“ఈ రోజు నేను, కమల గూడూరు నుండి వాకాటికి బస్సులో ప్రయాణిస్తూ సరదాగా ఒక జూనియర్ పిల్లగాడిని ర్యాగింగ్ చేశాము”, అని ప్రకటించింది, ఒకనాటి సాయంత్రం నేను తనని కలవడానికి వెళ్లిన సందర్భంలో మా ప్రమీల .
ప్రమీల మరియు కమల నాకు ఒక సంవత్సరం జూనియర్లు. ఓహో! అని అనుకున్నా. అవి కాలేజీకి కొత్త ప్రవేశాలు జరుగుతున్న తొలి రోజులవ్వటం మూలాన, ర్యాగింగ్ చేయాలన్న అత్యుత్సాహం చాలా మందిలో అప్పుడప్పుడే ఉరకలెత్తుతూవుంది. మేము అప్పటికే నాలుగవ సంవత్సరానికి చేరుకోవటంతో మాకు ఈ ప్రక్రియ పట్ల అంత వ్యామోహం లేదు. నా ఈ ఆలోచనలని భంగపరుస్తూ, “అబ్బబ్బా! ఏమున్నాడు వాడు, ముట్టుకుంటే మాసిపోయేలా అచ్చు అమీర్ ఖాన్ కి మల్లె”, అంటూ కొనసాగించింది ప్రమీల.
పైగా వాడికి ఎంత ధైయిర్యం మాతో ఏడిపించుకొని, “మాలా డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ ఆడపిల్లలని తాను ఎక్కడా చూడలేదని, ఇలా మీ డైనమిజం అంతా అడవి కాచిన వెన్నెలలా బస్సుల్లో వృధా కాకూడదని, అలా కాకూడదంటే మీరు వచ్చి నన్ను మా తరగతి నుండి బయటకు పిలిచి మరీ ర్యాగింగ్ చేశారంటే అప్పుడు మీరు గొప్ప అని ఒప్పుకుంటాను సవాల్ విసిరాడని” చెప్పింది తను.
వీడెయ్యా! వీడెవడో మరీ గుండెలు తీసిన బంటులా వున్నాడే, చేరీ చేరక ముందే ఇన్ని వేషాలు వేస్తున్నాడంటే వీడు ఖచ్చితం గా హైదరాబాదోడే అయ్యుంటాడు అనుకుంటూ అడిగా తనని, అయితే తమరు ఆ సవాలును ప్రతిసవాలు చేయడానికే నిశ్చయించుకున్నారా అని. “అవును రేపు నేను, కమల వాడి తరగతి అయిన MH4 కి వెళ్లి వాడిని బయటకు లాగుతాము. అబ్బబ్బా! వాడున్నాడు చూడు అచ్చు అమీర్ ఖాన్ కి మల్లె”, అంటూ తన ధోరణిలోకి వెళ్ళిపోయింది. నాకు ఆ అమ్మాయి వాడిని చూసి ముచ్చట పడటం, ముద్దుగా వుండే ఓ చిన్ని కుంకను చూసి మనమెలా ముద్దు చేస్తామో అచ్చు అలాగే అనిపించింది.
“MH4 అంటే మెకానికల్ హాల్ 4 అది మా ఫైనల్ ఇయర్ మెకానికల్ వాళ్ళ తరగతి గది అంటే మా తరగతి, ఏమోలే క్లాస్ రూమ్స్ అప్పుడప్పుడు ఎక్స్చేంజి అవుతుంటాయని సర్ది చెప్పుకున్నా, నాకేదో ఎక్కడో తేడా అనిపిస్తుంది, ఎందుకంటే మా కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు మరియు వసతి గృహాలు, సీనియర్స్ వుండే ప్రదేశాలకు కాస్త దూరం లో ఉంటాయి, జూనియర్స్ ని ర్యాగింగ్ నుండి రక్షింపపడడానికి. మరి ఈ అమ్మాయేమో వాడి తరగతి MH4 అంటుంది”, లాటి ఆలోచనలు తిరుగుతున్నాయి, ఆ అమ్మాయి వాడిని వర్ణిస్తున్నంత వరకూ. అయినా మనం చాలా విషయాల్లో మాశ్రీధర్ గాడిలా ఎక్కువ బుర్ర పెట్టము కదా అందుకే ఎక్కువగా ఆలోచించ కుండా వదిలేశా, ఆ విషయాన్ని అంతటితో.
మరుసటి రోజు మా అనీల్గాడు హడావిడిగా వచ్చాడు. వచ్చీ రాగానే ఎప్పుడూ ముందు వరుసలో కూర్చొని పాఠాలు తెగ వినేసే మా శ్రీధర గాడిని మరియు నాలుగో బెంచీలో కూర్చొనే నన్నూ తెగ ప్రేమగా, ఒరే నాకు ఈరోజు మా యింటి మీద బెంగయ్యింది, నేను ఈ రోజంతా మీతోనే ఉండాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఈరోజు నా నివాస స్థలమైన ఆఖరు బెంచీకి రండిరా అని.
అబ్బా ఛా! వీడికి ఈ కళలు కూడా ఉన్నాయా అని అనుకునేలా మా హృదయాలను ద్రవింపచేసేలా బ్రతిమాలుకొని మమ్మల్ని చివర బెంచీకి బదిలీ చేయించుకున్నాడు. ఎప్పుడు వాడి పక్కన పడివుండే ప్రశాంత్ గాడినేమో మా శ్రీధర గాడు ఖాళీ చేసిన మొదటి బెంచీలో కుర్చోపెట్టాడు. నాకు ఇదంతా ఎదో తేడా అనిపిస్తున్నా, మమ్మల్ని అడిగిందెవరు మా అనీల్గాడు కాబట్టి నా సందేహాలు పక్కన పెట్టా. మా శ్రీధర గాడితో ఏమన్నా ముందే చెప్పుంటే వాడెప్పుడో ఈ చుక్కలన్నీ కలిపేసి ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో చెప్పేసేవాడు.
అది మా హెడ్డు అఫ్ ది డిపార్ట్మెంట్ మరియు ఆ సంవత్సరమే ప్రిన్సిపాల్ హోదా లభించిన మా ప్రభాకర రావు గారి క్లాస్. ఆయన ఎప్పటిలాగే ఆయన మానాన బోర్డు మీద ఓ బొమ్మని చెక్కి ఆ చెక్కటం లోని ఆయన ప్రావీణ్యానికి ఆయనే తన్మయులై, ఆ బొమ్మకే పాఠం చెప్పుకుంటున్న వేళ, ఆయనకి తపో భంగం కలిగిస్తూ, తలుపు దగ్గర ఎవరో నిలబడి ఆయన్ని ఎదో అనుమతి అడిగారు, ఆయన మా వైపు తిరగాల్సిన దానికే చిరాకు పడుతూ, “ప్రశాంత్ యు హేవ్ సం విజిటర్స్” అని చెప్పి మరలా బొమ్మకి తుది మెరుగులు దిద్దటంలో మునిగిపోయారు.
మా హాస్టల్ వెధవలందరూ పళ్ళికిలిస్తూ ఒకళ్ళకొకళ్ళు హై-ఫై లు ఇచ్చుకోవటం మొదలెట్టారు. వీళ్ళు ఎందుకిలా అని మా సెంటర్ వాళ్లమంతా తెల్ల మొహాలేసుకొని చూస్తున్నాము. కొంత సద్దుమణిగాక మాకర్థమయ్యింది ఏమిటంటే, ఆ వచ్చిన అతిధులు ఎవరో కాదు మా కమల మరియు ప్రమీల లేనని, వాళ్ళు తెగ ముచ్చట పడి బస్సులో ర్యాగింగ్ చేసింది, వాళ్ళ ముందు మొదటి సంవత్సరం బుడ్డోడిగా నటించి వాళ్ళని బోల్తా కొట్టించింది, ఇప్పటికీ తన పాల బుగ్గలని కోల్పోని మా ప్రశాంత్ గాడేనని.
బస్సు లో ర్యాగింగ్ అయ్యాక, వాడెళ్ళి ఈ విషయమంతా హాస్టల్ లో చెప్పటం తో, వాళ్లంతా కలిసి నన్ను శ్రీధర గాడిని వెనక బెంచీకి మార్చే పన్నాగం పన్నారు, ఎందుకంటే శ్రీధర గాడిని మొదటి బెంచీలో చూస్తే, ప్రశాంత్ గాడిని పిలవడానికి వచ్చే ఆ అమ్మాయిలకు సందేహం ఎక్కడ వస్తుందోనని, సందేహం వచ్చి వెనక్కి మరలి పోతారేమోనని. ఈ పన్నాగపు అమలుకు స్క్రీన్ ప్లే మరియు దర్సకత్వం వహించి విజయవంతం చేసింది మా అనీల్గాడు.
మా ప్రశాంత్ గాడి బృందం ఈ కథని ఇంతటితో వొదల్లేదు, వాడు బయటకి వెళ్లి ఆ అమ్మాయిల ధైర్యాన్ని అభినందించి, వాళ్ళు ఆ సాయంత్రం మా నాయర్ కాంటీన్ వచ్చినచో వాళ్ళని అక్కడ మాత్రమే దొరికే అరటికాయ బజ్జీలు మరియు కాఫీతో సత్కరించుకుంటానని చెప్పివచ్చ్హాడు. మా అనీల్గాడి స్నేహ బృంద తదుపరి పన్నాగం, వాళ్ళీద్దిరనీ ఆ కాంటీన్లోనే తిరిగి ర్యాగింగ్ చేయాలన్నదే.
నాకు కమల మొదటి నుండి మంచి స్నేహితురాలు, మేము మరియు వాళ్ళ పిన్నమ్మ వాళ్ళు మా నెల్లూరి హౌసింగ్ బోర్డు కాలనీ లో ఇరుగు పొరుగు వాళ్ళము కావటంతో. కమల, ప్రమీలలు వారి మొదటి సంవత్సరం లో ఒకే గదిలో ఉండేవారు, అందువలన నాకు ప్రమీల కూడా మంచి స్నేహితురాలు. మా శ్రీధర గాడికి నాతో పాటు కమలా కూడా మంచి స్నేహితురాలు, వాడికీ ప్రమీలకి పడేది కాదు అసలు, ఎడ్డెమంటే తెడ్డేమే వాళ్లిద్దరూ.
ఇక మా స్నేహితురాళ్లను జరగబోయే అవమానాలనుండి కాపాడే బాధ్యత మాది అని తెగ ఆలోచించేసాము. మేము ఎక్కడ యిలా భావించి ఆ అమ్మాయిలను కాంటీన్కి రాకుండా చేస్తామేమో అని మా అనీల్గాడు మాకు నాలుగో నెంబర్ ప్రమాద ఘంటికని జారీ చేసాడు, మేము అలా చేసినచో జరగబోయే తదుపరి పరిణామాలకు వాడు బాధ్యుడు కాదు అని. పోరా! నీకు ప్రశాంత్ గాడు స్నేహితుడైతే నాకు వీళ్ళిద్దరూ స్నేహితులే అని మనసులో అనుకొని, మధ్యాహ్నపు భోజన విరామంలో వెళ్లి చెప్పొచ్చా ఆ ఆడపిల్లకాయలకు, కాంటీన్ కి వెళ్ళొద్దని. సరే సరే అని బుర్ర ఊపారు వాళ్లిద్దరూ.
ఆ సాయంత్రం నాలుగున్నరకు మా తరగతులన్నీ ముగించుకు వస్తున్న నాకు, మా శ్రీధర గాడికి, వాళ్లిద్దరూ మా మెకానికల్ బ్లాక్ కు ఎడమ వైపున వున్న ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో కూర్చొని కనపడ్డారు వాళ్లిద్దరూ, నాయర్ కాంటీన్ కి వెళ్ళడానికే నిశ్చయించుకొని. చెప్పొద్దూ! నాకు మా శ్రీధర గాడి చాలా ఆవేశమొచ్చేసింది, అక్కడకు వెళ్లొద్దు, వెళ్ళితే మీకు చాలా ఎంబరాస్ అవుతారు అని చెప్పినా వెళ్ళడానికి నిశ్చయించారంటే ఇక వాళ్ళ ఖర్మ అని. అయినా ఊరుకోలేక మా శ్రీధర గాడు వెళ్లి వాళ్ళని దగ్గరుండి వాళ్ళ సైకిల్స్ ఎక్కించి వాళ్ళ రూమ్ కి తరిమేసి వచ్చాడు. కాంటీన్ కి వెళ్ళటమనేది ఆలోచన, ఏమొచ్చినా మొండిగా ముందుకెళ్లే మా ప్రమీల తత్వమని నాకు తెలుసు.
ఇక ఈ ఘట్టం ఇంతటితో ముగిసిందని నేను మా శ్రీధర గాడు ఊపిరి పీల్చుకొని మా రూమ్ కి వెళ్ళిపోయాము. కానీ మా ప్రశాంత్ గాడు, అనీల్గాడు, జగ్గూ గాడు, అరుణ్ గాడు, కోట గాడు ఈ విషయాన్నీ అంతటితో వొదల లేదు. ఆ రోజు పొద్దుబోయాక అరుణ్ గాడి స్నేహితురాలైన రంగరంజని గదికి వీళ్ళిద్దరినీ పిలిపించి, మా వాడిని ర్యాగింగ్ చేసినందుకు బదులుగా వాళ్ళిద్దరినీ ఏడిపించి మరీ బదులు తీర్చుకున్నారు.
నాకు కొన్ని రోజుల వరకూ మా అనీలగాడి మీద మనస్తాపం వుండేది, వాడు వాడి స్నేహితుడి కోసం ఇంత నడిపించాడు, నాకు ఆ అమ్మాయిలిద్దరూ స్నేహితులేనని తెలిసి కూడా అని.
కానీ కొన్ని రోజులు గడిచాక మా కమల చెప్పింది మేమేదో, ఎప్పుడూ ర్యాగింగ్ చేయలేదు అనే సరదాతో పొరపడి మా సీనియర్ ని చేశాము దానికేదో వాళ్ళు బదులు గా మమ్మల్ని చేశారు, కొన్నాళ్ల తర్వాత మేమూ పిచ్చ లైట్ గా తీసుకొని నవ్వుకున్నాము, నువ్వు కూడా లైట్ తీసుకో బాబూ అని.
కొద్ది రోజులయ్యాక ప్రమీల కూడా చెప్పింది, మీ వాళ్ళు మమ్మల్ని ఏడిపించామని అనుకున్నారు, కానీ వాళ్ళకంత దృశ్యం లేదు బాబూ అని.
అలా మా వాకాటి కాలేజీ చదువు, మా అమ్మాయిలకు తమ తమ భావి జీవితాలకు కావలిసి మానసిక స్థైర్యాన్ని నేర్పించేసింది.
Leave a Reply