Apple PodcastsSpotifyGoogle Podcasts

ఇసుకే బంగారమాయెనా !

మనకి రామాయణ మహాభారత కథలు చెబుతూ మన పెద్దలు కొన్ని పిట్ట కథలు చెప్పేవారు. ఈ పిట్ట కథలు చాలా వరకు గ్రంధస్తం అవ్వవు మరియు ఇవి చాలా వరకు ప్రాదేశికాలు (లోకలైజ్డ్ అని నా ఉద్దేశ్యం). మా తెలుగు అయ్యవారు చెప్పిన చాలా పిట్ట కథల్లో నాకు చాలా ఇష్టమైన కథ ఇది.

యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేసి అనంత మైన సంపదను ప్రోగు చేసుకున్న తర్వాత ఆయనకీ ఒక ఆలోచన వచ్చిందట. వెంటనే బావ శ్రీకృష్ణుడు తో పంచుకున్నాడట, ‘కృష్ణా !, నేను మరియు నా తమ్ములం సకల రాజులను జయించాము, ఇంత సంపదను పోగేసాం, మేము ఒక సూతుడు మరియు ఒక సామంత రాజు అయిన, ఆ కర్ణుడి పాటి దానధర్మాలు చేయలేమా’ అని.

కృష్ణునికి అర్థమయ్యిందట సంపద ధర్మరాజు సహజ గుణాన్ని ఎలా నాశనం చేయబోతుందో అని, దాన్ని మొగ్గలోనే త్రుంచి వెయ్యాలని. “సరే, ధర్మజా!, నువ్వున్నూ మరియు నీ నలువురు తమ్ముళ్ళున్ను తదుపరి రోజు సూర్యోదయమవగానే సముద్రపు ఒడ్డుకు వచ్చేయండి, అక్కడ మీకు ఒక పరీక్ష పెడతాను అని పలికాడు.

తదుపరి రోజున సూర్యోదయం అయిన పిదప ఐదుగురన్నదమ్ములు, కృష్ణుడు చెప్పిన సముద్రపు ఒడ్డుకు చేరుకున్నారు. శ్రీకృష్ణుడు వెంటనే ఆ సముద్రపు ఒడ్డున వున్న ప్రతి ఇసుక రేణువును బంగారపు రేణువుగా మార్చి, పిదప పాండవులను సూర్యాస్తమయము అయ్యేలోపుల ఆ బంగారాన్నంతటిని దానం చేసెయ్యమని కోరాడు.

ఇక ఆ ఐదుగురు అన్నదమ్ములు, తలా ఒక కొలపాత్ర తీసుకొని జనులకు బంగారాన్ని కొలవటం ప్రారంభించారు. కొలుస్తున్నారు, కొలుస్తున్నారు కానీ ఎంతటికీ ఆ బంగారం తరగటం లేదు. సూర్యాస్తమయం కావొస్తుంది. వీళ్ళేమో కొలిచి కొలిచి శోష వచ్చి పడిపోయేలా వున్నారు.

కృష్ణుడు చెప్పాడు, ఇక మీవల్ల కాదు కర్ణుడిని పిలవనా అని. అంతటి నీరసం లో కూడా ఆ ఐదుగురు నవ్వారు, చూద్దాం మేము ఐదుగురం కలిసి చేయలేనిది తాను ఒక్కడే అదీ సూర్యాస్తమయం ఇంకొద్ది సమయములో ముగియనుండగా అని.

శ్రీకృష్ణుడి పిలుపునందుకొని, “ఏమిటి వాసుదేవా నీ ఆజ్ఞ” అంటూ వచ్చాడు కర్ణుడు. కర్ణా !, ఈ బంగారు రేణువులుగా మార్చబడ్డ ఇసుక రేణువులనంతటినీ నువ్వు దానమివ్వగలవా, ఇవ్వగలను అనుకుంటే వెంటనే పని ప్రారంభించమని ఆజ్ఞాపించాడు.

వెంటనే కర్ణుడు అక్కడ గుమిగూడిన జనులను పిలిచి, కను చూపు మేరలో వున్న ప్రదేశాన్నంతా వేరు వేరు భాగాలుగా విభజించి, ఒక్కో భాగాన్ని ఒక్కొక్కడికిచ్చేసాడు. ఇదంతా కళ్ళముందే లిప్తకాలంలో జరిగిపోయింది.

అన్నదమ్ములు కొయ్యబారి పోయారు. అప్పుడు కృష్ణుడు నవ్వి , ‘ధర్మజా ! దానం చేయటానికి సంపదకూ సంబంధం లేదు అది ఒక కళ. అది సహజంగా అబ్బినవాడే చేయగలడు’ అని సెలవిచ్చాడు.
కానీ వాళ్లెవరి ఊహకందనిది ఏమిటంటే కలియుగంలో, నిజంగా ఇసకే బంగామవుతుందని, దాన్ని ప్రదేశాల వారీగా విభజించి పంచేసుకోవటం ఎలా అని సోదాహరణంగా అక్కడ వున్న జనులకు చూపించామని, అలా చూసిన జనులే కలియుగంలో ఇసుకాసుర అవతారమెత్తారని. ఈ ఇసుకాసురులు గురించి మా అయ్యోరు కూడా చెప్పలా నాకు.

“ఇసుకే బంగారమాయెనా !” కి 9 స్పందనలు

 1. Surprised to see this dimension in ypu Harsha. Pleasmt reading. Took me back to ages when i used to read a lot..

  1. థాంక్యూ రామా. మిగతా కథలు కూడా చదివెయ్యండి.

 2. విన్నకోట నరసింహారావు Avatar
  విన్నకోట నరసింహారావు

  (This comment is not for publishing.)
  హర్ష గారూ, మీ ఈ “ఇసుకే బంగారమాయెనా” పోస్ట్ వేసిన తేదీ June 3, 2020 అని పోస్ట్ హెడింగ్ క్రింద చూపిస్తోంది. కానీ పోస్ట్ కు వచ్చిన ఒక కామెంట్ (from Mr.Rama Reddy), దానికి మీ జవాబు ఏప్రిల్ అని చూపిస్తోంది ఏమిటంటారు? సెట్టింగుల్లో ఏమన్సా సవరించాలా?
  (My comment is not for publishing.)

  1. నా బ్లాగు మార్చ్ ఆఖరున మొదలు పెట్టానండి. మాలిక వారు నా బ్లాగు ని మే 19 న అనుకుంటా అగ్రిగేట్ చేయటం మొదలెట్టారు. అటు పిమ్మట కొత్త కథల లింక్స్ మాలిక లో రావటం మొదలెట్టాయి. కానీ నా మిగతా కథలకు కూడా ప్రాచుర్యం రావాలి అనే ఆశతో వాటిల్ని రి-పబ్లిష్ చేయాలని ప్రయత్నించాను. ఆ ప్రయత్నం మీలాటి విజ్ఞులకు నచ్చక పోతే ఆ ప్రయత్నం నిలుపుదల చేస్తాను.

   1. విన్నకోట నరసింహారావు Avatar
    విన్నకోట నరసింహారావు

    ఓహో, రీ-పబ్లిష్ చేసిన పోస్టా? అయితే ఓకే.
    ఇందులో నాకు నచ్చక పోయేదేముందండీ? మీ బ్లాగ్, మీ ఇష్టం.
    నేనేమీ అంత “విజ్ఞుడు”ను కానండీ, తేదీలు చూస్తే కలిగిన తికమక వలన అలా అడిగాను, అంతే.
    ఒక ఉబోస … రీ-పబ్లిష్ చెయ్యడం చాలా మంది బ్లాగర్లే చేస్తుంటారు, మామూలే. మీరు తిరిగి ప్రచురిస్తున్నప్పుడు పైనో, క్రిందో ఎక్కడో ఒక చోట (Originally published on …….) అని ఒక సూచన కూడా వ్రాయండి. అప్పుడు నా బోంట్లకు తికమక కలగదు.

  1. విన్నకోట నరసింహారావు Avatar
   విన్నకోట నరసింహారావు

   Thank you, strayedlight గారు.

 3. >కథలకు కూడా ప్రాచుర్యం రావాలి అనే ఆశతో వాటిల్ని రి-పబ్లిష్ చేయాలని ప్రయత్నించాను. ఆ ప్రయత్నం మీలాటి విజ్ఞులకు నచ్చక పోతే ఆ ప్రయత్నం నిలుపుదల చేస్తాను.>>>
  మీలాంటి రచయతలు అగ్రిగ్రేటర్ లోకి రావడమే మా అదృష్టం.మీరు మళ్ళీ రీపబ్లిష్ చేయండి. రచయతలు రాయడం లేదని మాలాంటి పాఠకులు (విన్నకోటవారితో సహా) బాధపడిపోయాము కూడా.

  1. విన్నకోట నరసింహారావు Avatar
   విన్నకోట నరసింహారావు

   👍 నీహారిక గారు.

Leave a Reply