నాకు శైలేంద్ర అని ఇంజనీరింగ్ లో దొరికిన స్నేహితుడున్నాడు. వాడి ఎత్తు అయిన ఐదడుగుల ఆరంగుళాల కన్నా ఎక్కువ వుండి ఉంటే మన చలన చిత్రాలలోని కథానాయకులకేమీ తీసిపోడు. మొదటి సంవత్సరమంతా వాడికి మా వాకాటి కాలేజీని వాడికి తగ్గ కాలేజ్ కాదు అని తిట్టుకోవటంలోనే సరిపోయింది. నాకు తెలిసి వాడు మా గోపీచంద్ గాడు మా కాలేజ్ లో చేరాక కూడా మళ్ళి ఐ.ఐ.టి కి ప్రిపేర్ అయ్యారు అని నా అనుమానం.
నేనూ మా శ్రీధర గాడు, పరీక్షలకు ముందర ఒక ఓవర్ చూసి వద్దామని, వన్డే క్రికెట్ మ్యాచ్ అంతా చూసి సాయంత్రమయ్యేసరికి ఆ మర్నాడు జరగబోయే పరీక్షకు తగ్గ ప్రిపరేషన్ చాలలేదని కంగారు పడే వాళ్ళం. ఆ కంగారులో కూడా మనకి మన శైలేంద్ర గాడు తోడున్నాడులే అని ఊరట పడుతూ వాడి రూమ్ కి వెళ్లే వాళ్ళం. మేమెళ్ళేసరికి వాడు మంచిగా తల స్నానం చేసి, నీట్ గా ఒక కుర్చీలో కూర్చొని, పైన ఒక పెద్ద పాడ్ పెట్టుకొని మొదటి చాప్టర్ మొదటి పేజీలోని వుండే వాడు. హమ్మయ్య వీడు మనకన్నా ముందుకెళ్ల లేదు అనుకోని తృప్తిపడి రూమ్ కి వెళ్లే వాళ్ళము.
ఆరోజు నైట్ మా తంటాలు మేము పడి, గంట చదివి, ఓ గంట సెంటర్ దాకా వెళ్లి టీ తాగటంలో గడిపి మొత్తానికి ఓ నాలుగైదు చాఫ్టర్లు కంప్లీట్ చేసే వాళ్ళం. పరీక్షలు మధ్యాహ్నం పూట జరిగేవి కాబట్టి, ఉదయం పొట్టకి కాస్త బ్రేక్ ఫాస్ట్ పట్టిచ్చి, మరలా మా శైలేంద్రగాడు ఎక్కడున్నాడబ్బా అని వాడి రూమ్ కి వెళ్లే వాళ్ళం, మేము వెళ్లే సరికి మా వోడు తెగ ఆలోచనా నిమగ్నుడయ్యి ఆకాశం లోకి చూస్తూ ఉండేవాడు, కాకపోతే పేజీలు మొదట చాప్టర్ మధ్య వరకూ తిప్పబడి. ఏరా ఏమి చేస్తున్నావురా అంటే, ఉదాహరణకి ఈ బ్యాంకింగ్ యాంగిల్ అఫ్ ది కర్వుడ్ సర్ఫేస్ మీద దీర్ఘంగా ఆలోచిస్తున్నానురా, ఆలోచించగా ఆలోచించగా ఈ బుక్ లో రాసింది తప్పురా హర్షాగా అనేవాడు.
మా ఇద్దరికైతే బి.పి పెరిగిపోయేది. ఒరే శైలేంద్రగా నువ్వు ఈ రీసెర్చ్ అంత నువ్వు డాక్టరేట్ చేసేటప్పుడు చేద్దువురా, ఇప్పుడంతా మనం జవాబులు ముక్కున పెట్టుకొని వెళ్లి రాయాలిరా నాయనా, అని మా శ్రీధర గాడిని రూమ్ కి పంపి వాడికి నేను చదివిన అరాకొరా పరిజ్ఞానంతో ఓ నాలుగైదు ఇంపార్టెంట్ ప్రశ్నలకి జవాబులు వాడి చేత బట్టీ పట్టించి రూమ్ కి వెళ్లి, ఈ లోపల మా శ్రీధర గాడు చదివిపెట్టిన ప్రశ్నలకి జవాబులు వాడితో ఎక్స్ప్లెయిన్ చేయించుకొని, ఎదో విధంగా సిలబస్ అయ్యిందనిపించి పరీక్షకి హడావిడిగా వెళ్ళేవాళ్ళం.
పరీక్షా హాల్ కి వెళ్లే దారిలో మాకేమన్న ప్రశ్నలకి జవాబులు తట్టక పోతే మా విశ్వవిద్యాలయ ప్రథముడైన మా సుబ్బూ గాడిని బతిమాకునే వాళ్ళం, జవాబులు చెప్పరా అని. వాడు మాత్రం, అబ్బా హర్షా! శ్రీధరా మీరు టెన్షన్ పడకుండా పరీక్షా హాలుకి వెళ్ళండిరా నాయనా, అక్కడ మీకు వాటికవే గుర్తొచ్చేస్తాయి అనే వాడే కానీ ఒక్క క్లూ అంటే ఒక్క క్లూ కూడా ఇచ్చే వాడు కాదు. మా టెన్షన్ మేము పడుతూ పరీక్షా హాలుకి నడుస్తుంటే మాకు ఇంకో టెన్షన్, మా ఎలక్ట్రానిక్స్ బ్యాచ్ మేట్ అయిన స్నేహలత, వెళ్లే దార్లో పుస్తకం చదువుతూ చదువుతూ అడ్డొచ్చిన తుప్పల మీదకెళ్ళి పోయి ఎక్కడ పడిపోద్దో అనే ఆదుర్దా మాకొకటి. అసలే ఆ అమ్మాయి గెడ కర్రలా ఉండేది, తట్టుకొని కిందపడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. అమ్మాయా! మమ్మల్ని చూడు ముందే అన్నీ చదివేసి ఎంత హాయి గా పరీక్షా హాలుకెళ్తున్నామో అని ఒక క్లాస్ పీకాలనే కోరిక మాకు మనసులో.
మా శైలేంద్ర గాడు నేను చెప్పిన జవాబులు ముక్కున పట్టి సుద్ధంగా పరీక్షల్లో రాసొస్తే నేను తప్పులు చేసొచ్చేవాడిని. మనకసలే పరీక్షా హాల్లో తింగరి డౌట్స్ వచ్చి జవాబులు చెడకొట్టి వచ్చే వాడిని. మా శైలేంద్ర గాడు ఇప్పటిక్కూడా వాడి ఇంజనీరింగ్ మార్కుల్లో నాలుగో వంతు వాటా హర్షా గాడితే అని ప్రకటిస్తాడు, నాకు అమిత సంతోషం కలిగేలా. ఒకసారి కలిసినప్పుడు చెప్పేడు మా శైలేంద్రగాడు, ఒరే! నాకు ఎక్సెలారై లో ఎం.బి.ఏ లో ప్రవేశం వచ్చిందిరా, కానీ నేను చేరలేదురా అని. అదేందిరా శైలేంద్ర అంటే, అడ్మిషన్ కార్డుని మా పోస్ట్ మాన్ ఆరు నెలల తర్వాత తెచ్చిచ్చాడురా అని చెప్పాడు. ఒరే నాతో చెప్పావు కానీ ఎవరితో చెప్పుకోకురా అని చెప్పా నేను, దాని వాడు, ఏరా నాకు అంత తెలివి లేదా అని అడిగాడు నన్ను. నేను నీ తెలివి గురించి సందేహపడటం లేదురా నీ తల రాత గురుంచే నా సందేహం అని చెప్పా నవ్వేస్తూ. అందులోనూ వాడు హస్త సాముద్రికంలో మెరిక లాటి వాడు. వాడి హస్త సాముద్రికం, పెరటి చెట్టు వైద్యానికి పనికి రానట్టు వాడికే పనికిరాలా. వాడు కూడా నవ్వేసాడు కొంచెం బాధగా.
అలా మా శైలేంద్ర గాడు తన అలవాటు ప్రకారం తదుపరి చదువుల్లో ఎన్ని మొదటి చాఫ్టర్లు పూర్తి చేసేడో లేక ఉద్యోగంలో ఎన్నిప్రాజెక్టులు ఎప్పటికీ స్టార్ట్ అప్ ఫేసుల్లో ఉంచేసేడో కానీ, నేను సీటెల్ లో ఉండగా తాను న్యూ జెర్సీ లో తేలాడు. ఇద్దరికీ టైం డిఫరెన్స్ మూడు గంటలు. వాడికి ఈవెనింగ్ పది గంటలైతే నాకు సాయంత్రం ఏడు గంటలు. నేను ఏడుకు ఆఫీస్ కట్టేసి వాడికి కాల్ చేసే వాడిని. వాడింకా ఆఫీస్ లోనే వుండే వాడు ఆయాస పడుతూ. ఏరా ఇంటికెళ్ళవా అంటే లేదురా ఇంకా పనుంది నేను లేకపోతే ఇక్కడ అసలు పని ముందుకే వెళ్ళదు అని అనే వాడు. నేను సరేరా కంపెనీని నీ భుజస్కంధాల మీద మొయ్యి అని ఇంటికెళ్లి వాడిని. ఇది వారం వారం జరిగే తతంగమే.
ఒక రోజు చిరాకుగా అడిగా ఇలా ఆఫిసులో పదిదాకా పడివుండడానికి అంతం లేదా అని. దానికి వాడు అవునురా! నేను చాల సాధించాలి, జీవితం లో పైకి రావాలి అని మొదలెట్టాడు. అసలే చిరాకు దానికి తోడు వాడి సమాధానం. నీ వయసెంతరా అని అని అడిగా. ఈ అసందర్భపు ప్రశ్నకి కాస్త తేరుకొని నలభై అన్నాడు. నెత్తి మీదకు నలభై వచ్చాయి, ఏదన్నా సాధించేవాడివైతే వాడివైతే ఇప్పటికే చాలా సాధించేసి వుండేవాడివి. ఇంకా లేదంటే నువ్వు ఇక చేసేదేమీ లేదు, మూసుకొని టైంకి ఇంటి కెళ్ళి, పెళ్ళాం పిలకాయలతో గడుపు అని చెప్పా.
వాడికి నా మాటలు వాడి లైఫ్ లో పెద్ద షాక్. కానీ త్వరగానే తేరుకున్నాడు. టైంకి ఇంటి కెళ్ళటం నేర్చుకున్నాడు. ఇద్దరు కవలలు వాడికి అందులోనూ ముద్దులొలికే ఆడపిల్లలు. వాడు నేనేమన్నా తుమ్మినా దగ్గినా చాలా ప్రేమగా న్యూ జెర్సీ నుండి హోమియో మందులు పంపేవాడు నాకు. ఆ మందులు వాడే పంపాలి నాకు, వేరే వాళ్ళు పంపితే వాడికి కోపం వచ్చేసేది వాళ్ళ సొంత తెలివితేటలు ఉపయోగిస్తున్నారని హోమియో వైద్యంలో.
టైంకి ఇంటికెళ్ళాలి అనుకుంటే మనం ఆఫీస్ లో పని చక చక చేసేస్తుంటాము. అదే ఇంటికి ఎప్పుడైనా వెళ్లొచ్చు అని గ్రాంటెడ్ గా తీసుకున్నామా లేక ఇంటికి వర్క్ తెచ్చుకుందామని అనుకున్నామా, మనం ఆఫీస్ లో పని చాలా నిదానంగా చేస్తాము, ఇంటికి వెళ్ళటం ఆలస్యం చేస్తాము. కాబట్టి ఇంటికి తొందరగా వెళ్ళండి, రాయాలనుకుంటే ఇప్పుడే రాసెయ్యండి, మీకిష్టమైనవి ఇప్పుడే చేసెయ్యండి. మా అనీల్గాడిలా పాటలు పాడేసి, ఆ పాటల్ని పంపి మీ స్నేహితులని బలిచేసెయ్యండి లేక వాడిలాగే బర్డ్ వాచింగ్ అనే పేరుతో రోజంతా అడివిలో పడి తీయక తీయక వసంతానికొక ఫోటో తీసి, అంతటితో ఆగకుండా వాటిల్ని ఫ్రేమ్ కట్టించి మీ జ్ఞాపకార్థం మీ స్నేహితుల యింటి హాల్స్ లో తలా ఒకటి తగిలించేయ్యండి, కావాలంటే మీకు మావాడినడిగి మనిషికి యెన్ని (పనికిమాలిన) అభిరుచులు ఉండవచ్చో ఒక సెషన్ ఇప్పిస్తా. ఆఖరకు ఈ బ్లాగ్ లో నా కథలకు వాయిస్ కూడా మా అనీల్గాడిదే. ఇంత వరకు ఏమి సాధించలేదన్న బాధ ఉంటే వొదిలెయ్యండి. బాధపడి సాధించేదేమీ లేదు, ఉన్నది ఒక్కటే జిందగీ.
ఇంతకీ శైలేంద్ర గాడు ఏమి చేస్తున్నాడిప్పుడు అనేగా మీ సందేహం. మరలా పెళ్ళాం పిల్లకాయల్ని వొదిలేసి మా కంపెనీ ఉద్దరించడానికి టోక్యో చేరున్నాడు. నేను కూడా ఎదురు చూస్తున్న వాడెప్పుడెప్పుడు మరలా మొదలుపెడతాడా, “నేను చాల సాధించాలి, జీవితం లో పైకి రావాలి” అని.
Leave a Reply