Apple PodcastsSpotifyGoogle Podcasts

నా సహోద్యోగులు, హాస్యచతురులు !

మనం వారంలో ఐదురోజులు మరియు రోజుకి కనీసం ఎనిమి గంటలు ఆఫీసుల్లో గడిపేస్తాం. మన కొలీగ్స్ లో హాస్యచతురత ఉంటే పని ఒత్తిడిని తట్టుకోవచ్చు. చతురత దండిగా వుండే ఒకానొక కొలీగ్ సామ్ ప్రదీప్. అప్పుడప్పుడు కలిసి భోజనానికి వెళ్తాము. నాకు ఈ మధ్య ఆపరేషన్ ఐనప్పటినుండి సుప్రియ ఎదో ఒక పండు పెట్టటం మొదలెట్టింది లంచ్ బాక్స్ లో. ఆ రోజు ఒక అరటి పండు పెట్టింది. భోజనమయిన వెంటనే నాకు పండు తినాలని ఉండదు కాబట్టి, నాలుగప్పుడు తిను అని చెప్పి డబ్బాలో పెట్టింది. నేను అరటి పండుని రెండుగా విరిచి టేబుల్ మీద పెట్టి, ఎవరు తినాలన్న చెరో ముక్క తీసుకోండి అన్న, నాతో వచ్చిన వాళ్ళని  అలాగే తీసుకున్నారు. పక్క రోజు బాక్స్ లో ఏమి పండు అబ్బా! అని సామ్ అడిగితే, కమలా పండు తీసిచ్చా. ఒక ఆరుగురు తలా, రెండు ముక్కలు పంచుకున్నారు. తినటం అయ్యాక సామ్ అందుకున్నాడు ఇక ఇట్లా కాదుగాని హర్షా! పండు తక్కువ, మందిమి ఎక్కువ వున్నాము, మాకు పంచటం కష్టంగా వుంది, ఈ సారి సుప్రియగారిని ఒక దానిమ్మ పండు పెట్టమనండి మా తిప్పలు మేము పడతాము అంటూ.

అలాగే ఒకసారి సామ్ ని నస పెట్టా, వాళ్ళ ప్రాజెక్ట్ ,లో నైట్ షిఫ్ట్ అలవెన్సు, ఫ్రీ ఫుడ్ కూపన్స్ ఎక్కువ వస్తున్నాయి చూసుకోమని. సరే హర్ష! మీరు మొన్న మూడురోజుల ఆఫ్ సైట్ మీటింగ్ కి ఏర్పాటులన్నీ చూసుకున్నారు కదా, ఎంత ఖర్చయింది అంటూ తీగ లాగాడు. ఒక వంద మంది రాక, పోక, వసతి, మూడు రోజులు భోజనాలు కలిసి ఒక ఇరవై ఐదు లకారాలు అంటూ డొంక లాగనిచ్చా. నవ్వాడు, నవ్వి చెప్పాడు, హర్షా! మీరంతా వెనక ఏనుగులు వెళ్తుంటే పట్టించుకోరు, కానీ ముందు చీమలు వెళ్లకుండా మాత్రం భూతద్దాలు వేసుకొని మరీ చూస్తారు, వదిలెయ్యబ్బా, చిన్న పిల్లకాయలు అంటూ తన స్టైల్ లో చెప్పాడు. నిజమే సామ్ అంటూ నవ్వేసా. అలాటి సామ్ కి రెండు కార్లు, రెండు ఇళ్ళు, రెండు బైక్ లు, రెండు కుక్క పిల్లలు , రెండు ఫోన్స్ (రెండూ పట్టుకొస్తాడు ఆఫీస్ కి), ఇద్దరు పిల్లలు. నీ రెండు పిచ్చి ఇంతేనా లేక ఇంకో సెట్ అప్ ఏమైనా? అని ఆట పట్టిస్తుంటాము మేము తనని. ఒకదానికొకటి బ్యాక్ అప్ అబ్బా అని తన రెండు పిచ్చిని కవర్ చేస్తాడు.

అలాగే వినోద్ సుందర్రాజ్. నాకు చాలా ఇష్టమైన చెన్నై కొలీగ్. పనిలో చాలా ఘటికుడు. అదేదో కంపెనీ యాడ్ లాగా కన్సిడర్ ఇట్ డన్ అన్నట్టు,  ఏదన్న పని ఒప్పజెప్పితే పూర్తి అయ్యేదాకా నిద్రపోడు, టీంని నిద్రపోనివ్వడు. టీంమేట్స్ పారిపోతుంటారు ఈ మనిషి ఇచ్చే పని చూసి. ఒక రోజు నేను నా కేబిన్ నుండి బయటకు వెళ్తున్న. దార్లో క్యూబికల్ లో ఒకబ్బాయి టేబుల్ మీద తలపెట్టి పడుకొని వున్నాడు, పక్కనే ఒకమ్మాయి వాడి తల నిమురుతూ వుంది. ప్చ్! ప్చ్! మా రోజుల్లో అమ్మాయిలు ఇలా లేరబ్బా! అని అనుకుంటూ వెళ్ళిపోయా, నవ్వుకుంటూ. ఒక వారం తర్వాత అదే దృశ్యం, అమ్మాయి సేమ్, అబ్బాయి వేరు. కానీ నిమరడం మాత్రం మారలా. కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఇంకో వారం అదే దృశ్యం, ఈసారి కూడా అమ్మాయి సేమ్, అబ్బాయి వేరు. వినోద్ ని పిలిచా, ఏమి జరుగుతుందో నాకు తెలియాలి నా మానాన నేను పోతుంటే ఈ పిల్లకాయలు ఓదార్చుకుంటూ, నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు అంటూ. అప్పుడు చెప్పాడు వినోద్ ఆ పిల్ల పేరుకు తగ్గట్టే స్వీటీ . చాలా సున్నిత మనస్కురాలు , అబ్బాయిలకు మనస్సు బాగా లేక పోతే వాళ్ళని ఓదార్చి, మామూలు మనుషుల్ని చేయటమే ధ్యేయంగా బతుకుతుంది అంటూ చెమర్చిన కళ్ళతో. నీ పాసుకూలా! ముందు నువ్వు పిల్లకాయల్ని భయ పెట్టమాకా,  వాళ్ళ లేత మనసుల్ని కష్టపెట్టమాకా , అప్పుడు వాళ్లకు నువ్వే స్వీటీవి అవుతావు అని చెప్పా.

ఒక వారం తర్వాత నేను ఇంకా ఆఫీసుకి బయల్దేర లేదు, లేట్ అయ్యింది వెళ్ళటం అప్పటికే . వినోద్ ఫోన్ చేసాడు, హర్షా ఇంకా రాలేదేమి ఆఫీసుకి అని. కొంచెం లేట్ గా వస్తా వినోద్ మనస్సేమి బాగా లేదు అన్నా. అయితే నువ్వు రావొద్దు హర్షా ఆఫీసుకి అస్సలకి అన్నాడు. లేదు లే వినోద్ ఒక గంట తర్వాత వస్తాను అన్నా. వొద్దొద్దు ప్లీజ్! ప్లీజ్! ప్లీజ్! అంటూ బతిమాలడం మొదలెట్టాడు మా వినోద్.

Leave a Reply