Apple PodcastsSpotifyGoogle Podcasts

మా (కానీ) సత్యం!

నేను నా కథలతో మా ఇంట్లో కనిపించిన పుస్తకాన్నంతా నలుపు చేసేస్తున్నానని, ఈ రోజు మా అమ్మ నాకో మందపాటి పాత డైరీ ఇచ్చి, దీంతో రాసుకో, రాసుకొని ఎక్కడంటే అక్కడ పారేసుకోకుండా జాగ్రత్త పెట్టుకో అని చెప్పింది. ఆ పాత డైరీ తీసుకోగానే, ఏదైనా ఓ పాత మధురంతో వెంటనే నలుపు చేసెయ్యాలన్న కోరిక నన్నావహించింది. ఎవరి గురుంచి రాయాలబ్బా అని ఆలోచిస్తుంటే మా సత్యగాడు గుర్తొచ్చాడు.

ఇప్పగుంట వెంకట సత్యనారాయణ, మా స్నేహితులకందరికీ ఐ.వి.ఎస్ గా సుపరిచితుడు, కానీ నాకు మాత్రం సత్య గానే, మా ఇంట్లో వాళ్లకు సత్యంగా. జీవితం లో కష్టాలు పడి పైకి వచ్చిన వాళ్ళని మనం కథలలో చదువుతూ లేక సినిమాలలో చూస్తూ లేక నిజ జీవితం లో ఎవరి ద్వారా అయినా వింటూ చాలా ఉత్తేజితుల మవుతాము, కానీ అలాటి ఒక వ్యక్తి మన సమకాలీనికుడు అయినప్పుడు మన జీవనక్రమంలో పడి తన  ఎదుగుదలని మనము పెద్దగా గమనించలేము. అలా మా సమకాలీనుకులలో జీవనక్రమాన్ని మొదలుపెట్టిన స్థితితో పోలిస్తే ప్రస్తుత స్థితి ఎంతో అందలేనంత ఎత్తులో నిలుపుకున్న వ్యక్తే మా సత్య. కానీ ఈ క్రమంలో వాడేమి బావుకున్నాడో లేక ఏమి కోల్పోయేడో వాడికే తెలియాలి.

మనిషి ఐదడుగుల ఆరంగుళాల ఎత్తుతో, చక్కటి వర్ఛస్సుతో, అప్పటికే ఎన్నో ఆటుపోటులను చవిచూసిన కారణంతోనో లేక బాల నెరుపు వల్లనో అక్కడక్కడా తెలుపు లేక ఎరుపు కానీ జుట్టు ఉండేవాడు సత్య. తన చురుకుతనంతో, తెలివితేటలతో, మహా కలివిడి తనంతో మరియు సహజ సిద్ధంగా అలవడిన వేణుగానంతో వాడు మా కాలేజీ చేరిన కొద్ది దినాల్లోనే బాగా పాపులర్ అయిపోయాడు. నాకు, శ్రీధర గాడికి వాడు ఎప్పుడు స్నేహితుడైపోయాడో కూడా తెలియనే లేదసలు. తెలిసే సరికి వాడు కూడా శ్రీధర గాడిలాగే మా కుటుంబ సభ్యుడైపోయాడు, వాళ్ళని నే పిలిచే వరసలతోనే పిలిచేస్తూ. రోజుల తరబడి తినకపోయినా, నిద్రపోకపోయినా, అలుపెరగని దేహం, చెక్కు చెదరని నవ్వు వాడి సొంతం. కాలేజీ లో పగలంతా లేక చాలా పొద్దుపోయిన దాకా అందరి రూములూ కలియ తిరుగుతూ, సందడి సందడి చేస్తూ, అందరూ పడుకున్నాక, తెలవారు ఝాము వరకూ చదువుకోవటం వాడి అలవాటు.

