Apple PodcastsSpotifyGoogle Podcasts

మా నెల్లూరోళ్ల కథలు కంచికి చేరవబ్బా!

ఓడమ్మా భడవా ఐదు నిమిషాల్లో నెల్లూరుని కళ్ళకు కట్టినట్టు విన్పించావు కదరా సామి, అన్నారు మా నెల్లూరోళ్లు వాళ్ళ కథవిని. కొందరైతే నేను ఏమేమి కవర్ చేయలేదో వాటిల్ని అన్నిటిని రాసి పంపించారు, అబ్బయ్య అసలు నీవు ఈటిల్ని ఎట్టా మర్చిపోయినావు అని. సో బాహుబలి పార్ట్ 2 మాదిరి మన నెల్లూరోళ్లు పార్ట్ 2 తయారు చేశా.

మొదలుగా గుర్తు చేసుకోవాల్సింది కమ్యూనిజంకి అసలు సిసలు అర్థం చెప్పి జనాల సేవే, జనార్థన సేవ అనుకొని మనకి సేవలు చేసిన రామచంద్రా రెడ్డి ఆసుపత్రి మన నెల్లూరికే కాదు రాష్ట్రానికే గర్వకారణం.

అట్టానే జమీన్ రైతు, గురించి గూడ చెప్పాల. ప్రపంచంలో ఎక్కడున్నా వారం వారం ఇంటికి తెప్పిచ్చుకోని జమీన్ రైతు చదివేవాళ్ళు, పోస్ట్ లో ఆ వారం మిస్ అయితే అన్నం మానేసే నెల్లూరోళ్లు నాకు తెల్సు. ఇప్పుడంటే ఆన్లైన్ ఎడిషన్ వచ్చిపారేసిందనుకో. మేము వి.ఆర్ కాలేజీకి వచ్చేపాటికి లాయర్ గూడ బాగా పాపులర్ అయ్యింది. ఇంకా ఈ రెండు పేపరోళ్ళు మన సబ్స్క్రిప్షన్ అయ్యిపోయినా ఆపకుండా ఇంటింకి పంపిస్తారు మన ఊరోళ్ళే కదా అని.

వాళ్ళ పేపర్లు నష్టాల్లో వున్నా అట్టా చెయ్యడం వాళ్ళకే చెల్లింది. అట్టా ఉంటాయి మావోళ్ల అభిమానాలు.

మదీనా వాచ్ కంపెనీలో దొరికే హెచ్.ఎం.టి వాచ్ ల గురించి, నెల్లూరులో వీధినపడి రిక్షాలో తిరుగుతూ ఆడ మగ గొంతులు రెండు ఆయనే మాట్లడుతూ, ప్రచారం చేసే మనిషి, నాకు మా చిన్నప్పుడు ఓ ప్రపంచ వింత.

ఆలాగే నేను పాంటు కుట్టించుకోవటం, నా ఇంటర్మీడియట్ లో సంతపేట లోని సుధా టైలర్స్ తో మొదలుపెట్టా, కొంచెం స్టైల్ పెరిగాక, వెంకట్ రామ అండ్ కో కి – అర్చన రెండో గేట్ కి మజ్జలో వుండే, కాపిటల్ టైలర్స్ కి మార్చా.

ఇంకొంచెం కిలాడీ వేషాలు పెరిగాక ట్రంక్ రోడ్ లోన రీగల్ టైలర్స్ కి ఆటుమాయిన ఫిట్ టైలర్స్ కి మారింది. మోడరన్ స్టోర్స్ లో గుడ్డ కొనటం ఆడ్నించి నేరుగా టైలర్ షాప్ కి వెళ్ళటం. ఆస్థాన వైద్యుల మాదిరి ఆస్థాన టైలర్స్ వుండే వాళ్ళు మనకి ఆరోజుల్లో, కానీ ఇప్పుడు అంత రెడీ మేడ్ మేళం, ఆ హ్యూమన్ టచ్ పొయ్యిందబ్బా.

గుడ్డలంటే గుర్తుకొచ్చింది మా సమయంలో బొంబాయి పాలస్, రాయవరపు శంకరయ్య అండ్ సన్స్, బెనారస్ హాల్, అమాయిన మా అమ్మ అక్కలు గంటలు గంటలు నన్ను కూర్చోబెట్టి, కొన్న చీరలకి మాచింగ్ బ్లౌజ్ లు కొనే కలర్ కాంప్లెక్స్.

మన ఖాదీ అని ఖాదీ భండారుకి కూడా ఎక్కువ వెళ్లే టోల్లం. దానికి ఎదురుంగా వుండే సిటీ మెడికల్స్ అప్పట్లో చాలా ప్రసిద్ధి, అలాగే నాలుగడుగులు వేస్తే వచ్చే బాబా స్పోర్ట్స్, మా బాడ్మింటన్ బ్యాట్స్ గెట్స్ తో అల్లి వచ్చేవి కాదు అప్పట్లో, బాట్ కొని గెట్స్ అల్లించుకొనేవాళ్ళము ఓపికగా.

ఇంకా కో-ఆపరేటివ్ బ్యాంకు కి చుట్టూ వుండే మన సండే మార్కెట్ లో అప్పట్లో దొరకని వస్తువు ఉండేది కాదు.

మేము ఇంజనీరింగ్ లోకి రాంగానే మొదట కొన్న కాసియో ఎఫ్ ఎక్స్ 100 కాలిక్యులేటర్ మన శ్రీ రామా కి ఎదురు మిద్దె మీద వుండే, అప్పట్లో మేము ముచ్చట గా చెప్పుకొనే, స్మగుల్డ్ గూడ్స్ షాప్ లో.

నేను ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో ఉండంగా అనుకుంటా, రాజీవ్ గాంధీ పోయాడని కొంత మంది తుంపుల మారోళ్ళు, సండే మార్కెట్ లోని షాప్స్ ని తగల పెట్టటం బాగా బాధ పెట్టె విషయం.

అట్టాగే చిన్నప్పుడు మద్రాసులో తెలుగు సినిమాలు తీసే రోజుల్లో , మొదటాటకి మద్రాస్ నించి చూడ్డానికి సినిమా వాళ్లంతా వచ్చేటోళ్లు , మన వూరికి హిట్టా ఫట్టా తేల్చుకోడానికి. అంటే మన నెల్లూరోళ్లే చెప్పాలి, మొదటాట చూసి ఆ సినిమా విషయం ఏందో.

ఆకాడికొస్తే అసలు చిరంజీవిని మెగాస్టార్ చేసిందే మనం.

ఎవరో గుర్తు చేశారు ఏమబ్బా హర్షా! నువ్వు ఆమె రాత్రులు లాటి మళయాళ సినిమాలు చూడలేదా, మనూర్లో అవెక్కడ ఆడతాయో మర్చిపోయినట్టు రాయకుండా పెద్ద మంచోడిలా పోజ్ కొడుతున్నవే అన్నారు.

నేను అసలు సిసలు నెల్లూరోడిని సామీ, ఆ వెంకటేశ్వర హాల్ వైభవాన్ని ఎలా మరిచిపోతాను. మా అనీల్గాడు వాళ్ళకి ఆ హాలోళ్లు తెల్సు గాబట్టి, ఎప్పుడెళ్ళిన, మా ఇద్దరికీ సీట్లేసి కూర్చోబెట్టేవాళ్ళు స్క్రీన్ కి దగ్గరగా.

ఇక పోతే మనొంటలు చాలా మటుకు బయట ఊళ్ళ వాళ్ళ కి తెలీవు.

మొన్నొక కథలో సుకీ అని రాస్తే ……అదేమిటండి సెలవిస్తారా ….అని అడిగారు.

ఇక మనం నిప్పటి అన్నామంటే వాళ్ళేడికి పోవాలా.

చింతాకు పొడి, రొయ్యల పొడి, మెత్తాళ్లు, మడప రొయ్యలు, పచ్చి మిరపకాయల పచ్చడి, మినుముల చింతపండు పచ్చడి, కంది పచ్చడి (మా ఇంట్లో ఎందుకో తీ పచ్చడి అంటారు), పొన్నగంటాకు కూర తాలింపు, సజ్జ వడలు, అలాగే మన మూడు హాళ్ల వీధి మూలన కళ్యాణి ఫిలిమ్స్ దగ్గర దొరికే చిన్న సమోసా అట్లాంటి వాటి మీద మనం అర్జెంటు గా పేటెంట్ తీసుకోవాల .

కోవూరు పొయ్యే వాళ్ళం మాంచి ఎండు చేపలు తెచ్చుకోవాలంటే. మా నెల్లూరోళ్లు అమెరికా వెళ్తూ గుడ్డలన్న తగ్గిచ్చుకుంటారు గాని వీటిల్ని మాత్రం దండిగా పట్టకెళ్తారు, సూట్ కేసులు నిండా. మా యావిడ అయితే నన్ను చాల మార్లు పట్టించేసింది మీ అమెరికా వాళ్లకి, మీ ఇంట్లో వండేటప్పుడు ఘాటు వాసనలు వస్తున్నాయని.

జరం తగిలి లేచినోళ్ల కి పూర్ణ బేకరీ బ్రెడ్ ప్రిస్క్రిప్షన్ గా రాసిచ్చేవారేమో అప్పట్లో డాక్టర్లు, ఆ బ్రెడ్ తినడానికి నేను ఎన్ని సార్లు లేని జ్వరం తెచ్చుకున్నానో నాకే తెలీదు.

పదవ తరగతి టైంలో అనుకుంటా విచ్చల విడిగా వీడియో పార్లర్స్ వొచ్చాయి .

ఓ రూమ్ లో ఓ పది కుర్చీలు వేసి, చూపించాల్సిన సినిమాలే చూపించెయ్యటం.

వాటి మీద పోలీస్ వాళ్ళ గోల ఎక్కువై, అవి మూతపడి పొయ్యి ఎక్కడ మా ఎడ్యుకేషన్ ఆగిపోద్దో అని మేము దిగులు పడితే, శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని, అవే కాఫీ కేఫ్ లు గా మారిపొయ్యి మమ్మల్ని ఉద్దరించేయ్యటం ఎట్టా మర్చిపొయ్యేది .

ఇంక కాలేజి రోజులకొస్తే బి.ఎస్.ఏ ఎస్.ఎల్.ఆర్ సైకిల్ వేస్కొని వెనక పడుతూ, అమ్మాయ్ వెన్నెల ఐస్క్రీం తినిపిస్తా వస్తావా అనటమే మా టైంలో ప్రపోజ్ చేసే విద్య, దాంతో పాటు నీ చేత్తో రోజూ ఇచ్చే నిర్మలా కాఫీ బెడ్ కాఫీలాగా తాగాలని వుంది అనేది ఇంకో అతి తెలివి లవ్ ప్రపోజల్.

ఇపుడంటే పెళ్ళిళ్ళకి వి.పి.ఆర్, సి.పి.ఆర్, కే.జి.కే, బాల పీరయ్య లు అంటున్నారు కానీ మా టైములో పెద్దోళ్ల పెళ్లి జరగుతుంది అంటే తి.తి.దే కల్యాణ మండపము. ఇప్పుడు మూసేసున్నారేమో.

పెళ్లిళ్లంటే, మా మండపాల వీధి లో బంగారు అంగళ్ళు, జైన్ సిల్వర్ పాలస్, సిల్వర్ పాలస్, గోల్డ్ పాలస్, వాటి వైభోగం వైభవం నేను చెప్పలేను మీ కళ్ళతో మీరే చూడాలా. కొన్న మన సంగతేమో కానీ అక్కడ అవన్నీ అమ్మినోళ్లు మాత్రం పాలస్ లు కట్టేశారు.

ఇంకా డబ్బులు ఊరికే రావు, కాబట్టి తిండి తినబాకండి ఖర్చు బెట్టబాకండి, నగలు కొనుక్కోండి అని ప్రపంచమంతా ప్రచారంచేసిన, గుండాయన కూడా యాపారం నేర్చుకుంది మా మండపాల వీధి లోనే.

ఇంకా తెలుగోళ్లకందరికి, నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చి, సంగీత్ ని పెళ్ళిళ్ళల్లో అలవాటు చేసిందే మా నెల్లూరోళ్లు.

ఇది గాక పెళ్లిళ్ల బఫెట్ లో కొస్తే, ఉప్పు మిరపకాయ, రాగి సంకటి దాన్లో కి బొమ్మిడాయిల పులుసు , వడల పులుసు, ఆకు కూర లివర్ ఫ్రై ఇవన్నీ మా ఇన్నోవేషన్స్.

ఇంకా ఆగకుండా ఈ మధ్య ఎదో పెళ్ళికి బోతే అక్కడ సద్దెన్నం గూడ పెట్టేసారు. ఆర్గానిక్ ఫుడ్ కౌంటర్ అన్చెప్పి సెపరేట్ గా.

మీ నెల్లూరోళ్లకి మా పిల్లల్ని ఇయ్యాలంటే మాకు భయ్యం అంటారు వేరే జిల్లా ఓళ్లు.

వారి మీ పాసు గూలా మా నెల్లూరి పిలకాయలాంటోళ్ళు మీకు ఏడ బోయినా దొరుకుతారా. మరీ కిండల్ గుందే మీకు అంటారు మా వాళ్ళు.

అలాగే ఓరి డమ్మా భడవా, నీ పాసు కాలా ఏందబ్బయ్య నీ యవ్వారమా, ఏందిమే నీ మందల, కూడు తిన్నావా, మరీ మిడిమాలమ్ గుందే లాటి పదాలు, అలాగే కోట వాకాడోళ్ల మాదిరి ప్రతి దానికి ఏమే కలుపుతూ, మా ఇంటికి రా ఏమే, అన్నం తిందువు రా ఏమే, చారు పోసుకుంటావా ఏమే లాటి వన్నీ ట్రేడ్ మార్క్ చేసుకోవాలి

ఇక పోతే చెప్పాలంటే మా నెల్లూరోళ్ల జంబాలు ప్రపంచ ప్రసిద్ధాలు. అర్థ రూపాయ ఆదాయానికి రూపాయ ఖర్చు పెట్టాయాలి మనం. పక్కింటిలో టీ.వీ ఉంటే కనీసం మన ఇంటి మీద ఏంటెన్నా అన్నా ఎగరెయ్యాలి.

ఇక పోతే మా చిన్నప్పుడు, పైన దండిగా వర్షాలు పడితే మా పెన్నా నది ఓ పది రోజులు జీవనది మాదిరి ఉండేది. ఎండిన రోజుల్లో కనీసం కొన్ని పాయలన్నా పారేవి, ఇంకా ఎండితే ఇసక మేటలన్నా కంటికింపుగా కనపడేవి. మరి ఇప్పుడు, కొంతమంది అన్నం మానేసి ఇసక తినబట్టి ఇసుక పొయ్యేసి ఆడ, కర్ర తుమ్మ మొక్కల్ని చూస్తున్నాము.

మా వూరు అంటే గుర్తు రావాల్సింది మా మొలగొలుకులు, బాధ పడాల్సిన విషయం ఏందంటే, మొలగొలుకులు ఏస్తే ఆర్నెల్లగ్గానీ పంట చేతికి రాదనీ, ఎక్కవ తడవలు నీళ్లు కట్టాలి అని మేం చాలామందిమి సంకర యిత్తనాలకి పొయ్యాం. దాని తర్వాత రొయ్యల గుంతల మీదకి పొయ్యాం, చివ్వరికి ఇప్పుడు ఆ భూములన్నీ బీళ్ళు చేసేసి రియల్ ఎస్టేట్ చేసేశాం.

చిన్నప్పుడు వేరే వూరినించి రైల్లో వస్తా కొవూరొచ్చే బాటికి, మూడు తాటి చెట్ల ఎత్తుండే కూలింగ్ బొట్ట కన్పడంగానే, వొళ్ళంతా వేడెక్కేది మనం మన నెల్లూరు రాజ్యానికి ఎంటర్ అయ్యిపొయ్యాం అన్చెప్పి.

రైల్లో అంటే గుర్తుకొచ్చింది ఆమజ్జ నేను మా ఆవిడా ఓ రోజు హైదరాబాద్ నుండి మద్రాస్ ఎక్సప్రెస్లో పోతున్నాము. ఉదయాన్నే చేరొచ్చని మేము మద్రాసు ఎక్స్ప్రెస్ లోనే పోతాం ఎప్పుడు పొయ్యినా.

మధ్యలో మంచి నిద్రలో ట్రైన్ ఆగిపోతే లేచి పక్కనాయన్ని అడిగా ఆయన సంచీలు సర్దతా ఉంటే ఏ స్టేషన్ పెద్దాయనా! అని.

ఆయన నెల్లూరు అనంగానే నేను గబా గబా దిగి సామానులు బయటకి లాగేసి మా ఆవిడ చెయ్యిబెట్టి గుంజా దిగమని, అమేమో ఎందుకు అంటుంది, నాకైతే మన వూరు వచ్చుల్లా ఎగిరి దూక్కుండా, ఎందుకంటుంది ఏంది ఈ అమ్మి, అని తెగ కోపం వచ్చేసింది. ఏందిమే రా నువ్వు అని మళ్ళా ఇంకో గుంజు గుంజా, ఇంక తట్టుకోలేక మా యావిడ చెప్పింది ఒరే మనం ఈ రోజు వెళ్తున్నది మద్రాసు రా నాయనా అని.

అలా ఉంటది మన ఆవేశం. వొంటి మీద గుడ్డలు నిలవవు మనకి నెల్లూరు పేరు వింటే.

“మా నెల్లూరోళ్ల కథలు కంచికి చేరవబ్బా!” కి 17 స్పందనలు

 1. Hasha,
  I have been enjoying your stories/swagathalu, especially
  stories in nellore slang. These stories are taking me back to my childhood memories.
  Ramesh

 2. విన్నకోట నరసింహారావు Avatar
  విన్నకోట నరసింహారావు

  // “ ఇక మనం నిప్పటి అన్నామంటే వాళ్ళేడికి పోవాలా.” //
  ఎక్కడికి పోతాం? non-నెల్లూరు వాళ్ళం మా సందేహాలతో మళ్ళీ మీ దగ్గరకే వస్తాం.
  “నిప్పట్లు” అంటే ఏమిటి?
  “కిండల్ గుందే” అంటే ఏమిటి?
  అయితే పెళ్ళిళ్లల్లో ఆ “సంగీత్” వేలంవెర్రి నెల్లూరు వారి పుణ్యమా బాబూ? మరి నెల్లూరు వారి అసలు ఆచారమైన “ఎదుర్కోల” మాట చెప్పలేదే?
  అవునూ, పెళ్ళి భోజనంలో కూడా నాన్-వెజ్ పెడతారా నెల్లూరు వాళ్ళు? ఏ ప్రాంతపు ఆనవాయితీ ఆ ప్రాంతం వారిదనుకోండి, కానీ ఏపీలో పలు ప్రాంతాల్లో శుభకార్యం నాడు నాన్-వెజ్ పెట్టరు … ఎంత మాంసాహార ప్రియులు అయినప్పటికీ.
  మీ ఊరి పెన్నా నది కాస్త ప్రమాదకరమని అంటారు. ఉన్నట్లుండి నీటిప్రవాహం వచ్చేస్తుందని, ఇసుకతిప్పలే కదా అని మరీ ఎక్కువ దూరం నది మధ్యకు నడుచుకుంటూ వెళ్ళడం క్షేమకరం కాదనీ అంటారు.

  1. వివరంగా రాస్తానండి. నిజమేనండి పెళ్లి రోజున భోజనాలు మాంసాహారం పెట్టరండి మా వాళ్ళు. పెళ్లి అయ్యాక వరుడు వాళ్ళు ఇచ్చే రిసెప్షన్ రోజున మాంసాహారం ఉంటుంది. నేను జనరిక్ మా పెళ్లిళ్లలో అనేశాను అలవాటులో పొరపాటున. మీరు అరిసెలు అనే వాటిల్ని మేము నిప్పట్లు అంటామండీ. కొన్ని ప్రాంతాల్లో వీటిల్ని అతిరసాలు అని అంటారేమో.

 3. విన్నకోట నరసింహారావు Avatar
  విన్నకోట నరసింహారావు

  పైన నా వ్యాఖ్యలో “నిప్పట్లు” అన్నాను. దాన్ని “నిప్పటి”గా చదువుకోవలెను (రెండింటిలో ఏదైనప్పటికీ అర్థం నాకు తెలియదనుకోండి 🙂)

 4. VENKATA RAJA RAO Lakkakula Avatar
  VENKATA RAJA RAO Lakkakula

  తద్దయు నెల్లూరి నుడుల
  పెద్దలు నరసింహరావు ప్రియపడినారా ?
  ముద్దుగ నెల్లూరీయుల
  బుధ్ధిగ నెఱజాణ లనిరి పూర్వము విబుధుల్ .

  1. విన్నకోట నరసింహారావు Avatar
   విన్నకోట నరసింహారావు

   తగల్లేదు కానీ “నెల్లూరి నెఱజాణ” అనే మాటయితే విన్నాను లెండి, మాస్టారూ 🙂.

   1. అపాయము నుపాయముతో తప్పించుకొనెడి సూక్ష్మబుద్ధిని, మాటకు ప్రతిమాట ఆవేశముతో కాక ఆలోచనతో నొనొర్చుటయే జాణతనము అందురని నా అభిప్రాయము. మనుజులు ఎక్కడివారైనను అట్టి బుద్ధి కలిగియుండుట మిక్కిలి ముదావహం.

 5. విన్నకోట నరసింహారావు Avatar
  విన్నకోట నరసింహారావు

  ఓహో, నిప్పటి = అరిసా? ఓకే. థాంక్స్.

 6. విన్నకోట నరసింహారావు Avatar
  విన్నకోట నరసింహారావు

  // “ అపాయము నుపాయముతో ……. “ //
  అవునండి.

 7. VAMSIDHAR NAGARUDRA AMANCHARLA Avatar
  VAMSIDHAR NAGARUDRA AMANCHARLA

  కిండల్ గుందా అంటే ఏం ఎగతాళి గా ఉందా అని అడగటం

  1. విన్నకోట నరసింహారావు Avatar
   విన్నకోట నరసింహారావు

   Thank you, ఆమంచర్ల వారూ.

 8. హ హా. సూపర్. నేను కూడా నెల్లూరు లొనే 14 ఇయర్స్ పెరిగాను. తర్వాత మా నాన్నగారు నా intermediate తర్వాత వేరే ఊరూ ట్రాన్స్ఫర్ మీద వెళ్లినా, retire అయ్యాక నెల్లూరు వచ్చారు. అసలు ఊరు మా నాన్నగారిది గుంటూరు.నా ఇంజనీరింగ్ సమయానికి, మా అమ్మ వాళ్ళు వేరే వూరిలో వుండే వాళ్ళు. నేను మా అత్తయ్య ఇంటికి వచ్చి, నా స్నేహితురాలు తో కలిసి త్రీ హాల్స్ లో సినిమా చూసి, బాబు ఐస్ క్రీమ్స్ లో ఐస్ క్రీమ్ తిని వెళ్ళేదాన్ని (ఏడాదికి ఒకసారి). ఒక్కసారి నెల్లూరు ని కళ్ళ ముందు నిలబెట్టారు.

  1. మీరు శెలవులలో చేసిన పనులు మాకు మా రోజుల్లో నిత్య కృత్యములు.

 9. అద్భుతంగా ఉన్నాయండి మీ పోస్టులు. అన్నీ ఏకబిగిన చదివేశాను. మీ సెన్స్ అఫ్ హ్యూమర్ కు వందనాలు. నెల్లూరు మాండలికాలను, నెల్లూరినీ మా కళ్ళముందు నిలబెడుతున్నారు. ఆగకుండా చదివింపచేసే మీ శైలి చాలా నచ్చింది.

 10. నెల్లూరు అంటే నాకు ముందుగా గుర్తొచ్చేది మొలగొలుకులు బియ్యమే. ఎప్పుడో, పాతికేళ్ళ క్రితం హైదరాబాద్ లో తిన్నాను. చాలా బాగుంటాయి. ఇప్పుడు దొరకటం లేదా?

  1. మొలగొలుకులు దొరుకుతున్నాయండి ఇంకా.

 11. నెల్లూరు గురించి చక్కగా వివరించారు. కానీ కోమలవిలాస్ గురించి మరిచారా? హర్ష గారికి అభినందనలు.

Leave a Reply