Apple PodcastsSpotifyGoogle Podcasts

ప్రపంచ సాహిత్యంలో ట్రావెలాగ్!

ప్రాచ్య భారత దేశానికి మహా ఇతిహాస జాతీయ కావ్యాలైన రామాయణ, భారత, భాగవతాలు ఎట్లో, ప్రాచీన పాశ్చాత్య సంస్కృతికి మూల స్తంభమైన గ్రీకు నాగరికతకు వారి  చరిత్రలు అయిన ఇలియడ్ మరియు ఒడిస్సీలు అలానే అని చెప్పవచ్చు.

మనకు వాల్మీకి, వ్యాసుడు ఎట్లనో వారికి హోమర్ అట్ల. అంతే కాదు ఆయా ఇతిహాస కావ్యాలలో కూడా దేశ, కాలములు వేరు అయినప్పటికీ  కొన్ని పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.

రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ వచ్చిన తర్వాత మధ్యధరా సముద్ర ప్రాంతములో హోమర్ మహాకవి కృతమైన కావ్యాల సంఘటనలు జరిగినట్లు గా ఋజువులు లభించాయి.

అట్లనే మన దేశము లో కూడా రామాయణ, భారత ఘటనల గూర్చి లెజెండ్స్ (తర తరాల నుండి నమ్మబడు గాధలు) వుండనే వున్నాయి.

ఆయా గాధలను తులనాత్మక పరిశీలన చేసినప్పుడు, ఒక రాజు భార్యను మరొకరు అపహరించుకు పోవుట, భార్యను పోగొట్టుకున్న రాజు అటు పిమ్మట తన హిత, సన్నిహిత స్నేహితుల సహాయముతో ఆ అపహరించిన రాజుతో యుద్ధము చేసి, ఓడించి, సంహరించి, తన భార్యను తెచ్చుకొనుట అనేది  ఇతివృత్తముగా వున్నాయి.

శ్రీమద్రామాయణంలో శ్రీరామచంద్రుని భార్యను రావణాసురుడు మోసముతో అపహరించి తీసుకొని పోతాడు. రాముడు వానర రాజు అయిన సుగ్రీవునితో స్నేహమొనరించి, అతని సైన్యము సహాయముతో లంకపై దాడి వెడలి, రావణుడిని జయించి, వధించి తన భార్యను వెనుకకు తెచ్చుకుంటాడు.

అదే మాదిరిగా హోమర్ చే గానం చేయబడిన గ్రీకు కావ్యమైన ఇలియడ్ నందు, మెనలాస్ అనే రాజు భార్య అయిన హెలెన్ ను పారిస్ అనే రాకుమారుడు అపహరించుకు పోతాడు. కాకపోతే ఇక్కడ తేడా ఏమిటంటే అపహరించుకు పోవుట అన్నది హెలెన్ యిష్ట ప్రకారము జరిగినది. మెనలాస్ తన హిత మరియు సన్నిహిత రాజుల తోడ్పాటుతో ఆ ట్రాయ్ రాకుమారుడి పైన యుద్ధానికి వెళతాడు, జయిస్తాడు, వధిస్తాడు, ఆపై తన భార్య హెలెన్ ను తెచ్చుకుంటాడు.

గమనించ దగ్గ విషయం ఏమిటంటే శ్రీమద్రామాయణం లోని యుద్ధ కాండము, మహా భారతములోని యుద్ధ పంచములతో పోల్చి చూసినప్పుడు ఇలియడ్ లోని ట్రోజన్ యుద్ధం ఏమాత్రం తక్కువ కాదు.

శ్రీమద్రామాయణం, భారతములను ఇలియడ్ తో పోల్చినప్పుడు, కొన్ని గమనార్హమైన విషయములు మనకు తెలియవచ్చు:

1 . వాల్మీకం లవకుశులచే గానం చేయబడినది. హోమర్ కావ్యాలు అయినా  ఇలియడ్ మరియు “ది ఒడిస్సీ” అంధుడైన అతని చేతనే గానం చేయబడ్డాయి

2 . మహా భారతం లో ధృతరాష్ట్రునికి నూరుగురు పుత్రులు, అలాగే ట్రాయ్ రాజు అయిన ప్రియమ్ కు నూరుగురు పుత్రులు