నెల్లూరు జిల్లాలోని కావలి వాడి స్వస్థలం. పుట్టింది పేద బ్రాహ్మణ కుటుంబములో. చదువుకున్నది కావలి బ్రాహ్మణ సంఘము వారి సహకారంతో మరియు వారాలు చేసుకుంటూ. వాడు పదవ తరగతి ఉత్తీర్ణుడయ్యాక, ఆ సంఘము వారు వాడి బతుకేదో బతికేస్తాడని వాడిని ఓ టైపు ఇన్స్టిట్యూట్లో  చేర్చారట, అక్కడ ఆ ఇన్స్టిట్యూట్ యజమాని వీడి తెలివితేటలు చూసి పైచదువులు చదువుకోమని ప్రోత్సహించాడట. అలా ఎంసెట్ రాసి ఆయన సహకారంతో వీడు మా కాలేజీలో పడ్డాడు. అలాగే వీడు వీడి చదువులతో ఎప్పుడు ఆయన్ని నిరాశ పరచ లేదు.

మేము మా రెండవ సంవత్సరంలో ఉండగా వాళ్ళ నాన్నగారు పోయారు. వీడు మాకెవరికీ చెప్పకుండా కావలికి వెళ్ళిపోయాడు. మేము ఒక పదిమంది స్నేహితులం తెలుసుకొని కావలికి చేరే సరికి అర్థరాత్రి అయిపొయింది. మాకు వాడి ఇల్లు ఎక్కడో కూడా తెలియదు. నాకు ఓ చిన్న జ్ఞాపకం, ఎక్కడో జనతా పేటలో వాళ్ళ ఇల్లు అని. మా దురదృష్ట వశాత్తు మేము దిగిన రోజే కావలిలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళ రాష్ట్ర మహా సభలు జరుగుతున్నాయి. మేము బస్సు దిగి నాలుగు అడుగులు వేసేమో లేదో, ఒక పోలీసు జీప్ వచ్చి మమ్మలన్దరినీ కట్టగట్టి పోలీస్ స్టేషన్లో పడేసింది. మేము ఇలా స్నేహితుడి నాన్నగారు చనిపోతే వచ్చాము అన్నా నమ్మే నాథుడే లేదు, మాలో కనీసం ఒక్కడి దగ్గర కూడా కాలేజ్ ఐడెంటిటీ కార్డు లేదు. మాతో పాటే జీపులో ఎక్కించుకొచ్చిన ఒక దొంగని మా కళ్ళ ముందరే సెల్ లో నాలుకు పీకుతుంటే బిక్కు బిక్కుమని గడిపాము.

మా అదృష్టవశాత్హు ఆ దొంగని బాదిన ఒక కానిస్టేబుల్ మా సత్యకి ఇంటర్లో సహాధ్యాయుడు అవటంతో, ఇన్స్పెక్టర్ కి చెప్పి సత్య వాళ్ళింటికెళ్లి వచ్చి మేము చెప్పింది నిజమే అని నిర్ధారణ చేయటంతో, ఆ కానిస్టేబుల్ సహాయంతోనే మేము సత్య వాళ్ళ ఇంటికి చేరుకున్నాము. వాళ్ళ ఇంటికెళ్లాకే మాకు తెలిసింది, సత్యాకి ఒక అక్క ఉందని, ఆ అక్క అప్పటికే ఒక ముస్లింని పెళ్లిచేసుకొని ఇంటినుండి వెళ్ళిపోవటంతో వీడు తనతో సంబంధ బాంధవ్యాలు తెంచేసుకున్నాడని. మేము ఉన్నంత వరకు వాళ్ళ బావ గారు మాతో చాలా కలివిడిగా, మా వెంటనే వున్నారు. పోనీలే ఆవిడ వీడి కోపతాపానికి బలయినా ఆవిడకి మంచి భర్తే వచ్చాడని అనుకున్నాము మేము. ఇద్దరు పిల్లలు అనుకుంటా వారికి అప్పటికే. అలా మేము వాళ్ళ నాన్నగారి కర్మకాండలలో పాలుపంచుకొని, ఆ రాతిరికి వాకాడుకి చేరుకున్నాము.

వాళ్ళ నాన్నగారు చనిపోవటంతో వాడు వాళ్ళ అమ్మగారిని తీసుకొని మా కాలేజీకి దగ్గర వున్న గూడలి అనే పల్లెకి మకాం మార్చేశాడు. ఎన్ని ఇబ్బందులు వున్నా వాడెప్పుడూ కుంగిపోలేదు, తన ఉత్సాహాన్ని చెదరనివ్వలేదు, అలాగే చదువుని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు, కాలేజ్ లేక యూనివర్సిటీ టాపర్ ల లిస్ట్ లో ఎప్పుడూ వుండే వాడు. వాడికి వాళ్ళ టైపు మాస్టర్ ఆర్థికంగా చాలా అండగా నిలిచాడు. మాకు ఆయనకి తన కూతురిని వీడికిచ్చుకోవాలనే కోరికగా ఉండేదేమో అన్న నమ్మకం, దాన్ని వీడుకూడా బలపరిచేవాడు, కానీ ఆ అమ్మాయి చిన్నపిల్ల, పదవ తరగతి అనుకుంటా తను మేము ఫైనల్ ఇయర్ లో వున్నప్పుడు. కాబట్టి ఆయనకు కోరిక వున్నా అది జరుగుతుందని మేము అనుకోలేదు.

మా ఇంజినీరింగ్ నాలుగో ఏటనే అనుకుంటా వాళ్ళ అమ్మగారు పడిపోయి కాలు విరగ్గొట్టుకున్నారు. ఆవిడని మేము పక్కనున్న గూడూరుకు కూడా తీసుకెళ్ల లేక, మా సీనియర్ అయిన బాలాజీ వాళ్ళ నాన్నగారు దయతో స్కూటర్ అవ్వటంతో నేను వాడు వెళ్లి గూడూరు నుండి ఒక ఎముకల డాక్టర్ ని తీసుకొచ్చి వైద్యం చేయించాము.  తర్వాత కొంత కాలానికి వీడికున్న ఒక్కగానొక్క బంధమయిన ఆవిడ కూడా పోయారు. అలా ఒంటరి అయిన వీడు ఎక్కువగా స్నేహితులతోనే గడిపేసేవాడు. నాలుగవ సంవత్సరంలో జరిగే, మాస్టర్స్ ప్రవేశ పరీక్ష అయిన గేట్ లో మా కాలేజీకి ప్రధముడిగా  వచ్చాడు వీడు, 98.07 పెర్సెన్టైల్ తో. అంతా సవ్యం గా జరిగుంటే నాలుగవ సంవత్సరం అవగానే మాస్టర్స్ కి వెళ్లిపోయి వుండే వాళ్ళము మేమంతా. కానీ మా కాలేజ్ విద్యార్థులం మాత్రం స్ట్రైక్ అని పరీక్షలు ఎగ్గొట్టటం మూలాన మా అందరికీ ఒక సంవత్సరం వృధా అయ్యింది అలాగే గేట్ స్కోర్ వచ్చిన వాళ్ళం కూడా ఆ సంవత్సరం మాస్టర్స్ లో చేర లేక పోయాము.

తర్వాతి విద్యాసంవత్సరం ప్రవేశాలు ఇంకా ఓ ఎనిమిది నెలల తర్వాత ఉండటం తో, నాకు, శ్రీధర గాడికి మరియు సత్యా కి మా శీనన్న హైద్రాబాద్లో ఉద్యోగాలు చూశారు, నేను సత్య వెంటనే చేరిపోయేటట్టు, శ్రీధర గాడు ఓ పదిరోజుల్లో వచ్చి మమ్మల్ని చేరుకొనేటట్టు ఏర్పాట్లు అయ్యాయి. నేను సత్య జాయిన్ అయిపోయాము, జాయిన్ అయిన మరునాడే నేను ఆ బాలానగర్ మరియు జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో బతకలేనని పారిపోయి వచ్చేశా. నేను వచ్చేయ్యటంతో శ్రీధర్ గాడి నాన్నగారు, “ఈయన వెళ్లి ఉద్యోగం చేసి మమ్మల్నేమి ఉద్దరించక్కర్లా, ఇంట్లోనే పడి వుండి నెక్స్ట్ ఇయర్ మాస్టర్స్ లో చేరిపోండి”, అని హుకుం జారీ చేయటంతో శ్రీధరగాడు కూడా తిన్నెలపూడిలోనే ఆగిపోయాడు. సత్యాకి జాబ్ చాలా అవసరం కావటంతో వాడు జాబ్ లోనే స్థిరపడి పోయాడు ఆ ఎనిమిది నెలలు, స్థిర పడిపోవటమే కాదు, చాలా మంచి పనిమంతుడు అని పేరుకూడా కాంచాడు. 

తర్వాత సంవత్సరం వాడు ఐ.ఐ.టీ మెడ్రాస్ లో మాస్టర్స్ లో చేరాడు, మాస్టర్స్ పూర్తయ్యాక వాడూ శ్రీధరగాడు మళ్ళీ చెన్నైలో పడ్డారు ఒకే కంపెనీలో. నేనూ అదే కంపెనీలో చేరాను కానీ, వాళ్ళ ఢిల్లీ బ్రాంచ్ లో. రెండేళ్ల తర్వాత సత్య కంపెనీ తరపున ఫీనిక్స్ కి వెళ్లి, కొన్నాళ్ళు తర్వాత కంపెనీని వదిలేసి ఆ కస్టమర్ ఆర్గనైజేషన్ లోనే చేరిపోయి తన భావి అమెరికా జీవితానికి బాటలు వేసుకున్నాడు.

మా నాలుగు సంవత్సరాల చదువులు మరియు ఒక సంవత్సరం గ్యాప్ సమయంలో వీడు మా కుటుంబానికి కూడా బాగా దగ్గరయ్యాడు. మా అక్కలైతే వీడికి పెళ్లి సంబంధాలు కూడా చూడటం మొదలెట్టారు, మన సత్యా కదా అని. వాళ్ళు ఒక్కో అమ్మాయి గురుంచి చెప్పను, వీడు వీడి సందేహాలతో వాళ్ళని విసిగించను, ఒక్క కూతురున్న సంబంధం చెబితే, ఆమ్మో! అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న నా మీదే పడిపోతేనూ  అనే వాడు, ఒక బామ్మర్ది వున్న సంబంధం చెబితే, వాళ్ళ తదనంతరం అంతా వాడికే ఇచ్చేస్తేనూ అనే వాడు. ఇలా అయితే వీడికి మేము పెళ్లి చేయలేమబ్బా అని మా అక్కలు కూడా డిసైడ్ అయిపోయారు.

వాడు ఫీనిక్స్ లో ఉండగానే వాళ్ళ టైపు ఇన్స్టిట్యూట్ మాస్టర్ కొన్ని సంబంధాలు చూడటం మొదలెట్టాడు. అలా ఆయన ద్వారా కుదిరిన సంబంధమే పెళ్లిగా మారింది. మా వాడి పెళ్ళికి మా అక్కలందరూ హైదరాబాద్ కి ఎప్పుడు వెళ్లాలా, ఏమేమి చీరలు కట్టాలా అని తెగ పథకాలు వేశారు, సత్య మాకు హైదరాబాద్ కి టికెట్స్ కూడా బుక్ చేసేస్తాడు అని నాతో పందేలు కూడా కాశారు, వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లుతూ, వాడు వాళ్ళ చేతుల్లో ఓ కార్డు ముక్క పెట్టి, మీరు అక్కడ దాకా ఎక్కడ వస్తారులే అక్కా, నేనే అమ్మాయిని తీసుకొని వచ్చి చూపిస్తా అని చాలా లౌక్యంగా చెప్పటం మా వాళ్లకి జీర్ణం కాలా.

అలా వెళ్ళిపోయినా సత్య ఆ తర్వాత మాకు ఇప్పటికీ కనపడలా. నేను శ్రీధరగాడు కొన్నాళ్ళు అమెరికాలో వున్నప్పుడు పలకరించే వాళ్ళము. బాగానే మాటలాడే వాడు. ఆ తర్వాతే మాతోనే కాదు, మా క్లాస్ మేట్స్ అయిన వాళ్ళ కావలి వాళ్ళకి కూడా అందుబాటులో లేడు. మేము మూడేళ్ళ క్రితం వాకాడు కాలేజ్ నుండి బయటపడి ఇరువది ఐదు ఏళ్ళు నిండిన సందర్భంలో అందరం కలిశాము. సత్యాన్ని చాలా బతిమాలాము రమ్మని, ఒక స్నేహితుడు వాడు ప్రస్తుతం ఉంటున్న చికాగోలో వాడి ఇంటికి వెళ్లి మరీ రమ్మని బతిమాలి వచ్చాడు. కానీ వాడు రాలేదు, వాడిని మా వాట్సాప్ గ్రూప్ లో చేర్చినా, ఎందుకో వాడికి వాడే ఎగ్జిట్ అయిపోయాడు. బహుశా ఈ కలవటాలు, ఈ వాట్సాప్ సందేశాలు అన్నీ వాడికి సమయం వృధా చేసుకొనే కార్యక్రామాలుగా అనిపించి ఉండవచ్చు. కానీ వాడికి తెలియని దేమిటంటే, వాడు మాకు ఒక హీరో. తన రెక్కలకష్టంతో వాడికంటూ ఓ జీవితాన్ని ఏర్పరుకున్న కష్టజీవి. మా స్నేహితులము ఎవరిమీ వాడినెప్పుడూ చిన్నబుచ్చలా, పైపెచ్చు చేయగలిగిన చేయూత లేక మానసిక స్థైర్యమే ఇచ్చాము, వాడంటే చాలా గౌరవంతో.

నేను  కొత్త కథ రాసినప్పుడల్లా మా గిరిగాడిని అభిప్రాయమడుగుతాను. వాడు తన సహజ ధోరణిలో, “సత్య చాల ఆచరణాత్మక  మనిషి. వాడు అమెరికాకి వచ్చాక వాడికంటూ ఓ సొంత లోకం ఏర్పరచుకున్నాడు, వాడి ఈ లోకంలో వాడి గతానికి తావులేదు. వాడికి మీ స్నేహం మరియు మిగిలిపోయిన ఆ ఒక్క బంధం చాలా నాటకాలుగా గాను  లేక వాడిని వాడి సహజత్వానికి దూరంగా తీసుకెళ్ళిపోయే ప్రయత్నాలుగా అనిపించివుండవచ్చు. వాడికి భవిష్యత్తుతోనే పని కానీ మీలాటి అవశేషాలతో కాదు. వాడి మానాన వాడిని వదిలెయ్యండి” అని చెప్పాడు. గిరిగాడితో నా సంభాషణ ముగిశాక నేను కథని ఏ వాక్యంతో అయితే ముగించాలని అనుకున్నానో అది  అప్రస్తుతం అయిపొయింది యిక.

“మా (కానీ) సత్యం!” కి 4 స్పందనలు

  1. Mee satyam kada chadivaanu chaala baaga raasaaru, kashtapadi chadivi baaga edigaaru santhosham,kaani,snehalaki, bandhaalaki andanantha etthulo vunnaru

  2. హర్షా . మీతోపాటు చదవక పోయినా మీ ఇద్దరి స్నేహం గురించి తెలిసిన వాళ్ళల్లో నేనొకడ్ని ..సత్య కి కావలి స్నేహితుడిని .. బాగా రాసారు.. 🙂

    1. మాకు వాడు పెద్ద హీరో. కష్టాల్లో పెరిగి వాటికి ఎదురు ఈది యీ రోజు ఇలా వున్నాడని. అర్థం కానిది ఎందుకు మమ్మల్ని వద్దనుకున్నాడో అని. నేను అసంపూర్ణం గా వదిలేసిన వాక్యం కనీసం అక్కనైనా కలిసాడో లేదో అని. వాడి సంగతి తెలిశాక నా మనస్సు చెబుతుంది కలవలేదని

Leave a Reply to హర్షవర్ధన్Cancel reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading