Apple PodcastsSpotifyGoogle Podcasts

గడ్డు కాలంలో నాతో నేను!

ఈ రోజు తీరిగ్గా కూర్చొని ఆలోచిస్తుంటే మా ఇంజనీరింగ్ అయ్యాక మాకు లభించిన ఒక సంవత్సరం ఖాళీ మనకు చాలా జీవుతానుభవాలనే నేర్పించి ఉంటుందని అనిపించింది. ఈ మధ్య ఒక సినిమాలో చూశా డిగ్రీ అయ్యి బయటకి రాగానే నెక్స్ట్ ఏంటి అని ప్రతీ వాడూ అడిగేవాడే అని కథానాయకుడు బాధగా పాడుకొనే పాటని. మేము బయటకు రావటం అందరిలా కూడా రాలేదు కదా, మీరు మర్చిపోయారా, పరీక్షలు ఎగ్గొట్టి ఒక్క సంవత్సరం కాజేసుకొని వచ్చిన బ్యాచ్ మాది అని.

అసలు మాకీ పరిస్థితిఎందుకు వచ్చిందబ్బా అని కొంచెం వెనక్కి వెళ్లి ఆలోచిస్తే, ఎక్కడో మేము మా నాలుగవ సంవత్సరపు చదువుని నిర్లక్ష్యం చేసి తీరా పరీక్షలు దగ్గర పడటంతో ఎక్కువ ప్రిపరేషన్ కావాలని, అలా కావాలంటే యూనివర్సిటీ వాళ్ళు ముందుగా షెడ్యూల్ చేసిన ప్రకారం ల్యాబ్ ఎగ్జామ్స్ థియరీ ఎగ్జామ్స్ కన్నా ముందు వద్దు, వెనకకి జరపమన్నామని  నాకు గుర్తు. అలా చెయ్యటం వలన మాకు కొంచెం ఎక్కువ రోజులొస్తాయి థియరీ ఎగ్జామ్స్ రాయడానికి అని మా వాదన.

కానీ మేము మిస్ అయిన లాజిక్ ఏమిటంటే మాలో తొంబై శాతం మందిమి వన్ డే బాటింగ్ చేసేవాళ్ళమే, అలాటి మాకు ఎక్కువ రోజులుంటే  ఏమి తక్కువ రోజులుంటే ఏమి. ఎందుకంటే మేము చదవ బోయేది సరిగ్గా పరీక్షకు ముందు రోజే కదా. వెళ్లి రాసి పడేసి వుండాల్సింది, స్ట్రైక్ అని మా తద్దినం మేమే పెట్టుకోకుండా.

పరీక్షలు రాయకుండా ఇంటికి వచ్చిన నన్ను చూసి ఇంటా బయటా హేళనలే, ఎవరూ జాలిపడలా, పిల్లకాయలేదో తప్పు చేసి వచ్చారు అని. ఆ తర్వాత పరీక్షలు రాసి వచ్చినా, మా అన్న హైద్రాబాదులో చూపిన వుద్యోగం చేయకుండా రెండవ రోజే పారిపోయి రావటం తో వీడు దేనికీ పనికి రాడు అనే ముద్ర పడిపోయింది మా వాళ్లకు.

అది నా మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీసింది. మీకు తెలుసనుకుంటా నాకిటువంటి అనుభవమే ఇంటర్మీడియట్ లో జరిగింది, రెండవ సంవత్సరం లెక్కల పరీక్ష  తప్పటంతో. అక్కడో సంవత్సరం ఖాళీ మరలా ఇంజనీరింగ్ అయ్యాక ఇంకో సంవత్సరం ఖాళీ. ఈ దెబ్బతో మనకి అన్ని సంవత్సరాలు ఎగిరెగిరిపడి తీరా అసలు సమయమొచ్చాక చతికిల పడ్డ చందాన పేరు వచ్చింది. అందులోను మనల్ని మన తలితండ్రులు చూసే విధానం మనం చదువుల్లో ఎలా రాణిస్తాము అనే దాని బట్టి ఉంటుంది, దీనికి మినహాయింపు ఇవ్వ దగ్గ తలితండ్రులను వేళ్ళ మీద లెక్కించ వచ్చు. మా కుటుంబం ఇందుకు అసలుకే మినహాయింపు కాదు, మా కుటుంబ ఆర్ధిక పరిస్థుల దృష్ట్యా.

ఏమీ చేత కానీ వాడు అనే ముద్రనుండి బయట పడాలని, నేను నెల్లూరు లో ఒక ఏ.ఎం.ఐ.ఈ కి శిక్షణను ఇచ్చే సంస్థ వెనక పడ్డా, ఉద్యోగమివ్వండి నేను స్ట్రెంగ్త్ అఫ్ మెటీరియల్స్, థెర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ల వంటి సబ్జక్ట్స్ ని బాగా చెప్పగలను అని. నాకింకా గుర్తు మనకి సర్టిఫికెట్స్ కూడా రాలేదప్పటికీ, నేను నా గేట్ స్కోర్ కార్డు పట్టుకు తిరిగే వాడిని నన్ను నమ్మండి మహా ప్రభో అని.

వాళ్లేమో రేపురా లేక ఎల్లుండిరా అంటూ రెండు నెలల పుణ్యకాలం అరగ దీశారు. ఈ లోపు నేను అప్పట్లో మా నెల్లూరులో పుట్ట గొడుగులా వుండే ఇంటర్మీడియట్ కోచింగ్ సెంటర్ల చుట్టూ కూడా తిరిగా, లెక్కలు మరియు భౌతిక శాస్త్రం చెప్పగలనని. పేరు మోసిన సంస్థలు ఎలాగూ గేట్ లోపలక్కూడా రానివ్వవని తెలిసి, టెన్త్ పాస్ అయితే చాలు మీ వాడికి ఇంజనీరింగ్ గ్యారంటీ అని బోర్డు లు పెట్టి వుండే సంస్థలు లక్ష్యంగా.

సాధనా సంస్థ అని ఎక్కడో ఊరి బయట వున్న ఒక సంస్థలో అవకాశం వచ్చింది మా ఇంటి పక్కనుండే ఒక ఉపాధ్యాయుడి సిఫారసుతో, రోజుకు రెండు గంటలు చెబితే నెలకు ఐదొందలు ఇస్తామని. వెళ్లి చేరిపోయా, పిల్లలు ఇష్టపడటంతో రెండు గంటలు బదులు నాలుగు గంటలు చెప్పటం మొదలెట్టా ఫానులు కూడా లేని రేకుల షెడ్డుల్లో, ఎగుడు దిగుడు గోడలకు నల్ల రంగు వేసి బోర్డులుగా మార్చిన తరగతుల్లో. ఇంట్లో ఖాళీ అనే మాట బదులు అక్కడ అలా పడివుండటమే స్వర్గంలా అనిపించేది.

ఈ లోపల ఏ.ఎం.ఐ.ఈ శిక్షణా సంస్థ వాళ్ళు కూడా రోజుకు రెండు గంటలు చెప్పమని అవకాశం ఇచ్చారు నెలకు ఒక వెయ్యి రూపాయల వేతనంతో. చేరిన ఒక నెలలోనే, మాకు స్ట్రెంగ్త్ అఫ్ మెటీరియల్స్ చెబితే ఆ హర్షా సర్ చెప్పాలని అన్నీ బ్యాచ్ లు నా దగ్గరకే రావటం నాకు మరచిపోలేని అనుభవం. వాళ్లకు నేనే రామామృతాన్ని మరియు సురేంద్ర సింగ్ ని. వీళ్లిద్దరు ఎవరబ్బా అంటారా ఆ సబ్జెక్టు మీద పేరు మోసిన రచయితలు. కొన్నాళ్ళకి ఆ కోచింగ్ సెంటర్ ఓనర్ వాళ్ళ కుటుంబాన్ని వరకట్న కేసుతో వాళ్ళ వదిన గారు అరెస్ట్ చేయించటంతో, ఆ సంస్థని అందరం లెక్చరర్స్ మి ఏమీ ఆశించకుండా ఓ మూడు నెలలు మూతపడకుండా నడపటం ఓ గొప్ప అనుభవం.

ఇంత కష్టపడినా ఎక్కడో నాలో నేను కోల్పోయిన ఆత్మస్థైర్యం పూర్తిగా తిరిగి వచ్చిన భావన లేదు. మరల గేట్ రాద్దామని రాస్తే, నేను ఈ సారి క్వాలిఫై కూడా కాలేదు, పాత స్కోర్ రెండు సంవత్సరాలు వాలిడ్ కాబట్టి బతిపోయా. ఈ తగ్గిపోయిన ఆత్మ స్థైర్యం తో మరియు పక్కన శ్రీధర గాడు కూడా లేక పోవటం తో, నేను మాస్టర్స్ కి  సరైన కాలేజీలకు సరైన ఆప్షన్స్ కూడా ఎన్నుకోలేక పోయా. ఈ సమయం లో నేను ఊరట పడే ఒకే విషయం, నా మాస్టర్స్ కి అప్లై చేయడానికి మరియు ప్రవేశ రుసుములకు ఇంట్లో వారికి భారం కాకపోవటమే.

కొన్ని యూనివర్సిటీలకి అప్లికేషన్స్ రిజిస్టర్ పోస్ట్ లో పంపకూడదు, స్టాంపులు అంటించి మాములు పోస్ట్ మాదిరిగా పోస్ట్ డబ్బాలో వేయాలి. ఎన్ని సార్లో డబ్బాలో వేసాక, స్టాంపులు అంటించానా, లేక అడ్రస్ రాసానా,  లేక అక్నాలెడ్జ్మెంట్ కార్డు సరిగా పెట్టానా లాటి అబ్సెసివ్ డిసార్డర్ తో, మరలా పోస్ట్ మాన్ వచ్చి డబ్బా ఓపెన్ చేసి అన్నీ చూపించే దాకా ఆ డబ్బా దగ్గరే ఎదురు చూసిన సందర్భాలెన్నో.

ఈ చెత్త పనులతో, ఒకే స్కోర్ వున్నా శ్రీధర గాడికి, ఖరగపూర్ లో ప్రొడక్షన్ అనే మంచి బ్రాంచ్ లో వస్తే నాకు  ఫౌండ్రి ఇంజనీరింగ్ అనే బూజు పట్టిన బ్రాంచ్ వచ్చింది. కానీ వాడు ఐ.ఐ.ఎస్సి లో చేరాడు, నేను ఆ బూజు పట్టిన ఇసక ఇంజనీరింగ్ లో చేరా. ఆ బ్రాంచ్ ని ఎందుకు నడుపుతారో ఆ ఖరగపూర్ యూనివర్సిటీ మహాశయులకే తెలియాలి, మా తోటి వారందరు ఎఫ్.ఈ.ఎం లాటి అడ్వాన్స్డ్ సబ్జక్ట్స్ చదువుతుంటే మేము కోప్, డ్రాగ్, సాండ్ అంటూ చెత్త టాపిక్ లతో, బాచిలర్స్ చదువులకన్నా ఏ మాత్రం అదనపు అంశాలు లేని ఆ బ్రాంచ్ నాకు నచ్చలా.

నేను చాలా ప్రయత్నించా బ్రాంచ్ మార్పిడి కోసమని. మిగిలిపోయిన ప్రొడక్షన్ సీట్స్ ని అలా ఉంచేసేరే కానీ అర్హత వున్న అభ్యర్థులకు వేరే బ్రాంచ్ నుండి ఈ బ్రాంచ్ కి మార్పిడి చేసుకోవడానికి అనుమతులు ఇవ్వలేదు.

తర్వాత సంవత్సరం మన అనంతపూర్ శీనుగాడు వచ్చాడు నాకు వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్లో వచ్చింది కానీ నాకు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో సీట్ కావాలి అని. నేను అప్పటికే నాకున్న అనుభవంతో వాడిని మా డీన్ వరకూ తీసుకెళ్లా, కానీ వాడికి కూడా నా అనుభవమే పునరావృత్తమయ్యింది. నాకింకా గుర్తు వాడు కూడా నా లాగే వాడు కోరుకున్న బ్రాంచ్ రాకపోవటం తో ఒక చిన్న పిల్లాడిలా ఏడవటం. ఆ తర్వాత వాడు వాడికిష్టమైన బ్రాంచ్ రూర్కీలో రావటం తో అక్కడ చేరిపోయాడు.

మా ఫౌండ్రి సబ్జక్ట్స్ మరియు ప్రాక్టికల్స్ ఎంత ఉత్సాహపరచక పోయినా వాటిల్ని నేను నిర్లక్యం మాత్రం చేయలేదు. అందులోను ఈ సబ్జక్ట్స్ అన్నీ బాచిలర్స్ లోనే చదివేసి ఉండటంతో నాకు సమయం ఎక్కువ చిక్కింది. అందువలన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మీద ఎక్కువ సమయం గడపటం మొదలు పెట్టాను, నేర్చుకోవటం చాలా బాగుండటంతో.  క్యాంపస్ లోనే జాబ్ ఆఫర్ రావటం, అటు పిమ్మట ఇష్టమైన ఏరియాస్ లో ప్రాజెక్ట్స్ చేయటం మరియు వాటిల్ని విజయవంతం చేయటం లో నా పాత్ర నేను పోషించటంతో  ఆత్మ విశ్వాసం తిరిగి ప్రోది అయ్యింది. నా ఉద్యోగం మీద మరియు సాఫ్ట్ వేర్ ఉద్యోగాల మీద  నేను ఎన్ని వెధవ జోకుల్ని వేసినప్పటికీ, సాఫ్ట్ వేర్ రంగమంటే నాకు ప్రేమ చాలా ఎక్కువ, ఎందుకంటే అది నాలాటి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసిన రంగం.

Leave a Reply