Apple PodcastsSpotifyGoogle Podcasts

మా ఇంట్లో ప్రజాస్వామ్యం పని చేయలేదు!

చేతిలో ఓ పది రూపాయలు ఆడినప్పుడు, మా అమ్మ అడిగేది మా ముగ్గురిని, ఈ రోజు ఏమన్నా తింటానికి చేసుకుందాం, మీ ఇష్టప్రకారం ఏమి చేయాలో మీరే తేల్చుకోండి అని.

వెంటనే మా అన్న, “నాకు గులాబీ జామున్ కావాలి”, అనే వాడు.  మా అక్క పాపం కొంచెం తక్కువ ఆశ కలది అయ్యి, “నాకు మినప వడలు మరియు పులుసు అన్నం కావాలి”, అనే కోరిక వెలి బుచ్చెడిది.

మరి నేను తక్కువ తిన్నానా, “ఊహు! నాకు  ఖచ్చితం గా సుకీ లు కావాలి” అనే వాడిని.

మా అమ్మ సర్ది చెప్ప బోయెడిది, పోనీ లేరా వాడు ఇంటికి పెద్ద వాడు ఈసారికి వాడు అడిగినట్టే చేద్దాము అని, దానికి నేను మా అక్క ససేమిరా అంటే ససేమిరా అనే వాళ్ళము మా వాదన మేము కొనసాగించే వారము.

మరికొంత సమయమయ్యాక, మా అమ్మ తన సెంటిమెంట్ తో, పోనీలెండిరా ఆడపిల్ల, అది మన ఇంట్లో ఉన్నంత కాలమే బాగుండేది, ఆ తర్వాత దాని కోరికలు తీరుతాయో లేదో అని మా అక్కవైపు మొగ్గు చూపేది. దానికి నేను మా అన్న మేము చస్తే ఒప్పుకోము అనే వాళ్ళము.

వాదనలు ప్రతి వాదనలు జరిగిపోయేవి, ఎవరికీ వారమే పోయిన సారి ఇతరుల కోసం మేము ఒక్కొక్కరం ఎంత త్యాగాలు చేసి నష్టపోయేమో చెప్పుకొని వాదించుకునే వారము.

మరికొంత సమయమయ్యాక మా అమ్మ నా వైపు మొగ్గేది, పొనీలేరా వాడు చిన్న వాడు మీకందరికంటే, నాకు చేదోడు వాదోడు వాడే, అంగడికి వెళ్ళేది వాడే, రేషన్ షాప్ కి వెళ్ళేది వాడే, మీరు తినే దోశె లకు పిండి మర ఆడించుకొచ్చేది వాడే అని.

వాళ్లిద్దరూ నీకు వాడంటేనే ఇష్టం అందుకే వాడికి వత్తాసు అని ఆవిడ మీదకే యుద్ధానికి వెళ్లే వాళ్ళు.

ఇలా కొంత సమయమయ్యాక, అప్పటి వరకు నోర్లతోనే సరిపెట్టుకున్న మాకు ఒకరి మీదకు ఒకరి చేతులు ఆడటం మొదలు పెట్టేవి.

ఇక ఓపిక నశించిన మా అమ్మ మా ముగ్గురుని తలా ఒకటి బాది, మిమ్మల్ని అడగటం నాదే బుద్ధి తక్కువ. సగ్గు బియ్యం తో పాయసం చేస్తా ఇష్టమున్నోడు తినండి, కష్టమున్నోడు మాడండి అని ఆ పాయసం కాసి  పోసేది.

నాకు అప్పుడు ఒక ప్రశ్న ఉదయించేది కుటుంబమనే ప్రజాస్వామ్యంలో ఏకాభిప్రాయం అసలుకే కుదరదా అని, నియంతృత్వమే సమాధానమా అని. లేక మా అమ్మ ముందే సగ్గు బియ్యం తో పాయసం చేయడానికే నిర్ణయించేసి, ఏకాభిప్రాయం పేరుతో మాకు ఎక్సపెక్టషన్ సెట్ చేసిందా అని.

“మా ఇంట్లో ప్రజాస్వామ్యం పని చేయలేదు!” కి 9 స్పందనలు

 1. విన్నకోట నరసింహారావు Avatar
  విన్నకోట నరసింహారావు

  ఉదాహరణకు .. ఏకాభిప్రాయం ఏకాభిప్రాయం అంటూ రాష్ట్రవిభజనకు ముందు జపం చేసేవారు. చివరకు వాళ్లు చెయ్యాలనుకున్నట్లుగా చేశారు. ఇంట్లో అయినా అంతేనండీ 🙂.
  “సుకీలు” అనగా ఏమిటి?

  1. సుకీలు అంటే ఒకరకంగా పూర్ణాలు అనుకోండి. మా అమ్మ చేతి సుకీలు తినాలంటే అందరు మా ఇంటికి రండి.

   1. విన్నకోట నరసింహారావు Avatar
    విన్నకోట నరసింహారావు

    థాంక్స్, హర్షవర్ధన్ గారు 🙂.

   2. మా ఇంట్లో సూకీలకి ఏకాభిప్రాయం ఉంది.మీది ఏ ఊరు ?

   3. మాది నెల్లూరు అండి. మా నెల్లూరోళ్లు ఎంతయినా ప్రత్యేకమబ్బా, చదివెయ్యండి ఒక్క సారి. ఈ దిగువ ఇచ్చిన లింక్ సహాయంతో https://harshaneeyam.in/2020/03/29/special-nellorians/

 2. దీనినే ప్రజాస్వామ్యం ముసుగు వేసుకున్న రాచరికం అంటారు.

 3. ఏకాభిప్రాయం అన్నది కుదిరితే నియంతృత్వమే ఉండేది కాదు. మీ అమ్మగారు నయం. నేనయితే గులాబ్ జామ్,మినపవడలు,సుకీలు వండ వలసివచ్చేది. ఎవరినీ బాధపెట్టలేము కదా ?
  సుకీలు అంటే ఏమిటండీ ?

 4. సామాన్యులలో ఏకాభిప్రాయం కుదరనపుడు బలవంతుల మాట అలా చెల్లిపోతుందట!

 5. Me tinubandarala kada bavundi,mana Nlr lo matrame ‘sukhilu’ antaaru ikkada poornalu ani kooda antaaru

Leave a Reply