Apple PodcastsSpotifyGoogle Podcasts

మా ఉలవపాళ్ళ స్వామి!

నాకు ఐదేళ్ల వయస్సులో మా ఉలవపాళ్ళలో, మామిడేళ్ల కిష్ట, అక్కిశెట్టి శేషగిరి మరియు మా వూరి పూజారి కొడుకైన స్వామి అనే ముగ్గురు స్నేహితులు వుండేవాళ్ళు. మా ఆటలు, పాటలు మరియు తిరుగుళ్ళు అన్నీ కలిసే ఉండేవి. వీటిల్తో పాటు మాకు ఇంకో ముఖ్యమైన రోజువారీ, లేక రోజుకు పలుమార్లు వుండే కార్యక్రమం ఉండేది. అదేమిటంటే తిన్నది అరిగాక, వూరికి వెనకాల వుండే చెరువు దగ్గరకో, లేక వూరికి ముందు వుండే వాగు దగ్గరకో వెళ్లి అరగక మిగిలినదాన్ని దించుకొని రావటం.

మా నలుగురి మధ్య వుండే ఒప్పందమేమిటంటే, మాలో ఎవరికీ ఆ అవసరముంటే, మిగతా ముగ్గురుకి అవసరమున్న లేకున్నా చచ్చినట్టు తోడు రావాల్సిందే. అలా అవసరం లేకుండా తోడుగా వచ్చినప్పుడు, ఆ కూర్చొనుండే వాడిని, అయ్యిందా లేదా, లేక ఇంకా ఎంత సేపురా అంటూ విసిగిస్తూ, మధ్య మధ్యలో, మా వూరి రాజకీయాల గురుంచో లేక మా వూరి సమస్యలకి పరిషారాలేమున్నాయబ్బా అనే చర్చలతో కాలక్షేపం చేసే వాళ్ళము. నాకైతే ఎక్కువగా మా వాగువైపుకి వెళ్ళటమే ఇష్టం ఈ కార్యక్రమానికి, ఎందుకంటే అక్కడ ఎక్కువగా పిచ్చి తులసి మొక్కలు పెరిగేవి, వాటి వాసనల మధ్య మా సువాసనలు మర్చిపోవొచ్చు, ఎంతైనా మనం నీటు గాళ్ళమే మొదటనుండి.  అబ్బా! స్నేహితుల మధ్య ఎన్నో మంచి జ్ఞాపకాలుంటే, ఈ హర్షా గాడేందిరా నాయనా, ఎంత సేపు ఇలాటి విషయాలే రాస్తాడు అని తిట్టుకుంటున్నారా, మంచి వాటికందరూ వస్తారు, ఇటువంటి వాటికి తోడు వచ్చేవారే అసలు స్నేహితులు అని చెప్పటం నా ఉద్దేశ్యం.

మా యీ ఒప్పందం చాలా సౌలభ్యం గా ఉండేది మా ముగ్గురుకీ, ఒక్క స్వామి గాడితో తప్ప. ఎందుకంటే వాళ్ళ నాన్న గారు, మా వూరి మూడు గుళ్ళల్లో ఒక్కటైన మాలక్ష్మమ్మ గుడిని, ఆ వయస్సులోనే వాడికి రాసిచ్చేశారు, మిగతా రెండు గుళ్ళని, ఒకటి ఆయనకోసం మరియు ఇంకొకటి ఇంకా చేతికి అందిరాని స్వామీ గాడి తమ్ముడికోసం అట్టిపెట్టుకొని. ఈ మూడు గుళ్ళకి పూజ, పునస్కారాలు చూసుకుంటూనే ఆయన మా వూరికి దగ్గరలోని, చెక్ పోస్ట్ లో కూడా పని చేసేవారు. మా స్వామి సాయంత్రాలపూట మాలక్ష్మమ్మ గుడి తెరిచి, వాడి నోటికి తిరిగిన మంత్రాలు చదువుతూ దీపారాధన చేసి, వచ్చినోళ్లకు పెట్టీ పెట్టనట్టుగా కాస్త చక్కెర వాళ్ళ చేతులకు రాసి, కొంత సేపయ్యాక గుడి మూసి వచ్చేవాడు. ఇవే కాక మళ్ళీ మిగతా గుడులలో వాళ్ళ నాన్న దగ్గర అప్పుడప్పుడూ అప్రెంటిస్ గా కూడా పనిచేసేవాడు. ఈ కార్యక్రమాలతో తీరిక లేకా మాకు చాలా సార్లు అందుబాటులో ఉండేవాడు కాదు వాడు. మాకు వాడి మీద ఈ విషయం లోనే ఫిర్యాదు.

మా పల్లెల్లో రెండు మూడు కుటుంబాలకు కలిపి ఉమ్మడి బావులుండేవి. ఈ కుటుంబాల చావిడీలు మధ్య వుండే గోడలు, ఈ బావుల దగ్గర మాత్రమే ఓపెన్ గా ఉండేవి. అటుపక్కనుండి ఆవల కుటుంబాలు, ఇటుపక్కనుండి ఈవల  కుటుంబాలు, కావలసిన నీళ్లను తోడుకొనే వారు. ఒక్కోసారి ఆవల కుటుంబాలకి సన్నిహితమైన మరికొన్ని కుటుంబాలు, ఈవల కుటుంబాలకి సన్నిహితమైన కొని కుటుంబాలు కలిపి ఇటువంటి బావులని వాడుకొనే వారు. అలాగే ఒక వీధిలోంచి ఇంకో వీధిలోకి, వెళ్ళటం ప్రమాదకరమైనా, దగ్గరి దారి అవటం తో ఈ బావులని దాటి వెళ్లే వారు కొందరు. అలా మా స్వామీ గాడికి, వాళ్ళ చావిడీలో వుండే బావిని దాటి వెళ్ళటం, మాలక్ష్మమ్మ గుడికి చాలా దగ్గర దారి అవటం తో వాడు వాళ్ళ అమ్మగారు గమనించనప్పుడల్లా, బావిని దాటి వెళ్ళేవాడు.

ఒకరోజు సాయంత్రం అలా వాడు దీపం పెట్టాలని, బావి దాటుతూ, కాలు జారి ఆ బావిలో పడిపోయాడు. బావి కూడా సగం నీళ్లతో అయినా లోతుగానే వుంది. పడ్డవాడు సాయం కోసం అరుస్తూనే వున్నాడు. చాలా సేపటికి వాడి అరుపులు విని అక్కడ జనం పోగయ్యారు. వెంటనే ఈత వచ్చిన వాళ్ళు బావిలో దిగి వాడికి తాడు కట్టి బయటకి లాగారు. బయటకొచ్చిన వాళ్ళు ఆశ్చర్యంగా అడిగారు వాడిని, అలా ఎలా ఒక ఈత వచ్చిన వాడిలా, బావి మధ్యలో చేతులాడిస్తూ తేలి వున్నావురా నువ్వు అని. దానికి మావాడు, నన్ను మాలక్షవ్వ కిందనుండి పైకి నెడుతూనే వుంది నేను బావిలో పడ్డప్పటి నుండి అని చెప్పాడు.

అదే మాలక్షవ్వ అప్పటికి కొన్ని నెలల క్రితం, మా వెంటపడి చెరువుకి వచ్చి, మేము మా ఆటల్లో పడి, తనని గమనించుకోక పోవటం వలన, చనిపోయిన మా లక్ష్మిని ఎందుకు పైకి నెట్టలేదో.

Leave a Reply