Apple PodcastsSpotifyGoogle Podcasts

మా శ్రీధర గాడు! ఓ మంచి స్నేహితుడు!

నేను ఇంతకుముందే చెప్పా, నావి ఎలాటి వానాకాలం చదువులో, ఇంటర్మీడియట్ ఎలా చావుతప్పి కన్ను లొట్ట పోయిన చందంగా గట్టెక్కానో, ఎంసెట్ లో ఎలా ఓ పెద్ద రాంక్ సాధించుకొని వాకాడు ఇంజనీరింగ్ కాలేజీలో పడ్డానో. ఈ పరిచయ వాక్యాలు చదవగానే మా గిరిగాడు యధావిధిగా విరుచుకు పడతాడు, నీ దొక బయోగ్రఫీ, అది ఇంతకు ముందు అందరూ చదివేసి ఉంటారన్న నీ ఎదవ అభిప్రాయమూ అని. వాడలాగే అంటూ ఉంటాడు, నేనిలాగే రాసి పారేస్తుంటా. ఇక్కడో రహస్యముంది, అబ్బా! నా పేరు వీడు కథలో వాడేసాడు అనే తృప్తితో వాడు ఈ కథని తక్కువ విమర్శిస్తాడు అన్నది నా ఎదవ అభిప్రాయము. కానీ ఈ కథ చదివి వాడు, చాలా భయం భయం గా రాసినట్టున్నావురా అనెక్కడ అనేస్తాడో నని నా భయం.

అవి నేను ఇంజనీరింగ్ చేరిన తొలి రోజులు. మా అనీల్గాడు మరియు నేను ఈ నాలుగు సంవత్సరాలు మాతో గడపబోయే మాబోటి దుర్లక్షణాలు మరియు మా తరంగ దైర్గ్యములు జత కలిసే మిత్రుల కోసం వెతుక్కుంటున్నాము. ముందే చెప్పాను కదా, మా వోడు హాస్టల్ మీద నేను ఊరి మీద పడ్డామని. మా వోడు అప్పటికే మావ!, నాకు ప్రశాంత్, భార్గవ్, జగ్గు, కోట మొదలగు వారు తెగ నచ్చేశారు అని అప్పటికే ప్రకటించేశాడు, నేను వెనకబడిపోయా మా వాడితో పోల్చుకుంటే. నాకూ అప్పటికే ఓ రూమ్ మేట్ దొరికాడు సుబ్రహ్మణ్యం అని, కానీ వాడు నాకు ఈ రెండు మూడు వారాల్లోనే అస్సలకి మనిషి అన్నవాడు ఇంతలా చదువుతాడా అనే సందేహం కలిగించేశాడు. వాడి చదువు తీరు మరియు వాడి క్రమశిక్షణా నాకు కడు దుర్లభంగా వున్నాయి. నాకు మిత్రుడయ్యే లక్షణాలు వాడిలో అస్సలకి లేవు అని అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసా.

ఆ రోజు మేము మొదటి సారిగా మెకానికల్ వర్క్ షాప్ కి వెళ్ళాము. మమ్మల్ని మూడు బ్యాచ్ లుగా విభజించారు. బ్లాక్ స్మితి, టిన్ స్మీతి మరియు వుడ్ కార్పెంటరీ బ్యాచ్ లుగా. ఇదేందిరా నాయనా నాలుగేళ్ళయ్యాక యీ పనులే చేసుకుంటా బతకాలా అని చతురోక్తులు వేసుకుంటూ ఎవరి స్థానాలకు వాళ్ళం వెళ్ళాము. నాది బ్లాక్ స్మితీ బ్యాచ్. నాతో వచ్చిన పక్కనున్న పిల్లగాడు కొంచెం పల్లెటూరు నుండి వచ్చిన వాడై కనపడటంతో మనకలవాటైన పట్టణపు అతి తెలివితో, నువ్వు కింద కుప్పలా పడున్న బొగ్గుల్ని ఎత్తుకొని కొలిమిలో వేస్తూ వుండు, నేను ఈ పొడవాటి టాంగ్స్ తో వర్క్ పీస్ ని కాలుస్తూ ఉంటా అని చెప్పా. ఆ పిల్లగాడు నన్ను పైనుండి కిందవరకూ ఓ మారు చూసి, పోరా! అదేదో నువ్వే ఆ బొగ్గులేరుకో, నీ చేతులే మసి జేసుకో అని గదమాయించాడు.

అప్పుడు ఇంకా గమనించా వాడిని, మనిషి మహా చురుగ్గా వున్నాడు, ముందు రెండు పళ్ళు చివర్ల విరగ్గొట్టుకొని వున్నాడు, మహా తులిపి తనానికి నిదర్శనంగా, నాకర్థమైయింది వీడు ఒకడికి చెప్పే వాడే కానీ వేరే వాడు చెప్తే వినేరకం కాడని, వెంటనే బుద్ధిగా వాడు చెప్పినట్టే చేశా. అలా నన్ను మొదటి రోజే ఏరా, పోరా అని, వాడి పెత్తనం కిందకు తెచ్చేసుకొని నన్ను ఇప్పటికీ ఆడేసుకొనే వాడే మా శ్రీధరగాడు.

ర్యాగింగ్ టైం లోనే మహాధైర్యంగా తిరిగేవాడు, ఎందుకంటే వాడు లోకల్. కాలేజీ కి నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళ వూరు. వారంలోపలే మనం వాళ్ళ ఊరిని సందర్శించటం, వాళ్ళ కుటుంబ సభ్తులను మరియు బంధువులను వాడు ఏ-ఏ వరుసలతో పిలుస్తాడో మనమూ అలానే పిలిచెయ్యటం, అలాగే వాడు మా నెల్లూరుని సందర్శించటం, నేను మా వాళ్ళను ఏ వరుసలతో పిలుస్తానో వాడూ పిలిచెయ్యటం లాటి చర్యలతో మా స్నేహం బర్తృహరి చెప్పినట్టు సజ్జనుల స్నేహం ఉదయపు ఎండలా ఎలా పెరిగిపోతుందో అలా పెరిగి పోయింది.

మొదటి సంవత్సరం వాడు వాళ్ళ వూరునుండి ఒక బుడ్డ బులుగు సైకిల్ లో వచ్చేవాడు, రెండవ సంవత్సరం నుండి వాడు నేను ఒక రూమ్ కి మారిపోయాము. వాడు లోకల్ అవటం నాకు చాలా సౌఖ్యంగా ఉండేది. వారంలో ఒక రోజు వాళ్ళ ఇంటినుండి ఇద్దరికీ పిలుపు వచ్చేసేది, ఏ చేపల కూరో, లేక ఏదైనా స్పెషల్ చేసినప్పుడో. వెళ్ళేసి కుమ్మేసి రావటమే. వారానికోసారి వాడి బట్టలన్నీ వూరికెళ్ళిపోయి నీట్ గా ఉతకబడి, గంజి పెట్టబడి, ఇస్త్రీ చేయబడి పర పరలాడుతూ వచ్చేవి. వాడి చొక్కాలు నేను వేసుకొని పూలరంగడి లా తిరుగుతూ ఉంటే, కుళ్లుకొని మా గోపీ గాడు, ఏరా వాడివి చొక్కాలేనా లేక అండర్ వేర్ లు కూడా వాడేస్తావా అని ఏడిచేసే వాడు.

వీడు టెక్స్ట్ బుక్ లు బాగా కొనేవాడు కానీ ఇద్దరం వాటిని ఏమాత్రం నలగనిచ్చే వాళ్ళం కాదు. సంవత్సరమంతా బలాదూర్ తిరుగుళ్ళు తిరిగి పరీక్షల ముందర మాత్రం తెగ నైట్ అవుట్ లు చేసే వాళ్ళము. వచ్చే సంవత్సరం నుండి ఎప్పటి పాఠాలన్నీఅప్పుడే చదివెయ్యాలని ఒట్లు పెట్టుకొనే వాళ్ళం. కానీ షరా మామూలే. ఇక నిశ్చయించుకున్నాం మనదంతా వన్ డే మ్యాచ్ బ్యాచ్అ ని. మాకుండే బొచ్చెడు వ్యాపకాలు తోడు సరిగ్గా సంవత్సరాంతపు పరీక్షల ముందే వచ్చేవి వన్ డే క్రికెట్ మ్యాచెస్. ఒక్క ఓవర్ చూసొచ్చి బుద్దిగా చదువుకుందామురా అని వెళ్లి మ్యాచ్ అంతా చూసి, అప్పుడు పడే వాళ్ళము అసలు సిసలు టెన్షన్. ఇక తట్టుకోలేక ప్రతీ పరీక్షకి ముందు ప్రతీ రోజు గుడిలో చేరే వాళ్ళం ఇద్దరం, దేవుడా గట్టెకించు అని.

కానీ నేను చూసిన స్నేహితులతో అత్యధిక ఐ.క్యూ వున్నవాడు వీడే. ఏక సంధాగ్రాహి, చదవటం తక్కువ వినటం ఎక్కువ వీడికి. మొదటి బెంచీలో కూర్చొని శ్రద్దగా వింటూ, రన్నింగ్ నోట్స్ రాసుకొనే వాడు. పరీక్షల ముందర టెన్షన్ పడ్డా ఆ నోట్స్ రెఫర్ చేసుకొని వెళ్లి పరీక్షలు రాసి వచ్చి మంచి మార్కులు తెచ్చుకొనే వాడు. మనమేమీ సక్రమంగా చేయము కదా, అలా అని ఎప్పుడన్నా వీడి రన్నింగ్ నోట్స్ తస్కరిద్దామంటే, మనోడి రాత మాత్రం బ్రహ్మ రాతే.

పరీక్షల గొడవలు లేనప్పుడు కాలేజీ నుండి రావటం, బాతాఖానీలు వేయటం, మెస్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని ఎదురు చూడటం, మెస్ లో మెసవటం, రావటం మరలా బాతాఖానీలు వేసి ఎప్పటికో నిద్రపోవటం, ఇవే మా నిత్యకృత్యాలు. కనీసం ఆటలు ఆడే ధ్యాసలు కూడా లేవు మాకు. మా దృష్టిలో గొప్ప ఆటంటే పేకాటే, లేకపోతే రూమ్ ముందర, టెన్నిస్ బాల్ తో గల్లీ క్రికెట్ ఆడటం. మా వాకాడు కాలేజీలో ఎవరబ్బా యీ అందమైన అమ్మాయి, కాస్త చూద్దాము అనుకుంటే ఆ అమ్మాయి ఎవరో విజిటర్ గాని లేక మా వాకాటి ఆర్ట్స్ కాలేజీ అమ్మాయో అయ్యుండేది, అర్ట్స్ కాలేజ్ అమ్మాయిల జోలికెళ్తే, ఆ కాలేజీ అబ్బాయిలతో పెద్ద గొడవలైపోతాయి కాబట్టి మాకా అదృష్టం కూడా లేదు.

కానీ మాకొక జూనియర్ అమ్మాయి ఉండేది. అప్పుడందరూ ఇంజనీరింగ్ అమ్మాయిలు పై నుండి కిందదాకా పంజాబీ దుస్తులల్తో చుట్టుకొని వస్తే ఈ అమ్మాయి మాత్రం మా కంటికింపుగా లంగా ఓణీ లతో వచ్చేది. అమ్మాయి పెద్ద అందగత్తె కాదు కానీ, మా లాటి తెగ అందగాళ్ళకు మాత్రం ఆకర్షణీయంగానే కనపడేది. ఓ రోజు ఆ అమ్మాయి మా కాలేజీకి వెళ్లే దారిలో, తన సైకిల్ పక్కన ఇబ్బందిగా నిలబడి వుంది. నేనూ మా శ్రీధరగాడు ఎప్పటిలా జంట కవుల్లా వెళ్తున్నాము కాలేజీకి, ఆ అమ్మాయిని దాటేశాక, మాకు సందేహం వచ్చింది, ఎందుకలా నిలబడి వుంది ఆ అమ్మాయి అని. వెనక్కొచ్చి అడిగాము, ఏమిటి నీ సమస్య అని. ఆ అమ్మాయి లంగా తన సైకిల్ చైనులో ఇరుక్కుపోయి వుంది. ఆహా ఏమి మా అదృష్టం అనుకుంటూ మా వంతు సాయం గా తన లంగాని విడిపించాము ఆ కబుర్లూ ఈ కబుర్లూ చెబుతూ. సరే ధన్యవాదాలు చెబుతూ వెళ్లి పోయిందా అమ్మాయి. మరునాడు సరిగ్గా అదే ప్రదేశం లో నిలబడి వున్నాము మేమిద్దరం. ఆ అమ్మాయి సైకిల్ లో మమ్మల్ని దాటుకుంటూ వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన అమ్మాయికి సందేహం వచ్చి వెనక్కొచ్చింది, వచ్చి అడిగింది, మేము అక్కడ ఎందుకు నిలబడి ఉన్నామో. ఇద్దరము ముక్తకంఠం తో చెప్పాము, ఈ రోజు కూడా తన లంగా ఇరుక్కుంటుందనే ఆశతో వచ్చామని. అలా ఉండేవి మా సుందోపసుందుల పనులు.

ఇంజనీరింగ్ చివరి సంవత్సరం లో మాస్టర్స్ కోసం జరిగే ప్రవేశ పరీక్ష ఐన గేట్ రాసాము మేమిద్దరం మా కాలేజీ లో అందరితో పాటు. అప్పట్లో ఇప్పటిలాగా ఇంజనీరింగ్ అవ్వగానే ప్రాంగణపు నియామకాలు లేవాయే. అప్పట్లో గేట్ రిజల్ట్స్ ఇప్పటిలా పేపర్లో వేసే వారు కారనుకుంటా, లేక వేసే వరకూ వేచి వుండే ఓపిక లేకో వీడు మరియు ఇంకొక స్నేహితుడు, చెన్నై వెళ్లారు, అక్కడ ఐ.ఐ.టి లో రిజల్ట్స్ పబ్లిష్ చేస్తారు కనుక. ఇప్పటిలా సెల్ ఫోనులు కూడా లేవు కదా, అందుకే వాళ్ళు వచ్చే లాస్ట్ బస్సు కోసం నేను మరియు గేట్ లో రాంక్ ఆశించే ఔత్సాహిక మిత్రులందరము వేచి యున్నాము. ఎప్పటిలా మా అనీల్గాడు, వాడు గేట్ రాయక పోయినా, మాకంటే ఆతృతగా ఎదురు చూస్తున్నాడు మా ఫలితాలకోసం మరియు మాకు మోరల్ సపోర్ట్ ఇస్తూ. నాకు, శ్రీధర్ గాడికి, అలాగే మా ఇంకో మిత్రుడు సత్య కి మంచి స్కోర్ రావటం మా అందరికీ ఆ రోజే కాదు ఆ సంవత్సరమంతా ఓ మధురానుభూతి. ఆ మధురానుభూతి ఎక్కువై, ఇంకా ఎక్కువరోజులు ఆ మధురానుభూతి కావాలనిపించి, సరిగ్గా నాలుగవ సంవత్సరపు పరీక్షల ముందర స్ట్రైక్ అని అరిచి పరీక్షలు ఎగ్గొట్టాము మా బ్యాచ్ అందరమూ. మా యూనివర్సిటీ లో అందరూ వాళ్ళపాటికి వాళ్ళు రాసేశారు పరీక్షలు. మేమంతా సెప్టెంబర్ బ్యాచ్ అయిపోయాము. అలా ఆ సంవత్సరం మంచి గేట్ స్క్రోర్ లు వున్నా మాస్టర్స్ లో చేరలేక పోయాము. ఆ పై సంవత్సరం మాస్టర్స్ వాడు ఐ.ఐ.ఎస్.సి బెంగుళూరు లో మరియు నేను ఖరగపూర్ లో చేరి, చదువు పూర్తి చేసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ లు గా సెటిల్ అయ్యాము.

వీడి గురుంచి నేను చెప్పేటప్పు వీళ్ళ నాన్నగారి గురుంచి చెప్పకపోతే ఆ కథకి పరిపూర్ణత రాదు. చాలా ఇష్టమాయనకి వీడంటే. వ్యవసాయదారుడాయన. మంచి పంచెకట్టుతో చాలా హుందాగా ఒక సింహంలా ఉండేవారు. వీడు చదువుకుంటాను అంటే ఎంతైనా డబ్బులు చేతిలోపెట్టేసే వారు. ఇంటర్మీడియట్ దాకా వీడి స్నేహితుడు పీలేరు శీను, పై చదువుల నిమిత్తం వెళ్ళిపోవటం తో ఆ గ్యాప్ నేను పూర్తి చేశానని, ఇద్దరం కలిసి బాగానే చదువుకుంటున్నామని ఆయన వీడితో పాటు నన్ను అలాగే ఆదరించారు. మా చదువులన్నీ అయ్యాక, మేము జీవితంలో స్థిరపడిన మూడు నాలుగేళ్ల తర్వాత, ఆయనకి బాగా లేక ఆపరేషన్ కి వెళ్ళేటప్పుడు వీడు లేడు పక్కన, అప్పుడు అమెరికాలో ఉండటంతో. కానీ సెలవుల మీద వచ్చిన నేను వున్నాను. ఆయన్ని చూడ వచ్చిన వాళ్ళు ఈ అబ్బాయి ఎవరు అంటే మా అబ్బాయే అని చెప్పేవారు. తర్వాత ఆయనకి బాగా సీరియస్ కావటం తో వీడు అన్నీ వదిలేసుకొని ఆయన్ని బాగా చూసుకోవాలన్న తలంపుతో చెన్నై వచ్చేసాడు. అయన చివరి సంవత్సరాలని కంటికి రెప్పలా చూసుకున్నాడు. నాకు తెలిసి వీడి జీవితం లో విషాదమేమన్న వున్నది అంటే అది వాళ్ళ నాన్నని ఆయన చిన్న వయస్సులోనే కోల్పోవటము. ఒక కొడుకుగా వాడు ఆయన్ని చూసుకున్న విధానం మా మిత్రులందరికీ ఒక గర్వకారణం.

నేను కూడా 2009 లో నా దేశదిమ్మరి తనానికి చరమ గీతం పాడి చెన్నైకి చేరుకున్నా. ప్రతీ వారాంతం బాగా కలిసే వాళ్ళం వాళింట్లో కానీ లేక మా ఇంట్లో కానీ. ఇద్దరు పిల్లలు వాడికి, నా పిల్లలు వాడిని మొదటి నుండి బాబాయ్ అని, వాడి పిల్లలు నన్ను బాబాయ్ అని పిలుచుకుంటారు. ఈ పిలుపుల అనుబంధాలు ఎంత గొప్పవి అంటే, నా ఇరవై ఏళ్ల చిన్న కూతురికి రెండేళ్ల క్రితం వరకూ వాడు నా స్నేహితుడని తెలీదు, వాడు నా కజిన్ అని అనుకుంటూ వున్నది. తనకి చెప్పా కజిన్ కన్నా స్నేహంతో వచ్చిన బంధం బాగుంది అని.

అలా అని మేమేమి తిట్టుకోకుండా కొట్టుకోకుండా లేము. వాడి మీద కోపం వస్తే నేను మాటలాడటం మానేస్తా. మధ్యలో మా అనీల్గాడు దూరతాడు. వాడి మీద నీకు అలిగే హక్కులేదురా ముండా, ఎందుకంటే వాడితో గత ముఫై ఏళ్లుగా కాపురం చేస్తూనే వున్నావు. అన్నీ మూసుకొని ముందు వాడికి ఫోన్ చేయి అని. ఈ మధ్య కూడా అలిగా వాడి మీద, మా అనీల్గాడైతే ఈ లాక్ డౌన్ లో గూడా కారేసుకొచ్చాడు నన్ను తిట్టి పోవడానికి సందు దొరికింది కదా అని. మా శ్రీధర్ గాడి పెద్ద అనుమానం నువ్వు నా మీద అలిగితే వాడొచ్చి నిన్ను తిడితే వెంటనే మామూలయ్యి నాకు ఫోన్ చేస్తావు, నీకు వాడి మాటంటే అంత గౌరవమెందుకురా అని. ఎవరికీ తెలియని రహస్యమేమిటంటే మా బాపనోడి నోరంటే నాకు భయం, తొందర పడి వాడు శాపనార్థాలు పెడితే అవి పుసుక్కున జరిగిపోతాయని మా మిత్రబృందం లో ఓ ఉవాచ, అందుకే వాడి నోటికి జడిసి అలాగే అలాగే అనేస్తాము. వాడికి కోపం వస్తే నా పేరు అనీల్గాడు కాదురా అనీల్ శర్మ అని గుర్తు చేస్తాడు మాకు.

మా శ్రీధరగాడు ఏడేళ్ల క్రితం అనుకుంటా తన సాఫ్ట్వేర్ జీవితానికి చరమాంకం పాడి, వ్యాపారవేత్త అవతారం ఎత్తి ఇప్పుడు ఓ నాలుగు ద్విచక్ర వాహనాల సేల్స్ అండ్ సర్వీసెస్ షో రూమ్ లు స్థాపించి విజయవంతంగా చెన్నై ని ఏలేస్తున్నాడు.

“మా శ్రీధర గాడు! ఓ మంచి స్నేహితుడు!” కి 8 స్పందనలు

  1. ఇలాంటి స్నేహితులు ఉండటం గొప్ప వరం. I envy you Harsha 😜

  2. Goppa sneham Harsha, mee sneham eppatiki ilaage vundaali

    1. Thanks Prasanna for reading my stories without missing them and encouraging always.

  3. Chaala goppa sneham Harsha. Congratulations to all three of you. Ilaage haapy gaa undaali. Oka rakamgaa asooya kooda undi… Friends are really like jewels in life.

  4. […] వరుసలో కూర్చొని పాఠాలు తెగ వినేసే  మా శ్రీధర గాడిని మరియు నాలుగో బెంచీలో కూర్చొనే నన్నూ […]

  5. […] మా శ్రీధర గాడు, పరీక్షలకు ముందర ఒక ఓవర్ చూసి […]

  6. […] బాగా పాపులర్ అయిపోయాడు. నాకు, శ్రీధర గాడికి వాడు ఎప్పుడు స్నేహితుడైపోయాడో కూడా […]

Leave a Reply