Apple PodcastsSpotifyGoogle Podcasts

నా స్నేహితుల కథా క్రమం లో మా సుబ్బూ గురించి!

నేను కథలు రాయాలనుకున్నప్పుడు, మొదట స్నేహితుల గురుంచి రాద్దామనుకున్నాను. కానీ ఇలా రాయటం లో తెలియని ప్రమాదముంది. మొదట యీ రాయటం సరదాగా మొదలయినా, పోను పోను అవి నా అభిప్రాయ వ్యక్తీకరణ సాధనాలుగా మారుతాయేమో అన్నది నా భయం. అప్పటికీ నేను నా స్నేహితులతో వాదించవచ్చు ఈ కథ నేను నా కోణంలోనుంచి మాత్రమే రాస్తున్నాను అని. అలా వాదించటం నన్ను నేను మోసం చేసుకున్నట్టే అవుతుందేమో. కాబట్టి నాకు తెలిసినంత వరకూ తటస్థం గానే రాస్తాను. మా శ్రీధర గాడు మాత్రం దీనికి మినహాయింపని మీకిది వరకే బోధపడిందను కుంటా. వాడో మంచి స్నేహితుడు మరి. ఈ కథ నా ఇంకో స్నేహితుడు సుబ్రహ్మణ్యం గురుంచి.

నేను, సుబ్రహ్మణ్యం మరియు చంద్రశేఖర్ మా వాకాటి కాలేజీ వుండే విద్యానగర్ అనే పల్లెకి ఎక్కువ, పంచాయితీకి తక్కువ లాటి ఊర్లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరపు కాలంలో రూమ్ మేట్స్ మి. ఆ వూర్లో పేరుమోసిన ఆర్ట్స్ కాలేజీ మరియు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండటంతో రూమ్స్ కి డిమాండ్ ఎక్కువే. ఆ ఊరి మోడల్ హై స్కూల్ లో పని చేసే గరటయ్య అనే లెక్కల మాస్టారు, కోటలో పని చేసే మా బావకి స్నేహితుడు కావటం మూలాన, మా బావ కోరికతో, ఆ మాస్టారు మాకు రూమ్ అని ఏకోశానా గుర్తింప మనస్కరించని ఓ సగం కూలి వంగిపోయిన కప్పుగల ఒక పూరి గుడిసె చూపించి పుణ్యం మూటకట్టుకున్నారు. మరి మేము ముగ్గురము ఎలా రూమ్ మేట్స్ మి అయ్యామంటే, చంద్రశేఖర్ గరటయ్య మాస్టారి ప్రియ శిష్యుడు మరియు మా సుబ్రహ్మణ్యం యొక్క చెడ్డీ మిత్రుడు, నన్ను గరటయ్య మాస్టారు వీళ్ళతో కలిపాడు. మా చంద్రశేఖరుడు ఇంజనీరింగ్ విద్యార్థి కాదు, ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి. మేము ఆ గుడెసెనే దేవాలయంగా ఆ ఓనరమ్మనే దేవత గా కొలిచాము. మరలా అప్పుడప్పుడూ ఆవిడ రూమ్ ని నీట్ గా పెట్టామా లేదా అని ఇన్స్పెక్షన్ కి వచ్చేది. ఆవిడకి మా సుబ్బూ మాట అంటే తెగ గురి, చదుకొని బాగుపడే లక్షణాలు ఉన్నాయని.

కానీ మా సుబ్రమణ్యాన్ని చూసాక అసలు ఒక వ్యక్తి ఇంతలా చదువుతాడా అన్న ప్రశ్నకి సమాధానం ఇప్పటికీ దొరకలా. స్వయం పాకం చేసుకునేవాడు. ఉదయం లేచి స్టవ్ మీద అన్నం పెట్టి, అది అయ్యేలోపల చదువుతూ, చదివినది పలక మీద పర పరా రాస్తూ మొదలెట్టి, మరలా కాలేజీ నుండి వచ్చాక అన్నీ సబ్జెక్టులు, అన్నీ టెక్స్ట్ బుక్కులు, ఆ బుక్కుల్లో అన్నీ పేజీలు చదివేసే వాడు, చదివింది మరలా యధావిధిగా పలక మీద పర పరా రాసేసేవాడు. మా గుడిసెలో ఒకే బల్బ్ హోల్డర్ వుండేది కాబట్టి మా చదువులన్నీ ఒక దగ్గరే. చాలా శ్రద్దగా చదివే సుబ్రహ్మణ్యం అవతలి వాడు చీమని చిటుక్కుమనిపించినా చిరాకు పడిపోయేవాడు. నాకది చాలా వింతగా వుండేది మరియు వాడిని ఇరిటేట్ చేయడానికి సాధనంగానూ కూడా. నేను కూడా అప్పుడప్పుడు కొంచెం పెద్దగా చదువుతూ వాడిని గీరే వాడిని తగువుకి.

సుబ్రహ్మణ్యం నాయుడుపేట మండలంలో ఓజిలి దగ్గరైన అన్నమేడు గ్రామస్థుడు. మొదటి నుండీ అన్నీ తరగతుల్లో ప్రధముడే. వాళ్ళ నాన్నగారు వాడికి ఊహ రాక ముందే గతించడంతో, తన ఇద్దరి పిల్లల్ని వాళ్ళ అమ్మగారు తన రెక్కల కష్టంతో చదివించుకుంటున్నారు. వీడు మూడు వారాలకో లేక నెలకొకసారో సైకిల్ మీదనే వాళ్ళ ఊరెళ్ళి తనకి కావాల్సిన సామగ్రి తెచ్చుకొనే వాడు. వాడి ధ్యాస అంతా చదువే. నాకు మొదటి నుండీ ప్రశ్న-అర్ధకమే, వీడు మా వాకాటి కాలేజీలో ఎలా పడ్డాడురా నాయన శాపవశాత్తూ, ఎక్కడో ఐ.ఐ.టి లో ఉండాల్సినోడు అని. అలా చదవటమే తిండీ నిద్రలాగా భావించే మా సుబ్రహ్మణ్యం మొదటి సంవత్సరంలో మా కాలేజీకి ప్రధముడిగా నిలిచాడు. మా కాలేజీ మా యూనివర్సిటీలో చదువుల్లో మేటి కాబట్టి, మా యూనివర్సిటీకి ప్రథముడు వాడు. మాకూ ఎదో గుర్తింపు యూనివర్సిటీ ప్రధముడి రూమ్ మేట్ గా. కొందరు చదువుల ఔత్సాహికులు వాడితో పాటూ నాతో మాట మంతీ కలిపేవారు, మా సుబ్రహ్మణ్యం రాంక్ యొక్క రహస్యం చెప్పమని. అక్కడ రహస్యమేమీ కనపడలా నాకు అస్సలు సాధ్యం కానీ కఠోర శ్రమ తప్ప.

సుబ్బూ చదువు చూసి ఉత్తేజితుడైన మా చంద్రశేఖరుడు కూడా నా మడత కూడా పడని మరియు కొత్త కరుకులా మిగిలిపోయిన ఇంజనీరింగ్ మెటీరియల్ నాచేతనే తెప్పించుకొని, మా చేత సందేహాలు నివృత్తి చేసుకుంటూ ఎంసెట్ లో రాంక్ తెచ్చుకొని తదుపరి సంవత్సరం ఇంజినీరింగ్ లో చేరటం మాకు మిగిలిన గొప్ప అనుభూతి. కానీ ఇలా చదివే సుబ్బుని నేను రెండవ సంవత్సరంలో భరించలేక మా శ్రీధరగాడితో కలిసి వేరే రూమ్ కి మారిపోయి ఊపిరిపీల్చుకున్న.

నాకు మా సుబ్బూ మీద మొదటి నుండి చివరి వరకూ ఓ ఫిర్యాదు లేక ఓ మనస్తాపం ఉండేది. మా బోటి వాళ్ళము మాకొచ్చిన అరాకొరా విజ్ఞానంతోనే, ఎవరైనా స్నేహితులొచ్చి ఏమన్నా సందేహాలు అడిగితే, పరీక్షా సమయంలో కూడా, మేము చదివేది పక్కన పెట్టి వాళ్ళ సందేహాల్ని నివృత్తి చేయ ప్రయత్నించే వాళ్లము. మా శైలేంద్ర గాడైతే ఇప్పటికీ వాడి మార్కుల్లో పావు వంతు హర్షాగాడివే నని చెప్తాడు. నేను వాడికి బోధించి వాడు పరీక్షల్లో సరిగా రాసి, నేను సమాధానాలు చెడగొట్టుకొచ్చిన సందర్భాలు కూడా వున్నాయి. కానీ అంతటి నడిచే విజ్ఞానఖని లాటి మా సుబ్బూ పరీక్షకెళ్లే దారిలో నాకేమైనా సందేహం వచ్చి నివృత్తి కోసం అడిగితే, అబ్బా, పరీక్ష సమయంలో నీకు వాటికవే సమాధానాలు తడుతాయి అని చెప్పేవాడు కానీ, ఏ నాడు నా సందేహం తీర్చలా వాడి దగ్గర సమాధానాలు వున్నా. అందుకేనేమో ఈ ప్రధములంత స్వార్థ పరులుండరేమో పోటీ విషయంలో. మా సుబ్బూ అన్నీ సంవత్సరాలలో మా విశ్వవిద్యాలయానికి ప్రధముడిగా, మరియు ఏ సబ్జెక్టు లోనూ డిస్టింక్షన్ తగ్గని మార్కులతో యూనివర్సిటీకే ప్రధముడిగా ఎనభై ఐదో లేక ఎనభై ఎనిమిదో శాతం తో ఆనర్స్ డిగ్రీ పొందాడు. వీటితో పాటు ఎన్నో జర్నల్స్ లో వాడి పేపర్స్ పబ్లిష్ అయ్యాయి. మీరు కూడా గమనించండి అన్నీ కథల్లో పోసుకోలు కబుర్లు చెప్పే నేను ఆ కథలో ఎంత సేపటికి చదువుల గురుంచే రాసా ఇప్పటి వరకూ, ఏమి చేద్దాం చెప్పు పాత్రలు మనల్ని అంత ప్రభావితం చేస్తాయి మరి.

డిగ్రీ అయ్యాక నేను మాస్టర్స్ చేసి, ఉద్యోగార్థం మన దేశ రాజధానిలో చేరా. మా సుబ్బు కూడా మాస్టర్స్ చేసి, ఐ.ఐ.టి లో రీసెర్చ్ స్కాలర్ గా ఢిల్లీ చేరాడు. కొంత కాలం అయ్యాక ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ లో వుద్యోగం రావటంతో రీసెర్చ్ వదిలేసి నారాయణ విహార్లో ఓ మంచి ఇల్లు తీసుకొని వాళ్ళమ్మ గారితో సహా స్థిరపడిపోయాడు. నేను మాత్రం నా బ్రహ్మచారి మిత్రులతో, కరోల్ బాగ్ లోని అజమల్ ఖాన్ రోడ్ లో తేలా. వారాంతాల్లో మాత్రం కలిసే వాళ్ళం ఇద్దరం క్రమం తప్పకుండా. మా రూమ్ మేట్స్ అయిన మధూకి మరియు నాగ్ కి కూడా సుబ్బూ మంచి స్నేహితుడైపోయాడు. సుబ్బు ఎంత కష్టపడినా ఏమన్నా కొనాలంటే చాలా క్వాలిటీ కాన్షస్ గా వుండే వాడు. మేమందరం అజ్మల్ ఖాన్ ప్లాట్-ఫారమ్ మీద స్వెట్టర్లు కొంటె వాడు మాత్రం మోంటే కార్లో మాత్రమే కొనే వాడు. ఏది కొన్న చాలా నీట్ గా ఉండాల్సిందే.

మేమిలా దేశరాజధానిలో కొలువుల సందడిలో మునిగి తేలుతుండగా ఇక్కడ నెల్లూరు లో మా హౌసింగ్ బోర్డు నివాసి ఐన మంజుల కూడా తన ఇంజనీరింగ్ పూర్తి చేసి ఐ.టి కొలువు వెలగపెట్టాలని తహ తహ లాడిపోతుంది అందరి యువ ఇంజినీర్ల మాదిరిగానే. ఈ మంజుల ఎవరంటే మా అక్క క్లాస్ మేట్ కూతురు. మీ అక్క అంత పెద్దదా నీకన్నా అనేగా మీ ప్రశ్న, తాను నాకన్నా ఓ సంవత్సరం చిల్లర మాత్రమే పెద్ద. మంజుల వాళ్ళ అమ్మ గారు పిల్లలు అందరూ పెద్ద ఐన తరువాత మరలా తన కాలేజీ చదువులు మొదలు పెట్టిన ధీర వనిత. ఈ మంజుల మా వీధి చిన్న పిల్లలందరికీ చదువులు చెబుతూ మా ఇళ్లల్లో మా ఇంట్లో అమ్మాయిలా తిరిగేది. అటువంటి మంజులాకి ఉద్యోగం ఇప్పించే ప్రణాళిక మా వాళ్ళు రచించేసారు నేను ఢిల్లీ లో ఉండగానే. సరే నేను కూడా మా ప్రాజెక్ట్స్ కి బిజినెస్ అసోసియేట్స్ ని అందించే ఒక సబ్ కాంట్రాక్టర్ని పట్టుకొని తనకి ఢిల్లీ లో కొలువు ఖాయపరిచా.

అలా ఒక శుభ ముహూర్తాన మంజుల ఢిల్లీ చేరింది. మా ప్రణాళిక, తాను వచ్చి కొలువులో చేరిపోయి, ఆ రోజే ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరిపోయేలా రచించి అన్నీ ఏర్పాట్లు చేసాము. తీరా ఆ అమ్మాయి రాగానే ఆ ఉద్యోగమిస్తానన్న నాకొడుకు పత్తా లేకుండా పోయాడు. వుద్యోగం లేనిదే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ప్రవేశం లేదన్నారు. అలా దిక్కుతోచని స్థితిలో మేము సుబ్బు ఇంట్లో తేలాము. ఆ రోజు శుక్రవారం కావటం తో, ఆ రోజు వచ్చిన అమ్మయిని నన్నూ గెట్ అవుట్ అనలేక సుబ్బూ వాళ్ళ అమ్మ గారు ఇంట్లోకి రానిచ్చారు. అలా మంజులాని వాళ్ళ ఇంట్లో పది రోజులు వుంచుకోమని బతిమాలి నేను పెళ్లి చేసుకొని రావడానికి నెల్లూరు పోయా. తిరిగొచ్చాక ఆ సబ్ కాంట్రాక్టర్ గాడిని పట్టుకొని కొలువులో పెట్టాలని నా ఆలోచన.

పది రోజుల తర్వాత వచ్చిన నన్ను కూర్చో పెట్టి, నాకు పళ్లెం లో తినడానికి ఇంత పెట్టి, మేము ప్రేమలో ఉన్నామని ప్రకటించారు మంజూ సుబ్బూలు. నా వంట్లో వణుకు వాళ్ళమ్మ ఎక్కడ విని మళ్ళీ గెట్ అవుట్ అంటారోనని. నాకప్పుడర్థమయ్యింది యీ విశ్వవిద్యాలయ ప్రధములకు లోకజ్ఞానం సున్నాయని, బుర్రలు మోకాల్లో వుంటాయని. పదిరోజుల్లో ప్రేమేందిరా నాయనా అంటే ప్రధమ వీక్షణలోనే ప్రేమ కలిగిందని సెలవిచ్చారు. సుప్రియా వచ్చేదాకా అన్న గుట్టుగా వుండండిరా నాయనా అని బతిమాలుకొని, సుప్రియా రాగానే మంజులతో సహా మేము నారాయణా విహార్ కి పక్కనే వున్న ఇంద్రపురికి మారిపోయాము. ఇంద్రపురిలో వున్న రోజులు మా జీవితంలో చాలా మంచిరోజులు. మాకు ఎదురుగానే ఎన్నో వందల ఎకరాల్లో వుండే పూస అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్. ఉదయపు వ్యాహ్యాళి కి అక్కడకు వెళ్లే వారం, కొన్ని వందల ఎకరాల్లో అపురూపమైన పంటలు, చక్కని గాలి, వందల కొద్దీ నెమళ్ళు మరియు పక్షులు, ఆ ఇన్స్టిట్యూట్ వలన ఆ ఏరియా ఉష్ణోగ్రత కనీసం ఓ డిగ్రీ అన్నా తక్కువ ఉండేది ఢిల్లీ లో అని అనుకుంటూ ఆ వాతావరణాన్ని ఆస్వాదించే వాళ్లము.

సుబ్బూ కూడా జీతం వచ్చిన రోజుల్లో రారాజు, సుప్రియాకి ఇష్టమని వచ్చినప్పుడల్లా అన్నీ రకాల పళ్ళు తెచ్చేవాడు, ఇద్దరం మరలా నెల చివరి రోజుల్లో, సుప్రియా! నీ హుండీ లో ఏమన్నా చిల్లర ఉందా అంటూ వెళ్ళేవాళ్ళం. అలా చాలీ చాలని జీతాలతో అయినా చాలా బిందాస్ జీవితం, వారాంతరాలలో ఢిల్లీ లో చూడదగ్గ ప్రదేశాలు చూస్తూనో లేక ఆంధ్ర భవన్ లో తెలుగు సినిమాలు వీక్షిస్తూనో. మేము ఎక్కడికెళ్ళి స్నేహ బృందాలు చాలా తయారయ్యి పోయేవి. అలా క్రమం తప్పకుండా కలిసే బృందంలో మా ఇంజనీరింగ్ లో సీనియర్ అయిన బాలాజీ వాళ్ళ కుటుంబం మరియు మా ఇంకో క్లాసుమేట్ అయిన జగ్గూ గాడి కుటుంబం కూడా ఉండేవి.

సుబ్బూ వాళ్ళ అమ్మగారికి వాళ్ళ వూరిలో వాళ్ళ పొరుగులోనే వున్న ఓ అక్క చెల్లెళ్లని సుబ్బూకి వాళ్ళ అన్నకి ఇచ్చి పెళ్లి చేసుకోవాలని పెద్ద కోరిక. అందులోను ఆ అమ్మాయిది సుబ్బూ ది చక్కటి జంట అవుతుందని ఆవిడ ప్రగాఢ విశ్వాసం. నాదీ సుప్రియాది, లేక బాలాజీ వాళ్ళ జంటకన్నా లేక ఆవిడకి తెలిసిన జంటలకన్నా సుబ్బూది వాళ్ళ ఊరి అమ్మాయిది చల్లటి జంట అని చెప్పేది ఆవిడ. అలాటి ఆవిడ ఆశల్ని శరాఘాతంలా కూలుస్తూ సుబ్బూ చెప్పేసాడు ఆవిడకి వాడి ప్రేమ గురుంచి. ఆవిడకి వాడంటే ఎనలేని ప్రేమ, వాడినేమీ అనలేరు, కానీ దీనికంతటికీ కారకుడైన యీ పాపాల భైరవుడిని ఆవిడ క్షమించలేదు. నాతో మాటలాడటం మానేశారు ఆవిడ. కనీసం నా ముఖం కూడా చూడడానికి ఇష్టపడలేదు. కానీ సుబ్బు అందరినీ ఒప్పించుకొని ఓ సంవత్సరం లోపే మంజూని తిరుమల లో పెళ్లి చేసుకున్నాడు. నేను ఆ సమయం లో నెల్లూరు లోనే వున్నా ఆ పెళ్ళికి హాజరు కాలేక పోయా సుబ్బూ సలహామీదే. ఎక్కడ వాళ్ళ అమ్మగారి ఆగ్రహానికి గురి అవ్వాలేమో అని.

మన అనీల్గాడు యీ మధ్య ఒక కథ రాసి చదివి వినిపించాడు మనకి. ఆ కథలో చాలా వేదాంతం చెప్పాడు, ఒక విషయం మనం చూసే కోణాన్ని బట్టి, లేక ఋతువులని బట్టి, లేక కాలాన్ని బట్టి మారుతూ ఉంటుందని. వార్నీ వీడికింత మెట్ట వేదాంతమెక్కడ వంటబట్టిందిరా నాయనా అనుకున్న, కానీ అది చాలా నిజం. కాలం గడిచే కొద్దీ, సుబ్బు వాళ్ళ అమ్మగారి కోపం నా పట్ల చాలా దయగా మారిపోయింది. సుబ్బు మాటల్లో చెప్పాలంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అన్నదమ్ముల వివాహాల తదుపరి జరిగిన పరిణామాల దృష్ట్యా సుబ్బువాళ్ళ అమ్మగారు సుబ్బు ఒక చదువుకున్న కుటుంబం నుండి వచ్చిన ఒక చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని చాలా మంచిపని చేశాడనే విశ్వాసానికి వచ్చారని. సుబ్బూ వాళ్ళ అమ్మగారు సంవత్సరంలో రెండు నెలలు వీళ్ళ దగ్గర మరియు, మిగతా నెలలు అన్నమేడులో వ్యవసాయ పనులతో తీరిక లేకుండా ఉంటారని, అన్నమేడులో వున్నప్పుడు క్రమం తప్పకుండా ప్రతీ రోజు సుబ్బూ మరియు మంజులకు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు తెలుపుతారు మరియు కనుక్కుంటారని. ఇప్పుడు సుబ్బు మంజు ఢిల్లీలోనే వాళ్ళ ఇద్దరు పిల్లలతో చాలా హాయిగా నెవెర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ లా బతికేస్తున్నారు. నేను కూడా చెప్పాను సుబ్బూకి, వాళ్ళమ్మగారు అన్నమేడులో వున్న సమయంలో క్షేమంగా వెళ్లి ఆవిడ ఆశీర్వాదం అనే లాభాన్ని తీసుకొచ్చుకుంటాను అని.

“నా స్నేహితుల కథా క్రమం లో మా సుబ్బూ గురించి!”‌కి ఒక స్పందన

  1. Mee Engineering college life gurinchi, friends gurinchi kallaku kattinattu raasaaru, mee friend subbu gaari love story super

Leave a Reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading