Apple PodcastsSpotifyGoogle Podcasts

నా కథల వెనుక అసలు కథ !

నా స్నేహితులు నన్నడిగారు, నీ కథలతో పడలేకున్నామురా, అసలు నువ్వెందుకు చెప్పాలనుకుంటున్నావు  అని. అసలే కథల కామరాజును కదా నేను, అందుకే నా కథల వెనక కథ ఇక్కడ చెప్తున్నా.

నా  బాల్యం ఉన్నంతలో బాగానే జరిగింది, నేను బడికి వెళ్లే వరకు. నాకెందుకో మొదటి నుండి బడికి వెళ్ళటమంటే చెడ్డ చిరాకు. బడి ఎగ్గొట్టడానికి కడుపు నొప్పులు, ఎండలో ఎక్కువసేపు నిలబడి జ్వరాలు తెచ్చుకోవటాలు, ఆ జ్వరాలు నాకే కాదు మా అయ్యోర్లకు కూడా వచ్చేయని కథలు చెప్పటాలు, ఇంకా ఎక్కువ సెలవలు కావాలంటే అయ్యోర్లే పైకి వెళ్లిపోయారనే అమాయకపు కథలు. ఈ కథలు అల్లటం చాలా సులభమే కానీ, ఎవరి దగ్గర ఏ కథ చెప్పామో గుర్తుంచుకొని ఆ కథ మరల మరలా పొర్లుపోకుండా చెప్పటం మహాకష్టం. ఆ మహా కష్టమే నాకు మంచి  జ్ఞాపకశక్తిని ఇచ్చిందని నా నమ్మకం.

నా ఈ కథలు చెప్పటం చాలా నిరాటంకంగా సాగింది చాలా ఏళ్ళు, అలాగే వాటి పరిధి కూడా బాగా పెరిగింది. ఒక వయస్సు వచ్చాక, తరచుగా నా అబద్దాలు బట్టబయలు కావటం మొదలెట్టటంతో, మా అమ్మ నా చెంప పగల కొట్టి, నీ అబద్దాలు ఎప్పుడన్నా అవసరం కోసం చెప్పటమనే గీత దాటి, అలవాటుగా చెప్పటమనే పరిధిలోకి వస్తున్నాయని, నా బతుకు నాన్నా! పులి కథలా అవుతుందని చెప్పింది. ఆ చెంప దెబ్బ నాకు నిజమైన చెంప పెట్టు. అప్పటి నుండి నేను అబద్దాలు అలవాటుగా చెప్పటం మాని, అవసరానికి మాత్రమే చెప్పటం నేర్చుకున్నా. కానీ కథలు అల్లటంలో పనికొచ్చిన పనికిమాలిన మేధోశక్తి మాత్రం దెబ్బతినలా మా అమ్మ చెంప దెబ్బ కొట్టినా. 

అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, చిన్నాన్నలు, చిన్నమ్మలు, అన్నలు, అక్కలు మరియు స్నేహితులతో జరిగిన చాలా ఘటనలు నాకు జ్ఞాపకమే, వాళ్ళతో పాటూ నా చుట్టూ పక్కల వున్నవారితో మరియు సహోద్యోగులతో  వున్న అనుబంధాలు, వాళ్ళతో నా అనుభవాలు ఇప్పటికీ నా కళ్ళ ముందరే. వాటికి అక్షర రూపమే ఒక పుటకి మించని ఈ కథలు. నా కథలలో పాత్రలన్నీ నాతో ఎదో ఒకరకంగా ప్రయాణం చేసిన వారే. అక్కడక్కడా కొన్ని పేర్లు మాత్రమే మార్చబడ్డవి వాళ్ళ గోప్యత కోసం.

నా కథలు మొదటి నుండి చదివి తిట్లు ఎక్కువ, పొగడ్తలు తక్కువ రూపేణా వెలిబుచ్చిన మా స్నేహ బృందానికి నేను ధన్యవాదాలు అస్సలు చెప్పను. అసలు నిన్ను ఊరంతా తిట్టాలిరా, అందుకే నువ్వు నీ కథలను బ్లాగ్ రూపేణా తేవాలి అని దురుద్దేశపూరిత సలహా ఇచ్చి నన్ను చెడకొట్టింది కూడా వీళ్ళే. వీళ్ళతో పోలిస్తే నా సహోద్యోగులు చాలా నయం, నేను నా కథలతో వాళ్ళను హింసించినా, మొహమాటానికైనా నీ కథలు కొన్నైనా బాగున్నాయని చెప్పి నా మనస్సుని రంజింపచేశారు. వాళ్ళకి నా మొదటి ధన్యవాదాలు. అలాగే కొంత కాలక్షేపంగా అవుతుంది అనే ఉద్దేశ్యం తో నా కథలను చదవనుపక్రమించిన మీ అందరికీ నా కృతజ్ఞతలు.

“నా కథల వెనుక అసలు కథ !” కి 2 స్పందనలు

  1. రెండురోజులుగా మీ బ్లాగుని వెనకనుంచి ముందుకు ముందునుంచి వెంక్కకి చదివేసి చెబుతున్నా మాట

    మీ బ్లాగ్ చాలా బావుందండి. మీరు ఆడియో రూపంలో మీ రాతలను పెట్టమని చెప్పిన మీ మిత్రుడుకు తప్పకుండా మరన్నీ సార్లు తప్పకుండా ధన్యవాదాలు చెప్పాల్సిందే 🙂 Keep writing more often.

    1. చాలా థాంక్స్ అండి. ఒక మిత్రుడు కథకు దగ్గ బొమ్మలు కూడా వేస్తానని ముందు కొచ్చాడు. ఆ మిత్రుని అద్భుతమైన స్కెచ్ మీరు స్కై ల్యాబ్ మా గడ్డి వాములో పడింది కథ లో చూడ వచ్చు. అలా గీతలు , మోతలు (ఆడియో) , కోతలు (ఎడిటింగ్) నా రాతలకు ఇతోధిక సహాయం చేస్తూ నడుపుతున్నారు. ఇంకో మిత్రుడు వంద కథలు రాయరా నా ఖర్చులో ప్రింట్ చేసి ఇళ్లిళ్లూ తిరిగి అమ్మి పెడతా అని వాగ్దానం చేసాడు.

Leave a Reply