Apple PodcastsSpotifyGoogle Podcasts

బలుపుకి మరియు వాపుకి తేడా చెప్పిన నా చిన్ననాటి మిత్రులు!

మా ఉప్పలపాడు గ్రామము నెల్లూరికి వాయువ్యాన మరియు ప్రత్యక్ష రవాణా సౌకర్యమున్న గ్రామాలలో ఒకటి. మా వూరు నెల్లూరు-ఉప్పలపాడు రవాణా మార్గములో ఆఖరు గ్రామము. నేను ఆరు మరియు  ఏడవ తరగతులు మా ఊరుకి ముందు రెండవ గ్రామమైన పెదపుత్తేడు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నా. మాకు కీ||శే|| మీరా రెడ్డి గారు ప్రధానోపాద్యాయులుగా ఉండేవారు, ఆయన పెదపుత్తేడు నివాసి మరియు ఆ ఊరిలో పేరుమోసిన మోతుబరి కూడా.

గంజి పెట్టిన మరియు మడత నలగని హాఫ్ హ్యాండ్ చొక్కాలతో, వేసిన ట్రౌజర్ రంగుకు సరిపోయే టైలతో, ప్రతి నిత్యం మిల మిల మెరిసేలా పాలిష్ చేయబడిన షూస్ తో, రాజు వెడలె రభసకు అనే రీతిన మా బడికి వచ్చే వారు ఆయన. ఆయన వాహనం మాత్రం అప్పటిలో గట్టితనానికి మారు పేరు అయిన హంబర్ సైకిల్. ఆయన క్రమ శిక్షణకు మారు పేరు.  అంతటి పద్ధతైన మా మీరా రెడ్డి గారు వాళ్ళ ఇంటిలో గోచీ పెట్టి పశువుల దగ్గర పేడ కళ్లెలు ఎత్తుతుంటే చూశామని చెప్పుకొని కిసుక్కుమనుకునే వాళ్ళము మేము.

మా బడిలో గాలి కూడా పద్దతిగా వీచాల్సిందే ఆయన ఉన్నంత వరకు. చదువులకు మా బడి పెట్టింది పేరు. గండవరానికి కొంచెం దగ్గర వున్న గ్రామాలు పిల్లకాయలు కూడా చదువులు బాగుండటంతో మా పెదపుత్తేడు బడికి వచ్చెడి వారు. మా బడికి వచ్చే గ్రామాల పిల్లకాయలు మధ్య చదువులలో పోటీ ఎప్పుడూ వుండెడిది.

మా బడిలో, తరగతిలో కనీసం పది మంది పిల్లకాయలన్నా దగ్గర బంధువులు అవటంతో నా చదువు మరియు ఆటలు నేను ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిపోయాయి. అందులోను తరగతిలో అందరికన్నా పిల్ల పీచును కావటంతో మా తరగతి అమ్మాయిలందరూ వాళ్ళ కుందుడు గుమ్మకో లేక పల్లంచకో, లేక ఆడపిల్లలు ఆడే ఆటలకు ఒక తలకాయ తక్కువ పడితే నన్ను కలిపేసుకొనే వారు. మా అక్క కూడా నా సహాధ్యాయి కావటం తో నాకు ఈ ఆడపిల్లల ఆటలకు ప్రవేశం బహు సులభం గా దొరికేది.

తరగతిలో చదువుల్లో చురుకుగా ఉండటంతో నాకు ఉపాధ్యాయుల ప్రేమతో పాటు మా సహాధ్యాయుల నుండి గౌరవ మర్యాదలు మెండుగా దొరికెడివి. పొట్టిగా ఉండటం తో మరియు తరగతిలో డెస్క్ లుండెడి బెంచీలకు కొరత ఉండటం తో నాలాటి ఓ పది మంది సత్రకాయలకి రెండు నేల బల్లలు వేశారు. నేను కూర్చునే స్థలం మా అయ్యోరి బల్ల కిందనే. నేను నా ఆటల్లో పడి ఒక్కోసారి మా అయ్యోరి బల్ల కిందకెళ్ళి కూర్చునే వాడిని, అందుకే అప్పుడప్పుడు మా అయ్యోర్లు ఎక్కడరా వీడు అని వెతుక్కునే వారు.

అలాగే మా అయ్యోర్లు ఎప్పుడన్నా మా తరగతి అమ్మాయిలను వాళ్ళ బల్ల వద్దకు వచ్చి మా తరగతి వైపుకి తిరిగి పాఠం పెద్దగా చదవమంటే నేను మట్టిలో పడి వుండే ఓ పుల్లను తీసుకొని వాళ్ళ కాళ్ళ మీద రాసే వాడిని, వాళ్ళు పెద్ద వెర్రికేక వేసి ఆమ్మో జెర్రీ అని పుస్తకం అక్కడే పడేసి పారిపోయే వారు. మా అయ్యోర్లు నీతో వేగలేకున్నామురా అని ఒక్కటి పీకే వారు. మా అమ్మాయిలు కూడా మరీ. వాళ్లకు పాఠం చదవటం రాక పోతే ఆ సంగతి నేరుగా చెప్పకుండా ఆ నెపం నా మీద నెట్టి, సార్ వాడు అక్కడ ఉంటే మేము చదవం సార్ అని తప్పించుకునే వారు. 

ఈ పుల్లతో రాయటానికి మా బడిలోనే ఎనిమిదవ తరగతి మరియు ఆపైన తరగతులకు సాంఘిక శాస్త్రం బోధించే మా పరంధామయ్య అయ్యోరి కూతురైన మా యశోధరకు మాత్రమే మినహాయింపు. ఆ అమ్మాయి ఒక గాన కోకిల మరియు చదువుల సరస్వతి. పాడనా తెలుగు పాట అని నా ముందర మరియు మా అయ్యోరి బల్ల పక్కన నిలబడి పాడుతుంటే ఎందుకో నేను చాలా సిగ్గుతో నా తలని నా మోకాళ్ళలో దాచేసుకొనే వాడిని. 

మా తరగతి గదులంటే ఎక్కువ ఊహించ వద్దు, అవి తాటాకులతో కప్పబడి, పేడతో అలకబడిన నేలను కల తరగతులు. పేడతో అలకబడిన కొద్ది రోజులే దుమ్ము రేగకుండా ఉంటాయి, ఆ తర్వాత మా నేల బల్లల పిల్లకాయలకి తరగతులు జరుగుతున్నా, చికు చికు పుల్ల లాటి ఆటలు మా పాటికి మేము ఆడుకునే దానికి బాగా పనికొచ్చేవి.

అలా మా ఆటలు ఎక్కువైనప్పుడు మా అయ్యోర్లు మా సి.పి.ఎల్ కి ఆదేశాలు జారీ చేసే వారు వీళ్ళ ఆగడాలు భరించ లేకున్నాముర్రా, కొంత సమయం జరిగితే ఆ దుమ్ము మా కళ్ళల్లో కొట్టేలా వున్నారు, ఓ ఆదివారం మీ పిల్లకాయలు సమూహం వచ్చి మీ తరగతి నేలని మీరే అలుక్కోండి రా అని.

అంతే మేము ఒక ఆదివారం పొలోమని మా బడికి వచ్చేసే వారం, మాధ్యాహ్నం దాకా చుట్టూ పక్కల వున్న పశువుల కొట్టాల మీద పడి పేడ సేకరించి, మా బడికి దగ్గరలో వున్న పుత్తేటి చెరువు నుండి నీళ్లు మోసుకొచ్చి మా తరగతులను శుభ్రంగా అలికేసేవారం.

మా  అమ్మాయిలు బహు చక్కని ముగ్గులు పెట్టేసేవారు. ఆహా! చూడు నా సామిరంగా మా తరగతులు ముస్తాబులు. మేము ఇట్టి ఆదివారాలు బడి లో ఉన్నంత కాలం మేము ఏమీ కోతి వేషాలు వేయకుండా మా బడి ప్యూన్ అయినా కాలేషా సాయిబు మాకు కాపలాగా ఉండేవారు. ఆయన కూతురు మూబీ మా సహాధ్యాయిని, ఆ అమ్మాయంటే ఆయనకి వల్లమాలిన అభిమానం. ఆ అమ్మాయి మమ్మల్ని ఆయన అతి క్రమశిక్షణ నుండి కాపాడేది.

ఇక బడి నుండి ఇంటికి వెళ్లే దారిలో సీమ చింత కాయలు, చక్కగా మగ్గిన తాటి పండ్లను పక్కన పడి వున్న ఎండు తాటాకులతో కాల్చుకు తినటం, గుంజి పళ్ళు, టేకు పళ్ళు, రేగు పళ్ళు, కలేకాయలు లాటివి, బెర్రీ పళ్ళు లాటివి కోసుకొని పంచుకోవటం,  ఎక్కడ కాలువలలో బడితే అక్కడ నీళ్లు తాగెయ్యటం లాటి సామూహిక కార్యక్రమాలతో సాయంత్రాలు ఇళ్లకు చేరే వాళ్ళము.

గ్రామాలకు చేరే సమయంలో మా గ్రామస్థులు మమ్మల్ని ఎక్కడ నుండిరా అంటే మా తరగతులు అలుక్కుని వస్తున్నామని వాళ్ళు కిసుక్కుమనేలా సమాధానాలు చెప్పే వారము. మాకు ఇట్టి ఆది వారాలు మా చదువులనుండి మాకు దొరికే అపురూప విరామాలు.

మాకు లెక్కలు మరియు ఆంగ్లము బోధించే సుబ్రహ్మణ్యం అయ్యవారు మా ఉప్పలపాటిలో నివాసముండెడి వారు. మేము మరియు మా పక్క గ్రామమైన రామలింగాపురము పిల్లకాయలు ఆయన వద్దనే ఉదయం మరియు సాయంత్రం ప్రైవేట్ వెలగ పెట్టేవారము. ఆయనకు నేను ప్రియ శిష్యుడను అయినందున, నా మాటే ఎక్కువగా చెల్లేది. ఎవరు ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో శత్రుత్వం చేయాలి, ఎవరి సైకిల్ లో ఎవరు ఎక్కి వెళ్ళాలి లాటి వాళ్లకు నచ్చని నిర్ణయాలన్నీ నేను అమలు చేసే వాడిని, లేక పోతే మా అయ్యోరికి చాడీలు చెప్పే వాడిని వాళ్ళ మీద. అందుకే వాళ్ళు నన్ను కొర కొర చూస్తూనే లేక మనస్సులో తిట్టుకుంటూనే నా మాట వినే వాళ్ళు.

మా అయ్యోరు కూడా నా పితూరీలు ఎక్కువైనప్పుడల్లా, రేయ్ హర్షా గా నువ్వు ఈ మధ్య మరీ పున్న తేలువై పోయి ఎక్కడ పడితే అక్కడ కుట్టేస్తున్నావురా తెలియకుండానే అనే వాడు.

నేను ఏడవ తరగతి అయ్యాక నెల్లూరులోని గుంట బడిలో చేరడానికి కావలసిన బదిలీ పత్రము తీసుకొని రావడానికి మా పెదపుత్తేడు గ్రామానికి వచ్చినప్పుడు, నా పితూరీలతో ఎక్కువ బాధింప పడ్డవారైన తాతా గిరిధర్ మరియు భూరెడ్డి కిరణ్, కేవలం నన్ను తిట్టడానికే నేనెక్కిన బస్సు లోనే ఎక్కి గండవరము వరకు నన్నునానా తిట్లు తిట్టటం నాకు ఇప్పటికీ గుర్తే. వారి పుణ్యాన నాకు తెలియ వచ్చినది ఏమిటంటే అప్పటివరకు నేను బలుపు అనుకున్నది బలుపు కాదని, అది కేవలం వాపు మాత్రమే అని.

“బలుపుకి మరియు వాపుకి తేడా చెప్పిన నా చిన్ననాటి మిత్రులు!” కి 7 స్పందనలు

  1. హ్హహ్హహ్హ! బాగుంది.
    గుంజి పళ్ళు, టేకు పళ్ళు, కలే కాయలు ఇవి ఎప్పుడు వినలేదు.

    1. గుంజి మరియు టేకు పళ్ళు సహజంగా ఎత్తు పెరగని పొదలలో దొరుకుతాయండి. వాటి గురించి తెలియాలంటే మీరు డెబ్భైయవ దశకం లేక అంతకు ముందు పుట్టిన అదృష్టవంతులై ఉండాలి. కలే కాయలు అనేవి ఇప్పటికి కూడా హైద్రాబాదు లాటి నగరాల్లో కూడా దొరుకుతాయి. ఇప్పుడే గూగులమ్మ ని అడగగా Bengal currant or Karanda fruit అంటారని చెప్పింది.

      1. ప్రాంతాన్ని బట్టి పేరు మారుతుంది చాలా సార్లు.
        కలే కాయలు” అని నెల్లూరు ప్రాంతంలో పిలిచే పేరు అనుకుంటాను (ఈ బ్లాగర్ నెల్లూరు జిల్లా వారనుకుంటాను 😉)..
        కృష్ణా, గోదావరి జిల్లాల వైపు ఇవి “వాక్కాయలు” గా ప్రసిద్ధి.

        https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%B2%E0%B1%87_%E0%B0%9A%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81

  2. కొన్ని ప్రాంతాల్లో వీటిని జాన కాయలు అని అంటారు. నల్లగా చిన్నగా తియ్యగా ఉంటాయి

  3. విన్నకోట నరసింహారావు Avatar
    విన్నకోట నరసింహారావు

    వాక్కాయలు / కలే కాయలు తియ్యగా ఉండవు. పులుపు వాటి ప్రధాన లక్షణం.

    నల్లగానూ ఉండవు. ఆకుపచ్చ, ఎరుపు / ఊదా రంగులు కలిసి ఉంటాయి.

    1. సరిగ్గా వర్ణించారండి.

  4. పండిన కలేక్కాయలు నేరేడుపల్లలాగా నల్లగా తియ్యగా ఉంటాయి. చిన్నప్పటినుంచీ నాకు ఇష్టమైన కాయలు అవి. కాకపోతే ఇప్పుడు దొరకట్లేదు.

Leave a Reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading