Apple PodcastsSpotifyGoogle Podcasts

ఆరుముగం దెబ్బ మా నెల్లూరు అంతా అబ్బా!

నేను ఎనభైయ్యవ దశకంలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో అనుకుంటా మా సంతపేటలోని తూకుమానుమిట్టలో రాత్రికి రాత్రే ఆరుముగం & కో అనే కుంపిణి అదిరిపోయే వ్యాపార ప్రణాళికతో వెలిసింది. “ఇందు మూలముగా అందరికి తెలియ చేయటమేమనగా మీరు గాని మా దగ్గరకు వచ్చి మా వస్తు పట్టికలో కనపడ్డ వస్తువును కనపడినట్టు ఆత్రముగా మూడవ వంతు ధర పెట్టి టిక్కు పెట్టుకుంటే మీకు ఆ వస్తువు రెండు నెలల్లో పువ్వుల్లో పెట్టి అప్పచెప్పబడును” అనే వాళ్ళ ప్రకటన సారాంశం నాకైతే అర్థం కాలా నాకు లెక్కలు రావు కాబట్టి. 

మా నెల్లూరోళ్లు, లెక్కల్లో మహా ఘటికులు, లెక్కలేసేసి, మూడు రూపాయల వడ్డీ గిట్టుబాటు అవతుళ్లా  మనకి అనుకొని, తరవాత రోజునుండి అమెరికాలో గాని థాంక్స్ గివింగ్ ముందు రోజు రాత్రి జంపఖానా పరిచి పడుకున్నట్టు పండుకొని పోయారు, ఎక్కడ మిగతా వాళ్ళు ఆ వస్తువులు తన్నుకు పోతారేమో అని.

సమయం గడిచే కొద్దీ అల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ కాదురా నాయనా తూకుమానుమిట్టకిరా అన్నట్టు ఒకటే తిరునాళ్ల, కట్టే వాళ్లు కట్టి పోతుంటే, పట్టకెళ్లే వాళ్ళు పట్టకెళ్లి పోతున్నారు.

అప్పట్లో మా నెల్లూరోళ్లకి పండగలొస్తే ఇంట్లో వుండే స్టీల్ సామానులని బయట తీసి, విమ్మో లేక సబీనాతో తోమి, వీధిలో వెళ్లే వాళ్ళకి, డిస్ప్లే పెట్టందే నిద్రబట్టేది కాదు. ఈ బలహీనతని మా ఆరుముగం బాగా పట్టేసేడు. రాబోయే పండగ సీజన్కి ఆరు నెలలు ముందుగానే దేశంలో వుండే స్టీల్ సామానులు తయారుచేసే ఫ్యాక్టరీల నన్నిటిని గంపగుత్తగా లీజ్ కి తీసేసుకొని మూడు షిఫ్టులలో తయారు చేయించి నెల్లూరులో దించేసేశాడు.  దానికి వాడు ఆ రోజుల్లోనే BI /BW వాడాడని నాకు అనుమానం.

స్టీల్ సామానులు తర్వాత మా నెల్లూరోళ్లకి ఆరోజుల్లో వాళ్ళ ఇంట్లో ఎంత పెద్ద బీరువా ఉంటే అంత గొప్ప. ఏ బీరువా అయినా గాడ్రేజీ బీరువానే మా వాళ్లకి.  స్టీల్ సామానులు తర్వాత ఎక్కువ మా వాళ్ళు పట్టుకెళ్ళినవి ఈ బీరువాలు, బి.ఎస్.ఏ సైకిళ్ళు, ఆ తర్వాత ఎప్పడు బొమ్మ రాదుకాని బహు భద్రంగా షట్టర్లు తో సహా వచ్చే క్రౌన్ టీ.వీ లు, ఎన్ని టీ.వీలో వాటికి నాలుగు రెట్లు సంఖ్యలో ఆంటెన్నాలు.

మీకు సందేహం రాలా నాలుగు రెట్లు ఆంటెన్నాలు  ఏందబ్బా అని? నాకు వచ్చింది, వెళ్లి ఆరా తీస్తే ఒకాయన ఎవరికీ చెప్పనని ఒట్టేస్తే తన గోడు వెళ్లబోశాడు, “మా ఆడమడిసి నువ్వు ఇంట్లో టీ.వీ అన్నా పెట్టకపోతే పెట్టక మాయినావు, ఇంటి మీద ఆంటెన్నా అన్నా పెట్టబ్బా, యింటికొచ్చిన  చుట్టాలకి మా టీ.వీ రిపేర్ కి వెళ్లిందని చెప్పుకొని బతికేస్తా అని ఒకటే సతాయిస్తా వుందబ్బయ్యా” అని. అలా వుంటాయబ్బా మా నెల్లూరోళ్ల యవ్వారాలు.

మా చుట్ట పక్కల వాళ్లంతా డబ్బులు కట్టేశారు, కొని తెచ్చేశారు. మా ఇంట్లో మా దగ్గర డబ్బులు అసలే లేవు. నేను ఏదో ఒకటి కొందాము అని రోజు అన్నం కూడా తినకుండా అలిగి అలిగి ఇక ఏమీ జరగదని నిస్పృహ లోకి వెళ్ళిపోయా.

మా దోస్తులేమో రంగు రంగుల బి.ఎస్.ఏ సైకిళ్ళు తొక్కేస్తున్నారు, కొన్న బీరువాలో ఏమి పెట్టాలో తెలియక ఇంకా చెక్కు చెదరకుండా వుంటాయని వాళ్ళ తరగతి పుస్తకాలని పెట్టుకుంటున్నారు. కొందరైతే ఇంట్లో టీ.వీ లేదని తెలిసినా పక్కనోళ్లు చూసేలా ఆంటెన్నాలు తెగ అడ్జస్ట్  చేసేస్తున్నారు, సిగ్నల్ అందటం లేదు అని చెప్పుకుంటూ. మా నెల్లూరులో అప్పుడు మా టీ.వీ సిగ్నల్ అందటం లేదు అని చెప్పుకోవటం పెద్ద ఫాషన్, అంతర్లీనంగా మా ఇంట్లో టీ.వీ వుంది అని తెలిసేలా.

ఇక లాభం లేదని నేను సరాసరి రామలింగాపురం లోని మా చిన్నక్క దగ్గరకి వెళ్ళిపోయా. మా ఆరుముగం దగ్గర నువ్వన్నా కొని బాగుపడవే, నాకు ఎలాగూ బాగుపడే అదృష్టం లేదు అని. మా అక్క కోళ్ళని పెంచి, పొట్టేళ్లని పెంచి తెగ వెనకేసుకుందని నా నమ్మకం. నువ్వు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, వేలి పొడువునా తీసుకొని మొహానికి రాసుకొనే ఫెయిర్ అండ్ లవ్లీ మూడు నెలలు మానేస్తే మీ ఇల్లంతా స్టీల్ సామానులతో నింపెయ్య వచ్చు అని సాయంత్రం దాకా ఊదరకొట్టి, లాస్ట్ బస్సుకు బయలుదేరతీసి  నెల్లూరుకు తీసుకొచ్చా.

మరునాడు వెళ్లి నాలుగు స్టీల్ బిందెలు, మూడు గంగాళాలు, ఓ ఐదు చిల్లుల గరిటెలకు డబ్బులు కట్టేసి వచ్చాము. అప్పటికి గాని నా కడుపు ఉబ్బరం తగ్గలా.

మా అక్క వెళ్ళిపోయాక నేను గోడమీద బొగ్గుతో గీతలు గీయటం మొదలుపెట్టా, ఎన్ని రోజులు మిగులున్నాయో మా అక్క ఖజానా మా ఇంటికి రావటానికి అని. రోజులు గడవటం  నాకు చాలా కష్టం గా వుంది. మా చుట్టూ పక్కల ఇళ్లల్లో వాళ్ళ సామానులు తెచ్చుకోవటంలో ఇతోధిక సహాయం చేస్తూ గడిపేస్తున్నా కానీ నాకు ముళ్ల మీద కూర్చున్నట్టే వుంది.

అప్పటికి ఏభై రోజులయ్యాయి మా అక్క డబ్బులు కట్టి. మా ఆరుముగం వ్యాపారం మూడు పువ్వులు  ఆరు కాయల మాదిరి వర్ధిల్లుతూనే వుంది, మా జిల్లానే కాదు పక్క జిల్లాల నుండి కూడా తాకిడి ఎక్కువయ్యింది, మా ఆరుముగానికి దేశమంతా శాఖలు వున్నాయని, అసలు వ్యాపారంలో అంబానీ అంతటోడు అని గట్టిగా నమ్మేస్తున్నారు మా జనాలు.

ఆ రోజే మా పక్కింటి ఈశ్వరక్క వాళ్ళ బీరువా డెలివరీ డేట్. వెళ్లి తెచ్చుకుందాం అక్కా! అంటే, ఈ రోజు మంచి రోజు కాదురా, బీరువా మన ఇంటి లక్ష్మిరా అని ఆవిడ వద్దు అంది. మనం వినం కదా, కుదరదంటే కుదరదు వెళ్లి తెచ్చుకోవాల్సిందే అని పట్టు పట్టి వెళ్లి తెచ్చేశా.

తెల్లవారి ఉదయాన్నే మా ఆరుముగం అండ్ కో కుంపిణి ముందు ఇసకేస్తే రాలనట్టు జనం. అబ్బా! మన నెల్లూరి జనాభా మనకి తెలియకుండానే ఇంత పెరిగిపోయిందా అనేలా. ఏందిరా నాయనా! అని వెళ్లి చూడగా ఖాళీ ఆఫీసు కనిపించింది. అక్కడ గుమికూడిన జనాలకి ఆవేశం పెరిగింది, ఆ ఆవేశంలో ఆ ఆరుముగం అండ్ కో ఆఫీసుకు ఎదురుగా వుండే మా మునికుమారి వాళ్ళ నాన్నగారు అయిన కిష్టయ్య గారు ఒక పోలీస్ కానిస్టేబుల్ అని గుర్తు కొచ్చి ఆయన ఇంటి మీద పడ్డారు, మీరు మా సామానులకు జవాబుదారీగా ఎందుకుండలేదు అని.

అంత ఆవేశం లో కూడా మా నెల్లూరోళ్లు లెక్కవేసేసారు, ఎంత లేదన్న ఒక కోటి పట్టుకెళ్లి ఉంటాడు ఆరుముగం అని.

పది రోజుల తర్వాత రామలింగాపురం నుండి వచ్చిన మా అక్కకి నేను రెండు రోజులు దొరక్కుండా తప్పించు తిరిగా. మూడో రోజు పట్టుకొని కోపంగా అడిగిన మా అక్కకు, “ఎర్లీ బర్డ్ కాచెస్ వర్మ్”, అని చెప్పా. మా అక్కకి అర్థం కాలేదు, తెలుగు ఏడవరా అని ఒకటి పీకింది. చెంప తడువుకుంటా కోపంగా చెప్పా, “మా ఈశ్వరక్క అదృష్టాన్ని కాజేసేవాడు, నీ దురదృష్టాన్ని బాగు చేసే వాడు ఈ లోకం లోనే పుట్ట లేదు” అని. 

ఆ విధంగా మా అక్కనీ, నన్ను, నాతోపాటు చాలా మంది నెల్లూరి జనాలని తెల్లమొగం వేయించిన ఆరుముగం అటుపిమ్మట మీ మీ ఊర్లలో కూడా తెల్ల రంగులు వేసే వుంటాడు ఖచ్చితంగా, బహుశా ఇంకో స్కీం పేరుతో. మనలోని దురాశే ఆరుముగాలకి పెట్టుబడి మరి.  

“ఆరుముగం దెబ్బ మా నెల్లూరు అంతా అబ్బా!”‌కి ఒక స్పందన

Leave a Reply