౩. గాంధారి తన సుతుడైన సుయోధనుని ఆశీర్వదించ తలచి తన వద్దకు రమ్మనగా, శ్రీకృష్ణుని మాయోపాయము మరియు సుయోధనుని గ్రహపాటు వలన ఊరువులు బలహీనము అయినాయి మరియు మరణ కారకము అయినాయి. అలాగే గ్రీకు వీరుడు అయిన అకిలెస్ తల్లి తన కుమారుని మృత్యువు నుండి సంరక్షించుకోవాలనే ప్రయత్నంలో అతని ఎడమ కాలి మడమ మాత్రం తడపనందున అతని ప్రాణములు అక్కడే నిక్షిప్తమయ్యి ఉంటాయి. పారిస్ వేసిన ఈటె అచటనే గ్రుచ్చుకొని అకిలెస్ మరణానికి కారణమవుతుంది. పోలిక సుయోధనుడు గ్రహపాటుతో అయినా, ఈ అకిలెస్ మన మహా భారతం లో కర్ణుడి అంతటి వాడు.

ఇక “ది ఒడిస్సీ” కావ్యానికి వస్తే ట్రోజన్ యుద్ధము అయ్యాక మెనలాస్, అతని స్నేహితులైన ఒడిస్సియస్ (ఉలిస్సెస్) మొదలగు వారు విజయోత్సాహముతో వారి వారి దేశాలకు గృహోన్ముఖులవుతారు. హోమేరియం అయిన “ది ఒడిస్సీ” అనబడు  ఉలిస్సెస్ చరిత్ర ప్రపంచ ట్రావెలాగ్ లలో ఒక స్థానం సంపాదించు కోవటమే కాక ఎన్నటికీ ఎంతో మందిని ఉత్సాహపరుస్తూ స్ఫూర్తివంతం చేస్తూ వుంది.

క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఒడిస్సియస్ ట్రోజన్ యుద్ధానంతరం గృహోన్ముఖుడై తన ఇంటికి చేరుటకు పడ్డ కష్ట నష్ట వ్యయ ప్రయాసలే, ఈ “ది ఒడిస్సీ” అనబడే గొప్ప గ్రీకు ట్రావెలాగ్.

ట్రోజన్ యుద్ధానికి వెళ్లిన భర్త ఉలిస్సెస్ ఏళ్ళు గడిచిన రానందున ఆయన భార్య మిగుల అందగత్తె అయిన పెనెలోప్ ఇరుగు పొరుగు రాజుల ఒత్తిడి వలన విసుగు చెంది తన ఎదిగిన కొడుకు అయిన తెలిమాకస్ ను భర్తను వెతుకుటకై పంపుతుంది. తన ద్వితీయ స్వయంవరాన్ని ప్రకటింప చేస్తుంది.  

ఇది మన భారతంలోని భర్త నలుడు కొరకు తపించి ఆయన జాడ కనుగొనుటకై యిద్దరు బిడ్డల తల్లి అయిన దమయంతి తన స్వయంవరాన్ని ప్రకటింప చేయడాన్ని గుర్తింప చేస్తుంది.

ఒడిస్సియస్ కి అమరత్వాన్ని అందజేస్తానని కాలిప్సో వనదేవత ఆశ పెట్టడటం, ఏడేళ్లు తన ఖైదులో ఉంచుకోవటం, సైక్లోప్స్ ని కలవటం, పాతాళలోక ప్రయాణం యిలా యిలా యిలా గృహోన్ముఖుడైనప్పటికీ తన భార్యను కలవలేక వివిధ రకాలైన అడ్డంకులను అధిగమిస్తూ తన గమ్యాన్ని చేరుకొని తన భార్యను కూడటమే ఈ ఒడిస్సియస్ జీవనయానం.

మీ సుందరబాబు

“ప్రపంచ సాహిత్యంలో ట్రావెలాగ్!” కి 2 స్పందనలు

  1. విన్నకోట నరసింహారావు Avatar
    విన్నకోట నరసింహారావు

    // “ పారిస్ అన్న అయిన హెక్టర్ వేసిన ఈటె అచటనే గ్రుచ్చుకొని అకిలెస్ మరణానికి కారణమవుతుంది” //

    అకిలెస్ మరణానికి కారణమయినది హెక్టర్ కాదు, పారిస్ వేసిన బాణం అకిలస్ కాలిమడమలో గుచ్చుకొనడం వల్ల.
    ట్రోజన్ యుద్ధంలో అంతకు ముందే హెక్టర్ ను అకిలెస్ వధిస్తాడు. కాబట్టి చివర్లో హెక్టర్ విసిరిన ఈటె వల్ల అకిలెస్ చనిపోయాడనేది సరి కాదు.

    1. ధన్యవాదములు అండి. తప్పుని సరి దిద్దుకున్నాము అండి.

Leave a Reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading