రామ లక్ష్మణు లాటి వారేమో అలా, సుందోపసుందులేమో ఇలా!

నాకు మేనత్త రవణమ్మకిన్ను మా నాన్న మేనమామ రవణయ్యకిన్నుపెళ్లి చేసేసారు, మా తాత ఆదెయ్య మరియు మా నాన్నమ్మ ఆదెమ్మ లు కలిసి. మా నాయనకి, మా చిన్నాయన కి, నాకు, మా అన్నకీ ఆఖరుకి మా అమ్మ అక్కల పిల్లకాయలకి అందరికీ ఆయన రవణ మావే. ఆయన మాకు ఇల్లరికపుటల్లుడు. మాటల్లోనే కాదు చేతల్లో కూడా మహాదూకుడు. ఆయన నడిస్తే పక్కనోళ్లు పరిగెత్తాలి, ఇద్డుమ్ వడ్ల బస్తా భుజం మీద నుండి విసిరేస్తే ఆరడుగుల దూరంలో పడాల్సిందే. పండగలొస్తే నిప్పట్లు వొత్తాలంటే రవణయ్యే, కట్టెలు పేళ్ళుగా చీల్చాలంటే రవణయ్యే, భోజనంలో సింహభాగం కూడా ఆయనదే.


మా మేనత్త ఆయన దూకుడుకి బాగా వ్యతిరేకం, మెత్తనిది , ప్రేమ పాత్రురాలు, మేము గాడిదల్లా పెరిగినా మా ఏడవ తరగతి వరకూ మమ్మల్ని సంకనేసుకొనేది. ఆయనేది మాటలాడిన నువ్వే రైట్ నువ్వే రైట్ అంటూ ఆయన వాక్యం పూర్తిగాక ముందే అనేసేది. ఆ విషయం లో మా మేనత్త లౌక్యం నాకు చాలా ఇష్టం. మా వూర్లో మాకొక అంగడి ఉండేది అది మా మేనత్త మరియు మా మామ నడిపేవాళ్ళు. పండుగ దినాల్లో చేతిలో డబ్బులాడక పండుగ చేసుకోలేరు అన్న ఇళ్ల కల్లా మా మేనత్త బియ్యం, బెల్లం, నూనె లాటివి మా మావకు తెలియకుండా పంపేది. అందుకే ఊరందరకి ఆమె మా రవణమ్మ.

వాళ్లకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతుర్ని మరలా మా చిన్నాన్నకిచ్చారు. మా నాన్న, చిన్నాయన, మా మామల వ్యవసాయం భలే ఉండేది. వడ్లు విలువ ఇక పెరుగదు అని కళ్లాల్లో అమ్మేసుకుంటే అవి వెంటనే పెరిగేవి, మిరపకాయలకి రేట్లు వస్తాయనుకుని బొట్టల్లో ఉంచితే తీరా రేట్లు పడిపోయేవి. అమ్మబోయే సరికి రేటు సగం, కాయ తెల్లబడి బరువు సగం అయ్యేవి. ఇలా వ్యవసాయం చేసి ముగ్గురూ మా తాతని కాజేసేసారు. మేము ఎదో బావుకుందామని, మా అమ్మమ్మోళ్ల ఊరు ఉప్పలపాడు చేరి పోయాము. కొన్నేళ్ళకి మా మావ, మా మేనత్త, ఇద్దరి కొడుకులతో, మా చిన్న నాన్నమ్మోళ్లకి హోటల్ మరియు బి.హెచ్.పీ.వి లో కాంట్రాక్టులు ఉంటే అక్కడికి విశాఖకి వలస పోయారు.

మా మేనత్త కొడుకులు గోపాలయ్య, భాస్కరయ్య లు చిన్నప్పటి నుండి రామలక్ష్మణుల్లా పెరిగారు. ఇద్దరిదీ ఒకే మాట. నేను మా అన్న ఇద్దరం, సుందోపసుందుల్లా పెరిగాము. ఇద్దరికీ ఎడ్డెమంటే తెడ్డెము. అన్నిటికీ కొట్లాటలే మా మధ్య. ఆయనస్నేహితులతో నేను స్నేహం చేయకూడదు, మాటలాడకూడదు, అంతెందుకు ఆయన ఆయన స్నేహితులు ఆడే చుట్టుపక్కల నేను కనపడకూడదు. ఆయనకి మార్కులు సంకనాకొచ్చు, నాకు తగ్గితే ఆయనకీ ఎక్కడ లేని పెద్దరికం వొచ్చేస్తుంది, నా మీద దౌర్జన్యానికి . అందరూ పోలవటమే వాళ్ళని చూసి నేర్చుకొండిరా అని.

వాళ్ళు విశాఖ వెళ్లి చాలా కష్ట పడ్డారు. మామ బి.హెచ్.పీ.వి కాంటీన్ కి సరకులు కొనుగోలు చేసేవాడు, భాస్కరయ్య బి.హెచ్.పి.వీ లో కాంటీన్ మైంటెనెన్సు, గోపాలయ్య హోటల్ మైంటెనెన్సు చేసేవారు. ఈ క్రమం లో వచ్చిన అనుభవం తో శ్రీకాకుళం లో హోటల్ స్వప్న, ఏడు లాంతరుల వీధిలో మొదలు పెట్టారు. ఎదో సినిమా లో చెప్పినట్టు ఉప్పు దొరికే దగ్గర మామిడికాయలు తెచ్చి ఆవకాయ పెట్టి అమ్మడమే వ్యాపార లక్షణమని, అలా శ్రీకాకుళ మోళ్ళకి నెల్లూరు భోజనం రుచి చూపటమే వాళ్ళ వ్యాపార విజయం. వాళ్ళు ఇక వెనక్కి చూసుకోలేదు ఇక. డబ్బుకు డబ్బు పేరు కు పేరు వాళ్ళ హోటల్ కి.


గోపాల మామ సమర్ధుడు భాస్కర మామ కష్ట జీవి. అన్న నీడలో నే బతగ్గల సామాన్య జీవి. కలిసే వుండే వారు ఇద్దరి పెళ్లిళ్లు అయ్యాక కూడా. ఆ తర్వాత మొదలయ్యాయి మనఃస్పర్ధలు. మేము అందరం చెప్పాము కనీసం కలిసే వ్యాపారం చేసుకోండి, కలసి ఒకే ఇంట్లో ఉండక పోయినా అని. భాస్కర మామే అడిగాడు హోటల్ నువ్వన్నా తీసుకో లేక నాకన్నా ఇవ్వు అని వాళ్ళ అన్నని. వాళ్ళ అన్నకి తెలుసు మా భాస్కర మామ కి కొత్త హోటల్ నడిపే సమర్థత లేదని. అందుకే బాగా జరిగే హోటల్ ఇచ్చేసి విజయనగరం లో కొత్త స్వప్న హోటల్ పెట్టుకున్నాడు. మొదట బాగా కష్టపడ్డా తర్వాత అది బాగా జరగటం మొదలెట్టింది.

కానీ భాస్కర మామే విశాఖలో ఒక హోటల్ ఓపెన్ చేసాడు జరగలేదు, బట్టల కొట్టు పెట్టాడు జరగలేదు. శ్రీకాకుళం హోటల్ మీద ధ్యాస పెట్టలేదు, అప్పులయ్యాడు. బాగా క్రుంగి పోయాడు. ఆస్తులు అమ్మేశాడు. ఒక రోజు ఫోన్ వచ్చింది భాస్కర మామ ఇక లేరు అని. హార్ట్ ఎటాక్ అని. మనిషి ఆరోగ్యం మీద మంచి అవగాహన వున్నవాడు. చెడు అలవాట్లు లేని వాడు. వాళ్ళ అన్న వచ్చాడు కర్మ కాండలు దాకా వున్నాడు. ఆ తర్వాత ఆ వైపు చూడలా. వాళ్ళ పిల్లల పెళ్ళిలకు పిలవలా, తమ్ముడి పిల్లల పెళ్లిళ్లకు రాలా.

రామ లక్ష్మణ కుటుంబాలు అలా విడిపోయాయాయి. ఇక సుందోప సుందుల కొస్తే ఇంకా తిట్టుకుంటూనే వున్నారు కొట్టుకుంటూనే వున్నారు. మధ్య మధ్యలో ఏరా నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ కుండీని ఎందుకు తన్నావురా అంటూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో లా పలకరించు కుంటూనే వున్నారు. ఎప్పుడూ మాట అనుకోని అన్న దమ్మలేమో అలా ఎప్పుడూ సఖ్యత లేని అన్న దమ్ములేమో ఇలా.

“రామ లక్ష్మణు లాటి వారేమో అలా, సుందోపసుందులేమో ఇలా!”‌కి ఒక స్పందన

  1. Harsha, read this one after some time. Like the others, this one also is like visualization of life in simple, witty narration. Life’s uncertainties again through the mena mamas journey.

Leave a Reply