అబ్బాయిల్లారా! మీకు అబద్ధం చెబితే ఎలా దొరికి పోతామో అన్నదానిమీద నా అనుభవం చెప్తా. ఈ మధ్య కాలం లో నా క్లాసుమేట్ నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది తను ఒక శనివారం ఉదయాన నాలుగు గంటలకు శంషాబాద్ లో దిగుతున్నానని, వచ్చి తనని తీసుకెళ్లి వాళ్ళ మేనమామ ఇంట్లో దిగపెట్టమని. తెగ ఆలోచించేసా ఆ టైంలో ఇంట్లో ఏమి చెప్పి వెళ్లాలా అని. మీకా డౌట్ వద్దు ఆడ స్నేహితమా లేక మగ స్నేహితమా అని. మగైతే వాట్సాప్ లోనే పెట్టేవాడిని కదా పోరాపో! నేను రానహే! అని. వచ్చేది ఆడ క్లాసుమేట్ అందులోను ఆ పిల్లంటే మనకి ఒకప్పుడు ప్లేటోనిక్ లవ్వు, తెలుగు లో అమలిన ప్రేమ.
ఇంకేముంది ఇంట్లో ఓ స్టోరీ అల్లేశాము. మా కస్టమర్ ఒకడు వస్తున్నాడు నేను వెళ్లి ఖచ్చితంగా పికప్ చేసుకోవాలి, లేకపోతే వాడు రివ్యూలో నరకం చూపిస్తాడు అని. పాపం మా సుప్రియ రెండున్నరకే లేపి ఒక టీ ఇచ్చి స్వెట్టర్ వేసి పంపింది. సరే వెళ్ళాం రిసీవ్ చేసుకున్నాం, మధ్యలో ఓ మంచి టీ స్టాల్ లో టీ తాగాము, కబుర్లు కాకరకాయలు చెప్పుకున్నాం. వాళ్ళ మామ ఇంట్లో దింపడానికి వెళ్తున్నాం.
ఈ లోపల మా సుప్రియ ఫోన్. మనం వెధవది బ్లూ టూత్ ఆపడం మరిచాం. కార్ డిస్ప్లే లో తాటికాయ అక్షరాలు, పెద్ద సౌండ్ తో రింగ్. నేను రియాక్ట్ అయ్యేలోగా నా క్లాసుమేట్ హాయ్! సుప్రియ, హౌ ర్ యూ! ఈ హర్షా గాడు ఈ చలిలో పాపం వచ్చాడు అంటూ బాగా పిచ్చా పాటిలో దిగి పోయింది. నేను కుడితిలో పడ్డ ఎలుకలాగా టప టపా కొట్టుకుంటున్నా. ఏమీ! పట్టించుకోకుండా, తీరిగ్గా మాట్లాడింది. ఆ తర్వాత నేను, ఫోన్ ఎందుకు ఎత్తావు అంటే, నువ్వు ఇంట్లో చెప్పకుండా ఎందుకొచ్చావురా అని నా మీదే ఎదురు దాడి చేసిందా స్నేహితురాలు. దేవుడా! ఎలారా ఈ సుప్రియాని ఫేస్ చేయటం అంటూ ఇంటికొచ్చా.
నాకో తంత్రం వుంది సుప్రియ నన్ను తిట్టే ముందే, నేను అలిగెయ్యటం. అలాగే అలిగి ముసుగేట్టేసా. కానీ ఇప్పటివరకూ తాను అడగందే!. తానెప్పుడూ అడుగుతుందా నేనేమి చెప్పాలా అన్న ఆందోళన ఈ రోజుక్కూడా. కానీ తానేమో ఏమీ జరగనట్టు నాతో మాములుగా ప్రవర్తిస్తూ నాతో ఆడుకోవటం న్యాయమా . మీరే చెప్పాలి. కాబట్టి ఈ స్టోరీ లో నీతే మంటే, ఇలా ఇంట్లో తెలియకుండా స్నేహితురాళ్ళని కలవడానికి ముందు బ్లూ టూత్ ఆపెయ్యాలి, వీలైతే మీ చరవాణి కూడా. ఏమంటారు. ఒరే మల్లిగా, సి.ఎన్ .ఆర్ గా ఈ కథని మా ఆవిడకి ఫార్వర్డ్ చెయ్యొద్దు, ప్లీజ్.
Leave a Reply