Apple PodcastsSpotifyGoogle Podcasts

మా బడి మిత్రుని కబుర్లు!

నా కథలు ఎక్కువగా నా బాల్యము, స్నేహితులు మరియు కుటుంబము ఇతివృత్తము గా సాగుతుంటాయి. ఈ మధ్య ఎక్కువగా కాలేజీ స్నేహితుల గురించే సాగ దీసి మిమ్మల్ని విసిగించాను. ఈ సారి మార్పుగా నా చిన్న నాటి స్నేహితుడి గురుంచి రాయాలనుకుంటున్నాను. వాడు ప్రస్తుతము అమెరికా సంయుక్త రాష్ట్రము లోని ఉత్తర కరోలినా లో ఉద్యోగపర్వం వెలగపెడుతున్నాడు

పేరు దాడి ప్రతాప్. ఏ కొత్త విషయం కనిపించినా నేర్చుకోవడానికి వాటి మీదకి దాడి చేసేస్తాడు. మా అమ్మ, మా పెద్దమ్మ కూతురైన మా బాడుగ అక్క మరియు ప్రతాప్ వాళ్ళ అమ్మ గార్లు కావలిలో పి.యూ.సి చదివారు. వాళ్ళ అమ్మగారిది అల్లూరు. అప్పట్లో కావలి చదువులకు చాలా ప్రసిద్ధి. విశ్వోదయ లాటి బడులతో, జవహరి భారతి లాటి కళాశాలలో చదవడానికి చుట్టుపక్కల వున్న ఊర్ల నుండి కావలి చేరుకొనే వారు.

మా అమ్మ వాళ్ళు ఒకప్పుడు సహాధ్యాయులైనా నేను వాడిని తొలిసారి చూసింది మాత్రం, నేను రాజుపాలెంలో బస్సు ఎక్కి ఉలవపాళ్లకు వెళ్తుండగా వాడు అదే బస్సులో నెల్లూరు నుండి కమ్మపాలెం వస్తున్నాడు. ఆ ప్రయాణమప్పటికి మేము చాలా పిల్ల పీసులం అయినా మా అమ్మ వాళ్ళు మమ్మల్ని వాళ్లకు రక్షణగా తీసుకెళ్తున్నారు. వాళ్ళు వాళ్ళ ఊరిలో దిగుతూ మాకు సీట్ ఇవ్వటం నాకు ఇంకా గుర్తు.

ఆ తరువాత మా నాన్న మరియు వాళ్ళ నాన్న కలిసి రైల్వే గుత్తే దారులుగా అవతారమెత్తారు. మా నాన్న చేసే రైల్వే పనులను పర్యవేక్షణ చేసే ఇంజనీర్ ప్రతాప్ వాళ్ళ ఇంట్లో బాడుగకు ఉండే వారు, అలా ఆ ఇంజినీరు, ప్రతాప్ వాళ్ళ నాన్న మరియు మా నాన్న పార్టనర్స్ గా అవతారమెత్తారు. అలా మా అమ్మ వాళ్ళ స్నేహాలు మరలా పునరుజ్జీవనం చెందాయి.

ఒక రోజు మా పేద పుత్తేడు జిల్లా పరిషత్ పాఠశాలలో నా మానాన నేను మా లెక్కల అయ్యోరి చేతిలో వొంగో పెట్టిచ్చుకుని గుద్దులు గుద్దిచ్చుకుంటుండగా మా వోడు ఎక్స్-క్యూస్ మీ అంటూ ఎంట్రీ ఇచ్చాడు. మా అయ్యోరు మహా గట్టివారు, నువ్వు ఎంత పీక్కున్నా నేను వీడిని తప్ప వోల్ తరగతిని వదులుతాను అని వాడిని తరిమేయ్యటం తో మా వోడు బడి వదిలిన దాకా నాకోసం బయట కాసుక్కూర్చోని వున్నాడు. నీ పాసుగూలా ఇలా చెప్పా పెట్టకుండా నెల్లూరి నుండి వచ్చెయ్యటమేనా, ముందే చెబితే మా అయ్యోరి చేతిలో పడకుండా మా ఏర్పాటులేదో చేసుకునే వాడిని కదా అనుకుంటూ ఇంటి దారి పట్టాము.

నా కన్నా వాడు రెండేళ్లు పెద్ద, కానీ ఆ కిలోగ్రాములు ఈ కిలోగ్రాములు అని ఆంగ్ల మాధ్యమం లో చదివి నా కోసం ఆగిపోయాడు. ఇద్దరం ఇప్పుడు ఒకటే తరగతి కాకపోతే వాడు ఎల్.సి.ఎం మరియు  జి.సి.డి అంటాడు నేను క.సా.గు మరియు గ.సా.ప్ర అంటా అంతే తేడా.

అలా వచ్చిన వాడు ఓ వారం వుండిపోయాడు మా ఉప్పలపాటిలో. మా స్నేహితులకి వాడు చెప్పే నెల్లూరు కథలు చాలా నచ్చేశాయి, మాటి మాటికీ వాడనే మా నెల్లూరులో ఐతేనా అంటూ చెప్పటం. రాత్రి అయితే వాడు కథా, మాటలు, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహించి చెప్పే ఎక్సార్సిస్ట్ కథలు, నేను మరియు నా స్నేహితుల మందరిమి ఆరు బయట మంచాలు వేసుకొని కెవ్వు కెవ్వు మంటూ వినటం, మా పెద్దోళ్ల చేత తిట్లు తినటం ఆ దిక్కుమాలిన కథలు వినటం ఎందుకు మమ్మల్ని మీరు ఉత్సలకు పోవడానికి కూడా లేపటం ఎందుకు అని.

మా వాడైతే ఆ సినిమాని థియేటర్ లో ఒంటరిగా చూస్తామని పందెం కట్టి గుండె ఆగి చచ్చిపోయినోళ్లు బొచ్చెడు మంది అని చెప్పే వాడు. మా పల్లెలో కేవలం ఆదివారాలు మాత్రమే ఇళ్లల్లో దోసెలు చేసే వారు. మా అమ్మ చేసిన ఎర్ర కారమేసుకొని హా! హా! అంటూ ఓ పది అయినా లాగించేసే వాళ్ళం. మా వాడిది చాలా ఇంజనీరింగ్ బుర్ర లే, మేము ఇటుక రాళ్లనే బస్సులుగా భావించి తోసుకుంటూ ఆడుతుంటే వాడు వాటికి ఇసుకతో రాంపులు మరియు సొరంగాలు తయారు చేసే వాడు.  

నేను కూడా వీడి వెంట పడి నెల్లూరు వెళ్లే వాడిని. మాకు ఉప్పలపాటిలో బ్రేక్ ఫాస్ట్ రోజూ  సద్దెన్నం మరియు ఆదివారం మాత్రమే దోసెలు. నెల్లూరులో ఎక్కడ బడితే అక్కడ దోశె అంగడులే, రూపాయికి పది దోసెలు. ఇద్దరం వాళ్ళ ఇంట్లో రూపాయ తీసుకొని అంగడికి వెళ్లే వాళ్ళం, నాకేమో అక్కడ అందరి ముందు తినటం కొత్తగా మరియు సిగ్గుగా ఉండేది, మా వాడేమో ఇక్కడే తింటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ అడగొచ్చు అని అక్కడే తినిపిచ్చే వాడు. ఆపమ్ అనే పేరు విన్నది నేను అక్కడే.

వీడికి మేము ఆరు ఏడూ తరగతుల్లో ఉండగానే క్రికెట్ పిచ్చి చాలా ముదిరి ఉండేది. పుర చేయి వాటం. దారిలో నడుస్తూ నడుస్తూ ఎడం చేతిని గిర్రున బౌలింగ్ చేసిన ఆక్షన్ లో, లేక పోతే ముందుకి రెండడుగులు గెంతి చేతుల్ని బాట్ మాదిరిగా పెట్టి బాల్ ని డిఫెన్స్ చేసే పోజ్  పెట్టె వాడు. నాకైతే వాడు చేతిని గిర్రున తిప్పుతుంటే వెనకా ముందులా ఎవరన్నా వస్తున్నారా అని కాపలా కాయటానికే సరిపోయేది పుణ్యకాలం. అలా దవడలు పగల కొట్టిన సందర్భాలు కూడా వున్నాయి. అదేమన్నా అంటే ప్లేయర్ కి ఎప్పుడూ ఆ మెంటల్ ఇమాజినేషన్  ఉండాలి అనే వాడు.

వీళ్ళ నాన్న గారికి తండల వ్యాపారం ఉండేది. ఈ వ్యాపారం లో మా నెల్లూరోళ్లు చాలా ప్రసిద్ధి. ఉదాహరణకి చిన్న చితకా వ్యాపారులకు 1000 రూపాయలు అప్పు కావాలనుకో ఈ వ్యాపారుల వద్దకు వస్తారు, అప్పుడు వీరు ముందే 100 రూపాయలు వడ్డీ గా  పట్టుకొని 900  ఇస్తారు, ఆ వ్యాపారులు ఆ 900 రూపాయలను, నెల రోజులలో రోజుకి ౩౦ రూపాయల వంతున తీర్చెయ్యాలి.

ఎన్ని రోజులు లేక ఎంత వడ్డీ అనేది వ్యక్తిని బట్టి, అమౌంట్ ని బట్టి మారుతుంది. ఏ రోజు డబ్బులు ఆ రోజు వసూలు  చేయటాన్ని కలెక్షన్ అనే వాళ్ళు తండల వ్యాపారులు. నేను, వీడు సాయంత్ర మయ్యే సరికి ఓ సైకిల్ వేసుకొని కలెక్షన్ కి వెళ్లే వాళ్ళము. ఓ బేకరీ షాప్ కో, మంగలి షాప్ కో లేక మిఠాయి బండి వద్దకు వెళ్లి, కలెక్షన్ తీసుకొని, వాళ్ళతో మా పాకెట్ బుక్ లో సంతకం చేయించుకొని, మేము వాళ్ళ పాకెట్ బుక్ లో సంతకం చేయటంతో ఆ రోజుకి కలెక్షన్ ముగిసేది.

అటు పిమ్మట మా కుటుంబం నేను ఎనిమిదవ తరగతికి రాగానే నెల్లూరుకు వలస వచ్చేసింది. మా నివాసం వీడి ఇంటికి దగ్గరలోనే వీడి చిన మేనత్తకు చెంది ఒక అగ్గిపెట్టెల్లాటి నివాస సముదాయాల్లో ఒక ఆగి పెట్టె.  వీడి ఇల్లు నాలుగు పోర్షన్ ల సముదాయం, ఒక పోర్షన్ లో వీళ్లు ఉంటూ మిగిలినవి అద్దెకు ఇచ్చారు. అన్నీ ఇళ్లలో కలిపి పిల్ల గ్యాంగ్ బాగానే ఉండేది, అదీ కాక మాతో వీళ్ళ ఫామిలీ ఫ్రెండ్స్ కి చెందిన పిల్ల కాయలు కూడా చేరే వారు.

అట్టి ఫామిలీ ఫ్రెండ్స్ లో మా నెల్లూరులోని కనక మహల్ సినిమా హాలు యజమానుల అన్నదమ్ములలో ఒకతను ఉండటం తో మా పిల్ల గ్యాంగ్ కి కనక మహల్, కొత్త హాలు, వినాయక, శ్రీనివాస మహల్ మరియు విజయ మహల్ లాటి తొట్టి హాల్స్ లో సినిమాలు ఫ్రీ. అందరం కట్టకలుసుకొని అడిగితే ఆయన పాపం మాకు సీట్స్ ఆరెంజ్ చేసే వారు.

నేను ఎనిమిదవ తరగతి సంతపేట లోనే వున్నప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలలో చేరాను మా అక్క నెల్లూరులో కన్యకలు ఆసుపత్రి పక్కెనే వున్న అమ్మగార్ల బడి అనబడే సేంట్ జోసెఫ్ పాఠశాలలో చేరింది. మా బడిలోనే ఆ సంవత్సరమే ఆంగ్ల మాధ్యమం ప్రారంభించటం తో మావాడు కూడా మాతో పాటు ఎనిమిదో తరగతిలో చేరిపోయాడు. అప్పట్లో మా బడిలో ఆంగ్ల మాధ్యమ పిల్లకాయలు అంటే, మా ఇంజనీరింగ్ కళాశాలలో హైద్రాబాదోడి మాదిరి ప్రత్యేకమబ్బా.

మా వాడి విశ్వరూపం మా బడిలో చేరాక ఇంకా ఎక్కువగా చూసా. వీడు కలిబెట్టని ఆట లేదు. క్రికెట్, బాల్ బాడ్మింటన్, లాంగ్ జంప్, హై జంప్ లాటి ఆటల అన్నిటిలోను వీడే. వీడి బౌలింగ్ లో ఎవరన్నా ఫోర్ బాదితే, గ్రేట్ షాట్ అనో, గుడ్ జాబ్ అనో లేక కీప్ ఇట్ అప్ అనో అవతల వాడి ప్రతిభని పొగిడి వీడి చచ్చు బౌలింగ్ ని కవర్ చేసుకొనే వాడు. అలాగే బాల్ బాడ్మింటన్ లో సెంటర్ ఆటగాడిగా అవతారం ఎత్తి ముందోడు లేక వెనకోడు కొట్టాల్సిన బాల్స్ కూడా లీవ్ ఇట్ లీవ్ ఇట్ అంటూ ప్రయత్నించి, నేల పాలు చేసి, ఈజీ ఈజీ అంటూ కవర్ చేసే వాడు. అలా వుండే మా వాడి ప్రభని మేము తట్టుకోలేక అప్పుడప్పుడు వీడికి వ్యతిరేకం గా మేము గ్రూపులు కట్టే వాళ్ళము.

వాళ్ళ నాన్న గారికి వాడంటే చాలా ప్రేమ. కానీ నా దగ్గర వాడిని, “ఒరే! కిరణా, వాడుత్త ఎదవరా, వాడితో చేరి నువ్వు కూడా బలాదూర్ తిరుగుతున్నావు” అనేవారు ఉత్తుత్తినే. నేను లేదు మామ వాడు చాలా మంచోడు, భలే చదువుతాడు, మా అయ్యోరులoదరికీ వాడంటే చాలా ఇష్టం అని పొగుడుతుంటే, పుత్రోత్సాహముతో పొంగిపోయేవారు. అలా నాకు వాడిని భట్రాజులా పొగిడే మహద్భాగ్యం వారానికో సారన్నా కల్పించే వారు ఆయన.

ఒక రోజు నేను మరియు వాడి ఆంగ్ల మాధ్యమ సహాధ్యాయుడైన ప్రసన్న కలసి వస్తున్నాము. ప్రతాప్ వాళ్ళ నాన్న గారు వాళ్ళ ఇంటి ముందర ఆపేసారు, వాడేడిరా అని. మామా వాడేదో ఆటల్లో వుండి ఉంటాడు అందుకని నేను వాడికోసం చూడకుండా వచ్చేసా అని చెప్పా. ఆయన ధోరణిలో మరలా ఎత్తుకున్నారు, “వాడు ఎదవరా!, ఎప్పుడూ ఆటలే వాడికి, చదువూ సంధ్య బొత్తి లేకుండా పోయాయి, పళ్ళు కూడా సరిగా తోమడు, స్నానం కూడా వాళ్ళ అమ్మ తరిమితేనే చేస్తాడు” అంటూ.

నేను మరలా ఎత్తుకున్నా, లేదు మామ వాడు చాలా మంచోడు, భలే చదువుతాడు, ఆటల్లో కూడా నెంబర్ వన్ అంటూ, ఆయనకి ఆ పొగడ్తలు చాలితేనా, ఇంకా చెలరేగిపోయారు. ఇంతలో నేను వద్దు వద్దు అని కనుసైగ చేస్తున్నా మా ప్రసన్న గాడు, అవును అంకుల్ మీ వాడు వుత్త ఎదవే, నాతో ఈరోజు చాలా పెద్ద గొడవేసుకున్నాడు అనవసరంగా అంటూ చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ మా ప్రతాప్ వాళ్ళ నాన్నగారి వెంట పడాల్సి వచ్చింది, లేదు మామ వాడు చాలా మంచోడు అంటూ నా అరిగిపోయిన పాత పాటని మల్లి మల్లి వేస్తూ.

ఆదివారమైతే ఇంట్లో వాళ్ళ కళ్ళు కప్పి చల్లగా జారుకునే వాళ్ళము. ఎక్కడకి వెళ్లాలో మాకొక నిర్దుష్ట ప్రణాళిక ఉండేది కాదు. ఎవరన్నా స్నేహితుల ఇళ్లల్లో దూరదర్శిని ఉంటే అక్కడికో, లేక వాడి బాట్ పట్టుకొని గ్రౌండ్ కో, లేక పోతే హిందూ పేపర్ ఏజెన్సీ వున్న మా స్నేహితుడి ఇంటికో. అక్కడ వాడు హిందూ పేపర్, స్పోర్ట్స్ స్టార్ చదివితే, నేను బాల మిత్ర మరియు బుజ్జాయి చదివేసేవాడిని. అప్పడుడప్పుడు లీలామహల్ పక్కనున్న మెక్లీన్స్ క్లబ్ లో తెర మీద పాత సినిమాలు వేయటం కనిపెట్టిన మేము అక్కడే మాయబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ లాటి సినిమా లు కూడా చూసే వాళ్ళము.

నాకు గ్రౌండ్ కి వెళ్లి వీడితో క్రికెట్ ఆడే పిచ్చి ఉండేది కానీ క్రికెట్ వీక్షించే పిచ్చి ఉండేది కాదు. నేను వాడు క్రికెట్ చూస్తుంటే  ఇంటి కెళదాం ఇంటి కెళదాం అని విసిగిస్తుంటే నాకు దగ్గర వుండి   మియాందాద్ మరియు  వెంగసర్కార్ లు ఎంతటి డిపెండబుల్ ఆటగాళ్ళో, డెస్మండ్ హెయిన్స్ మరియు గార్డన్ గ్రీనిడ్జ్ లు ఎంతటి విలువైన ఓపెనర్ లో, వివ్ రిచర్డ్స్ ఎంతటి విధ్వంస కారుడో చెబుతూ నాకూ అంటించేసాడు ఆ పిచ్చిని. నన్ను ఇమ్రాన్ ఖాన్ అంటూ పొగుడుతూ నా చేత గంటలు గంటలు బంతులు వేయించు కుంటూ బ్యాటింగ్ అంతా వాడే ఆడేసేవాడు.

ఇలా ఆటలు పాటలు పాడి చివరకు పరీక్షలు వచ్చే సమయానికి మా ఇంటి మీద ఓ టెంట్ వేసే వాళ్ళం. మాతో పాటు మా తరగతులకు చెంది వేరే వేరే బడుల్లో చదివే వారు మా వీధిలో ఓ ఏడెనిమిది మంది వరకూ వుండే వారు. వారందరం మిద్దె మీద టెంట్ లో చదివే వాళ్ళం. మా వీధిలో వాళ్లకి నేను మరియు వాడూ తెగ పొడిచేస్తాము పదవ తరగతిలో అని పెద్ద నమ్మకం. పదవ తరగతి ఫలితాలు వచ్చాక, వాడికి 434 ,  నాకు 432 మరియు అందరూ నిదానం, బట్టీ పట్టి చదువుతుంది అనే మా అక్కకి 436 వచ్చాయి.

అలా మా ప్రతిభ బయట పడటంతో మేము ఇంటర్ లో చాలా బుద్దిగా చదవాలని నిశ్చయించాము. కానీ తోకలు మాత్రమే తక్కువైన మాకు, తోక కూడా వుండే అనీల్గాడు కలిసాడు. అలా మేము ముగ్గురం, చదువు చూడకు, చదువు వినకు, చదువు గురుంచి మాటాడకు అనే గాంధీ గారి కోతులమయ్యాము.  నా ఇంటర్మీడియట్ చదువు అయ్యేదాకా నాకు చాలా సన్నిహిత మిత్రుడు, మార్గదర్శి మరియు గురు సమానుడు వీడు.

“మా బడి మిత్రుని కబుర్లు!” కి 7 స్పందనలు

 1. చైతన్య(చైతు) Avatar
  చైతన్య(చైతు)

  బడి మిత్రుడికి కూడా బ్లాగులో గుడి కట్టినట్టు వుంది… మీ వర్ణన…క్షమించాలి వర్ణన కన్నా జ్ఞప్తికి ఉంచుకొని చెప్పిన సంగతులు నిజంగా అభినందించదగ్గవి…😜👌

  1. ధన్యవాదములండీ చైతన్య గారు మీ సమయానికి. నా స్నేహితుల గూర్చి రాయటం నాకు కడు సంతోషమండీ.

 2. Kada chaduvutunte bale navvu vachhindi. Chaala baaga raasaaru really hats off. Ela inni gnapakalu gurtupettukuni raastunnaru … mee gnapakalanni so sweet harsha

 3. చాలా బాగా రాశారు. తెగ నవ్వొచ్చింది.

  1. సంతోషమండీ వీణ గారు. నా మిగతా కథలు కూడా చదవండి please.

 4. చదివేశానండీ అన్నీ ఏకబిగిన.
  యాదృచ్ఛికంగా మీ వాసన్న నిన్న ఈనాడు పేపరులో కనపడ్డారు

  1. సంతోషమండీ వీణ గారు అన్నీ కథలు చదివేసినందులకు. మీరు పరిశోధనలో మా అనీల్గాడిని మించిపోయారండి!

Leave a Reply