Apple PodcastsSpotifyGoogle Podcasts

మన జీవితాల నాయకా నాయకులు! రెండవ భాగం

నేను ఇంతవరకూ రాసిన కథల పాత్రల జీవితంలో ఎదో ఒక సంఘర్షణ ఉండేది. అలా సంఘర్షణ వున్న పాత్రల గురుంచి రాస్తేనే ఓ మంచి కథ అవుతుంది అని నమ్మేవాడిని. కానీ ఆర్ధిక పరమైన కొన్ని సంఘర్షణలు తప్ప వ్యక్తిగతమైన సంఘర్షణలు లేకుండా జీవితాన్ని గడిపి, ప్రేమలను మాత్రమే పంచిన మన పెద్దమ్మలు, పెద్ద నాన్నలు, చిన్నాన్నలు, చిన్నమ్మలు, మామలు, అత్తలు మొదలగు వారి గురించి కూడా రాయాలి. వీళ్లంతా మనమెక్కడో వెతుక్కోవాల్సిన పనిలేకుండా మనపక్కనే వుంటూ వాళ్ళ జీవితాల్ని ఎంతో కొంత మనకు ధారపోసిన నాయకులూ లేక నాయికలు. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇందరి సహాయ సహకారాలు, ప్రేమానురాగాల వల్లనే మనం పెద్దవారి మయ్యామన్న స్పృహ కలుగుతుంది. ఇక నేను ఇటువంటి కథలకు విక్రమాదిత్యుడు-బేతాళుడుల కథలకు మల్లె పైన రాసిన వాక్యాలు పరిచయ వాక్యాలుగా వస్తాయి.

మా మేనత్తని తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసింది మా నాయనమ్మ. మరలా మా మేనత్త తన కూతురిని తన తమ్ముడు అంటే మా చిన్నాన్న కిచ్చి పెళ్లి చేసింది. అలా మా పిన్నమ్మ మరియు చిన్నాన్నల పెళ్లి రెండవ తరపు మేనరికం. మా పిన్నితో మాకు చాలా మంచి అనుబంధం వుంది. ఆవిడ పని చేయటం లో మహా చురుకు, మాటల్లో మాత్రం మహా నిదానం. మా అమ్మ ముక్కీ మూలిగి ఇంటి వెనక ఉండే చిన్న లోగిలి ఊడ్చే లోపలే మా పిన్ని ముందున్న చాలా పెద్దదైన లోగిలి అంతా చిమ్మేసి, కళ్ళాపి చల్లేసి, ముగ్గులు కూడా పెట్టేసి వచ్చేసేది. మాతో రక రకాల ఆటలు ఆడటం అంటే తనకి చాలా ఇష్టం. చిన్నా చేయి చాపు తాయిలం పెడతా అని, అని నేను చేయి చాపగానే, బతికున్న కప్పనే చేతిలో పెట్టి పారిపోయేది, మా కేకలకు ఎక్కడ మా అమ్మ వచ్చి చీవాట్లు పెడుతుందో అని. అలాగే రబ్బరు బల్లిని అందరూ నడిచే చోట గోడలకి అంటించి అది వాళ్ళు నడిచేటప్పుడు సరిగ్గా వాళ్ళ నెత్తిన పడేలా చేయటం వాళ్ళు భయంతోనో అసహ్యం తోనో కేకలు పెడుతూ దులుపుకుంటుంటే పక పక లాడటం, వాళ్ల మీద బొద్దింకలేయటం లాటి ఆటలతో మా ఇల్లు సందడే సందడి. తాను మమ్మల్ని భయపెట్టడానికి తన కను రెప్పల్ని వెనక్కి ముడుచుకొని, గాలి నోటితో లోపలి పీల్చుకుంటూ బొంగురు గొంతుతో భయపెడితే నాకు దడుపుతో ఆ రాతిరికి జ్వరం కాసేది.

దానికి తోడు మా చిన్నాన్న కూడా చాలా సరదా మనిషే. మా ముందు గోళీలను మాయం చేసి మా చెవుల్లోంచి, ముక్కుల్లోంచి తీయటం, మనసులో ఓ అంకెను అనుకొని, దాన్ని రెండుతో పెంచి, ఓ పది కలిపి లాటి కంగాళీ లెక్కలు చేసి మనసులో మేము అనుకున్న అంకెను ఆయన చెప్పటం లాటి సరదా లెక్కలు చేయించటం, మమ్మల్నివీపు మీద ఎక్కించు కొని బావిలో ఈదటం, మా వూరిలో వేసే నాటకాల్లో ఎప్పుడు పంతులు వేషం వేసినా మా చిన్నాన్నే వేశాడు అని మేము ఎప్పటికీ గుర్తుపట్టలేనట్టు మమ్మల్ని మాయ చేయటం, నేను ఒకటి రెండు మూడు అనే లోపల మీరు మంచం దిగుతారు అని పందెం కట్టి మేము పందేనికి ఒప్పుకోగానే, మూడు అని ఎప్పటికీ అనకుండా మమ్మల్ని విసిగించి మేమే దిగేలా చేయటం లాటి పనులతో మా చిన్నాన్న అంటే మేము ప్రాణం ఇచ్చేలా చేసుకున్నాడు ఆయన. అసలు ఆయన మమ్మల్ని ఎప్పుడు సందడిగా, ఉత్సాహం గా ఉంచడానికి చాలా చిట్కాలు, పాటలు మరియు పద్యాలు నేర్చుకున్నాడు అని అనుకుంటే ఆ ఇష్టం ఇంకా ఎక్కువయ్యేది.

ఆయన బావిలో మమ్మల్ని వీపునెక్కించుకొని ఈతలు కొట్టే ఆటలకి మా అమ్మ తన అనుమతి ఇచ్చేస్తే మా పిన్ని మాత్రం తన కొడుకుని సంకనేసుకొని తోటలోంచి ఇంటికి పరిగెత్తేసేది వాడిని ఆయనకు దొరకనీయకుండా. వాడు రెండు తరాల మేనరికాల వలన పుట్టటమే కొంచెం బలహీనప్రాణి. వాడంటే మా ఇంటిల్లిపాదికీ గారాభమే. వాడికైతే స్నానం చేయించడం, అన్నం పెట్టడం, కథలు చెప్పడం లాటి అన్నీ పనులకి వాళ్ళ పెద్దమ్మ అంటే మా అమ్మే ఉండాలి. వాడు ఒకరోజు అత్యుత్సాహం తో నన్ను మా దొడ్లో వుండే నీళ్ల తొట్టిలో దించమన్నాడు, నేను ఉత్సాహం గా దించేసా, దిగాక వాడు నాకలివి గాలా, ఎంతకూ రాడు బయటకి, నేను వాడిని నా చేతులతో మునిగిపోకుండా అలాగే పట్టుకొని కేకలు వేస్తూనే వున్నా, ఎప్పటికో మా అమ్మా పిన్ని వాళ్ళు విని పరిగెత్తుకొచ్చారు, ఆ రోజు మా పిన్ని భయపడి ఏడ్చిన విధానం, ఇంక నేను వాడితో ఎప్పటికీ అలాటి ప్రయోగాలు చేయకుండా చేసింది. అలాగే వాడేమన్నా తులిపి పనులు చేసి ఆమె చేతిలో తన్నులు తిని, వాడు ఏడవటం, వాడితో పాటూ ఆమె ఏడవటం, అందరూ తిరిగి ఆమెని తిట్టేవరకు జరిగేది, అంతలా ఏడ్చేదానివి వాడిని కొట్టటం ఎందుకు మొదట అని.

మా పిన్ని మా చిన్నప్పుడు తినడానికి వేరుసెనగ ముద్దలో, చలిమిడి ముద్దలో, నువ్వుల చిమ్మిరో చాలా క్రమం తప్పకుండా చేసేది. కానీ ఎప్పుడూ అన్నీ మా దగ్గర పెట్టేది కాదు, చాలా జాగ్రత్తగా దాచి రోజుకొక్కటే ఇచ్చేది. ఏరోజుకారోజు అయిపోయాయి, ఇదే చివరి ముద్ద అని చెప్పేది, ఆమె ఎక్కడ దాచుతుందో అని మేము ఎంత గూఢచర్యం చేసినా కనుక్కోవటం బ్రహ్మ తరం కూడా కాదు. వడ్ల కూట్లోనో, మిరపకాయల బొట్టల్లోనో, గంగాళాలోనో, అటకలమీదనో పిల్లి కానీ తన పిల్లల్ని మార్చినట్టు వాటిల్ని మారుస్తూ ఉండేది. నిన్న ఐపోయిందన్నావ్ కదా ఈ రోజు ఎలా వచ్చింది అని నేను తగువు పెట్టుకుంటే, నేను అలా నడుస్తూ వెళ్తున్నానా, ఇది మీ చిన్నాకి ఇవ్వు అంటూ కాకి ఇచ్చి వెళ్లిందనో, ఉడత ఇచ్చి వెళ్లిందనో, కాకమ్మ కథలు చెప్పేది. కానీ ప్రతీ రోజూ తినేదానికి ఎదో ఒకటి పెట్టేది. అన్నీ ఇప్పుడే ఇక్కడే నా ముందు పెట్టాలి అని నేను హఠం వేసుకుంటే, ఇప్పుడే తినేస్తే రేపు ఎవరిస్తారు నీకు, అందుకే ఈ రోజు దాచుకొని ప్రతీ రోజు ఒక్కటి తినాలి అని రేపటి గురుంచి ఎంత బాగో చెప్పేది.

పనులు చేసుకుంటూ రేడియో వినటం చాలా ఇష్టం తనకి. కావాల్సిన రేడియో స్టేషన్ ట్యూన్ చేయటం, పెండ్యులం క్లాక్ కి మరీ ఎక్కువ కాకుండా కీ ఇవ్వటం, ఎప్పుడూ నిమిషాల ముల్లునే ముందుకే కదపాలి అని, ప్రతి గంట దగ్గర ఆపి గంటలు కొట్టిచ్చటం లాటి ఎన్నో పనులు నేను మా చిన్నాన్న దగ్గర నేర్చుకున్నా. ఒక రోజు రేడియో లో ఓ పాట వస్తే ఆ పాట ఎవరు పాడారు అని మా పిన్నిని అడిగితే, బాలసుబ్రమణ్యం మరియు సుశీల అని చెబితే, కాదు నాగేశ్వర రావు మరియు శ్రీదేవి అని గొడవేసుకున్నా, ఎందుకంటే ఆ ముందు వారమే ఆమెతోనే మేము మా బిట్రగుంటలో ముద్దులకొడుకు సినిమా చూసొచ్చాము కాబట్టి. అలాగే ఓ రోజు, చిన్నా మన అంగడి ఇంటికెళ్లి రెండు గుడ్లు పట్టకరా అని చెప్పారు, నేను రెండు చేతుల పిడికిలితో బహుజాగ్రత్త గా రెండు గుడ్లు పట్టుకొస్తున్నా, నా జాగ్రత్త మరీ ఎక్కువయ్యి ఇంకా పదడుగుల దూరం లో మా పిన్ని ఉందనగా ఒక గుడ్డు నా చేతిలోనే పగిలిపోయింది, ఆవిడ ఎప్పటిలాగే పక పక నవ్వులు, నాకు ఉక్రోషం తో ఏడుపు, ఎక్కులెక్కిళ్లు పెట్టి మరీ. అప్పుడు నేర్చుకున్నా మా పిన్ని దగ్గర, గుడ్డుని ఎప్పుడూ అడ్డం గా పట్టుకోకూడదని, నిలువుగా పట్టుకోవాలని, ఆ తర్వాత మా అంగడింటికెళ్లి గుడ్లు తేవటం ఎప్పుడూ నా పనే ఎందరు పిల్లలున్నా, మా చిన్నానే సూపర్ అనిపించుకుంటూ.

మా నాన్నమ్మ తాతలకు వాళ్ళ మనమరాలు అయినా మా పిన్నమ్మ అంటే చాలా ప్రాణం. అలాగే తనకీ వాళ్లంటే చాలా ఇష్టం మొదటనుండి దగ్గరకి తీశారని. అలాగే మా అమ్మ తన తులిపి పనులకు ఎన్ని చీవాట్లు పెట్టినా నవ్వుకుంటూనే వెళ్లిపోయేదే కానీ ఒక్క మాట తిరిగి అనటం నేను చూడలా. అలాగే మా అమ్మ వాళ్ళ కుటుంబం లోని ప్రతి ఒక్కరికి మా నాన్న కుటుంబం లోని ప్రతి ఒక్కరితో చాలా మంచి అనుబంధాలు వుండేవి. వాళ్ళు ఒకరినొకరు ఎమన్నా అనుకోవటం నేను చూడలేదు. మా పెద్దమ్మల పిల్లలతో మా మేనత్త పిల్లలు అందరూ చాలా కలివిడిగా ఉండేవారు, రాక పోకలతో. ఉలవపాళ్ళ లో ప్రాధమిక విద్య అయ్యాక, ఉన్నత పాఠశాలకు మేము పదిహేను కిలోమీటర్లు అన్నా వున్న అల్లూరు వెళ్లాల్సిందే, అలా మా అన్న వెళ్ళేవాడు అల్లూరుకి చదువులకోసం. అలా వెళ్ళటం రావడానికే సమయమంతా పోవటం ఇష్టం లేక మరియు మాకు ఉప్పలపాటిలో కూడా పొలాలు ఉండటం, ఉప్పలపాటి ఉన్నత పాఠశాల దగ్గరలోనే ఉండటం మూలాన, బుడ్డోళ్లం మేము ఉన్నత పాఠశాలకు వస్తే కష్ట పడకూడదని, మేము ఉప్పలపాటి మకాం మార్చేసాం, మా తోటని, మా నాయనమ్మ తాతల్ని మా పిన్నీ చిన్ననాన్నల చేతిలో పెట్టి. మా నాన్నమ్మ మరియు తాతలు కూడా ఆవిడ దగ్గరే ఉండడానికి ఇష్టపడటం తో వాళ్ళ వాటాగా వచ్చిన ఆస్తిపాస్తులన్నీ మా చిన్నాన్న వాళ్లకే ఇచ్చేసి వాళ్ళ దగ్గరే ఉండిపోయారు ఉలవలపాళ్ళలో.

ఆ తర్వాత మేము మా చదువుల నిమిత్తం నెల్లూరు వచ్చేసాము. మా చిన్నాన్న తోటలు సరిగా పట్టించుకోకుండా, నాటకాలు, స్నేహితులు, తిరనాళ్ళలు ఎక్కడ జరిగితే అక్కడ తేలిపోవటాలు లాటి పనులతో గాడి తప్పి మా నాన్నమ్మ తాతయ్యల డబ్బులు , మరియు వాళ్ళ పెన్షన్ డబ్బుల మీద ఆధార పడటం మొదలెట్టాడు. మా నాన్నమ్మ ఒకసారి మా చిన్నాన్న మీద అలిగి మా దగ్గర కొచ్చేశారు మాతో ఉండిపోదామని, కానీ ఆవిడ వున్నన్ని రోజులు మాతో అంత సౌఖ్యం గా లేరు. మా దగ్గర వున్నప్పుడు ఆవిడ పేరు మీద వున్న ఫిక్స్డ్ డిపాజిట్ రెన్యువల్ కి వచ్చింది, రెన్యువల్ చేయడానికి బ్యాంకు కి వెళ్లారు మా నాన్నతో, ఆవిడకి తోడుగా మా అక్క కూడా వెళ్ళింది, అక్కడ రెన్యువల్ చేసేటప్పుడు ఆ బ్యాంకు ఆఫీసర్ అడిగాడు, నామినీగా ఎవరమ్మా అని, నా మనవరాలు అని చెప్పారావిడ, మనవరాలు అంటే ఎవరమ్మా, నీ పక్కన వున్న ఈ అమ్మాయా అని మా అక్కని చూపుతూ అడిగిన ఆయనకు, కాదయ్యా నా కూతురి బిడ్డ అని చెప్పిన ఆవిడ కూడా ఎందుకో చాలా ముభావంతో ఉండిపోయారు. అప్పుడు కొడుకు బిడ్డని మనవరాలుగా చెప్పలేక పోయాను లేక ఈ బిడ్డకి ఏమీ ఇవ్వలేక పోయాను అనే బాధతో అనుకుంటా ఆవిడ మా దగ్గర ఎక్కువ కాలం ఉండలేక మరలా మా పిన్ని దగ్గరకే పయనమయ్యారు. మా చదువులకోసం మా నాన్న మా భాగానికి వచ్చిన తోటని అమ్మాలనుకున్నప్పుడు మా తాత తన డబ్బులతో అవి కొని మా చిన్నాన్నకే ఇచ్చేసారు, ఎలాగూ వాళ్ళు ఉండబోయేది వాళ్ళతోనే అని వాళ్ళు అప్పటికే నిశ్చయించుకొని ఉండటం వలన.

మా చిన్నాన్న వాళ్ళన్నా ఉలవలపాళ్ళని వదలరు, మాకు ఉలవలపాళ్ళతో వున్న అనుబంధం చెదరదు అనే మా ఆశలకు గండి కొడుతూ మా చిన్నాన్న కూడా ఎదో వ్యాపారం చేసుకుంటానని మా పిన్ని వాళ్ళ అమ్మ నాన్నలు అంటే మా మేనత్త వాళ్ళు విశాఖపట్టణంలో అప్పటికే స్థిరపడిపోవటంతో వీళ్ళు కూడా విశాఖపట్టణానికి వెళ్లిపోయారు. మా చిన్నాన్న చాలా వ్యాపారాలు మొదలుపెట్టి అన్నీ సరిగా జరగక, మా ఉలవలపాళ్ళలో ఆస్తులు కూడా అమ్మేసుకున్నారు. అలా మాకు ఉలవలపాళ్ళతో వున్న సంబంధాలన్నీ వేరైపోయాయి. మా తాత పెన్షన్ మరియు మా చిన్నాన్నకొచ్చే ఆదాయమే వాళ్ళకాధారమయ్యింది. కానీ మా పిన్ని మా తాతని మా నాన్నమ్మనీ కంటికి రెప్పలా చూసుకొనేది. మా నాన్నమ్మకి సమయానికి అనుకున్నట్టు అన్నీ జరిగిపోవాల్సిందే. పండ్లూ పలహారాలలో సింహభాగం ఆవిడదే, ఎందుకంటే మొదటనుండి ఆవిడకి ఆవిడ హయాంలో ఏ లోటూ లేకుండా జరిగింది, ఆ తర్వాత మనవరాలి దగ్గరా అలాగే జరిగింది.

నా ఇంజనీరింగ్ చివరిలో ఉండగా మా తాత గారు గుండెపోటుతో పోయారు. నేను మాస్టర్స్ లో ఉండగా మా చిన్నాన్న వాళ్ళు కొత్తవలస అని శ్రీకాకుళానికి దగ్గర ఉండగా, మా నాన్నమ్మ బాత్రూమ్కి వెళ్లి లైట్ వేయపోయి, కరెంటు షాక్ తగలటం తో చనిపోయారు. అది మాకు చాలా బాధని మిగిల్చింది, వార్ధక్యంతో పోవటం వేరు, కానీ ఇలా ప్రమాదవశాత్తు హఠాత్తుగా పోవటం వేరు కాబట్టి.

తన ఆహారం మీద నియంత్రణ లేని అలవాటుతో మా చిన్నాన్నకి మధుమేహం చాలా ఎక్కువయ్యింది. ఎంతటికీ తగ్గని వ్యాధితో ఆయన చాలా ఇబ్బంది పడ్డారు, ఒక దశలో తన కాలి అరిపాదం కూడా తీసెయ్యాల్సి వచ్చింది. ఆ వ్యాధి ఆయన ఒక్కొక్క అవయవాన్ని నాశనం చేస్తూ వచ్చింది. అయినా ఆయన ఏదడిగినా ఆయన కోరిక ప్రకారం మా పిన్ని అమర్చేది, ఎవరు ఎన్ని కేకలేసినా ఆయనకటువంటివివి పెట్టవద్దు అని చెప్పినా. ఆ వ్యాధి ఆయన బుద్ధిని కూడా నాశనం చేసింది, ఎంతో ప్రేమగా వుండే ఆయన మా పిన్నిని మరియు తనకి చాలా ప్రాణమయిన మా తమ్ముడిని మరియు మా తమ్ముడి కుటుంబాన్ని చాలా ఇబ్బందులు పెట్టారు, తనని సరిగా చూడటం లేదు అని అందరికీ చెక్కుబుతూ, ఇంటి బయటకి వచ్చి అందరూ వినేలా కేకలు వేస్తూ. చాలా ఇష్టం ఆవిడకి మా చిన్నాన్న అంటే, ఇక లాభం లేదు, ఇంటికి తీసుకెళ్లిపొండి అని డాక్టర్స్ ఆయన చివరి క్షణాల్లో అంటే, ఆయనకీ వెంటిలేటర్ పెట్టిచ్చి ఉంటే ఆయన ఇంకా బతికేవారని ఇప్పటికీ కుములిపోతారు ఆవిడ.

అలా ముగ్గురికి తన అలుపెరగని సేవలతో వాళ్ళకేలోటూ రాకుండా చూసుకున్న ఆవిడకి ఇకనన్న విశ్రాంతి దొరుకుంది అనుకున్నాడు మా తమ్ముడు. వాడి ఆశల్ని వమ్ము చేస్తూ , తర్వాత కాలంలో మా మేనత్త మేనమామల్ని అంటే మా పిన్నీ వాళ్ళ అమ్మ నాన్నల్ని చూసుకొనే బాధ్యతా ఆవిడ మీదే పడింది. మా అమ్మ మదర్ థెరిసా కాదు అందర్నీ చూసుకోవడానికి అని వాడి రోదన అరణ్య రోదనే అయ్యింది, మా పిన్ని వాళ్ళను చూసుకోవడానికి సంతోషంగా ఒప్పుకోవటంతో. మా పిన్నీ వాళ్ళ అమ్మా నాన్నల ఇద్దరి కొడుకులలోఒక కొడుకు అంటే మా పిన్నీ వాళ్ళ ఒక తమ్ముడు అన్నీ ఏర్పాట్లు చేసాడు, మా పిన్ని అన్నీ సేవలు చేసింది వాళ్ళ చివరి క్షణాల వరకూ.

అలా ఐదుగురిని తన సేవలతో చూసుకున్న మా పిన్ని ఇప్పుడు విజయనగరం లో మా తమ్ముడి దగ్గరే వుంది. వాడికి వాళ్ళ అమ్మ అంటే చాలా ప్రేమ. అర్భకుడు అనుకొనే వాడు, చదువు ఇంటరుతోనే ఆపేసి, పాప్ కార్న్ షాపులకి సప్లై చేసే చిరు వ్యాపారం చేసుకుంటున్నాడు. వాడికొక కూతురు. సంవత్సరానికొక నెల రోజులు బ్రేక్ తీసుకొని తన కుటుంబం తో పాటు యాత్రలకెళ్లి వస్తాడు తప్పకుండా. చిన్నన్నా నాకూతురు భలే తెలివి కలది, చూస్తూ వుండు తనతో పాటూ నేను అమెరికా వెళ్తా అని చెప్తాడు, అలాగేరా నీది మంచి మనసు, అన్నీ నువ్వు అనుకున్నట్టు జారిపోతాయని మనస్ఫూర్తిగా దీవిస్తా వాడిని. చాలా మొండి వాడు, ఎప్పుడన్నా ఎలా ఉందిరా నీ వ్యాపారం, డబ్బులు పంపుతారా అంటే, ఆపని మాత్రం చేయమాకు, నేను ఫస్ట్ క్లాసుగా వున్నాను అంటాడు. ఇప్పటివరకూ వాడు తన అవసరాలకోసం ఎవరినీ అడగగా నేను చూడలేదు.

ఒక మూడేళ్ళ క్రితం అనుకుంటా ఒక మూడు రోజులు బ్రేక్ తీసుకొని వాడి దగ్గరకెళ్ళాం, నేను మరియు సుప్రియా. వాడి స్కూటీ మీద వాడు వాడి భార్య, ఆ అమ్మాయి స్కూటీ మీద నేను సుప్రియా, ఎండల్ని, వానల్ని లెక్క చేయకుండా విజయనగరం మరియు చుట్టు పక్కలా సంచార జీవుల్లా తిరిగేసాము. ఎక్కడ పడితే అక్కడ ఆగి, తాటికాయలు, ముంత మామిడి కాయలు తినేసాము, పెద్దమ్మ గుడిలో ముడుపులు మరియు అన్నదానానికి డబ్బులు కట్టేసాము. ఇన్ని చేసి అలసిసొలసి ఇంటికి వస్తే మా పిన్నీ ఇంకా తిరగాల్సిన ప్రదేశాల లిస్ట్ చేతిలో పెట్టేది. ఆ ట్రిప్ లోనే అనుకుంట మన పవర్ స్టార్ నటించిన వీర విజయవంతమైన కాటంరాయుడు సినిమా చూసింది. ఆ ట్రిప్ లో మన కనీస అవసరాలు తీరేవరకూ డబ్బులుండి, మరీ డబ్బులు పోగెయ్యాలి అనే కోరికలేకపోతే మా తమ్ముడి దగ్గర ఎలా సంతోషం గా ఉండవచ్చో తెలుసుకోవటంతో ఆగకుండా అనుభవించి మరీ వచ్చాము నేను మరియు నాతో పాటు సుప్రియా.

“మన జీవితాల నాయకా నాయకులు! రెండవ భాగం” కి 3 స్పందనలు

  1. 2 bhagam chaduvutunte badha ga anipinchindi, meeru kallaku kattinattlu raasaaru kaabatti, mee thammudi korika (America)theeralani korukuntunna

  2. Superb. Especially the last summary.

Leave a Reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading