Apple PodcastsSpotifyGoogle Podcasts

మా వూరి మైలురాయి కమ్యూనిస్టులు!

అనీల్ గాడు నాకు వున్నాయి, పొలమారింది జ్ఞాపకాలు కథ చదివి అది హర్ష గాడి కార్ల్ మార్క్స్ పోకడ కథ అని వ్యాఖ్యానించాడు. నేను కూడా మా ఊర్లలో వుండే కొన్ని కమ్యూనిస్ట్ గాధలని చెప్పాలని అప్పుడే అనుకున్న. ఎవరో ఒక పేరుమోసిన కమ్యూనిస్ట్ గారిని అడిగారట, మీరు పక్కా  కమ్యూనిస్ట్ లు కదా, మరి ఖరీదైన మధ్యంసేవిస్తారు, రెండవ వివాహంకూడా ఆడేశారు, కొంచెం విలాసవంతమైన జీవనం గడుపుతారు, ఇది ఏవిధమైన కమ్యూనిజం అని. దానికి ఆయన నవ్వేసి మేము మైలు రాళ్ల వంటివారము, అవి ఎప్పడు ఫలానా ఊరికి ఇక్కడనుండి ఎంత దూరమో చెప్తాయి, కానీ దగ్గరుండి దిగబెట్టి రావు, అలాగే మేము కమ్యూనిజం అంటే ఏమిటో చెప్తాము అంతేనని ముక్తాయించాడట.

అలాగే మా తాత, అనగా మా నాన్నకి నాన్న కూడా ఓ కమ్యూనిస్ట్. ఆయన మావూరికి దగ్గరలో వున్న బిట్రగుంట లోకో షెడ్ లో ఓ ఫిట్టర్. ప్రజాశక్తి దినపత్రికని నిత్యం తన తోటి వాళ్లకు బిగ్గర చదివి వినిపించటం ఆయనకీ మహా సరదా. ఏమాటకామాటే చెప్పుకోవాలి, స్పష్టమైన ఉచ్చారణ, కంచుకంఠం తో, చక్కని హెచ్చు తగ్గులతో ఆయన పేపర్ చదువుతుంటే చుట్టూ పక్కల వాళ్ళు వహ్వా అనాల్సిందే. ఈయన పేపర్ చదివి అందరి పని చెడగొట్టటంతో, రైల్వే అధికారులకు కోపం వచ్చి ఓ మూడేళ్లు రాజమండ్రికి కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఆగండాగండి ఇవన్నీ విని, ఆయన్ని ఓ ఆరడుగుల ఆజానుబాహుడు అని మీరూహించుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆయన ఎత్తు భూమికి జానెడు. కానీ మా నాయనమ్మ బహు పొడగరి. ఈ వ్యత్యాసాన్ని ఆయనలోని కమ్యూనిస్ట్ అస్సలకి పట్టించుకోలేదని నా నమ్మకం. అలాగే మా నాన్నమ్మ ఇంటిని మరియు పరివార జనులని ఏలటంలో నాయకురాలు నాగమ్మే. ఇంటి పెత్తనమంతా మా నాన్నమ్మదే, మా తాత జోక్యం ఇందులో అసలకి ఉండేది కాదు, అలాగే ఆయన మా నాన్నమ్మని పల్లెత్తు మాట అనటం నేను చూడలేదు. ఇక్కడ మాత్రం ఆయన ఒక నిజ కమ్యూనిస్ట్.

మాకు మా నాన్న వాళ్ళ ఊరిలో పొలాలు మరియు ఓ ఐదు ఎకరాల తోట ఉండేది. ఆ తోటలో వేరుశెనగ, మిరప లాటి పంటలు వేసే వాళ్లము. మా తోట మా ఊరికి చాలా దగ్గరలో ఉండటం వలన మేము అందరం తోటలో ఎక్కువ సమయం గడిపే వాళ్లము, నాకైతే మా పొలాలకు వెళ్ళినట్టే గుర్తు లేదు, ఎందుకంటే అవి మావూరికి చాలా దూరం, పక్కన ఊరికి చాలా దగ్గర. మా తాత గారు మా తోటలో వచ్చే పని వారి పని విషయం లో మహా కరుకు. వాళ్ళు ఉదయం పనిలోకి వొంగితే మధ్యాహ్నం భోజనానికి మాత్రమే లేవాలి; భోజనాలు ఐన వెంటనే మళ్ళి పనిలోకో దిగాలి – విరామం లేకుండా పని చేయాలి. వాళ్ళు మా అమ్మ దగ్గరకు వచ్చి మొర పెట్టుకొనే వాళ్ళు, అమ్మ మీ మామగారు పేరుకే కమ్యూనిస్ట్, హక్కులు సాధించుకోవటం అంతా ఆయన వుద్యోగం లోనే ఇక్కడ మాత్రం కాదు అనే వాళ్ళు. అమ్మ తోటలో ఉంటే వాళ్ళకి పండగే పండగ. వెల్తూ వెల్తూ తోటలో వేసిన వంకాయలో, బెండకాయలో, గోంగూరో, పచ్చి మిరపకాయలో గిల్లుకొని వెళ్లే వారు స్వతంత్రం గా. మా తాత ఉంటే ఇవన్నీ కుదరవు మరి. ఎంతైనా మైలురాయి  కమ్యూనిస్ట్ కదా ఆయన.

అలాగే మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో అమ్మకి ఓ ఐదు ఎకరాల పొలం ఉండేది. అది పాలికి అంటే కౌలుకి చేసే వాడు మా కొండన్న. ఆయనకీ మా అమ్మ చిన్న బుజ్జమ్మ. చిన్నప్పటి నుండి మా అమ్మనాయన పొలాల్లో కొన్ని ఆయన పాలికి చేసే వాడు. అమ్మ పెళ్లి అయ్యాక అమ్మకి వచ్చిన ఐదు ఎకరాలు తీసుకొని అవి మాత్రమే పాలికి చేయటం మొదలెట్టాడు. మేము నెల్లూరుకి వచ్చేసినా ఆయనే వాటికి సంరక్షకుడు. అప్పుడప్పుడు అమ్మ ఊరికి వెళ్లి చూసుకొని వచ్చేది – విత్తనాలకు, కూలీలకు, ట్రాక్టర్ కి, మందులకు డబులు సర్దటం అన్నీ అమ్మే చూసుకొనేది. ఏమన్నా అమ్మ ఇవ్వటం ఆలస్యమతే ఆయనే నెల్లూరు వొచ్చి ఒక రోజు అయినా వుండి  తీసుకెళ్లే వాడు. మాకు కూడా ఆయన కొండన్న. ఆయన పెద్ద కొడుకు నా ఈడువాడు, కానీ చదువుకోలా, పొలం పనులు లేక మేకల్ని మేపుకోవటం. ఉప్పలపాటిలో కూడా కొంత కమ్యూనిస్టుల ప్రభావం వుంది. రఘురామయ్య అని ఒకాయన రైతు కూలీలా తరపున, ఇలా పాలికి చేసుకొనే వాళ్ళ తరపున హక్కుల పోరాటం చేసే వాడు. ఆయన మా కొండన్న బోటి వాళ్ళందరి కీ లీడర్. చిన్న చిన్నగా వాళ్ళ పోరాటం కొంచెం దున్నే వాడిదే భూమి కోణం లో మారటం మొదలెట్టింది. మా కొండన్న ఎప్పుడూ మా దగ్గర ఆ ప్రభావమున్నట్టు కనిపించేవాడు కాదు. ఆయన మా పట్ల తన సహజసిద్ద ఆపేక్షనే వ్యక్తపరిచే వాడు. కానీ మేము మా పొలాలు అమ్మేశాము, మా అక్క పెళ్లి దగ్గర పడటంతో మరియూ జాగ్రత్త పడాలన్నతహ తహతో. ఉన్నదానితో సహాయం చేసే గుణమున్న మా అమ్మ ఒక కమ్యూనిస్ట్, చుట్టుపక్కల పిల్లలందరికీ మాతో సమానం గా చదువు చెప్పటం లో కమ్యూనిస్ట్. కానీ ఉన్న కొంత ఆస్తిని కాపాడుకోవడంలో పక్క క్యాపిటలిస్ట్ అయిపొయింది.

“మా వూరి మైలురాయి కమ్యూనిస్టులు!”‌కి ఒక స్పందన

  1. ‘మా ఊరి మైలురాయి కమ్యూనిస్టులు’ కథ మీ తాత చదివుంటే “ఈ పిల్లనాయాలు నా గురించి భలే కనిపెట్టేశాడు…ఎంతైనా నా మనవడు కదా” అని గుంభనంగా నవ్వుకునేవాడు!

Leave a Reply to Ravichandra ReddyCancel reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading