Apple PodcastsSpotifyGoogle Podcasts

మన వాకాటి కథల్లో గోపీగాడు!

ఈ మధ్య మా అనీల్గాడు ఓ వెధవ సలహా ఇచ్చేశాడు, వరస బెట్టి మన స్నేహితుల కథలు రాసెయ్యి, అవి ఓ ఇరవై అయిదు అయ్యాక మనం వాటిల్ని మన వాకాటి కథలు పేరున ఒక  సంపుటిగా తీసుకొద్దాము అని. 

ఇలా రాయటం మొదలు పెడితే అంతా మన స్నేహితుల గురుంచే రాయాల్సి వస్తుంది, నా రాతలతో ఎక్కడో వాళ్ళ మానాన బతుకుతున్న వాళ్ళని ఎప్పుడో జరిగిన జ్ఞాపకాలతో ఎక్కడ బాధ పెడుతానేమో అన్న భయం వ్యక్తం చేసిన నన్ను చూసి, వాడు నవ్వి, ముండా నీ అభిప్రాయాలకి వాళ్ళు అంత విలువిచ్చి తెగ బాధ పడిపోతారని నువ్వు మరీ అంతలా ఇదైపోకు, ముందు రాసెయ్యి అని వాడికలవాటైన విధంగా చెల రేగిపోయాడు.

నువ్వు ఈ కథలన్నీ నీ వైపునుండి వాళ్ళ మీద ఫిర్యాదుల పూర్వకంగా రాస్తే మేము ఇంకా సంతోషిస్తాము అన్నాడు, ఆ మాటల్ని బలపరుస్తూ మా గిరిగాడు, ఇరవై ఏళ్ల తర్వాత వాళ్ళ గతం మీద వాళ్లకు ఏమీ హక్కులుండవు అనే కావియట్ తో కథ మొదలెట్టు అని సలహా ఇచ్చి పారేశాడు.

ఆలా సంపుటిగా తీసుకొస్తే దానికి ముందు మాట మన గిరిగాడు రాయాలి, మరి మన శ్రీధరగాడు తన డబ్బులతో ప్రచురించి, ఇళ్ళుల్లు తిరిగి అమ్మాలనే షరతు మీద ముందు మన గోపీగాడితో మొదలెడుతున్నా.  

కడప జిల్లా ఎర్రకుంట్లకు చెందిన కొంగని గోపీచంద్  మా వాకాటి ఇంజనీరింగ్ కళాశాలలో మా మైటీ మెకానికల్ బ్రాంచ్ లో మా సహాధ్యాయుడు, నా నాలుగు సంవత్సారాల బెంచ్ మేట్ మరియు నాలుగేళ్లు ప్రాక్టికల్స్ లో ల్యాబ్ మేట్. నాలుగేళ్లలోనూ వాడికి నాకు క్రమం తప్పకుండా నాలుగైదు మార్కులే తేడాగా ఉండేవి.

తెలుగు బాగానే మాటలాడుతాడు కానీ, మొదటి నుండి వాళ్ళ నాన్న గారి ఉద్యోగరీత్యా దేశమంతా సంచరిస్తూ  తదనుగుణంగా  సి.బి.ఎస్.యీ సిలబస్ లోనే చదవటం వలన, తెలుగు చదవటం, రాయటం రాదు. గూడూరులో బస్సు దిగి వాళ్ళనీ వీళ్ళనీ ఈ బస్సు వాకాటి వెళ్తుందా లేదా అని అడుగుతుంటే, ఒక ముసలవ్వ వీడికి ఏమయ్యా చూసేదానికి  చదువుకున్న వాడిలాగే కనపడుతున్నావు ఆ మాత్రం ఊర్ల పేర్లు చదువటం రాదా అని క్లాస్ పీకింది అని మా గిరిగాడు వాకాడు కాలేజీలో టామ్ టామ్ చేసేసాడు. మా గిరిగాడు ఏదన్నా చెబితే మేమిక నిజనిర్ధారణ లాటి పనికిమాలిన పనులు పెట్టుకోము. నా కథల్లో చిన్న పిల్లల మొదలు పెద్ద వారి వరకూ తెలుగు చదవటం రాని పాత్ర వుంటే ఆ పాత్ర పేరు గోపి అనే ఉంటుందని మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చెయ్యండి.

వీడు, మా గిరిగాడు మరియు మేము ప్రెసిడెంటు అని ముద్దు గా పిలిచుకొనే నరేంద్ర గాడులు రూమ్ మేట్స్. వాళ్లిద్దరూ ఎలా చదివేవారో రూమ్ లో నాకు తెలియదు కానీ, వీడు మాత్రం మొదటి నుండి పద్ధతి గా చదివే వాడు, ఏ రోజు పాఠాలు ఆ రోజు. పరీక్షల రోజుల్లో కూడా ఏ మాత్రం కంగారు పడకుండా వాడి అలవాటు ప్రకారం పదిగంటలకు పడక వేసేసేవాడు ఎందుకంటే మొదట నుండి అన్నీ చదివేసుకొనే వాడు కనుక. మరీ ఇంత పద్ధతైన వాడిని నేను మొదట దూరం పెట్టేసే వాడినే కానీ, భిన్న ధృవాలు స్నేహం చేసినట్టు మా మధ్య స్నేహం అలా కుదురిపోయిందంతే మా ప్రమేయం లేకుండా.

ల్యాబ్ లో వీడు పద్ధతిగా  పరిశోధనలు చేసి, పరిశోధనా విలువలు నాకు ఇస్తుంటే నేను కాల్కులేటర్ లో ఆ విలువలని ఎక్కించి ఫలితాన్ని రాబట్టి, ల్యాబ్ నుండి అందరికంటే ముందే బయటపడిపోయే వాళ్ళము. మా రోజుల్లో ల్యాబ్ నుండి ఎంత తొందరగా బయటపడితే అంత గొప్ప, ఈ సూత్రం మా మెషిన్ డ్రాయింగ్ కి వర్తించదు, ఎందుకంటే ఆ సబ్జెక్టు ఉండటం మా మెకానికల్ వాళ్ళు చేసుకున్న ఖర్మ. ఎవరో కొందరుండే వాళ్ళు మా బట్టల సత్తిగాడు లాటి వాళ్ళు డ్రాయింగ్ ని టప టప గీసేసి డ్రాయింగ్ హాల్ నుండి బయటపడిపోయేవాళ్లు.

ల్యాబ్ లో గోపీగాడు తీసే రీడింగ్స్ మీద నేను ఎంత ఆధారపడిపోయానంటే మా మూడవ సంవత్సరపు థెర్మోడైనమిక్స్ యూనివర్సిటీ ప్రాక్టికల్ పరీక్షలో, నాకసలు రీడింగ్ తీయటమే రావటంలా, నేను రీడింగ్ తీసి రిజల్ట్స్ చూపితే మరలా వైవాకి అటెండ్ అవ్వాలి. అసలే చండశాసనుడు అయిన మా నాగేశ్వర రెడ్డి అయ్యవారు నా చుట్టూ అయ్యిందా లేదా అంటూ తిరుగుతున్నారు.

ఆయనకి మెల్లగా చెప్పా నా ఇబ్బంది, ఓర్నీ నీ పాసుగూలా బాగానే చదివి చస్తావుగా నీకిదేం పోయే రోగం అని నాలుగు తిట్టి, మా ఎక్స్టర్నల్ ఎక్సామినర్ చూడకుండా ఆయనే రీడింగులు తీసిచ్చి పుణ్యం కట్టుకున్నాడు. ఆదాయన నేను ఫైనల్ ఇయర్ ఆయ్యేదాకా మనసులో పెట్టుకున్నాడు. సందర్భం వచ్చినప్పుడల్లా నా మీద సెటైర్లే.

వీడు సంక్రాంతి సెలవలకి వాళ్ళ తలి తండ్రులున్న గోరఖ్పూర్ వెళ్ళలేడు కాబట్టి ఒక సంవత్సరం సెలవలకి నేను మా ఇంటికి పట్టుకెళ్ళిపోయా. మా ఇల్లు ఒక చిన్న హాల్, ఒక చిన్న బెడ్ రూమ్, ఒక వంటగదితో, చాలా చిన్నదిగా ఉండేది, అంత చిన్న ఇంట్లోనే మేము ఐదుగురము మరియు మా స్నేహితులు ఎవరొచ్చినా యిరుక్కునే వాళ్ళము.

వీడిని ఎవరన్నా విసిగిస్తే వాళ్ళ మెడని తన ఒక మోచేతితో దొరకబుచ్చుకొని వాడు, అంతే ఇక ఆ ఉడుం పట్టు విడిపించుకోవటం బ్రహ్మ-రుద్రాదుల తరం కూడా కాదు. మా శ్రీధర గాడు వీడికి బలైపోయి, మొద్దు నాకొడకా అని తిట్టటం నాకిప్పటికీ గుర్తే.

వీడు వీడి గురించి గాని లేక వీడి రూమ్ మేట్స్ అయిన గిరిగాడు, నరేంద్ర గాడి గురించి ఏమీ చెప్పేవాడు కాదు, కానీ నేను వీడు నా పరమ మిత్రుడు అని అన్నీ వీడికి చెప్పుకొనే వాడిని, మరుసటి రోజే మా గిరిగాడు వచ్చే వాడు, ఏరా హర్షాగా యిదంట కదా నీ సంగతి అని, నేను చెప్పిన దానికి నాలుగు చిలువలు పలువలు కలిపి మరీ.

నాకర్థం మయ్యేది కాదు నా సంగతులు ఈ గిరిగాడికి ఎలా తేలిపోతున్నాయబ్బా, అసలే వాడి నోరు మంచిది కాదు అని. మీకెప్పుడైనా గిరిగాడు కనపడితే వాడు నోరు విప్పక ముందే ఓ తెల్ల జెండా వూపేయ్యండి, నేను వాడిదగ్గర అదే చేసి బ్రతికి బట్టకడుతున్న ఇప్పటికి కూడా.

అటు పిమ్మట మా గోపీగాడు, కోయంబత్తూరు లోని పి.ఎస్.జీ  టెక్ లో మాస్టర్స్ చేశాడు. మాస్టర్స్ చివరి సెమిస్టరు లో ఉండగానే మా కంపెనీ, ఆయా క్యాంపస్ లకు వెళ్లి ఉద్యోగావకాశాలు ఇచ్చేది. అలా క్యాంపస్ లో ఉద్యోగాలు సంపాదించి వాడు ముంబై లో నేను ఢిల్లీ లో చేరాము ఒకే కంపెనీలో.

వాడు ముంబై నుండి హైదెరాబాద్కి బదిలీ మీద వచ్చి, అటుపిమ్మట ట్యాండెం అనే ప్లాట్ఫారం మీద పని చేస్తూ నైపుణ్యం సంపాదించి, NASDAQ లో చేరిపోయి ఇప్పుడు కనెక్టికట్ లో స్థిరపడిపోయాడు. వాడికి ఇద్దరు కవలలు, అమ్మాయీ మరియు అబ్బాయీ.

నేను ఎదో తంటాలు పడి, డెన్వర్ చేరుకొని కొన్ని ఏళ్ళు అక్కడే వున్నాను. అప్పుడప్పుడూ ఫోన్ చేసి పలకరించే వాడిని. వాడి సంగతి తెలిసీ ఒక రోజు అడిగేసా వాడిని, ఏరా ఎప్పుడూ నేను ఫోన్ చేస్తే నే మాటలాడుతావా, నీకై నువ్వెప్పుడన్నా చేసేది ఉందా లేదా అని.

సహజం గా ఇటువంటి ప్రశ్న మన స్నేహితులని అడిగితే వారు, ఏదో లేరా  తీరిక  లేదు, అయినా నువ్వు చేస్తే ఒకటా లేక నేను చేస్తే ఒకటా అని మనల్ని ఓదారుస్తారు, కానీ వీడు మాత్రం, నాకామాత్రం సమయం ఉంటే, నేను మా ఇంటికి చేసుకుంటానురా, నీకెందుకు చేస్తాను అని పుసుక్కుమని అనేశాడు. నా బుర్ర గిర్రున తిరగటం నాకు ఇంకా గుర్తే.

మనం కొందరిని వాళ్ళు మనకి చాలా దగ్గర అని భావిస్తాము మరియు చెప్పుకుంటాము. కానీ వాళ్ళ ప్రతిస్పందన మనపట్ల అలాగే ఉండాలన్న నియమమేదీ లేదు అన్నది నాకు అర్థమయ్యింది. అర్థమయ్యాక మనసు ఊరట చెందింది.

Leave a Reply