మా నెల్లూరోళ్లు, ఎంతైనా ప్రత్యేకమబ్బా!

మా నెల్లూరోళ్లు చాల ప్రత్యేకమబ్బా. ఓర్నీ పాసు గూలా, ఏందిరా! అబ్బయ్యా అంటూ భోళాగా పలకరిచ్చేస్తారు. ఆటో గాని రిక్షా అతను కానీ ఎక్కండి అనరు, బేరం కుదరగానే ఎక్కు అంటారు అలాగే ఎవర్నైనా నువ్వు అంటారే గాని మీరు అనరు. కొంచెం బయట ఊర్ల నుండి వచ్చినోళ్ళకి మా ఏకవచన సంబోధన కొంచెం కష్టమే.

మా వాళ్ళకి నచ్చేది సినిమాలు, భోజనాలు మరియు పాలిటిక్స్. ఒకప్పుడు మాకు అదిరే హాల్స్ ఉండేవి. మూడు హాళ్లు, నర్తకి, అర్చన మొదటి శ్రేణి అయితే, సుందర్ డీలక్స్, రాధామాధవ్, శ్రీనివాస, అనిత, లీలమహల్ లాటి ద్వితీయ శ్రేణి, వినాయక, న్యూటాకీస్, విజయ మహల్, మనీటాకీస్ లాటి తృతీయ శ్రేణి హాల్స్. పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడాలంటే వినాయక హాల్ మాత్రమే. పేరుకు న్యూ టాకీస్ గాని ఆడేదంతా రెండో రిలీసో లేక మూడో రెలీసో లేక ఎన్ని రిలీస్ లయ్యాయో తెలీని అరిగిపోయిన సినిమాలు.

ఇక భోజనానికి వస్తే, మా ప్రత్యేకాలు చాలానే వున్నాయి. నెల్లూరు చేపల పులుసు అంటే వరల్డు ఫేమస్. మేము పులుసును, గండి, బొచ్చె, బొమ్మిడాయిలు, మట్ట గిడసలు, జెల్లలు మొదలగునవి వాడతాం. అలాగే పులుసులో ఓ మామిడి ముక్క, ఓ వంకాయ ముక్క వేస్తే నా సామిరంగా ఆ రుచే వేరబ్బా. వంకాయ మామిడికాయ బజ్జి, మునక్కాడలులో పాలుపోసి చేసే కూర, పులి బొంగరాలు, మిరపబజ్జీలు, కారందోశలు మా ప్రత్యేకాలు. చిన్నప్పుడు స్వతంత్ర పార్క్ లో ఆడి, సండే మార్కెట్ దగ్గర బజ్జీలు తినటం, ఆ తర్వాత కొంచెం పెద్దయ్యాక రాధా మాధవ్ దగ్గర కారం దోశెలు రుచి చూడటంలో ఆ మజానే వేరు. సంతపేట లో మునిసిపల్ మార్కెట్ కి ఎదురుగా వుండే పరంధామయ్య హోటల్ లో దోశె మరియు పాయా కూర రుచో చూడాల్సిందే.

మంచి గులాబ్ జామూన్ కావాలంటే జై హింద్ స్వీట్స్, మలై కాజాకి మురళి కృష్ణ స్వీట్స్, అరటి బజ్జీలకి రాజా కేఫ్, చాయ్ పే చర్చలకు సీమ కేఫ్ , టెస్ట్ బుక్స్ కి శ్రీరామ్ స్టోర్స్, హోమియోపతి మెడిసిన్కి సదాశివ మెడికల్స్, మంచి ఫొటోస్ దిగాలనుకుంటే ట్రంక్ రోడ్ లో రాజా స్టూడియోస్, అప్పట్లో హీరో పెన్ కావాలంటే పెన్ కార్నర్, కంటి అద్దాలు కావాలంటే డాక్టర్ కృష్ణ , ఐస్క్రీం కి బాబు లేక ఎస్.జి.ఎం, అన్నీ టిఫిన్స్ అల్ టైం ఫేవరెట్ చంద్రభవన్స్ (మూసేసారు), వెజ్ మీల్స్ కి కోమల విలాస్ కి వెళ్లాల్సిందే నబ్బ.

అలాగే చీప్ గా రఫ్ నోట్ బుక్స్ కావాలంటే టౌన్ హాల్ ఎదురు సందులో వికాస్ బుక్స్, సెకండ్ హ్యాండ్ బుక్స్ కి సంతానం అండ్ కో,ఎమన్నా వెనెరియల్ ప్రాబ్లెమ్ లకు ఉమా నర్సింగ్ హోమ్ పక్కన డాక్టర్ మాతుల్లా గారి దగ్గర కు వెళ్లాల్సిందే. నాన్ వెజ్ కి బోసోటా, నర్తకి పక్కన నిర్మల కేఫ్, కిళ్లీ సామానులకి గూండా అంజనేయశెట్టి గారి షాప్, సరుకులకు స్టోన్ హౌస్ పేటలో నాత వారి షాప్ అలాగే పెద్ద బజారులో నాగరాజం స్టోర్స్, మెటల్ సామానులకు కాంతి స్టోర్స్, పండ్లకు నారపనేని వీరాస్వామి అండ్ సన్స్ ఫేమస్ అబ్బా.

ఇక పాలిటిక్స్ కి వద్దాం. అసలు రాజకీయాలు మా బ్లడ్ లోనే వున్నాయబ్బా. కానీ మన నెల్లూరు అన్న వివేకా చని పోయాక ఎంటర్టైన్మెంట్ తెగ మిస్ అవుతున్నాం. నీ పాసుగూల ఏందయ్యా జాఫ్ఫారా! అంటూ తను చేసిన హడావుడి, షాప్ ఓపెనింగ్స్ వెళ్లి చీరలు పైన వేసుకొని చేసే ఆర్బాటం బాగా మిస్సింగ్. ఇక సీమా కేఫ్ దగ్గర పావుగంట నిలబడితే అసలు ఇరాక్, కువైట్ ని ఎందుకక్రమించిందో, అమెరికాకి ఇరాన్ మీద కోపమెందుకో, మైక్ గాటింగ్ ని అవుట్ చేసిన అద్భుతమైన బంతిని షేన్ వార్న్ ఎక్కడ, ఎలా ప్రాక్టీస్ చేసాడో లాటి ప్రశ్నలకు నాకు అక్కడ సమాధానాలు అప్పట్లో దొరికేసాయి. ఈ మధ్య కాలం లో అక్కడ నిలబడలేదు, కాబట్టి ప్రస్తుత అంతర్జాతీయ సమస్యలకు మా నెల్లూరొళ్ల పరిష్కారాలు గురుంచి నాకు తెలియదు. అసలు మా సీమా కేఫ్ ని యూ.ఎన్.ఓ యొక్క రెండో బ్రాంచ్ గా ఎందుకు డిక్లేర్ చేయలేదో నాకైతే అర్థం కాదు. ఆ ప్రపోసల్ ని పాకిస్థాన్, చైనా సహాయంతో తిప్పి కొట్టటంలో సఫలమయ్యిందని మా వాళ్ళ ఉవాచ.

నాకు ఇప్పటికీ నెల్లూరు రైల్వే-ఫీడెర్స్ రోడ్డులో వెళ్తూ అమెరికన్ హాస్పిటల్ ని చూస్తుంటే డాక్టర్ బేరమ్మ ఇంకా అక్కడే ఉందేమో అనిపిస్తుంది. అరవైయ్యవ లేక డెబ్భైయ్యవ శకం లో పుట్టిన నా బోటోళ్లందరూ అక్కడే ఈ లోకాన్ని చూసుంటారు. ఎంత మందికి ఆవిడ, ఈ నాటి శస్త్ర చికిత్సలు అవసరం లేకుండానే పురుడులు పోసుంటారో. ధన్యురాలు ఆ తల్లి. అలాగే పల్లెలనుండి కాన్పులకు వచ్చిన వారందరికీ వసతి కల్పించిన ఆ రేబాల వారి సత్రం, ఆ సత్రం లో గడిపిన అడపా దడపా రోజులు. ఉన్న కొన్ని రోజుల్లోనే ఐకమత్యంగా మెలిగి అక్కడనుండి బాగైపోయి కూడా కళ్ళనీళ్ళతో వెళ్లే వాళ్ళు రోగులు (రోగులనకూడదు వాళ్ళని ఆరోగ్యవంతులనాలి). అట్టి సత్రాలు కట్టి వాటిని నామమాత్రపు రుసుముతో నడిపిన వాళ్ళ జన్మ ధన్యం.

ఇక స్కూళ్ల కి వస్తే చాల స్కూల్స్ మూసేసారు అనే బాధ. సి.ఏ.ఏం (జిల్లా జైలు పక్కన వుండే కోల్స్ అక్కెర్మన్ మెమోరియల్), ఏ.బి.ఎం. లాటి స్కూల్స్ లేవనే విషయం జీర్ణం కావటం కష్టం. సేంట్ పీటర్స్,ఈ.ఎస్ ఆర్ . ఎం, వేదసంస్కృత పాఠశాలలు ఇంకా ఉన్నాయని అనుకుంటా. ఉండాలనే ఆశ . రత్నం, నారాయణ చైతన్య లాటి స్కూల్స్ బాగానే వర్ధిల్లుతున్నాయిగా. సంతపేట లోని మా గుంట బడి మాత్రం బాగుంది. ఓ మూడేళ్ళ క్రితం మా 1985 లో పదవ తరగతి ఉత్తీర్ణులైన వారమంతా కలిసి కొన్ని మరమ్మత్తులు, ఎంట్రన్స్ నుండి కిందకు వెళ్ళడానికి రాంప్ మరియు రంగులు వేయించాము.


మొన్న నెల్లూరు వెళ్ళినప్పుడు రోడ్స్ బాగానే వున్నాయి అనిపించింది . పార్లల్ రోడ్స్ కూడా బాగా వున్నాయి వున్నాయి నెల్లూరుకు. నా స్నేహితులు, బయట దేశాలు లేక బయట ఊర్ల నుండి వచ్చినప్పుడు ముందు మిస్ కాకుండా కారం దోసెలు మిర్చి బజ్జీలు, తర్వాత రంగనాకులపేట ఆలయం, పెన్నా వారధి, జొన్నవాడ, నరసింహకొండ, కోమల విలాస్ భోజనం, మురళి కృష్ణ మలై కాజా, పిక్నిక్ లో ఐస్ క్రీం మొదలైన ప్రదేశాలు దర్శించాల్సిందే. ఆ స్నేహితులు అడా లేదా మొగ అని అడగొద్దబ్బా. మనకి మగ ఫ్రెండ్స్ తో తిరగడం తెగ బోర్ అబ్బా !!

ఆగండాగండి, ఇంత రాసాడు వీడు, మరి టౌన్ హాల్ గురుంచి, అందులో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల గురుంచి ఎందుకు రాయలేదనేగా మీ సందేహం. మనం కళాపోషణకు బహుదూరమబ్బా.

29 దర్శనాలు

మా నెల్లూరోళ్లు, ఎంతైనా ప్రత్యేకమబ్బా!

 
 
00:00 / 00:05:25
 
1X
 
పంచుకోండి

అతిధి దర్శనాలు

అధ్యాయాలు

హర్షణీయం సభ్యత్వం కొరకు మీ ఈమెయిల్.

ధన్యవాదములు

హర్షణీయం

FREE
VIEW