Apple PodcastsSpotifyGoogle Podcasts

మా వాకాటి కథల్లో, సూరి గాడు!

సూర్య ప్రసాద్ మా మెకానికల్ ఇంజనీరింగ్ తరగతి సల్మాన్ ఖాన్. కానీ ఆ ఖాన్ కన్నా మంచి పొడగరి, ఎప్పడూ ఆకర్షణీయమైన దుస్తులు ధరించి కళ కళ లాడుతూ ఉండేవాడు. వాడి ఆ పిచ్చిని ఎక్కువ చేస్తూ మా భార్గవ్ గాడు, ప్రశాంత గాడు మరియు మా అనీల్గాడులు తరగతిలో వాడి వెనక వరుసలో కూర్చొని, ఏ ఇండియా టుడే మ్యాగజిన్ లాటి వాటిని తెరిచి, వీడు వినేలా అబ్బా! ఈ మోడల్ చూడరా! అచ్చు వీడు మన సూరిగాడిలా వున్నాడురా అని వాళ్లలో వాళ్లే వీడికి కితాబులిచ్చేలా మాటలాడుకోవటం, వాడు ఆ మ్యాగజిన్ లో మోడల్స్ వుండే పేజీలను కత్తిరించుకొని, వాళ్ళలా తయారయ్యి రావటం, మా అందరికీ కడు కాలక్షేపంగాను ఉండేది. 

రావటం కొడిగినహళ్లి పాఠశాల నుండి రావటంతో చదువుల విషయంలో తెలివితేటలతో పాటు క్రమశిక్షణ కలిగివుండే వాడు. నాకు తెలుసు వాడు ప్రతీ పరీక్షకి కనీసం అరడజను మార్కర్ పెన్స్ తో వచ్చేవాడు, ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్సామినర్స్ కి హత్తుకునేలా అండర్ లైన్  చేస్తూ, ముత్యాల్లాంటి చేతి రాతతో, అబ్బా! పేపర్ రాయటం అంటే ఇలా వుండాలిరా అనిపించేలా రాసేవాడు. నిత్యం శరీర ధారుడ్యాన్ని పెంచే కసరత్తులతోను మరియు బాస్కెట్ బాల్ ఆటతోను చురుగ్గా ఉండేవాడు.

ఉండటం హాస్టల్ లో అయినా అందరు హాస్టల్ వాసుల్లాగే, మా రూమ్ ని తరచూ పావనం చేసేవాడు. నేను మరియు మా శ్రీధర గాడు అందరి వాళ్ళమవటంతో అటు డే స్కాలర్స్ తోను ఇటు హాస్టల్ వాళ్ళ దర్శనాలతో మా రూమ్ నిత్య కళ్ల్యాణం పచ్చ తోరణం లాగ ఉండేది. మీ సాఫ్ట్ వేర్  పరిభాషలో చెప్పాలంటే మా రూమ్ చాలా స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉన్నట్టు మా కాలేజీ మిత్రులకు.

అన్నట్టు మా సూరికి ఒక ఏకదారి (వన్ వే కి నా తెనిగింపు ) ప్రేమ కథ ఉండేది. మాకు రెండు సంవత్సరాలు జూనియర్ ఆ అమ్మాయి. చూడ చక్కనిది. మా కళాశాల అందరు విద్యార్థులు లాగే మా సూరి గాడు ఆ అమ్మాయి ప్రేమలో నిండా పడిపోయాడు. ప్రతి గురువారం ఒక తెల్లటి లాల్చీ పైజామా ధరించి  మా వాకాటి సాయి బాబా గుడికెళ్ళి, ఓ కొబ్బరికాయ కొట్టి, ఓ ముక్క అమ్మాయికోసం పట్టుకెళ్లి ఒక ముక్కతో మా రూమ్ కి వచ్చే వాడు. మేము తన ప్రేమని ఆటపట్టిస్తూనో లేక తెగ ఎంకరేజ్ చేస్తూనో పరోక్షంగా వాడిలో వాడి ప్రేమ పట్ల చాలా ఘాడమైన భావన కల్పించే వాళ్ళము. ఆ అమ్మాయి మాత్రం ఎవరినీ తన దరిదాపుల్లోకి రానీయటం మేము చూడలా.

అలా మా సూరికి మరియు మాకు తెలియని విషయం ఏమిటంటే ఆ అమ్మాయికి అప్పటికే పెళ్లి అయిపోయిందని, తనకి ఆ విషయం అందరికీ చెప్పుకోవటం ఇష్టం లేక దాచిందని. కానీ ఈ విషయం తెలియక మా సూరి గాడు, ఆ అమ్మాయి తిరస్కారం తో దేవదాసు అయిపోయాడు. వాడు అలా కావడానికి మేము కూడా కారణమే పరోక్షంగా అనే బాధ మాలో ఇప్పటికే వుంది. అయినా మావాడు తన చదువుని ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు. ప్రతీ సంవత్సరం డిస్టింక్షన్ తోనే ఉత్తీర్ణుడయ్యాడు.

నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా, మేము కళాశాల నుండి బయటపడిన తర్వాత కొందరం కొద్దిమందితోనే సంబంధ బాంధవ్యాలను కలిగి వున్నాము, అప్పటిలో కొందరికే ల్యాండ్ లైన్ సౌకర్యాలు ఉండటం మూలాన, ఇప్పటిలా చరవాణులు మరియు వాట్సాప్ సమూహాలు లేనందున. అలా సూరిగాడితో మాకు సంబంధాలు తెగిపోయాయి. మా స్నేహితులతో ఎవరికి వాడితో  అటుపిమ్మట మాటలు ఉన్నాయో నాకు తెలియదు. మా అనీల్గాడో లేక మా ఈశ్వరుడో చెప్పాలి, ఎందుకంటే మా బ్యాచ్ లో చాలా మంది మధ్య వీళ్లిద్దరి అనుసంధాన కర్తలు.

మా కళాశాల ప్రథముడైన మా సుబ్బూ గాడు వాడి రీసెర్చ్ నిమిత్తం ఢిల్లీ వచ్చి అక్కడే వున్న నన్ను కలిసినప్పుడు, సూరి అన్నా యూనివర్సిటీ లో సుబ్బూ ఉండగా, వాడి రూమ్ కి ఎదో ప్రవేశ పరీక్ష నిమిత్తం వచ్చాడని, వచ్చిన వాడు ఏ పరీక్షలకు వెళ్ళక ఊరంతా బలాదూర్ తిరుగుడు తిరిగి సాయంత్రానికి వచ్చే వాడని, మా సుబ్బూ అది చూసి ఓ నాలుగు రోజుల తర్వాత నిలదీయటంతో, “నన్ను సి.బి.ఐ వాళ్ళు వెంట పడి తరుముతున్నారు, వాళ్ళని తప్పించుకు తిరుగుతున్నాను”, అని అర్థం పర్థం లేకుండా మాట్లాడాడని, సుబ్బూ మరీ ఎక్కువ ఇబ్బంది పెడితే సుబ్బూ రూమ్ లోనే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని, అందుకే సుబ్బు వాడిని మంచి మాటలు చెప్పి ఇంటికి పంపించాడని నాకు చెప్పాడు. అప్పుడు నాకు కలిగింది మా సూరి మానసిక పరిస్థితి మీద సందేహం. కానీ మా జీవిత పయనం లో మేము పడిపోయాము.

మేమందరం దేశాలు  పట్టుకు తిరిగి తిరిగి చివరకు కొందరం హైద్రాబాదు లో తేలాము. మా స్నేహితుల్లో మా నారాయణకి సాంఘిక సంక్షేమం పట్ల కొంత చింత వుంది అప్పటికే. వాళ్ళ నాన్న గారి వూరిలో స్కూల్ కి సహాయం చేయటం, స్కూల్ కి కొన్ని గదులు లేక బడి పిల్లల సాంస్కృతిక వికాసం కోసం ఒక ఓపెన్ స్టేజి ని కట్టించటం లాటి పనులు చేసి వున్నాడు.

వాడు తరచు అనే వాడు, దేవుని దయ వలన మనం బాగున్నాము, కానీ మన స్నేహితులతో ఎవరు ఏ స్థితుల్లో వున్నారో మనకు తెలియదు, అందులోను అందరితో సంబంధ బాంధవ్యాలను కోల్పోయిన వారు ఖచ్చితం గా ఆర్ధికం గానో, శారీరకం గానో లేక మానసిక అనారోగ్యం తోనే బాధపడుతూ ఉండవచ్చు, వాళ్ళను మనం వెతికి పట్టుకొని, సహాయం అందించాలి అని, అట్టివారికోసం ఒక ట్రస్ట్ లాగా ఏర్పరచి, వాళ్ళ ఆరోగ్యము మరియు వాళ్ళ పిల్లల చదువులు లాటి కనీస అవసరాలు తీర్చాలి అనేవాడు.  

అందుకే మేము మా నారాయణని మా బ్యాచ్ కల్లా మంచి హృదయమున్న వ్యక్తిగా గౌరవిస్తాము. మాలో కొందరిమి వాడిని నిరుత్సాహపరిచే వారము, మిగిలిన స్నేహితుల దగ్గర నుండి డబ్బులు కూడ పెట్టటం, ట్రస్ట్ ఏర్పరచటం మరియు లెక్కలు గట్రా చూపుతూ నిర్హహించటం చాలా సమయం మరియు శ్రమతో కూడిన పని అని.

మా కళాశాల ప్రతీ సంవత్సరం పూర్వ విద్యార్థులు సమ్మేళనం నిర్వహిస్తుంది, ఎక్కువ సార్లు హైద్రాబాదులోనే. అలా ఒక సంవత్సరం పాల్గొన్న మాకు భరత్ అనే స్నేహితుడు, సూరిని ఒక సారి హైద్రాబాదులోని సంజీవ రెడ్డి నగర్ లో,  చూశానని, వాడి పరిస్థితి కడు దయనీయంగా ఉందని చెప్పటం తో, మా నారాయణకు వెళ్లి వాడిని చూసి వాడి పరిస్థితి  మెరుగు పరచాలనే పూనకం కలిగింది. కానీ మరల ఎవరి పనులలో వాళ్ళం మునిగిపోయి సూరీని కలవాలనే  కోరికని వాయిదా వేస్తూ పోయాము.

ఏమయిందో ఏమో కానీ ఒకరోజు ఉదయాన మా నారాయణుడికి జ్ఞానోదయమయ్యి, మా అనీల్గాడికి ఫోన్ చేసి వాహనం వేసుకొని వచ్చెయ్యరా మనం ఈరోజే గిద్దలూరు వెళ్తున్నాము అనే హుకుమ్ జారీ చేయటంతో మా అనీల్గాడు మారు మాట్లాడకుండా బయల్దేరేసాడు. వాళ్ళిద్దరికీ సూరిగాడు గిద్దలూరు లో ఉంటాడు, వాడికి ఒక అక్కయును మరి ఇద్దరు అన్నలున్ను అని మాత్రమే తెలుసు. గతంలో మా అనీల్గాడు, సూరి వాళ్ళ అక్క గారు కర్నూల్ లో ఉండగా సూరితో పాటు ఒక రెండు రోజులు వాళ్ళ ఇంట్లో మకాం వేసి వున్నాడు. అదీ కాక సూరి వాళ్ళ నాన్నగారు సి.ఐ గా చేసి వున్నారు కాబట్టి ఆచూకీ తెలుసుకోలేక పోతామా అన్న ధీమా వీళ్లది.

మా అనీల్గాడితో చాలా సౌలభ్యమేమిటి అంటే దారి పొడుగునా వాగుతూ మా నారాయణకు విసుగు ఎక్కువ చేస్తూ డ్రైవింగ్ చేసే తప్పుడు ఏమన్నా కునుకు వస్తే దాన్ని ఎగరకొడుతూ ఉంటాడు. మా అనీల్గాడి కథలు వినాలంటే మీరు ఎప్పుడన్నా లాంగ్ డ్రైవ్ వెళ్ళేటపుడు వాడిని నావిగేటర్ గా పట్టకెళ్ళండి. నన్నైతే ఏరా ఇక్కడనుండి ఎలా వెళ్ళాలి అంటే, ముండా తిరిగి నేను చెప్పే వరకూ ముందుకెల్తూనే ఉండాలీ మధ్య మధ్యలో నేను చెప్పే సోధికి అడ్డు రాకు అని దబాయిస్తాడు, కానీ మా నారాయణతో కొంచెం జాగ్రత్తగానే ఉంటాడు మావోడు.

కానీ గిద్దలూరు వెళ్లిన మా వాళ్ళ పని అంత సులభo కాలా. మా సూరిగాడు, లేక వాళ్ళ నాన్న గారు లేక వాళ్ళ అన్నల పోబిడి వీళ్ళు చెప్పగా విని గిద్దలూరు జనాలు అట్టి సదరు జనాలు ఈ వూరిలో ఎప్పుడూ నివసించి ఉండలేదని తేల్చేశారు. కానీ వీళ్ళకి సూరి వాళ్ళ నాన్న గారు సి.ఐ గా చేశారు అని తెలుసు గదా అందుకే నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అక్కడ కూడ వీళ్ళు ఆయన పేరు, పని చేసిన సంవత్సరం లాటి తదితర విషయాలు చెప్పలేక పోవటం తో పెద్దగా సహాయం దొరకలేదు.

వీళ్ళకి ఆయన సి.ఐ గా చేరక ముందు ఎక్స్ ఆర్మీ మాన్ అని కూడా గుర్తు ఉండటం తో, అట్టి ఒక వ్యక్తి వూరికి దూరం గానో లేక పక్కన వుండే ఒక పల్లెలోనో వుండే వారు అని చెప్పటం తో అక్కడికి హుటా హుటిన పయనమై వెళ్లారు, అలా వెళ్లిన వారిని నిరాశ పరుస్తూ వాళ్లకి ఆయన ఆచూకీ కానీ, మా సూరి ఆచూకీ కానీ దొరక లేదు. వీళ్ళు మరలా పోలీస్ స్టేషన్ నే ఆశ్రయించారు, వీళ్ళు తపన చూసి ఆ పోలీస్ స్టేషన్ లో వుండే ఒక రైటర్ అనుకుంటా, వీళ్ళని, ఆ వూరిలో వుండే ప్రింటింగ్ ప్రెస్ పరిసరాలలో వాకబు చేయమని సలహా ఇచ్చాడు.

వీళ్ళిద్దరూ పోలోమని ఆయన చెప్పిన పరిసరాలలో వాకబు చేయగా మరలా నిరాశే మిగిలింది. ఇక విసిగిపోయి వీళ్ళిద్దరూ ఆ పరిసరాలలో వున్న ఓ టీ కొట్టుకెళ్ళి టీ తాగుతుండగా వీళ్ళు ఆ పరిసరాలంత కలియపడి తిరగటం చూసిన ఆ ప్రింటింగ్  ప్రెస్ లో పని చేసే ఆయన వీళ్ళని ఏ పని మీద వచ్చారు అని అడగటం, వీళ్లిద్దరు వీళ్ళు పడుతున్న తిప్పలన్నీ ఏకరువు పెట్టటం, అట్టి అడిగిన ఆయనకి సూరి వాళ్ళ కుటుంబం గురుంచి తెలియటంతో, సూరి వాళ్ళ ఇల్లు ఆచూకీ చెప్పటం, దానికి వీళ్ళు ఊపిరి పీల్చుకోవటం వెంటనే జరిగిపోయాయి.

అలా సూరి వాళ్ళ ఇంటికి వెళ్లిన వీళ్లకు వాళ్ళ చిన్న అన్నగారు కనపడ్డారు. మన సూరి జాడ లేదు, ఎందుకంటే అప్పుడు వాడికి ఉదయాన్నే  ఏమన్నా దొరికితే తినటం, ఊరి మీద పడటం, ఎప్పటికో ఇంటికి చేరుకోవటం లాటి వ్యాపకాలు తప్ప చేయడానికి ఏమీ లేవని. వాడు వచ్చే లోపల వీళ్ళు వాళ్ళ అన్నని అసలు ఇప్పటి వరకూ ఏమి జరిగిందో చెప్పమన్నారు.

ఆయన చెప్పటం ఏమిటంటే కాలేజీ నుండి వచ్చిన సూరి కొన్ని రోజులు బాగానే వున్నదని, ఆ తరువాత క్రమంగా మానసిక సంతులనం కోల్పోతూ వచ్చాడని, యీ పరిస్థితి సూరి వాళ్ళ పెద్ద అన్నకు కూడా ఉందని. వాళ్ళ అమ్మ గారు పోయినా, వాళ్ళ నాన్న గారు ఉన్నంత వరకూ సూరిని బాగానే చూసుకున్నారని, ఆయన కూడా పోవటం తో మరియు ఈయన అంటే సూరి వాళ్ళ చిన్నన్న గారి మీదే అన్నీ బాధ్యతలు పడ్డాయని, ఈయన ఆర్ధిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే అవటం తో సూరిని వైద్యుల వద్ద చూపటం గాని మరియు మందులు క్రమం తప్పకుండా వాడటం కూడా జరగలేదని, ఇక వాడి పరిస్థితి నయమవుతుందో లేదో అని.

వీళ్ళు మాటల్లో ఉండగానే వచ్చాడు సూరి, వాడి వాలకం చూసిన వీళ్ళకి నోట మాటలేదు, కానీ గుడ్డిలో మెల్ల వాడు వీళ్ళని చూడగానే గుర్తు పట్టటం, వీళ్ళకి కొండంత భారం దించుతూ మాతో వస్తావా అనగానే సంతోషంగా వాడు మరియు వాళ్ళ అన్నగారు ఒప్పుకోవటం జరిగిపోయాయి.

కానీ ఇక్కడ వాడికి సంబందించిన వైద్యుడిని మరియు ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ని చూడాల్సిన బాధ్యత ఉండటం తో, వాడికి మరియు వాళ్ళ అన్నగారికి, మేము యీ ఏర్పాట్లన్నీ చేసి మీకు కబురు పెడతాము అని చెప్పి నేరుగా హైద్రాబాదులోని వాళ్ళ అక్కగారి ఇంటికెళ్లి, ఆవిడ అనుమతి కూడా సంపాదించారు, వాడిని మా సంరక్షణలోకి తీసుకోవడానికి.

వాళ్ళ అక్కగారు కూడా సంతోషంగా ఒప్పుకోవటం తో వాళ్ళ పని సులువు అయ్యింది. యీ అనుమతులన్నీ తప్పని సరి, ఎందుకంటే వాడి స్థితి బాగాలేదు, వాడిని తీసుకొచ్చి మేము ఒక సెంటర్ లో ఉంచితే, వాడు ఆ సెంటర్ వాళ్ళ కళ్ళు కప్పి పారిపోతే, వాళ్ళ కుటుంబ సభ్యులు వాడి మానాన వాడు బతికేవాడు మా దగ్గర, మీరేదో ఉద్ధరిస్తామంటే మీ వెంట పంపాము, ఇప్పుడు చూడు మనిషి ఆచూకీయే లేదు అని ఆ తర్వాత మమ్మల్ని నిందించకుండా. 

యీ లోపల మా అనీల్గాడు, ఒక వైద్యుడిని చూడటం మరియు ఆ వైద్యుడికి సంబందించిన రీహాబిలిటేషన్ సెంటర్ తదితర  ఏర్పాట్లు చేసెయ్యటం తో, ఒక పది రోజుల తర్వాత సూరిని వెంట బెట్టుకొని వాళ్ళ అన్నగారు మియాపూర్ లోని మా ఇంటికి వచ్చేశారు. మేమంతా నిజంగా భయపడ్డాము, వాడేమన్నా వాడు అనుకున్నది జరక్కపోతే వైల్డ్ గా అవుతాడేమో, వాడిని ఎలా కంట్రోల్ చేయాలి లాటి సందేహాలతో. కానీ మా సూరి మాతో ఒక గంగి గోవులానే వున్నాడు, వాడికి మా స్నేహితులందరూ పేరు పేరునా గుర్తు, కాక పోతే వాడికై  వాడు మాటలాడాడు, కానీ మేము మాటలాడిస్తే సమాధానాలు చక్కగా గుర్తు తెచ్చుకుంటాడు.

అలా హైదెరాబాదులో వుండే స్నేహితులందరము వెంట ఉంది వాడిని రీహాబిలిటేషన్ సెంటర్ లో చేర్చాము. అక్కడ డాక్టర్ చలవతో, మరియు నర్సుల సేవలతో వాడు కోలుకున్నాడు. దాదాపు ఒక సంవత్సరమున్నాడు వాడు అక్కడ. ఆ డాక్టర్ మాక్కూడా వాడి స్థితి గురుంచి ఎక్సపెక్టషన్ సెట్ చేసాడు. మేము అనుకున్నంత విపరీత మైన మార్పు ఇక రాదనీ, వాడి మందులు వాడు వేసుకుంటూ వాడి జాగ్రత్తలో వాడు వుండే అంత  మార్పు మాత్రమే వస్తుందని. మేము అప్పుడప్పుడు ఎవరో ఒకరం వెళ్లి వాడిని చూసి వస్తూ, వాడికి కావాల్సిన బట్టలు (వాడికి చాలా ప్రేమ మంచి బట్టలు వేసుకోవటం), పళ్ళు, స్నాక్స్ లాటి తదితరములు ఇస్తూ వాడికి మాటలు చెబుతూ వచ్చేవాళ్ళం. వేరే వూర్లో వున్న స్నేహితులు కూడా కొందరు వాడికోసమే వచ్చి, కొందరు ఏమన్నా పనులుంటే వచ్చి వాడిని కలవటం ఒక నియమంగా పెట్టుకున్నారు.

నారాయణకు మా సూరిని కేవలం వాడి మందులు వాడు వేసుకొనే వరకే బాగు పరచటం తో ఆగిపోవటం ఇష్టం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా సూరి చేత ఏదన్న పని చేయించాలనే ఆలోచన, అలా చేయటం వలెనే వాడు ఇంకా మెరుగు అవుతాడు అన్నది వాడి వాదన.  కొన్నాళ్ళయ్యాకా వాడి పరిస్థితిలో మార్పు వచ్చిందని నమ్మకం కుదిరాక, వాడికి ఒక ఆటో ఏర్పాటు చేసి, వాడు ఒక నాలుగు గంటలు మా అనీల్గాడి సంస్థలో పని చేసే విధం గా ఏర్పాట్లు జరిగాయి. అలా దాదాపు ఒక సంవత్సరం గడిచాక, మా నారాయణ వాడిని తన భవన నిర్మాణ సంస్థలో వస్తు పర్యవేక్షకునిగా నియమించాడు. ఆ పని ముగియటంతో మా నారాయణ కి ఆప్తుడైన మూర్తి గారి  ట్రాన్స్పోర్టేషన్  సంస్థ కి చెంది గ్యారేజీ లో పని చేస్తున్నాడు మా సూరి.

కష్టపడి చదువుకుని, ఇంజినీరింగ్ లో అన్నీ సంవత్సరాలు డిస్టింక్షన్ తెచ్చుకొని, ఎంతో చక్కని భవిష్యత్తు ఉండాల్సిన మా సూరి, వాడి చేతిలో లేని జబ్బుకు మరియు పరిస్థితులకు బలై పోయి, ఒక కుటుంబం అంటూ లేకుండా ఒంటరయ్యాడు అనే బాధ మా స్నేహితులకు.

నా ఉద్దేశ్యం లో సూరీ విషయం మేము తెలుసుకొని ఏదన్న చేసే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ ఒక సందర్భంలో సూరి వాళ్ళ డాక్టర్ మాతో చెప్పినట్టు మనలో లేక మన చుట్టు పక్కల వుండే వాళ్లలో, మెదడు అనేది కూడా శరీరంలో భాగమేనని, దానికీ మన మిగతా శరీర అవయవాల్లాగే రుగ్మతలు వస్తాయని, వస్తే దానిని సరి చేయవచ్చని, అలా సరి చేసే డాక్టర్ లు లేక మందులు ఉన్నాయని ఎంత మందికి అవగాహన వుంది, ఒక వేళ అవగాహన వున్నా సందేహించకుండా సహాయం పొందాలన్న ఆలోచన ఎంత మందికి ఉంటుంది.

అలాగే మానసిక సమస్యల మీద మన ఆలోచనల్లో సమూలంగా మార్పు రావాలి మరియు అట్టి సమస్యలతో సతతమయ్యేవారికి వారికి కుటుంబ సభ్యులు మరియు వారి స్నేహితుల సహకారం చాలా లభించాలి.

మా నారాయణ, అనీల్గాడిల ఈ ప్రయత్నం, సఫలవ్వటమే కాకుండా మా స్నేహ బృందం అటు పిమ్మట పలు మంచి పనులు చేయడానికి నాందీ పలికింది. వాటి వివరాలు తరువాయి భాగంలో.

“మా వాకాటి కథల్లో, సూరి గాడు!”‌కి ఒక స్పందన

Leave a Reply