Apple PodcastsSpotifyGoogle Podcasts

మా జి.వి.ఎస్ మాస్టారు గారు!

జి.వి.ఎస్ మాస్టారు గారు ఒంగోలు P.V.R.మునిసిపల్ హై స్కూల్ లో నా టీచర్. ఆయన పూర్తి పేరు గాలి వెంకట సుబ్బారావు గారు. ఆరడుగుల మనిషి, స్ఫురద్రూపి, లెక్కలు  మరియు సైన్స్ అయన స్పెషాలిటీ. ఇదికాక ఆయన అద్భుతమైన వక్త,  విషయం ఏదైనా తెలుగు లో చాలా అందంగా, అనర్గళంగా మాట్లాడగలరు.

నాకున్న తెలుగు తెగులు ఆయన నుంచే తగులుకుంది అని నా అనుమానం. బడిలో విన్నది చాలక ఆయన గొంతు విందామని ఆయన దగ్గరకి ట్యూషన్ కూడా వెళ్ళేవాడిని. మొదటి నుండి ఆయనకు నేనంటే ఎందుకో ప్రత్యేకమైన అభిమానం.

ఏరా, అబ్బాయి అంటూ ప్రేమగా పలకరించే వారు. ఒకసారి మా బడిలో వక్తృత్వం పోటీలు జరుగుతున్నాయి. నలుగురు జడ్జీలలో జి.వి.ఎస్ మాష్టారు గారు ఒకరు. నేను గది బయటుంటే చూసి, “ఏరా, నువ్వు కూడా పోటీ లో ఉన్నావా?” అని అడిగారు, అవునండి అన్నాను నేను.

నా వంతు వచ్చేసరికి ఆయన ఆ పోటీలు జరిగే ప్రదేశంలో కనపడలా నాకు.  పోటీ అంతా అయిపోయాక టీచర్ల గదికి వెళ్లిన నాకు, ఆయన కాలు మీద కాలు వేసుకొని, బ్లిట్జ్ పేపర్ చదువుకుంటూ కనపడ్డారు. నేను రావటం గమనించి, ఆయన తల పైకెత్తి, కళ్ళద్దాల్లోంచి చూస్తూ, “ఏరా! బాగా చేశావా?” అని అడిగారు. ఫస్ట్ ప్రైజు వచ్చిందండి అని చెప్పా, తల ఎగరేసి కాస్త ఉక్రోషంగా. ఆయన చిన్నగా నవ్వేసి, “నా ప్రశ్నకి సమాధానం అది కాదురా” అని అన్నాడు.

కోపంగా వెను తిరిగిన నాకు వెనకనుండి , “చూడరా అబ్బాయీ, నీకు ప్రయిజు వస్తుందని నాకు తెలుసు. నేను అక్కడ వుండి వుంటే, నువ్వు ఎట్టా వాగినా , నీకు మార్కులు వేసేవాడిని. అది ఇష్టం లేకే వచ్చేసాను” అని చెప్పటం వినిపించింది.

ఇక్కడ ముళ్ళపూడి వారు చెప్పినట్టు ఓ చిన్న కోతి కొమ్మొచ్చి. మా వాడొకడు ఆ మధ్య ఏదో సందర్భములో క్లాసు పీకుతూ , చాల స్టైల్ గా ఆంగ్లములో, “దేర్ ఈజ్ నో మీనింగ్ అఫ్ ఫ్రెండ్షిప్, ఇఫ్ దేర్ ఈజ్ నో ప్రిజుడిస్” అన్నాడు. 

పదవ తరగతిలో జరిగిన వార్షికోత్సవంలో నాకు చాల బహుమతులు వచ్చాయి. వాళ్ళ బంధువులలో ఒకాయనకు నన్ను పరిచయం చేస్తూ చెప్పారు ఆయన, “ఈ సారి పదవ తరగతిలో మా బడికి మొదటిస్థానం కూడా మనోడిదే” అంటూ. చిన్నప్పటినుండి తెలుగు అంటే ఎంత ఇష్టమో, హిందీ అంటే అంత చిరాకుగా ఉండేది నాకు. అదేదో సినిమాలో బ్రహ్మానందం, “ఆవిడని  ప్రేమించాల్సి వచ్చింది” అని చెప్పినట్టు, ఇప్పుడు నాకు నార్త్ కి వెళ్ళినప్పుడు తప్పనిసరియై హిందీ మాట్లాడాల్సి వస్తుంది, భాష అంటే ప్రేమ ఎక్కువై కాదు, వాళ్ళు ఇంగ్లీషులో మాట్లాడితే భరించలేక.

పదో క్లాసు పరీక్షలలో హిందీ పరీక్షకు ముందు, మాకు మూడు రోజులు శెలవులు వచ్చాయి. అన్నీ సబ్జెక్ట్స్ ని ఒకటికి పది సార్లు చదివి, రివిషన్ చేసుకొనే అలవాటు వున్న నేను, హిందీని మాత్రం పూర్తిగా వదిలేశా. ఆ మూడు రోజులలో టెన్షన్ మొదలయ్యింది, సరిగా చదవ లేక పోయా, రాయ లేక పోయా. ఒకటి కాదు కదా , రెండు నుండి కూడా జారిపోయి, మూడుకి వెళ్ళిపోయా నేను . ఇరవై ఐదు   మార్కుల తేడా నాకు ఫస్ట్ రాంక్ వచ్చిన గోపాల్ గాడికి.

ఈ లోపల మా నాన్నకి నంధ్యాలకి ట్రాన్స్ఫర్అ య్యింది. వెర్రి మొహమేసుకొని వెళ్ళాను ఆయన్ని కలవడానికి. “ఏరా! ఎందుకిలా అయ్యింది” అన్నారు ఆయన నా భుజం మీద చేయి వేస్తూ. విషయం వివరించాను ఆయనకు. “చూడరా అబ్బాయీ! పని ముఖ్యం అనుకుంటే, ముహుర్తాలు చూడకూడదురా. ముందే పూర్తి చేసేసుకోవాలి” అన్నారు. వచ్చేస్తూ చెప్పాను ఆయనకు, ” మళ్ళీ బాగా పైకి వచ్చాక వచ్చి కనపడతాను అండి” అని. నా పైకో లేక మీదకో రావొద్దురా, బాగా ప్రయోజకుడివై రారా అని దీవించి పంపారు.

ఆ తర్వాత చదువు , ఉద్యోగం, పెళ్లి అన్నీ జరిగిపోయాయి కొన్ని నా ప్రమేయంతో కొన్ని అప్రమేయంగానే. ప్రయోజకుడయ్యానో లేదో అనే అనుమానం వున్నా, వెళ్లి ఆయన్ని కలిస్తే బాగుండు  అని చాల సార్లు అనిపించేది.

పది దేశాలు, పదహారు రాష్ట్రాలు తిరిగినా, ఆయన్ను కలవడానికి సమయం దొరకలేదు నాకు ఎప్పుడూ . ఓ ఐదేళ్ల కింద ఆఫీసు పని మీద ఒంగోలు వెళ్ళాను. అక్కడ ఎంక్వయిరీ చేస్తే , రాత్రి ఎనిమిది లేక ఎనిమిదిన్నర మధ్యలో సాయి బాబా గుడికి వచ్చి మంచి ఉపన్యాసాలు ఇస్తుంటారు అని ఎవరో చెప్పారు.

ఆ సాయంత్రం వెళ్ళాను గుడికి. గుడి బయట, గుడి లోపల లేక గుడి మంటపం లో వెతికిన నాకు ఆయన ఎక్కడా కనపడలేదు. గుడిలో వున్న పూజారి వద్దకు వెళ్లి వాకబు చేశా ఆయన గురించి, ఎక్కడ కలవ వచ్చు ఆయనని అని.

చాల మందికి ఒక దరిద్రం అలవాటు వుంటుంది. అసలు విషయానికి రాకుండా, విపరీతమైన ఉపోద్ఘాతాలు ఇస్తారు, మెగాస్టార్ ఇంట్రొడక్టరీ సీన్ లో ముందు బూటు దగ్గర నుండి మొదలుపెట్టి, అటు పిమ్మట, కాలు, ప్యాంటు, చేయి, చేతి వేళ్ళు విడి విడిగా, ఆ తర్వాత కలిపి చూపినట్టు. “ఆయన రోజు యిక్కడికి వస్తుంటారు యీ సమయంలో, ఆయన చెప్పే ఉపన్యాసాలు అంటే జనాలు చెవి కోసుకుంటారు, యీ మధ్యనే స్నానాల గదిలో జారి  క్రింద పడితే వాళ్ళ అబ్బాయి వైద్యానికని హైదరాబాద్ కి తీసుకెళ్లాడు” అని చెప్పారు. ఆతృతగా ఏ హాస్పిటల్కి అని అడిగిన నాకు, “కూకట్ పల్లి లో  ఏదో రెమెడీ హాస్పిటల్ అట” అని సమాధానమిచ్చారు.

ఆ రెమెడీ మా యింటికి పదిహేను నిముషాల దూరం లోపే . వాళ్ళ అబ్బాయి ఫోన్ నెంబర్ ఇవ్వగలరా, మాస్టారు గారిని ఓ సారి కలవాలి నేను అని అడిగా. “అయ్యో! మాస్టారు గారు చనిపోయి రెండు రోజులయ్యింది”, అంటూ ఆయన అక్కడనుండి వెళ్లిపోయారు ఎవరో ఆయన్ని పిలవటంతో.

నోట మాట రాలేదు నాకు, కళ్ళల్లో నీళ్లూరలేదు. బాధ కాదు, ఇంకా అంతకన్నా ఏదో ఎక్కువ అన్న భావన. చివరగా అయన చెప్పిన మాటలే నా చెవిలో గింగురుమంటున్నాయి, “చూడరా అబ్బాయీ! పని ముఖ్యం అనుకుంటే, ముందే పూర్తి చేసుకోవాలిరా, ముహూర్తాలు చూసుకోకూడదు” అని.

నిజమే చాలా విషయాలు ముఖ్యమని చాలా ఆలస్యంగా తెలుస్తుంటాయి,

హైదరాబాద్ వచ్చి వారం అయినా, అదే బాధకన్నా …ఎక్కువైన ఏదో భావన. కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచనలలో పడిన నాకు అప్పుడు స్ఫురించింది, అది బాధ కాదు వెలితి అని.

మా జి.వి.ఎస్ మాస్టారు గారు అయితే మాథమెటికల్ గా, “ఒరే అబ్బాయీ! బాధ అనేది ఈజ్ ఏ ఫంక్షన్ అఫ్ టైం. అది కాలం తో పాటు పోతుందిరా. వెలితి అనేది నువ్వు కాలం చెందితే తప్ప పోదురా. ఇట్ కెన్ ఓన్లీ డై విత్ యు!” అనే వారేమో. 

“మా జి.వి.ఎస్ మాస్టారు గారు!” కి 7 స్పందనలు

 1. అయ్యో. నేను కూడా వాయిదా పద్ధతుంది దేనికైనా అని గడుపుతూ చాలా విషయాల్లో పశ్చాత్తాపానికి గురయ్యాను.

 2. Sri GVSమాస్టారుకు నాకు అనుబంధం ఏక్కువ ఎందుకంటే ఆయన మాకు దగ్గరి బంధువు అందుకనే పదవతరగతి తప్పుతావు ఎందుకైన మంచిదని మా నాన్నగారు మాస్టారు ఇంటిదగ్గర రాత్రి పడుకోనే అరెంజిమెంట్ చేశారు .నాకు హింది అంటే చాల భయం ఎందుకంటే నేను క్రికెట్ ఆటకు ఏక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని.ఆ ఆటలో కూడా కోన్ని మధురానుభూతినలు సోంతం చేసుకోన్నాను మరియు దెబ్బలు తగిలించుకోన్నాను.శ్యామ్ ,ఆనంద్ , స్వర్గీయ రామకృష్ణ మరియుభాస్కరు క్రికెట్టులో నాదోస్తులు.మేమంతా ప్రకాశం బడి గ్రేండు లో ఆడేవాళ్ళం.ఇప్పటికి బ్యాచులు నడుస్తున్నాయి.. నా బాల్యమిత్రుడు భాస్కరరెడ్డి ఓక 6నెలలు కలసి వున్నాం మాస్టారు ఇంటిదగ్గర.నాకు తెలిసి మాస్టర్ ఎప్పుడు విద్యార్థుల ను మందలించిన సందర్భాలు లేవు.వారు మరియు వారి కుటుంబ సభ్యులందరు అందరితో చాల ప్రేమగా వుండేవారు.మాస్టరుకు బాగాలేక హైదరాబాద్ తీసుకవెళ్ళారని తెలుసు.ఓక రోజు మార్నింగ్ కడుపు ప్రేగులలో చెప్పలేని బాధ వచ్చింది. ఎప్పుడు ఇటువంటి బాధనేను జీవితంలో అనుభవించలేదు.ఏమైవుంటుందని నేను ఆలోచించేలోపల మా మేనమామగారు మరియు మానాన్న గారు ఇద్దరు మాస్టారు ఇహ మనకు అందుబాటులో లేరనే విషయం వివరించారు. జీవితంలో చాల లోటుగా అనిపించింది. తరువాత కోన్నాళ్ళు కి మాదగ్గర వున్న డి.ఎ.వి హైస్కూల్ లో సైన్సు సబ్జెక్టులో మొదటిగా వచ్చినవారికి బహుమతి కోన్నాళ్ళు ఇచ్చాం.సేట్టు లు డివైడ్సు అయిన తరువాత మెనెజ్మెంట్ సుముఖంగా లేకపోవటం వలన విరమించవలసి వచ్చింది.ఆయన మంచివక్త మరియు మహభక్తుడు.మల్లవరంస్వయంభు
  శ్రీ వేంకటేశ్వరస్వామి వారిదేవస్ధాన్నాకి మరియు ఓంగోలు షిర్డిసాయిబాబా సంస్ధానానికి చాలకాలం సేవ చేశారు.ఆయన ఏల్లరకి ప్రాతఃస్మరణీయుడు .ఆయనోక విజ్ఞానభాండాగారం.ఎంతో నిస్వార్ధసేవచేసిన మహనీయులు. ఆయన ఆశ్శీసులు ఎల్లప్పుడు మన పై వుండాలని కోరుకోంటు సెలవుతీసుకోంటున్న శిష్యపరమాణువు.నమస్కారాలతో
  మీ
  పుట్టంరాజు పవనకుమార్ .అద్ధంకి.

  1. పవన్ కుమార్ గారు, చాలా సంతోషం సర్.

   జీవీఎస్ మాస్టర్ గారి, మల్లవరంలో జరిగే తిరునాళ్లకి వాలంటీర్ గా ఒక సంవత్సరం, ఆయన నన్ను పంపించారు.

   ఆ సందర్భంగా ఆ వూళ్ళోని వాళ్ళ ఇంటికి వెళ్లడం తటస్థించడం, వారి అమ్మ గారి చేతి బెల్లం కాఫీ తాగడం , నాకింకా జ్ఞాపకం సర్.

   జీవీఎస్ మాస్టర్ గారి సాంగత్యం, నా జన్మాన్తర సుకృత ఫలితం అని నేననుకుంటానండి.

 3. నమస్కారం 🙏,

  అనీల్ కుమార్ గారు, మీరు మీ భావాలను మరియు గురువు పట్ల మీ ఆరాధనను చాలా బాగా వ్యక్తపరిచారు.

  మీ అనుభవాన్ని చదివాక, జీ. వీ. మాస్టారు మిమ్మల్ని ఎంతగా ప్రభావితం చేశారో అర్థం అవుతుంది. ఇది మాస్టారు గారి వ్యక్తిత్వానికి నిదర్శనం…

  “పని ముఖ్యం అనుకుంటే, ముందే పూర్తి చేసుకోవాలిరా, ముహూర్తాలు చూసుకోకూడదు” ఇవి కేవలం వాక్యాలు కావు, సరిగ్గా అర్థం చేసుకుంటే జీవిత గమనాన్ని మార్చే ప్రభావిత శరాలు. ఇవి నన్ను కూడా ఆకట్టుకున్నాయి.

  “బాధ అనేది ఈజ్ ఏ ఫంక్షన్ అఫ్ టైం. అది కాలం తో పాటు పోతుందిరా. వెలితి అనేది నువ్వు కాలం చెందితే తప్ప పోదురా. ఇట్ కెన్ ఓన్లీ డై విత్ యు!”. మీ మనసులో మాస్టారు గారిని కలవలేదనే బాధ ఎంతగా ఉందో, ఎంత వెలతి మిగిలిచిందో, ఈ వాక్యాలు చెబుతున్నాయి. నిజమే, “చేయాలనుకున్న పని వెంటనే చేసేయాలి, నాంచకూడదు…”

  ఈ రోజు, మాస్టారు గారి వ్యక్తిత్వం నుండి కొంత, మీ అనుభవం నుండి ఎంతో కొంత పాఠం నేను కూడా నేర్చుకున్నాను…

  జీ. వీ. ఎస్ మాస్టారు గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి…🙏🙏🙏🌹🌹🌹

  మీరు మీ అనుభవాన్ని అక్షర రూపంలో మా అందరికీ చెరవేసినందుకు కృతజ్ఞతలు…💐💐💐

  1. గిరీష్ గారు, చాలా ధన్యవాదాలు.

 4. చదవడానికి, ఇష్టంతో అదే చదువును ఆకళింపు చేసుకోవడానికి మద్య ఒక వంతెన గురువు.
  అతను ఓ మెంటర్, అయ్యోరు, టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్ లేదా జీతం ఇచ్చే బాసులా సందర్భానుసారం మారుతూ ఉంటాడు.
  (పాఠకుల లింగభేద పరిగణ తమ ఇష్టం)
  ఏనాడైతే విద్యార్థుల వ్యక్తి వికాసం కొరకు గురువు తపిస్తాడో, మాస్టారిలా తమవారి భవిష్యత్తు కోసం ఓ అందమైన రహదారిని నిర్మిస్తారు.

  నేను నాలుగవ తరగతిలో ‘జూలియస్ సీజర్ నాటిక’ మా టీచర్ ఇచ్చిన స్పూర్తితో పూర్తిగా ఆంగ్లంలో మాట్లాడి ” యూ టూ బ్రూటస్ ” అన్నప్పుడు ఆ విలువ ఈరోజు నా భాషకి ఎంతగా ఉపయోగ పడిందో బాగా తెలుసు. నాలాగే ప్రతి ఒక్కరికీ ఇలాంటి విషయాలు తెలుసుంటాయి. వీలైనంత వరకు కలవడానికి ప్రయత్నించి చూడండి. అలా వచ్చే సంతృప్తికి వర్ణన లేదు.
  గురుభ్యోనమహః 🙏

  1. రవి! మీ వ్యాఖ్యలు ఈ కథలకి ఓ కొత్త flavour ని తీసుకొస్తున్నాయి . Please keep contributing.

Leave a Reply