మనకీ మందులున్నాయబ్బా!

చాలా పెద్ద కథని ఒక్క మాటలో చెప్పాలంటే నాకు గత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, ఆయుర్వేదము మరియు హోమియో వైద్యాలమీద నమ్మకం సడలింది. అదిగో మీకు వెంటనే కోపం వస్తుంది కదా! అయితే వినండి, నాకూ ఆయుధముంది, ఇది నా అభిప్రాయం మాత్రమే అని బుకాయించే ఆయుధము. సహజంగా నా అభిప్రాయాలు చివరకు తప్పని తేలుతుంటాయి, ఆ చివర ఎప్పుడు అని తెలుసుకోవాలంటే మీకు ఓపిక అనే గొప్ప గుణం ఉండాలి.

నేను గత మూడు సంవత్సరాలుగా ఎక్కువ ప్రయాణిస్తూ, మరియు యింటికి అర్థరాత్రి లేక అపరాత్రికి చేరుతూ, అప్పుడు ఏది పడితే అది మెసవుతూ, సరిగా ద్రవ పదార్థాలు మరియు పీచు పదార్థాలు తినక, ఫిస్టులా మరియు ఫిషర్ లని కలిపి తెచ్చుకున్న. గత సెప్టెంబర్ లో రెండవ అభిప్రాయము లేకుండా మరియు తీసుకోకుండా మరియు స్నేహితులెవ్వరికీ చెప్పకుండా కేవలం నా సతి మాత్రమే తోడురాగా శస్త్ర చికిత్సా బల్ల మీద పడుకునేశా.

శస్త్ర చికిత్స అనంతరం నా శరీరం లో సెటన్ అనే సైతానుని కూడా మూడు నెలలు భరించా.  ఈ సెటన్ అన్నది ఒక దారపు ఉంగరం, అది ఫిస్టులాని సహజంగా కత్తి  అవసరం లేకుండా కోసుకొని దానికై అదే బయట పడిపోతుంది అని మా వైద్యుడు ధృవీకరించాడు కూడా.  కానీ దానికి నా శరీరమంటే మిక్కిలి ప్రీతీ అయ్యి, ఈ హర్షా గాడిని కోసి నేను బాధించలేను అని నా శరీరం లోనే ఉండి పోయింది.

దానికున్న జాలి మా వైద్యులుంగారికి  లేదు కదా మరలా నన్ను డిసెంబర్ మాసంలో  కోసిన దగ్గర మరలా కోసి సెటన్ బయటకి తీసి, ఇలా నూరుమందిలో పదిమందికి జరుగుతుంది, నీ మొహం చూసే అనుకున్న నువ్వు ఆ పదిమందిలో ఒకడివి అని చెప్పి, నొప్పి తగ్గక పోతే అప్పుడప్పుడు వచ్చి కనపడు అని చెప్పాడు.

ఆ ముక్క నేను శస్త్ర చికిత్సా బెంచి మీద పడుకోక ముందే చెప్పాలి అని అనుకొని ఆ నొప్పి తగ్గడానికి ఇంకో మూడు వారాలు మంచమెక్కా నేను. కానీ నాకు గత నాలుగు  నెలలుగా హీల్ కావటం లేదు, నేను కూడా శపధం చేశా సుప్రియా దగ్గర లాక్ డౌన్ ఎత్తేసినా నేను నన్ను కోసిన వైద్యుడిని చూడను అని.

మా అనీల్గాడు కాల్ చేసి కనుక్కుంటాడు ఎలా ఉందిరా, తగ్గిందా లేదా అని. వాడు చేసినప్పుడల్లా నేను కళ్ళ నీళ్లు పెట్టుకుంటా. ఇక వాడు నా బాధ చూడలేక ఎలాగూ బాధ పడుతున్నావు కదా, నిన్ను కోసినోడిని చూడనంటున్నావు కదా , ఏమీ  మందులు వాడకుండా ఏడ్చే బదులు నాకు తెలిసిన ఒక హోమియో వైద్యుడున్నాడు, ఆయన్ని కలిసి ఆయనిచ్చే ఆ నాలుగు తీపి గోళీలు  నములుతూ కూడా నీ ఇప్పుడేడిచే ఏడుపు ఏడ్చుకోవచ్చు అని సలహా పడేశాడు. సలహాతోనే ఆగకుండా ఆ హోమియో ఆయనతో మాటలాడి ఈ లాక్ డౌన్ లో కూడా నన్ను చూసే ఏర్పాటు చేసాడు.

చెప్పొద్దూ మొదట దర్శనం లో ఆయన నన్ను ప్రొఫైలింగ్ చేసి పడేశాడు ఓ గంట కూర్చో పెట్టి. చలి అంటే ఇష్టమా లేక వేడి అంటే ఇష్టమా అన్నదానికి చలి ఉండటం వలన నాకు అమెరికా అంటే ఎంత ఇష్టమో కథలు కథలు గా చెప్పా. చిన్నప్పుడేదన్న నీకు బాధ కలిగే సంఘటన గురుంచి చెప్పమంటే మా లక్ష్మి కథ చెప్పేశా, చురుగ్గా వుండే వాడివా అంటే మా అమ్మ తప్పిపోయిన కథ చెప్పా,.

పరీక్షలంటే టెన్షనా అంటే అసలు టెన్షన్ ఎందుకు మొదలయ్యింది అని నాది మరియు అనీల్గాడి ఇంటర్మీడియట్ సోది కథ చెప్పేశా, నీ స్నేహితులు నీ గురుంచి ఏమనుకుంటారు అంటే నీలో నువ్వు అన్నిటికీ పీక్కుంటావెందుకురా అంటారని చెప్పా.

ఎవరన్నా బాధ పెడితే గుర్తు పెట్టుకంటావా అని అడిగితే ఎప్పుడో ఇరవై ఏళ్ళక్రితం మన గోపీ గాడు నాకు టైం ఉంటే మా యింటికి ఫోన్ చేసుకోకుండా నీకెందుకు చేస్తానురా అని అన్నాడని గుర్తుపెట్టుకొని వాడి మీద కథ రాసేసాను అని చెప్పా, చిన్నప్పుడు ఇంట్లో నిన్నెవరన్నా అన్నిటికీ సప్రేస్స్ చేశారా అంటే రామలక్ష్మణులేమో అలా సుందోపసుందులేమో ఇలా అనే కథ చెప్పా, పెద్దయ్యాక సప్రెస్ చేశారా అంటే గడ్డు కాలంలో నాతో నేను కథ చెప్పా.

అబ్బా! నీలో చాలా విషయముందే అని అని నా ప్రొఫైలింగ్ చాలా కుతూహలంగా ముగించాడు. ఇంకా చాలా అడిగాడులే, అవన్నీ ఇక్కడ రాయలేను, ఏమడిగాడో నేనేమి చెప్పానో మా అనీల్గాడికి చెప్పా ఎందుకంటే వాడు కూడా ఆయన దగ్గర ప్రొఫైలింగ్ చేయించుకున్నాడు.

వస్తుంటే ఆయన అడిగాడు, ఏవండీ మీ వాకాడు వాళ్లంతా ఇంతేనా లేక మీరిద్దరు మాత్రమే యిలానా  అని. ఎందుకు డాక్టర్ అలా అడిగారు, వాడి సంగతి వదిలెయ్యండి అనుమానం లేకుండా వాడు సాధారణం కాదు, నేను కూడా సాధారణం కాదా అని అడిగా. ఆయన దానికి అవునని  అనలేదు, కాదని అనలేదు, నవ్వుతూ చెప్పాడు, సాధారణం కానీ గుణానికీ హోమియో లో మందులున్నాయండి అని. 

Leave a Reply