Apple PodcastsSpotifyGoogle Podcasts

గొలుసుకట్టు కుబేరులు!

అవి మేము కొలరాడో లోని, డెన్వర్ కి మరియు బౌల్డర్ కి మధ్యన కల లూయివిల్లీ అనే విరాట రాజ్యం లో నివసించే రోజులు. అక్కడ మేము గుర్తు పట్టగల లేక మమ్మల్ని గుర్తు పట్టగల తెలుగు కుటుంబాలు లేవు, తెలుగు దాకా ఏల అసలు భారతీయ కుటుంబాలే లేవు. మీ పవర్ స్టార్ రేంజ్ కాదు కానీ నేను అక్కడ ఒక అజ్ఞాత వాసిని. మా సహోద్యోగి మిత్ర కుటుంబాలన్నీ డెన్వర్ లో మేము లేకుండా, ఇంకో మాటలో చెప్పాలంటే మాకు ఈ హర్షా గాడి పీడ వదిలింది వారాంతపు సంబురాలు జరుపుకుంటున్నారు.

ఒక్కరన్నా ఈ వారాంతం రండిరా బాబు అని పిలుస్తారని ఆశగా ఎదురు చూస్తున్నాము, పోనీ వాళ్లనే రమ్మంటే, ఎందుకబ్బా! మీరే ఇక్కడికి వస్తే మనమందరము కలవొచ్చు అంటారు. ఈ సారి చెప్పకుండా వెళ్ళిపోయి మా ఫణి మరియు యశోదమ్మల కుటుంబం మీద వాలిపోదాము, అసలు మా యశోదమ్మ చేసే పేపర్ దోసెలు మరియు కర్నూల్ నషాళామంటే ఆ చికెన్ సూప్, అబ్బబ్బ  తలుచుకుంటుంటేనే ఎప్పుడెప్పుడు డెన్వర్ లో పడదామా అనిపిస్తూ వుంది.

ఈ లోపల మా వాకాటి స్నేహితురాలి ద్వారా పరిచయమైన కుటుంబం నుండి నాకు పిలుపు వచ్చింది, ఆ వారాంతపు శనివారం డెన్వర్ లోని వారి ఇంటిలో వారి స్నేహితులందరూ మధ్యాహ్నం పన్నెండింటికి కలుస్తున్నారని, పనిలో పని గా మేము కూడా వచ్చేస్తే బాగుంటుందని. ఆహా! నెల్లూరులో ఎక్కువగా సెటిల్ అయిన పుదూర్ ద్రవిడుల ఇంట్లో దొరకబోయే అవియల్ రుచి ఊహించుకొని మైమరిచిపోయా నేను.

ఆ శనివారం నాడు వాళ్ళని కలిసి లంచ్ ఆరగించి అటుపిమ్మట మా సహోద్యోగి మిత్ర బృందాలని కలసి, శనివారం కాబట్టి మా శిరీషమ్మ మరియు చక్రపాణి దంపతుల ఇంట్లో శాకాహార డిన్నర్ చేసి, మొహమాటానికి మా ఫణి, ఈ పొద్దు ఏమి పోతారబ్బా! పిల్లకాయల్ని వేసుకొని మీ వూరికి, ఇక్కడే పడి నిద్రపోయి, పక్కన రోజు వెళ్ళండి అంటే, చెప్పానుగా, వాళ్లింట్లోనే దొరికే కర్నూల్ చికెన్ మరియు పేపర్ దోశె లు పక్కన రోజు ఆరగించి మరీ బయల్దేరేలా, తలా ఒక జత బట్టలు పెట్టుకొని మరీ బయలుదేరాము డెన్వర్ కి, చాలా కాలం తర్వాత మన పల్లెకి వెళ్తున్నాము అనే భావనతో.

మా పిల్ల పీచుల్ని లేపటం, వాళ్లకి స్నానాలు చేయించటం, వాళ్ళు అటూ ఇటూ పరిగెడుతుంటే ముద్ద ముద్దకి వాళ్ళని ఆపి టిఫిన్ పెట్టటం లాటి పనులు మాకు పెద్ద పనులు అప్పటిలో. వాళ్ళకి టిఫిన్ పెడుతూ పెడుతూ వాళ్లకి పెడుతున్నాను అని మర్చిపోయి వాళ్ళ టిఫిన్ కూడా అప్పుడప్పుడూ నేనే భోంచేస్తూ, సుప్రియతో తిట్లు తింటూ ఉంటా నేను. ఆమెకి పిల్లలు ఎంత తిన్నారో లెక్క తేలియాలట, ఆ లెక్క నేను తప్పిస్తున్నానట. ఈ కార్యక్రమాలతో మరియు కీచులాటలతో మేము అప్పటికే ఆలస్యం అవుతున్నాము వాళ్ళ ఇంటికి చేరటంలో.

ఈ లోపలే రెండు ఫోన్ లు వచ్చేసాయి, అందరు విచ్చేసి వున్నారని, మాదే ఆలస్యమని. దానికి తోడు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళటం అదే మొదలు, ఆ కనుక్కొనే క్రమంలో ఇంకొంచెం ఆలస్యం. అప్పటికి ఇంకా ఈ జి.పి.ఎస్ లు అలవాటు కాలేదో లేక నా బుర్రకి ఆ టెక్నాలజీ అంతు పట్టలేదో కానీ నా మానవ బుర్రని ఉపయోగించాల్సి వచ్చింది.

అయ్యో మనవాళ్ళు అందరూ ఆకలిగా ఎదురు చూస్తున్నారు అనే అపరాధ భావంతో వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించాము. వారి ముందరి గదిలో అప్పటికే దాదాపు పది కుటుంబాల వరకూ సమావేశమయ్యి వున్నారు. వెళ్లి అందరికీ నా ఆలస్యానికి మన్నించమని వేడుకొని ఆసీనుడైన నాకు ఆ జీవన గది లోని దూర దర్శని పక్క ఒక పెద్ద తెల్లని రాత పలక దర్శనమిచ్చింది.

అబ్బా వీళ్ళు చాలా పద్ధతి గా పిల్లలకి లెక్కలు నేర్పుతున్నారు, ఇలా నేర్పే వాళ్ళు ఉండి వుంటే నా లాగ లెక్కల రావు అని పిలిపించుకునే దుర్గతి వాళ్లకు తప్పుతుంది అనుకుంటూ, ఇప్పుడు చల్లని పళ్లరసమిస్తారా లేక వేడి సూప్ ఇస్తారా అని నా లెక్కలు నేను వేసుకొనే కార్యక్రమంలో మునిగిపోయాయి. ఇటు వంటి లెక్కల్లో నేను ఆచంట మల్లన్న కన్నా ఘనుడను కదా.

ఇంతలో ఒకాయన లేచి ఆయనలోని ఉత్సాహాన్ని అందరికీ ప్రతిబించేలా రెండు అంగలలొ ఆ తెల్ల రాత పలక దగ్గరకు చేరుకొని, శక్తి వంతమైన గొంతుతో, ప్రియా మిత్రులారా, నేను ఇక్కడ సమావేశమైన ఈ సమూహానికి ఒక ప్లాటినాన్ని. నేను ఈ ప్లాటినం అవటంలో సహకరించిన నా అర్థాంగి కూడా మీకు తెలుసు అని మొదలెట్టగానే, ఆ సదరు అర్థాంగి గారు ఆయన పక్కన చేరిపోయారు. ఇక ఇద్దరు కలిసి వాళ్ళ వ్యాపార అనుభవాలు, వారు దాటిన అవరోధాలు, దశల వారి ఎదుగుదల, ఆ ఎదుగుదలలో వారి కుటుంబ, స్నేహితుల, పరిచయస్తుల పాత్ర ఎటువంటిదో మరియు నాలాటి అపరిచుతులను గొలుసుకట్టుగా ఎలా పాత్ర దారులుగా చేయాలో సోదాహరణంగా వివరించారు. అటుపిమ్మట ఒక వజ్రం లేచారు, మరలా అదే కథ కాకపోతే వేరే ఉదాహరణలు, అటుపిమ్మట ఇంకో బంగారం లేచి అదే పాఠాన్ని నొక్కి వక్కాణించారు.

నా లాటి అపరిచితుడు ఒకాయన లేచి చెప్పారు, ఈ వ్యాపారం లో తాను కొత్తగా చేరబోతున్నాను అనియు, ఇలా ఇంతకు ముందు చేరిన వారి విజయం తనకి చాలా ప్రేరణ కలిగించినదనియు, ఈ వ్యాపారం లో చేరని వారు, “నా చీజ్ ని ఎవరు కదిలించారు” కథలో హెమ్ లాగ మిగిలి పోతారని, అందుకే తాను హెమ్ కాదల్చుకోలేదు మరియు హా! గా మారదామను కుంటున్నాను అని.

ఇవన్నీ వింటూ మైమరిచి కళ్ళు తెరిచి చూసిన నాకు, ఆ తెల్లని రాత బల్ల మీద వివిధ రంగులతో ఓ చక్కని ఇంద్ర ధనుస్సు ఆవిష్కరించబడి వుంది. అబ్బా! ఏమి సెప్తిరి ఏమి సెప్తిరి అనుకుంటూ విహరిస్తున్న నన్ను, నా పిల్లల కేర్ కేర్ మనే ఏడుపులు ఈ లోకంలోకి తీసుకొచ్చాయి. వాళ్లకి కడుపులో ఎదో పరిగెడుతున్నాయని తెలుసు కానీ అవి ఎలుకలని తెలుసుకొనే వయస్సు రాలా వాళ్ళకి.

ఈ లోపల మా ఆహ్వానకర్త గారు మా అందరికి ఒక ప్లేట్ లో కొన్ని గుడ్ డే బిస్కత్తులు పెట్టుకొని వచ్చి అక్కడ వుండే బల్ల మీద పెట్టి, పక్కనే అవి నీళ్లు, మీరందరు అనుకునేలా పళ్ళ రసాలు కావు అని తెలిసేలా ఒక గాజు జగ్గులో ఉంచి వెళ్లారు. ఇదేందిరా! నాయనా, వాములు తినే స్వాములకు పచ్చగడ్డి ఫలహారము అనుకుంటూ, అయినా వంటలేమన్న ఆలస్యమవుతున్నాయేమో ప్రస్తుతానికి వీటితో సర్దుకుందామనుకున్నా. కానీ పిల్ల కుంకలు వాటికేమి తెలుసు ఈ సర్దుకోవటం, వాళ్ళు కేర్ కేర్ మనటం నేను రాసిన ప్రోగ్రాం లూప్ లో ఎలా పడిపోద్దో అలా లూప్ లోకి వెళ్లి పోయారు.

ఇక కుదరదు, అని సుప్రియ లేచి, బాగ్ సర్దుకొని మా ఆహ్వానకర్త గారి దగ్గరకు వెళ్లి, పిల్లలకి ఆలస్యమయ్యిందండి, ఇక బయల్దేరుతాము అని బయటపడడానికి ఉద్యుక్తురాలయ్యింది, అప్పటికీ నాకు ఆశ ముందు పిల్లలకి పెట్టేసుకోండి, మనం కొంచెం నిదానంగా తిందాము, ఈ కార్యక్రమ మయ్యాక అంటారేమో నని ఆశగా చెవి అటు పక్కన వేశా.

ఆవిడ వాళ్ళ ఆయన గారిని పిలవటం, వీళ్ళు బయలు దేరుతారట అని చెప్పటం, మరియు ఆయన నా వద్దకి ఒక పెద్ద ఫోల్డర్ పట్టుకు రావటం వెను వెంటనే జరిగిపోయాయి. ఆయన నేను ప్రోస్పెక్ట్స్ మీకు వివరిస్తాను అని చెప్పటం మొదలెట్టారు. నాకు అర్థమయ్యింది ఈ సమావేశం లో ముఖ్యముగా చెప్పినది మీకు దొరికిన అపరిచితులను భాగస్వామ్యం చేసే దాకా వదల వద్దని, అది ఈయన మనసా వాచా కర్మణా నమ్మేశారని.

నేను ఇక ఆలస్యం చేయకుండా ఆయన్ను ఆ అప్లికేషన్ లో ఎక్కడ సంతకాలు పెట్టాలో అడిగి పెట్టేసి, నా దగ్గర వున్న కొన్ని డాలర్లు, సుప్రియా సంచిలో వున్న కొన్ని డాలర్లు, తీసుకొని, $120 అనుకుంటా, కొత్త వారి చేరిక రుసుము కింద కట్టేసి బయటపడిపోయాము.

సమయం చూసుకుంటే మధ్యాహ్నం రెండున్నర. దార్లో ఫ్రెంచ్ క్వార్టర్స్ పక్కన వున్న కాంప్లెక్స్ లో కొత్తగా పెట్టిన ఇండియన్ రెస్టారంట్ చేరుకున్నాము. వాళ్ళు అప్పుడే సర్దేసుకుంటున్నారు, మేము వెళ్ళగానే, “వి అర్ క్లోస్డ్” అన్నారు. వాళ్ళని బతి మాలుకున్నాము, బాబూ చిన్న పిల్లలు ఆకలితో వున్నారు, మాకు ఎక్కువ వద్దు, ఒక పిడికెడు అన్నం కొంత పప్పు చాలు అని. వాళ్ళు పిల్లల వైపు చూసి రెండు ప్లేట్స్ లో కొంచెం అన్నం కొంత పప్పు తెచ్చి ఇచ్చారు. బతుకు జీవుడా అనుకొని, పిల్లలకి తినిపించుకొని, మా పథకాలు అన్నీ మానుకొని వెళ్లి ఇంట్లో పడిపోయాము.

ఇది జరిగిన రెండు వారల తరువాత అనుకుంటా, సుప్రియా నేను costco లో మాకు దొరకటమే గొప్ప అనుకునే మెక్సికన్ మామిడికాయలు పెద్దవి ఏరుకుంటూ ఉండగా, నమస్తే అంటూ ఒకాయన పలకరించారు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు వుంది అంటూ. నా బుర్ర పాదరసం కాకపోయినా అప్పుడప్పుడు పనిచేస్తుంది, నాకు వెంటనే నేను పాల్గొన్న ఆ సమావేశంలో ఆ వజ్రం చెప్పిన వాక్యాలు గుర్తొచ్చాయి, అపరిచితులను ఎలా పలకరించాలి అనే దానిమీద. నేను చాలా నవ్వు పులుము కొని చెప్పా బహు జాగ్రత్తగా, మీకు ఆ అవకాశమే లేదు, ఎందుకంటే నేను నిన్ననే మొదటి సారిగా ఈ గడ్డ మీద కాలు  పెట్టాను అని.

ఆయన నా పేరు కుబేర్ మరి నేను మీ పేరు తెలుసుకో వచ్చా అన్నారు రెండో అంకంలోకి దిగుతూ, నేను మనస్సులో నా పేరు దరిద్ర్ అనుకుంటూ పైకి మాత్రం నా పేరు దానికి వ్యతిరేకం “హర్ష” అని చెప్పా. ఆయన పిచ్చాపాటి మాట్లాడుతూ వున్నా నా బుర్ర ఈయన తదుపరి అడుగు వాళ్ళ ట్రేడ్ మార్క్ అంకంలోకి ఇంకా పడలేదేమిటి అబ్బా అనుకుంటూ ఉండగా, నా అనుమానం పటాపంచలు చేస్తూ ఆయన మీరు మీ ఖాళీ సమయాల్లో ఏమి చేస్తుంటారు అని అడిగారు.

ఇదేమిటి వీళ్ళకి ప్రశ్నల క్రమమే నేర్పుతారా వీళ్ళ ట్రైనింగ్ క్లాసుల్లో, సమాధానాలను బట్టి ప్రశ్నలు మార్చరా? నిన్నఇండియా నుండి దిగినోడిని ఖాళీ సమయాల్లో ఏమి చేస్తారు అని అడుగుతున్నారు అని అనుకుంటూ మరల అంతలోనే ఈయన నాలాటి వాళ్ళనెందరిని చూశాడో, నేను ఇండియా నుండి నిన్ననే రావటం అబద్దమని  కనిపెట్టేశారా అనే కన్ఫ్యూషన్ లో నేనుండగా, నన్ను రక్షిస్తూ నా పెద్ద కూతురు, నాన్న అని రెండు వేళ్ళు చూపించింది నాకు. హమ్మయ్య అనుకుంటూ, నేను నా ఖాళీ సమయాల్లో నా కూతుర్ల డైపర్లు మారుస్తుంటా అని చెప్పా.

ఈ సమాధానంతో ఆయనకి అద్భుతమైన ఆచూకీ దొరికేసినట్టుంది, అయితే నేను ఇవ్వబోయే ప్రపంచం లోనే అద్భుత వ్యాపార అవకాశానికి , మీలా కుటుంబాన్ని ప్రేమగా చూసుకొనే నేపధ్యం వున్న వాళ్ళు చాలా పనికొస్తారు, ఏమంటారు అన్నారు ఆయన. అబ్బా! ఈ పొగడ్త మా సుప్రియ విన్నదా లేదా అని చూశా! ఊహు పొగిడినప్పుడు తాను పక్కన ఉండదు, ఇంకా మామిడి కాయలు ఏరుకుంటూనే వుంది.

ఇంతలో costco లో పని చేసే ఆవిడ  నా దగ్గర కి వచ్చి చిరు నవ్వు చెక్కు చెదరనీయకుండా చెప్పింది,  “అక్కడ మామిడి కాయలు ఏరుకొనే మీ ఆవిడకి చెప్తారా! అలా వేరే బాక్స్ లో నుంచి పెద్ద పెద్ద మామిడి కాయలు ఏరుకొని మీ బాక్స్ లో పెట్టుకో కూడదు, ఒక బాక్స్ ఎలా ప్యాక్ అయి వస్తుందో, మీరు అలాగే తీసుకొని వెళ్ళాలి” అని.

ఆయన వినేలా ఆ costco సఖితో చెప్పాను, అక్కడ నిలబడి మామిడికాయలు ఏరుకొనే ఆ సుప్రియా ఎవరో నాకు తెలియదు అని. చెప్పి ఇలా చూసేసరికి మా కుబేరుడు జారుకున్నారు అక్కడ నుండి. ఒక ప్రమాదం నుండి బయటపడిన నన్ను, ఇంటికెళ్ళాక సుప్రియా చేతిలో జరగబోయే సత్కారం భయపెట్టడం మొదలుపెట్టింది.

“గొలుసుకట్టు కుబేరులు!” కి 6 స్పందనలు

  1. విన్నకోట నరసింహారావు Avatar
    విన్నకోట నరసింహారావు

    హ్హ హ్హ, amway బాధితులా మీరు 😁? అది ఉధృతంగా ఉన్న రోజుల్లో కొత్తవాళ్ళని పలకరించడానికి కూడా జనాలు భయపడేవారు.
    వేరే బ్లాగులో ఒకసారి చదివాను … ఇండియా నుండి వెళ్ళిన కొత్తలో ఒకాయన అందరితో పరిచయం చేసుకోవాలనే ఉబలాటంతో “We are not anway” అని బోర్డు వ్రాసుకుని నలుగురూ కలిసే చోట్లకు వెళ్ళినప్పుడల్లా ఆ బోర్జ్ కూడా తీసుకువెళ్ళి అందరికీ కనబడేచోట ఆ బోర్జ్ పట్టుకుని నిలబడేవాడట 😁.
    మీరు ఇప్పటికీ కొలరాడోలోనే ఉంటున్నారా? నేను ఐదారుసార్లు బోల్డర్ వచ్చాను లెండి. అందమైన రాష్ట్రం.

    1. బాగా ఇబ్బంది పడ్డాను అండి. అందులో ఇద్దరు పిల్లలతో భోజనానికి అని వెళ్లి అలా భంగపడటం బాధించింది. ఓపికగా వుంటాను కానీ, పిల్లలు ఇబ్బంది పడటం తో కొంచెం అసహనం కలిగింది వారి మీద. 2000 నుండి ఒక నాలుగు సంవత్సరాలు వున్నా నండి డెన్వర్ మరియు బౌల్డర్ ప్రాంతాలలో. బౌల్డర్ ఒక అందమైన ప్రదేశం, రాకీ మౌంటైన్స్ బహు దగ్గరగా మరియు కనపడుతూ.

  2. ఎక్కడో చదివాను , తెలుగు వాళ్ళని పలకరించాలంటే భయమేస్తుంది అని ఎవరో బ్లాగుల్లో వాపోయారు . ఈ దరిద్రం అక్కడ కూడా ఉందని అర్ధం అయింది . కాకపోతే ఈ మధ్యన వీళ్ళు అతి తెలివి చూపిస్తున్నారు . amway , మలం ( ఎం ఎల్ ఎం ) అంటే పారిపోతున్నారు అని స్టార్టుప్ అని చెప్పడం మొదలుపెట్టారు వెధవలు . బెంగుళూరు లో నేను ఇలానే మోసపోయా . నేను ఒక రాత్రి , గాలి వాన, ఉరుములు లో తడిచిపోతూ ఒక షాప్ ముందు నిలబడితే, పక్కన ఉన్న వెధవ ఇంగ్లీష్ లో పరిచయం చేసుకుని , స్టార్టుప్ పెడుతున్నాం , ఫండింగ్ ఏమి వద్దు , కేవలం మీ విజ్ఞానం కావలి అంటే మురిసిపోయా . అప్పటికి ప్రకృతి సింబాలిక్ గా చెప్తున్నా వినకుండా నా ఫోన్ నెంబర్ ఇచ్ఛేసాను .
    ఆ తరువాత రండి మా స్టార్టుప్ మీటింగ్ కి అంటే అబ్బో అని వెళ్ళా , రెండు బస్సు లు మారి . అక్కడ అంతా ఆ బాపతే అనుకుంట .. మీటింగ్ స్టార్ట్ అయిన 5 నిమిషాలకి సగం హాల్ ఖాళి అయిపొయింది , నాకు బుర్ర పనిచేయడం మానేసింది . నా మొహమాటానికి బాగుంది అన్న ఒక్క మాట కి వాడు 6 నెలలు వెంటపడ్డాడు , వదిలించుకునే సరికి విసుగొచ్చింది .
    కంపెనీ మారిన తరువాత , విప్రో లో ఉన్నప్పుడు , ప్రాజెక్ట్ లేక లైబ్రరీ లో ఉన్నా ( ఎలక్ట్రానిక్ సిటీ ) , అక్కడ కూడా ఒక అమ్మాయి ఇలానే పలకరించింది , దెబ్బకి నాకు జ్ఞానోదయం అయి , ఇప్పుడు నాకు ఒక గంట కూడా టైం లేదు అని కట్ చేసేసా.

    1. బాగా ఇబ్బంది పడ్డాను అండి. అందులో ఇద్దరు పిల్లలతో భోజనానికి అని వెళ్లి అలా భంగపడటం బాధించింది. ఓపికగా వుంటాను కానీ, పిల్లలు ఇబ్బంది పడటం తో కొంచెం అసహనం కలిగింది వారి మీద.

  3. అద్భుతంగా ఉన్నాయండి మీ పోస్టులు. అన్నీ ఏకబిగిన చదివేశాను. మీ సెన్స్ అఫ్ హ్యూమర్ కు వందనాలు. నెల్లూరు మాండలికాలను, నెల్లూరినీ మా కళ్ళముందు నిలబెడుతున్నారు. ఆగకుండా చదివింపచేసే మీ శైలి చాలా నచ్చింది.

    1. చాలా థాంక్స్ అండి , చదివి నందుకు , నచ్చినందుకు. సరదాగా రాసినవి స్నేహితులకు పంపేవాడిని వాట్సాప్ లో. వాళ్ళు కొన్ని బాగున్నాయిరా అంటే నాకు ఉత్సాహం వచ్చేసింది.

Leave a Reply to విన్నకోట నరసింహారావుCancel reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading