Apple PodcastsSpotifyGoogle Podcasts

ఉజ్జ్వల మైత్రి అనుబంధం కి నాంది!

మా సూరిని తీసుకు రావటం, వాడిని రీహాబిలిటేషన్ సెంటర్ లో చేర్చటం మరియు వాడు కూడా బుద్ధిగా చికిత్సకు సహకరిస్తూ వుండడటంతో మా మిత్రబృందపు ఆత్మ విశ్వాసం ఇనుమడించింది, మనము కూడా అనుకున్నపనులు అనుకున్నట్టుగా సాధించగలం అని.

ఈ లోపల మాతో వాకాటిలో చదివిన ఇంకో మిత్రుని అమ్మగారికి శస్త్ర చికిత్స అవసరం అయ్యింది, మా వాడు కూడా ఉద్యోగం మారే సంధికాలంలో ఉండటంతో ఇన్సూరెన్స్ ద్వారా అందవలసిన సహాయం అందక పోవటముతో ఇబ్బందుల్లో పడిపోయాడు. ఈ విషయం తెలిసిన మా ప్రశాంత్ గాడు స్పందించి మా అనీల్గాడిని కార్యరంగంలోకి దిగమని ఆజ్ఞాపించటం, మరియు మా వాడు మా వాళ్ళందరినీ కదిలించటంతో ఒక వారం లోపే చికిత్సకు కావలసిన రమారమి ఓ పది లక్షలు, ఇంక వొద్దురా నాయనా చాలు ప్రస్తుతానికి అనే దాకా మా వాళ్ళు చక చక సర్దేసారు.

ఇటువంటి అసంకల్పిత ప్రతీకార చర్యలాగా అందిన సహాయం మా వాళ్ళ ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసింది, అవును అవసరాలలో వున్న మన స్నేహితులనందరినీ ఆదుకోవోచ్చు అని. దానితో పాటు ఎన్నో ఆలోచనలు, వనరులు ఎలా సమకూర్చుకోవాలి, ఏమేమి ప్రాధమిక అవసరాలు పరిగణలోకి తీసుకోవాలి, కేవలం స్నేహితుల ఆరోగ్య సమస్యలేనా, లేక కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు కూడానా, లేక పిల్లల చదువులు కూడా పరిగణించాలా, బదులు తీర్చే నిబంధన తోనా లేక గ్రాంట్ రూపం లోనా, ఇటువంటివి అన్నిటికీ ఒక రూపం రావాలంటే ఒక కార్యనిర్వాహక బృందం ఏర్పడాలి అని నిశ్చయించారు.

ఈ లోపల మా కాలేజీతో సంబంధ బాంధవ్యాలు నెరుపుతున్న మిత్రులకి మా కాలేజీ తరపున మా బృందం కాలేజీని వొదలి ఇరవై ఐదేళ్లు అయిన సందర్భముగా జరపబోయే రజతోత్సవానికి  రమ్మని ఆహ్వానము అందినది. ఈ ఆహ్వానాన్ని అందిపుచ్చు కొని వీలు అయినంత మందిమి కలవాలని నిశ్చయించారు. మా ముందు బ్యాచ్ వాళ్ళు ఒక ఎనభై మంది వరకు అట్టి సమ్మేళనంలో కలిసారని మా సీనియర్ అయిన బాలాజీ ద్వారా తెలియటం తో మేము కనీసం ఒక నూట ఏభై మందిమైనా కలిసి మా బ్యాచ్ యొక్క ప్రత్యేకతని నిలబెట్టుకోవాలని తీర్మానం చేసేశాము. 

వీటి ఏర్పాట్లు పర్యవేక్షించడానికి అందరం ఒక మూడు నెలల ముందే మా నారాయణగాడి నిర్మాణ సంస్థలో వాడి కార్యాలయం లో ప్రతి రెండు ఆదివారాలొకొక సారి సమావేశాలు నడపాలని నిశ్చయించారు. అలా సమావేశానికి వచ్చిన వారికి మా నారాయణుడు ఇడ్లీలు, పొంగలి, వడలు, అటుపిమ్మట ఓ మంచి కాఫీ తో సత్కరించాలని హుకుం జారీ అయిపోయాయి. అలా మొదలైన మా సమావేశాలకి మా ఎన్.ఆర్.ఐ మిత్రులు వీడియో కాల్ లో కలిసేవారు.

రజతోత్సవం రోజున మా కాలేజీ లో కలిసి, సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలలో పాల్గొని, అటు పిమ్మట ఆ సాయంత్రానికి తిరుపతి చేరుకొని, ఆ రాతిరి  మరియు మరుసటి రోజంతా మా సంబురాలు జరుపుకొని అటుపిమ్మట మరలా ఎవరి మానాన వాళ్ళం వాళ్ళ వాళ్ళ ఊర్లకు చేరుకునేలా పథకం వేసేశాము.  ఈ పథకాన్ని చిన్న చిన్న పనులుగా విభజించి, ఒక్కో పనికి ఒక్కొరిని బాధ్యుల్ని చేసి ఆ పనులు ఎలా సాగుతున్నాయి చూడడానికి రెండువారాలకొకసారి సమావేశం అయ్యేవాళ్ళము.

వీలైనంత మంది స్నేహితులను ఈ సమ్మేళన సందర్భంగా వచ్చేలా చూసే బాధ్యత మా అనీల్గాడు నెత్తికెత్తుకున్నాడు. ఆ కార్యక్రం అయ్యేదాకా నిద్రాహారాలు మాని ఒక పూనకం వచ్చిన వాడిలా పని  చేశాడు. వాడు ఒక్కో స్నేహితుడిని ఎలా కనుగొన్నాడో రాయాలంటే ఓ పెద్ద గ్రంథమే అవుతుంది కానీ మచ్చుకు కొన్ని రాసి వాడి పరిశోధనా భరితమైన బుర్రని గురించి తెలియజేయాలి అని అనుకుంటున్నా.

అసిఫ్ అహ్మద్ మా సహాధ్యాయి మరియు మా అనీల్గాడికి ల్యాబ్ మేట్. అట్టి ఆసిఫ్ ని మావాడు చివరిసారిగా కలిసింది 1994 లో మరియు హైదరాబాదు నగరంలో. అటు పిమ్మట వారిద్దరి మధ్య సమాచార వారధి తెగిపోయింది. మావాడు ముందుగా ఆసిఫ్ ని వెతకటం లో పడ్డాడు, ముందుగా మా కాలేజీలో లోనే ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మా స్నేహితుడైన మోహనయ్య ద్వారా అసిఫ్ అడ్రస్ పట్టాలని చూశాడు. కానీ మా మోహనయ్యకి గుట్టలు గుట్టలు గా పడి వున్న ఆ రికార్డ్స్ రూమ్ లో మా అసిఫ్ ఆచూకీ ఒక పట్టాన దొరకలేదు.

ఇంతలో మా జగ్గూగాడు గుర్తు చేసాడు మా వాడికి, ఆసిఫ్ వాళ్ళ నాన్నగారు ఒకప్పుడు అద్దంకి ఎస్.బి.ఐ శాఖలో పని చేసేవారని. మా జగ్గూ గాడు అద్దంకి వాడలో ముద్దొచ్చే చిన్నవాడు అప్పటిలో. మా అనీల్గాడు తనకి తెలిసిన వ్యక్తి ద్వారా అద్దంకి శాఖలో విచారణ చేయించాడు, అసిఫ్ అనే పేరుగల అబ్బాయికి తండ్రి ఎవరైనా ఎస్.బి.ఐ లో ఒకప్పుడు పని చేశాడా అని, ఎందుకంటే మావాడికి ఆసిఫ్ వాళ్ళ నాన్న గారి పేరుకూడా తెలియదు కాబట్టి. కానీ వాళ్ళు ఏమీ సహాయ పడలేక పోయారు పని చేసినాయన పేరు కూడా చెప్పలేక పోవటం తో.

ఈ లోపల మా అశోక్ గాడు ఇంకో ఆచూకీ వదిలాడు. అశోక్ గాడు ఉస్మానియా యూనివర్సిటీ లో మాస్టర్స్ చేసే సమయం లో ఆసిఫ్ వాళ్లు నాంపల్లి లో ఉండేవారని, వీడు తరచు వాళ్ళ యింటికి వెళ్లే వాడని, ఆసిఫ్ వాళ్ళ అమ్మగారు వీడిని తన బిడ్డగా ఆదరించేవారని. ఇంకే ముంది మనోడికి ఇంకో ఆధారం దొరికేసింది.

వీడు ఇక నాంపల్లి లోని చెప్పుకో దగ్గ మసీదుల వెంట పడ్డాడు, ఎవరన్నా ఒక పెద్దాయన తన ముగ్గురు కొడుకులతో నమాజ్ కోసం వచ్చేవారా అని.  కానీ అక్కడ ముల్లాలు,  మనోడికి అక్కడ నమాజ్ కోసం కొన్ని వేల మంది వస్తుంటారని, అందువలన తాము ఏమీ ఆచూకీ తెలపలేమని చెప్పారు. మా వాడి ప్రయత్నం అక్కడి దాకా వచ్చి ఆగిపోయింది.

ఈ లోపల మా మోహనయ్య, రికార్డులన్నీ శోధించే క్రమంలో, ఆసిఫ్ వాళ్ళ నాన్న గారి పేరు కనిపెట్టేశాడు. ఆ పేరుతో మరల ఇంతకు ముందే పంపిన వ్యక్తిని, అద్దంకి ఎస్.బి.ఐ శాఖకు పంపించాడు మా అనీల్గాడు. ఆ శాఖ వారు, ఇక్కడ ఆ పేరుతో వున్న ఎవరూ పని చేయలేదని, ఒక వేళ అట్టి సదరు వ్యక్తి హైద్రాబాదు పరిధిలో పదవీ విరమణ చేసియున్నచో, ఆ వివరాలు వాళ్లకు సంబంధించిన మరియు నాంపల్లి లో కల వాళ్ళ సెంట్రల్ బ్రాంచ్ లో దొరకవచ్చని ఒక ఆచూకీ ఇచ్చారు.

మా అనీల్గాడికి తెలిసిన ఒక మేనేజర్, తనకి తెలిసిన మూర్తి అనే ఆయన సెంట్రల్ బ్రాంచ్ లో పని చేస్తున్నాడని, వెళ్లి ఆయన్ని కలవమనటం తో, వీడే స్వయం గా ఆ బ్రాంచ్  లో తేలాడు. కానీ వీడు వెళ్లే సరికి అట్టి మూర్తి అనే ఆయన అక్కడ లేడు ఆయన స్థానం లో వేరే ఆయన కూర్చొని వున్నాడు, అయినా వీడు సందేహించకుండా మా 25  ఏళ్ల బంధాన్ని వివరించి అందులో భాగం గా ఆసిఫ్ ని కలవటం వీడికి ఎంత అవసరమో చెప్పి, ఆయన మనసంతా కరిగించాడు.

అలా కరిగిపోయిన ఆయన, బాబూ! నేను నీకు సహాయ పడలేకపోయినా, నీకు సహాయపడగలిగే వాడు వున్నాడు అంటూ, అదే హాల్ లో ఆ చివర కూర్చొని వున్న వేరొకని దగ్గరకు తీసుకెళ్లి, ఎక్కడ వీడు మరలా తన కథని మొదటి నుండీ మొదలు పెడతాడేమో నని భయపడి, ఆయనే వీడి తరపున మా 25 ఏళ్ల బంధాన్ని వివరించి, ఆ సదరు వ్యక్తిని కూడా కన్నీరు మున్నీరయ్యేలా చేసి, మొత్తానికి వాళ్ళ దగ్గరున్న డేటాబేస్ లో నుంచి షాద్నగర్ లో వున్న ఒక అడ్రస్ మరియు ఒక ఫోన్ నెంబర్ మా వాడి చేతిలో పెట్టారు. 

మా వాడు ఫోన్ చేయగా మా ఆసిఫ్ వాళ్ళ తమ్ముడు ఫోన్ ఎత్తారు. మా వాడు అంతటితో వొదల్లా ఈ కథని, వెంటనే తన వాహనాన్ని షాద్నగర్ కేసి తిప్పాడు. వాడు ఆసిఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళటం, అందరినీ కలవటం, ఈ లోపు అశోక్ గాడికి ఫోన్ చేసి అసిఫ్ వాళ్ళ కుటుంబం తో మాటాడించటం, ఆసిఫ్ వాళ్ళ అమ్మగారు మన అశోక్ గాడితో మాట్లాడుతూ చాలా సేపు తన ఇంకో బిడ్డ దొరికినట్టు రోదించేయటం, మన వాడు ఆపూటకి అక్కడే భోజనం కానిచ్చేయటం అన్నీ జరిగిపోయాయి.

ఇలా మావోడు తన సకల కళలని వుపయోగించి పట్టిన ఇంకో స్నేహితుడు సౌజన్య కుమార్. నాకు తెలిసి మా వాకాడులో చేరిన వాళ్లందరిలో ఎంసెట్ రాంక్ మొదటిది వీడిదే. వీడి అక్క గారు కూడా మా కాలేజీలో మాకు సూపర్ సీనియర్, అందుకే వీడు కూడా మా కాలేజీలో చేరిపోయాడు. మహా తెలివి వీడి సొంతం, పుస్తకం పట్టడు, అందరి రూమ్ లి కలియ తిరుగుతూ, కబుర్లు చెబుతూ, అక్కడి విశేషాలు ఇక్కడ, ఇక్కడ విశేషాలు అక్కడ చెబుతూ, మాకు సమాచార వ్యవస్థలా పని చేసే వాడు, ఆ తరువాత ఎవరి ఎరుకలోనూ లేకుండా అయిపోయాడు.

వీడిని పట్టటం చాలా గగనమే అవుతుంది అనుకున్నాము. నాకు లీలగా గుర్తు వీడి ఇంటి పేరు నా ఇంటి పేరులాగే ఎన్ తో మొదలవుతుంది, మరియు నా ఇంటి పేరుకు దగ్గర గా ఉంటుంది. ఆలోచించగా ఆలోచించగా నల్లపాటి అని గుర్తుకు వచ్చింది. ఇంకేమిటి ముఖపుస్తకం లో వెతికాము, ఆనవాళ్లు దొరుకుతున్నాయి, కానీ ఆ ఫోటో మా వాడిది కాదనే సందేహం, అదియును వాడు ఆ ముఖపుస్తకాన్ని ఈ మధ్య కాలంలో వాడినట్టు అస్సలకి లేదు. వాడి ముఖపుస్తక ఖాతాలో వాడి పరిచయస్తులు పేరులలో వాళ్ళ అక్కగారి పేరుందా అని చూశాము. వాళ్ళ అక్కగారి పేరు వుంది, కాబట్టి మా వాడు వీడే అని తేల్చుకున్నాము, వెంటనే వాడికి మెసేజ్ పెట్టాము, కానీ వాడు ఆ మెసేజ్ చూస్తాడని నమ్మకం లేదు.

రెండు రోజుల తర్వాత మా వాడు ఫోన్ చేసాడు, దొరికేసాడు మన సౌజన్యా గాడు, మాటలాడేశాను అంటూ. నీ పాసుగూలా! ఎలారా అంటే, వాడుండేది గుంటూరు లో అని తెలుసు, ఆ పేరుతో వున్న ఇంటి పన్ను రికార్డ్స్ అన్నీ చెక్ చేస్తే మనోడి అడ్రస్, ఫోన్ నెంబర్  తో సహా దొరికింది అని చెప్పాడు. అబ్బా మా వాడు అపరాధ పరిశోధకుడిగా ఉంటే చక్కగా రాణించే వాడేమో అనుకుంటూ, నేను కూడా మా బక్క సౌజన్యా గాడికి ఫోన్ చేయటం లో నిమగ్నమయ్యా. ఎంతో తెలివి కల మా సౌజన్యా, తనకై పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తులను కాపాడుకోవడంలో అను నిత్యం కోర్ట్ పక్షిలా మారిపోయాడు.

ఇంతలో నెల్లూరులో వుండే మా ఇంకో స్నేహితుడు రవీంద్ర నుండి ఫోన్ వచ్చింది, మా ఇంకో స్నేహితుడు అయిన రమేష్ కి ఆరోగ్యం సరిగా లేకపోవటంతో వెళ్లి నారాయణా లో చూపించి వస్తున్నానని. వాడి పరిస్థితి అసలు బాగా లేదని. ఈ సారి నెల్లూరు కి వెళ్లి రమేష్ ని మరియు వాడి కుటుంబాన్ని కలిసి అన్నీ విషయాలు తెలుసుకొనే బాధ్యత నేను తీసుకున్న. ఆ పై వారం నెల్లూరు కి వెళ్లాను వాడి తదుపరి డాక్టర్ విసిట్ సమయానికి. నేను మరియు రవీంద్ర వెళ్ళాము రమేష్ వాళ్ళ ఇంటికి.

అక్కడకు వెళ్లిన మాకు తెలిసినది, ఏమిటంటే రమేష్ ఒక ఐదారు సంవత్సరాల క్రితం పనిచేసే ఆఫీస్ మొదటి అంతస్థు నుండి, ఒక్క సారి స్పృహ తప్పి పడిపోయాడని, ఆ క్రమంలో వాడి శరీరం లోని ఎడమ కాలు మరియు చేయి పక్షవాతానికి గురి అయ్యాయని, మాట కూడా స్పష్టం గా రావటం లేదు అని. ఇద్దరు ఆడ పిల్లలు వాడికి. పెద్ద పాప అప్పటికి బి.సి.ఏ చేసి ఎదో ఒక ఫిషరీస్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా చేస్తూ ఓ ఏడెనిమిది వేలు తెచ్చుకుంటుంది. చిన్న పాప నాలుగవ తరగతి. బాడుగుల మీద ఒక వేయి దాకా వస్తాయేమో, అదీ వాళ్ళ ఆర్ధిక స్థితి.  వాడికి, వాడి కుటుంబానికి కావలసిని ధైర్యం చెప్పాము మేమిద్దరం, మా స్నేహితులం అందరం అండగా ఉంటామని. తగిన ఏర్పాట్లు చేస్తామని.

వాడిని నారాయణ హాస్పిటల్ కి తీసుకెళ్లి వాళ్ళ డాక్టర్ ని కలిసాము. వాళ్ళ డాక్టర్ చెప్పాడు, వాడికి వాడు పడిపోకముందు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, ఇప్పుడు వచ్చిన రికవరీ నే మాక్సిమం రికవరీ అని, ఇక ఇంతకు మించి  మార్పు ఉండదు అని, ఇక జీవిత కాలం మందులు వాడాలి అని. అలా వాడికి కావాల్సిన మందులు ఆరు నెలలకి సరిపడా కొనిచ్చి వాడిని ఇంట్లో దిగపెట్టి వచ్చేసాము నేను, రవీంద్ర.

హైదరాబాద్ వచ్చాక మా కార్యవర్గ సభ్యులకు వీడి పరిస్థితి అంతా వివరించాక, మా శ్రీధరగాడు కొంచెం లోతుగా పరిశీలించి, వాడి లెక్కల బుర్ర ఉపయోగించి ఏమేమి కవర్ చెయ్యొచ్చో అని వాడి రికమండేషన్ యిచ్చాక,  మా వాళ్ళు ఆ పెద్ద అమ్మాయి ఎం.సి.ఏ చదవడానికి అయ్యే ఖర్చు, చిన్న పాప చదువు ఖర్చు, మరియు వాడి కుటుంబ జరుగుబాటుకు నెలకు పదిహేను వేలు కేటాయించారు. ఈ ఖర్చులన్నీ ఆ పెద్ద అమ్మాయి చదువు పూర్తి అయ్యి ఉద్యోగంలో చేరేంత వరకూ భరించాలని తీర్మానించారు. ఇలా తీర్మానించాక మా ఒకానొక కార్యవర్గ సభ్యుడైన మా ప్రశాంత్ గాడు, “ఇప్పుడు మన రజతోత్సవానికి ఒక అర్థం ఏర్పడింది. ఇక తృప్తిగా ఉత్సవం జరుపుకోవొచ్చు” అని వ్యాఖ్యానించాడు.

అలా మా మనస్సులో మా ఇంజనీరింగ్ సహాధ్యాయులందరికీ ఇష్టుడై, మేము ఇంజనీరింగ్ నుండి బయటకొచ్చిన ఒక సంవత్సరం లోనే ప్రాణాలు పోగొట్టుకున్న మా ఉమా పేరిట, “ఉజ్జ్వల మైత్రి అనుబంధం – UMA  ) ఏర్పాటుకు నాందీ పడింది.

“ఉజ్జ్వల మైత్రి అనుబంధం కి నాంది!” కి 6 స్పందనలు

  1. బాగుందండి, స్ఫూర్తిదాయకంగా.

  2. ఆంజనేయ స్వామి సంజీవని పర్వతాన్ని తీసికొని రావడం, ఒక పుక్కిట పురాణ కథనం అనుకున్న కానీ మన అనిల్, నారాయణ అంతకు మించి కార్యసాధకులు

  3. chala bagundi. Truly inspirational.

    1. Thanks andi Venki gaaru. Some of my friends are inspirational.

  4. Harsha garu chala bagundhi UMA your friendship is so great helping friends one another in need is a very great idea. I really like it

  5. Harshanna , Very nice Friend ship and good re collect..

Leave a Reply to Madhusudan ReddyCancel reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading