Apple PodcastsSpotifyGoogle Podcasts

మన జీవితాల నాయకా నాయకులు! ఒకటవ భాగం

నేను ఇంతవరకూ రాసిన కథల పాత్రల జీవితం లో ఎదో ఒక సంఘర్షణ ఉండేది. అలా సంఘర్షణ వున్న పాత్రల గురుంచి రాస్తేనే ఓ మంచి కథ అవుతుంది అని నమ్మేవాడిని. కానీ ఆర్ధిక పరమైన కొన్ని సంఘర్షణలు తప్ప వ్యక్తిగతమైన సంఘర్షణలు లేకుండా జీవితాన్ని గడిపి, ప్రేమలను మాత్రమే పంచిన మన పెద్దమ్మలు, పెద్ద నాన్నలు, చిన్నాన్నలు, చిన్నమ్మలు, మామలు, అత్తలు మొదలగు వారి గురించి కూడా రాయాలి. వీళ్లంతా మనమెక్కడో వెతుక్కోవాల్సిన పనిలేకుండా మనపక్కనే వుంటూ వాళ్ళ జీవితాల్ని ఎంతో కొంత మనకు ధారపోసిన నాయకులూ లేక నాయికలు. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇందరి సహాయ సహకారాలు, ప్రేమానురాగాల వల్లనే మనం పెద్దవారి మయ్యామన్న స్పృహ కలుగుతుంది.

ఈ మధ్య మా అమ్మతో మాట్లాడుతుంటే, తన చిన్ననాటి స్నేహితురాలైన ఈదల పద్దమ్మ గారి గురుంచి చెప్తూ, తన చిన్నతనంలో తనంతటి వయస్సు వుండే ఆవిడ చాలా పెద్దదైన వాళ్ళ పెరడు అంతా ఊడ్చి, కళ్ళాపి చల్లి, ముగ్గులు పెట్టి, ఆ తర్వాత అంట్లు అన్నీ తోమేస్తే మా అమ్మ తనకి సహాయం చేసేది అంట్లు కడగటంలో. మా అమ్మనడిగా నేను, మరి మీ ఇంట్లో ఈ పనంతా ఎవరు చేసేవారు అని. మా చిన్నక్క ఐన సరోజినక్క అని చెప్పింది. చెప్తూ మన పనంతా గోసంగిలా ఊరంతా స్నేహితురాళ్ళతో తిరగటమే, అంత మా అక్కే చూసుకొనేది అని సెలవిచ్చింది. ఈ ఒక్క వాక్యం చాలు మా చిన్న పెద్దమ్మ ఎంత కష్ట జీవో, మరియు తన చెల్లెలైన మా అమ్మ కూడా పని చేయాలి కదా అని వంతుల కోసం ఎదురు చూడకుండా తన పని తాను ఎలా చేసుకొని పోయేదో చెప్పడానికి.

మా సరోజన పెద్దమ్మ మరియు మా శేష పెదనాన్నలకి నలుగురు సంతానం. ముగ్గురాడపిల్లలు మరియు ఒక మగ నలుసు. మా పెదనాన్నకి అందర్నీ ప్రేమించటం, వ్యవసాయప్పనులు చూసుకోవటం తప్ప ఏమీ తెలియదు మా పెద్దమ్మే అన్నీ చక్కబెట్టుకోవాలి. వాళ్లిద్దరు వాళ్ళ నలుగురు పిల్లలతో పాటు మాకు, అంటే మా అన్నకి, అక్కకి మరియు నాకు, సమానంగా ప్రేమని పంచారు, ఇంకా ఒక పాళ్ళు ఎక్కువే, మేము చిన్న పిల్లలమవటంతో. మా పెదనాన్న వాళ్ళ నాన్నగారు మా అమ్మమ్మ వాళ్లకి బంధువులు మరియు వాళ్ళకి మొదటినుండి ఉప్పలపాటిలో పొలాలు ఉండటం తో మా పెద్దనాన్న ఉప్పలపాటికే వచ్చేశారు. అలా మా సొంత అక్క ఉప్పలపాటిలో మా పెద్దమ్మ పెద్ద నాన్నల దగ్గరే పెరిగేసింది. మా నాన్నమ్మ వాళ్ళ వూరైన ఉలవపాళ్లలో మా నాన్నకసలు ముగ్గురు పిల్లలని తెలీనే తెలియదు. మా అక్క మా ఉలవపాళ్ళకి అప్పుడప్పుడు వచ్చి పోయే ఇందిరమ్మ. ఎందుకో తెలియదు మా ఉలవపాళ్ళ జనాలు మా అక్క పేరు సుమతి అయినా, ఇందిరమ్మ, లేక ఇందిరా గాంధీ అనే పిలిచే వాళ్ళు.

అలాగే నేను ఉప్పలపాటి వచ్చి ఎక్కడికైనా వెళ్లాలంటే మా పెదనాన్న భుజాలమీద ఎక్కి వెళ్లాల్సిందే, నాకు బాగా లేనప్పుడు ఎత్తుకెళ్ళి చీటీలు కట్టించటం, లేక కామెర్లకి పక్కూరికి తీసుకెళ్లి మందు పెట్టించటం, అంత ఎందుకు మా ఊరి పొలాల వెనక పారే వాగులో దొరికే అతి రుచికరమైన అర్జులు అనబడే చేపలు తెచ్చుకోవాలన్న నేను మా పెదనాన్న భుజం ఎక్కాల్సిందే. ఆయనకి ప్రేమ ఎక్కువైతే నా బుగ్గలు కొరికేసేవారు. అదొక్కటే నేను ఆయన మీద చేయగలిగిన ఫిర్యాదు. ఆఖరకు మేము ట్యూషన్లో లేట్ అయినా లాంటర్న్ ఎత్తుకొని వచ్చేవాడు మా పెదనాన్న నన్ను మా అక్కనీ ఇంటికి తీసుకెళ్లడానికి. నాకు తెలీదు అంత ప్రేమ ఆయన ఎలా పంచగలిగాడో అని.

మా పెద్దమ్మైతే పొలం పనుల అజమాయిషీలో పడి అలిసి సొలిసి వచ్చినా దాలి గుంత వేసి కాగు నిండా నీళ్లు కాచి ఆ వేడినీళ్ళతో మాకు స్నానాలు చేయించేది. నేను పెద్ద వాడినయ్యా నేనే చేస్తా అని హఠం వేసే వాడిని అప్పుడప్పుడు. ఆమె ఎప్పుడన్నా నెల్లూరు వెళ్తుంటే పనుల మీద కాళ్లకడ్డం పడి ఆమె వెంట వెళ్లే వాడిని. నెల్లూరులో ఆమె ఎన్ని పనులున్నా ఓపికగా నడిచే వెళ్లే వారు, నేను కొంచెం నడిచి రిక్షా ఎక్కుదామని మారాం చేసే వాడిని. ఎన్నిటికని ఎక్కగలం, ఆమె అలాగే నన్ను బతిమాలుతూ నడిపిస్తూ, నడిస్తే షోడాకొని పెడతానని చెబుతూ, తనకి ఓపిక వున్న వరకూ నన్ను మోస్తూ పనులు చక్క బెట్టుకొనేది.

ఇక మా పెద్దక్క సి. గాన పెసూనాంబ అయితే మా పిల్లకాయల్ని మాయ చేసి అన్నాలు పెట్టటంలో మహా నేర్పరి. అప్పట్లో మాకు ఇన్ని రకాల కూరగాయలు లభ్యం అయ్యేవి కావు. మహా అయితే పల్లెల్లోనే పండిన సొరకాయో, పొట్లకాయో, పందిరి చిక్కుడ్లో, లేక పోతే తంబకాయలో దొరికేవి. ఇప్పటిలా క్యారట్లు, బీట్ రూట్లు, క్యాబేజీలు లాటివి మేమెరుగం. బంగాళా దుంపలు కూడా ఎప్పుడో పండగలకు పబ్బాలకు కుర్మా రూపంలో. చేపలు మాత్రం చాలా విరివిగా దొరికేవి. కానీ సాయంకాల పూట, సూర్యాస్తమయ్యాక, ఆరుబయట, మినవల పచ్చడి, పొట్టు పెసలతో చేసిన పప్పు, నెయ్యి కలిపి మా అక్క భీముడి కథలు చెప్తూ నా సామిరంగా అన్నం పెడుతుంటే, ఇంకా పెట్టు, ఇంకా పెట్టు, నేను భీముడిలా అయిపోయి బకాసురుడిని చంపేస్తా అంటూ పొట్ట నిండా తినేసే వాడిని. ఆ తర్వాత పెద్దమ్మే! వాడు తిన్నాడనుకొ నువ్వు పెట్టెయ్యడమేనా, ఇప్పుడు చూడు వాడెలా భుక్తాయాసం తో కష్టపడుతున్నాడో అంటూ మా అమ్మమ్మ నా పొట్ట మీద చేయి వేసి వాతాపీ జీర్ణం వాతాపీ జీర్ణం అంటూ తడిమేది. ఆ స్పర్శలోని హాయితో అక్కడే వుండే నులక మంచాలమీదే వాలిపోయే వాళ్ళం. మా పెద్దనాన్నకి మాత్రం అన్నీ పూటలా చేపలో లేక మాంసం ఉండాల్సిందే, కూరగాయల భోజనం పెడితే అన్నాన్ని అలా అలా కెలికేసి పీట కిందకి తోసేసి వెళ్ళిపోయేవారు. ఎక్కువ తినరు కానీ ఉండాల్సిందే.

ఇక మా రెండో అక్క సునీతాంబ, చదువులలో కడు సున్నా, కానీ అందరికీ పెట్టడం లో మాత్రం మిన్న. తనది మహా పెద్ద చేయి, దాపరికం అసలు తెలియదు పెట్టే వస్తువుల గురుంచి కానీ లేక మాట గురుంచి కానీ. ఈ అక్క చదువు తొందరగానే మానేసి ఇంట్లో ఉండటంతో మేము ఎక్కువగా ఈమె చుట్టూనే తిరిగే వాళ్ళం. ఈవిడ నిద్రకోసం కళ్ళు మూయగానే, అక్క కళ్ళు తెరువు, నన్ను చూసి నవ్వు అంటూ, ఇంకా కళ్ళు తెరవక పోతే మా సునీతక్క చచ్చిపోయిందని ఏడుస్తూ తిరిగే వాడినట నేను. ఇవన్నీ మురిసిపోతూ చెప్పుకుంటుంది మా అక్క ఈరోజుక్కూడా. ఇక మా ఆఖరి అక్క అయిన సుజనక్క మహా చదువరి. తను స్వతంత్ర దినోత్సవంలో లేక గణ తంత్ర దినోత్సవంలో తెచ్చుకొనే బహుమతుల కోసమో, లేక తాను తినకుండా మాకోసం తెచ్చే చాక్లెట్ లకోసమో తనొచ్చే బస్సు దగ్గర ఎదురు చూడటం నాకింకా గుర్తు. నేను నోట్స్ లు పోగొట్టుకుంటే మా ప్రసునక్క మరియు సుజనక్క నా నోట్స్ లన్నీ రాసివ్వటం నాకింకా గుర్తే.

ఇక మా శీనన్న మా లెక్కల మాస్టర్. కోపమెక్కువే మానవుడికి, నాలుగు సార్లు చెప్పి ఐదో సారి సరిగా చేయక పోతే ఒకటి పీకే వాడు, నాకు వూహ తెలిసే సరికి తనకి టెన్త్ అయిపోయి పాలిటెక్నిక్ చదువుతున్నాడు. అన్నీఆటలలో ఛాంపియన్ అయన, మరియు మా ఊరి కబాడీ టీం లో ప్లేయర్ కూడా. ఆయన మా ఊరి బుద్ధిమంతుడు మరియు మాలాటి పిల్లకాయలకు మార్గదర్శకుడు. మా ఎడ్లు బoడి తోలేడు అంటే ఆ ఎద్దులు ఎటువంటి మొద్దువైనా పరుగులు తీయాల్సిందే. మా పెద్దనాయన తో కానీ, మా అన్నతో కానీ మావూరి వడ్ల మెషీన్ కి వడ్లు వేసుకొని బండిలో పోవటం నాకు చాలా సరదా అలాగే చేలల్లోకి కానీ లేక మా పక్కవూరు రామలింగాపురం వరకూ వాళ్ళతో బండిలో పోవడానికి పర్మిషన్ దొరికిన రోజు నాకు పండగే పండగ. అలాగే మా పెద్దనాయనో లేక మా సీనన్నో తాటికాయలు కోసి పెడుతుంటే వాటిల్ని జుర్రేయ్యటం మర్చిపోలేను. మా వోడు తాటికాయల్ని జుర్రేయ్యటం లో నెంబర్ వన్ అనేవాళ్ళు వాళ్ళు.

ఈత కాయల గెలల్ని మా పెద్దనాయన తో కొట్టించుకొచ్చుకొని మా గడ్డి వాములలో మగ్గవేసి, ప్రతీ రోజు అవి మగ్గాయా లేదా అని చూసుకోవటం ఇంకా కళ్ళముందరే. నులక మంచాలని తిరగేసి, వాటి నాలుగు కోళ్లకు తాడుకట్టి మా కొట్టం దూలాలకు ఉయ్యాలలా ఆయన వేసిస్తే ఎండలకు బయటకి తిరగకుండా వాటిల్లో ఊగుతూ గడిపేసే వాళ్ళం. ఓ రోజు మా సొంత అన్న తన గుడ్డలన్ని విప్పి ఆయన స్నేహితులతో కలిసి మా వురి చెరువులో ఈత కొడుతూ ఉంటే మా పెద్దనాన్న ఆ బట్టల్ని తన చంకన పెట్టుకొని వచ్చేసారు, మా అన్న మొండిమొలతో పొలాలకు అడ్డం పడి వచ్చి ఆ ఉక్రోషం తట్టుకోలేక చాలా నీళ్లు పెట్టె పెద్ద పెద్ద బానలని పగలకొట్టెయ్యటం, ఓ ఏభై బిందెల నీళ్లు పట్టే తొట్టెలో తన కాళ్ళను బురదలో ముంచి మరీ దిగి వాటిని పాడు చేయటం, అది చూసి మా పెద్దనాన్న ఆ ఉక్రోషానికి నవ్వుకోవటమే తప్ప కోపగించుకోక పోవటం నాకు ఇంకా గుర్తే. మా అన్న అంత ఉక్రోషపడడానికి కారణం ఆ ఏడాది మా ఊరి ప్రాధమిక పాఠశాల మరమ్మత్తుల నిమిత్తం మా కొట్టాలలో జరుపబడుతూ ఉండటం, మా అన్న మొండి మొల చూసి ఆ బడిలో ఆడ పిల్లలు కిసుక్కున నవ్వటం. మా సుమతక్క కైతే ఆయనంటే చాలా ప్రేమ, నువ్వు ఏమిటే పెదనాయన ఇలా తగ్గిపోతున్నావు, మా నాన్న చూడు ఎలా లావైపోతున్నాడో అంటూ ఆయన్ని తన చిన్నప్పుడు పట్టుకొని ఏడ్చేయటం నాకింకా గుర్తే.మా చిన్నప్పటి విషయాలు ఆయన్ని కదిలిస్తే వాటికి చాలా అతిశయోక్తులు కలిపి మరీ చెప్తారు కాబట్టి, పో పెదనాన్న మీరు చెప్పేవి మేము నమ్మమని ఆయన్నే బుకాయించటం మాకు చాలా సరదా.

అలా అందరూ అక్కలు మరియు అన్నల మధ్య పెరగటం మా ముగ్గురి అదృష్టం. ఇప్పటిక్కూడా చిన్నా అనే వాళ్ళ పిలుపు నాకు చాలా ఇష్టం. నాకు గుర్తులేని నా చిన్నప్పటి విషయాలు మా అక్కలు నాకు గుర్తు చేస్తారు, మా అక్క అన్నిటికీ నిదానంగా తేరులా ఉండేదో, గ్లాస్సెడు పాలు గంటలు గంటలు తాగుతుంటే, నా వంతు నేను తాగేసి తన గ్లాస్ కూడా లాగేసుకొని వాళ్లకు అందకుండా పారిపోయేసి తాగేసి వాడినో మొదలగునవి. మా అక్క తన చేతులతో వేసిన డిసెంబరాల చెట్టు విరగబూసి ఎన్ని పువ్వులిచ్చేదో కూడా మా అందరకీ ఇంకా గుర్తే. పెద్దమ్మ మరియు పెద్దనాన్నలు వాళ్ళ అందరి పిల్లల పెళ్లిళ్లు చేసి, మనవలు మనవరాళ్లను అందరినీ చూసుకొని, మా శీనన్న దగ్గరే ఉంటూ ఏ లోటు లేకుండా వెళ్లిపోయారు. చివరి రోజుల్లో ఇద్దరూ కాస్త అస్వస్ధకు గురి అయినా చాలా మందిలా మంచంలో పడకుండా వెళ్ళిపోయినా పుణ్యాత్ములు ఆ ఇద్దరు. అంత ప్రేమను పంచిన వాళ్ళు ఇంకొన్ని రోజులుంటే బాగుండును అనే కొరత మాకెప్పటికీ.

కానీ వారు పంచిన ప్రేమ ఎక్కడికీ పోలేదు, ఈనాటికీ నేను నెల్లూరెల్లితే మా ముగ్గురు అక్కలూ వంట చేసి వుంటారు నాకోసం. నేను ఎక్కడికెళ్తానో ఎక్కడ తింటానో నాకే తెలియదు. వాడు ఈ మధ్య చికెన్ మరియు చేపలు మానేసాడు, వాడికేమన్న కూరగాయలు ఎక్కువగా ఉండాలి అనే చిన్న చిన్న విషయాలు గుర్తు పెట్టుకొని మరీ. ఇది కదా మన తన అని తేడా లేకుండా పెంచిన అమ్మ పెద్దమ్మ పెద్దనాన్నల అసలు గుర్తులు మాకు. ఎప్పుడన్నా మాలో మేము గొడవలు పడి దూరాలు పెంచుకుంటే ఖచ్చితం గా పైనున్న వాళ్ళ ఆత్మలు శాంతించవని మేము గుర్తుపెట్టుకుంటే మాకే మంచిది.

“మన జీవితాల నాయకా నాయకులు! ఒకటవ భాగం” కి 3 స్పందనలు

  1. Excellent memories, mee stories chaduvutunte maa chinnappati vishayaalu anni gurtuku vastunnai, meemu brothers and sister’s kalipi andaramu 14,members, memu, pedananna, chinnanna pillalu andaru kalipi.andaru settled ayyi vaari vaari pillala tho haiga vunnaru

    1. హర్ష, నీ కథతో నా చిన్ననాటి రోజులను ఒకసారి గుర్తుకి తీసుకొచ్చావు. మా అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళతో ( చిన్నాన్న, పెదనాన్న పిల్లలము 13 మంది) ఆటలు, చూసిన సినిమాలు, మా నాయనమ్మ కమ్మని ఆవకాయ అన్నం ముద్దలు కలిపి పెట్టిన మధుర క్షణాలు గుర్తుకు తీసుకొచ్చావు. ధన్యవాదములు 🙏

Leave a Reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading