ఆ మధ్య ఒకసారి మా అనీల్గాడు నాతో సంభాషిస్తూ, రాసే కొద్దీ నీ కథలు మెరుగుపడుతున్నాయి. అలాగే నీ పాత్రలతో సహజీవనం చేస్తూ నువ్వు కూడా వ్యక్తిగా మెరుగు పడాలని ఆశిస్తున్నా అన్నాడు. ఇదే మాట మా సీనియర్ బాలాజీ కూడా అన్నాడు మా వాడంతా కరుగ్గా కాదు, కాస్త మెతగ్గా, ఈ కథలు నీ వ్యక్తిత్వాన్ని ఇంకాస్త మెరుగు పరుస్తాయని.
కానీ వరుసగా ఈ మధ్య నా కథలు చదివిన మా అనీల్గాడు, ఈ మధ్య కథల్లో వినయం పేరుతో నువ్వు పడే స్వీయ-జాలితో చస్తున్నామురా బాబు, అంత ఆత్మ విశ్వాసం లోపిస్తూ నువ్వు రాసే కథలు ఒక కంపెనీ లో లీడర్షిప్ పోసిషన్ లో వున్నా నీకున్నూ మరియు నీ చుట్టూ పక్కల వారికిన్ను అంతగా శోభించవు అని మరలా నాకు హిత బోధ చేశాడు. నాకు వాడి హితబోధ చాలా నిజమనిపించి నా ముందు కథ అయిన “గడ్డు కాలం లో నాతో నేను” ను నేను చాలా ధనావేశంగా ముగించా.
లక్ష్మి లేకపోవటం నిజం, మన (కాని) సత్యం లేక అందగాడు మరియు ధవళ వర్ణము వాడు మా పెద్దనాన్న లాటి కథలు రాసినప్పుడు లేక నా కథలు నేనే చదివినప్పుడు మనసంతా చాల స్తబ్దుగా అయిపోతుంది, ఇలా జరిగి ఉండకూడదు అనే బలమైన భావన. టైం మెషిన్ లో వెనక్కి ప్రయాణించి అంతా రీసెట్ చేసుకోవాలనే తలంపు. అలా కాలాన్ని వెనక్కి మళ్లించాలి అనే ఆలోచనే నా అపరిపక్వ మనస్తత్వాన్ని తెలియజేస్తుందేమో కదా.
కొన్ని నిజ జీవిత పాత్రలగురుంచి రాసేటప్పుడు వాళ్ళ గురించి రాసే హక్కు లేక అర్హత నాకేముంది అనే ప్రశ్న కూడా మనసుని తొలుస్తుంది. నా కథల ద్వారా నేను ఎదో మంచి చెబుదాము లేక సందేశాన్ని ఇద్దామని అనుకోవటం లేదు. నిజ జీవితంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారో నా కథలలో పాత్రలు కూడా అలానే వుండాలను కుంటాను.
నేను నా జీవితం నూటికి నూరు శాతం కథానాయకుల గుణగణాలతో బ్రతికిన లేక బ్రతుకుతున్న వారిని, అలాగే నూటికి నూరు శాతం ప్రతినాయకులు గుణగణాలతో బ్రతికిన వారిని చూడ లేదు. నాతో వున్నవారు లేక నా చుట్టూ పక్కల వున్నవారు, తమ తమ సహజ సిద్దమైన మానుష ప్రవర్తన కలిగి వున్న వారే.
పరిస్థితుల ప్రభావం తో కొట్టుకు పోతున్నవారే ఎక్కువ మంది, వారిలో చాలా మంది మనం ఊహించిన దానికంటే కరుణాత్మకంగా ప్రవర్తించి ఉండవచ్చు, అదే వారు మనం ఊహించని దానికంటే కఠినాత్మకంగాను కనపడి ఉండవచ్చు మరొక సమయాన.
చాలా మంది మాకు యండమూరి వీరేంద్రనాథ్ కథలు చాలా ఇష్టమంటారు. ఆయన రాసిన నవలలో వెన్నెల్లో ఆడపిల్ల కానీ, ఆనందోబ్రహ్మ అనే నవల కానీ ఇష్టమని ఏభై శాతానికి పైనే చెప్పటం మనం వింటాము. ఆయన ఆ పుస్తకాలలో రాసిన ఆ వెన్నెల్లో ఆడపిల్ల, రేవంత్ లేక సోమయాజి, మందాకినీ లాటి పాత్రలులా బలమైన వ్యక్తిత్వమున్న పాత్రలు మనకి నిజ జీవితంలో తారస పడవు, తారస పడాలని కోరుకోవటం అసహజమే అవుతుంది.
నాకు మట్టుకు ఆయన రాసిన వెన్నెల్లో గోదావరి అనే పుస్తకనుంటే చాలా ఇష్టం. ఆ పుస్తకాన్ని ఆయన ఆనందరావు, తరళ, ప్రమథ్వర , గోపిచంద్ మరియు తరళ వాళ్ళ నాన్నగారుల పాత్రలతో జరిగిన ఒకే కథని ఒక్కొక్కరి కోణంలో చెప్పటం అనే ప్రయోగం చేశారు అని గుర్తు. చదివి చాలా రోజులయ్యింది. మరల చదవకుండానే యిక్కడ ఏమాత్రం సందేహం లేనివాడిగా రాసేస్తున్నా. ఒక్కో పాత్ర తన కోణం నుండి అదే కథ చెబుతుంది, వాళ్ళు చేసిందే సత్యం మిగతా వాళ్లంతా అసత్యాలు గా కనపడతారు.
ఇంత సుత్తి ఎందుకురా అంటే, నిజ జీవితం కూడా అంతే, మనం ఏ విషయాన్ని అయినా మన కోణం లోనే చూస్తాము, మన కోణమే భలమని నమ్ముతాము. అలా నమ్మలేక పోతే మనం మనలేము. మనకి మనమే అసత్యంగా కనపడటం కన్నా మిక్కిలి బాధాకరం ఈ లోకంలో లేదు. ఒక్కోసారి మనతో మనమే ఓ నలభై లేక ఏభై ఏళ్ళు గడిపినా మనకి మనమే అర్థం కాము, ఇక ఇతురులనేమి అర్థం చేసుకోకగలం. ఆలా కాకుండా ప్రతీ విషయాన్ని ఇతరుల కోణం లో చూసే వారిని మనం ఋషులని అనాలేమో, వాళ్ళ మనుగడ పురాణ కాలాలలోనే, నిజ జీవితంలో అలాటివారి మనుగడ ఓ మిధ్య.
నాకు ఓ మహా చెడ్డ వ్యక్తిత్వ లోపం వుంది, నేను ఇతరుల మాటలను బట్టి మరియు చేతలను బట్టి, వెంటనే వారి కోణంలో చూడకుండా అపార్థం చేసుకోవటంలో ఘనుడను. పైగా వారు నేను అనుకున్నట్టు గా ప్రవర్తించలేదని గింజుకోవటం. మనమనుకున్నట్టు బతకడానికి వాళ్ళేమన్నా మనం ప్రోగ్రాం చేసిన యంత్రాలు కాదు కదా.
కానీ ఎన్నిమార్లు అనుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతోనే పోవాలన్నట్టు, యీ వ్యక్తిత్వ లోపం నన్ను వదలటం లేదు. నా స్నేహితులు మరీ ముఖ్యం గా శ్రీధరగాడు తరచు అంటుంటాడు ఎందుకురా ప్రతీ దానికి అంత గింజుకుంటావు, కొన్ని కొన్ని వాటిల్ని అలా వదిలేయి అని. నిన్న కూడా ఫోన్ చేసి ఇదే మాట అంటూ నాకు నీతోనే అనుకుంటే ఈ మధ్య మీ చెల్లెలు కూడా నీలానే తయారయ్యిందిరా నాయనా అని తలపట్టుకున్నాడు.
మా అనీల్గాడు అయితే, మా మీద అలిగి నువ్వేదో మమ్మల్ని సాధిస్తున్నానని అనుకోకు, మా మీద అలిగి నిన్ను నువ్వే సాధించుకుంటావు. నిన్నేమన్నా అనాలనుకుంటే మేము నీ మొహం మీదే అంటాము అంత వరకు నీ రీడింగ్ బిట్వీన్ ది లైన్స్ బుద్దులు మానెయ్యి అని.
నేను ఎలాగూ ఇతరుల కోణంలో ఎక్కువగా ఆలోచించలేను, కానీ ఎదో సినిమాలో ఒక పాత్ర అంటుంది, నాకు ఎవరన్నా పరిచయం అవ్వగానే ముందుగా వారిలోని లోపాలు పరిచయం అవుతాయి అని గొప్పగా, ఆ గొప్ప బుద్దిని నాకు ఒక వ్యక్తి పరిచయం అవగానే కాదు, నేను పోయేదాకా కూడా స్విచ్ ఆన్ కాకుండా చూడు స్వామీ!
Leave a Reply