మా అమ్మమ్మ చిన్నప్పుడు నాకు పలు రకాల కథలు చెప్పేది, కొన్ని కథలు సందర్భాను సారంగా, మరి కొన్ని నాకిష్టమైనవవడంతో నేను పదే పదే అడిగేవి.
అమ్మమ్మ, నేను ఏ మేకనో, గొర్రెనో తిన్న రోజున నా పొట్ట మీద చెయ్యేసి మూడు మార్లు నిమురుతూ చెప్పేది, “వాతాపీ జీర్ణం” అని, అటు పిమ్మట ఆ కథ లోకి వెళ్ళేది.
వాతాపి మరియు వాడి సోదరుడు రాకాసులు. వాళ్ళ పని మునులు చేసుకొనే యజ్ఞాలకు ఆటంకాలు కలిగించటమే. ఈ ఆటంకాలు కల్పించటం లో ఒక్కో రాక్షసులకు ఒక్కో పద్ధతి వుంటుందట. వీళ్ళ పద్ధతి ఏమిటంటే ముందుగా వాతాపి వాడికొచ్చిన కామరూప విద్యతో ఓ మేకగా మారి మునుల ఆశ్రమ ప్రాంతాలలో తిరుగాడటం, ఆ మేకను చూసిన పిచ్చి మునులు ఆహా యజ్ఞానికి సమర్పించడానికి ఓ బలి మేక దొరికిందని సంబర పడటం, దాన్ని పట్టకెళ్లి యజ్ఞ సమర్పణ పేరుతో సుష్టుగా గా భోంచెయ్యటం, అలా భోంచేసిన మునుల భుక్తాయాసం తీరక ముందే, వాతాపి సోదరుడు వచ్చి, ఒరే వాతాపీ! వాతాపీ! నువ్వులేకుండా నేను వుండలేనురా రారా నాయనా అని పిలవటం, వాడు ఆ మునుల పొట్టను చీల్చుకుంటూ వచ్చేయ్యటం.
ఇలా వాళ్ళు మన బుడుగు మాటల్లో చెప్పాలంటే ఓ వందో లేక వెయ్యో లేక ఓ ఇరవయ్యో మునులను చంపేశారట. ఈ తతంగం అంత మన అగస్త్య మహా మునికి చాలా కోపం తెప్పించింది.
ఈ వాతాపీ గాడు వాడి సోదరుడు భరత ఖండములో అసలు యజ్ఞాలే చేయకుండా కోట్లాది మేకల్ని భోంచేసే దుష్ట మానవులందరినీ వదిలేసి, మా ముని జాతి మీదే ఎందుకు పడ్డారు అని, వీళ్ళ పని పట్టాలని అప్పటికి అప్పుడే అనుకొనేశారట.
రాజు తల్చుకుంటే దెబ్బలకి కొదవేముంది, అగస్త్య మహా ముని తల్చుకుంటే యజ్ఞాలకు కొదవా. వెంటనే ఓ యజ్ఞం మొదలెట్టేసేయ్యటమేమిటి, వాతాపీ గాడు యీ మారు గొఱ్ఱెయ్యి పోవటమేమిటి, వాడిని పథకం ప్రకారం ఆయన మాత్రమే భోంచేసేయ్యటం వెంట వెంటనే జరిగిపోయాయి. భోజనాలు అయ్యాక ఆయన తన పొట్టమీద చేయి వేసుకొని, హాయిగా నిమురుకుంటూ, “వాతాపీ జీర్ణం” అని మూడు సార్లు అనుకోగానే వాతాపీ సున్నం లో ఎముక కూడా మిగలకుండా జీర్ణం అయిపోయాడట.
వాళ్ళ అన్న వచ్చి వాతాపీ రారా బయటకి, రారా బయటకి అని ఎన్ని సార్లు పిలిచినా జీర్ణమయిపోయిన వాతాపీ ఇక బయటకి రాలేదు. మా వాతాపీ అసలిక్కడకు రాలేదేమో అనుకోని వాడు దేశం లో మునులు కాదు, చాలా మంది మేకల్ని గొర్రెల్ని భోంచేసి వాళ్ళున్నారు, ఎక్కడో వాళ్ళ కడుపులో జీర్ణం కాని మా వాతాపీ గాడు ఉంటాడు అని దేశం మీద పడి ఇప్పటికీ అరుచుకుంటూ తిరుగుతున్నాడట.
అందుకే మేకనో గొఱ్ఱెనో తిన్న రోజున అమ్మమ్మలు తమ మనవళ్ల పొట్టలు వాతాపి జీర్ణం అని మూడు సార్లు నిమరాలట.
ఈ కథ వింటుంటే నాలో బుడుగు మళ్ళి బయటకి వచ్చేవాడు, అదేవిటి నిన్నో మొన్నో లేక ఈ రోజో నేను ఉలవపాళ్ళకి వెళ్ళినప్పుడు గుడి అయ్యోరి కొడుకు స్వామి తో నేను ఓ కోడిని కోడిని లేపేసా అనగానే, భళ్ళున వాంతి చేసుకొని, అప్రాచ్యుడా! నువ్వు నా స్నేహానికి తగవుపో అన్నాడు, మరి ఇక్కడ మునులు మేకల్ని మేకల్నే మింగేశారు అని చెప్తున్నావు అని మా అమ్మమ్మతో వాదనకి దిగేవాడిని.
మా అమ్మమ్మ చాలా తెలివిగా తప్పించుకునేది, ఏమోరా అబ్బీ నాకేమి తెలుసు, ఈ కథ నేను సి గాన పెసూనాంబ అంత వున్నప్పుడు నాకు మా అమ్మమ్మ చెప్పింది, నేను నీకు చెబుతున్నా, అంతకు మించి నన్ను ఈ కథ తో ఇరికించకు నాయన, అసలే నీకు నోటి దూల ఎక్కువ అని వార్నింగ్ ఇచ్చింది.
అసలు మీ అమ్మమ్మకు ఎవరు చెప్పారు అని పరిశోధన చేయబోయిన నాకు ఆవిడ సమాధానం చాలా చలాకీగా వచ్చింది, వాళ్ళ అమ్మమ్మ అని. ఓహో ఇక ఇది తెగేది కాదులే అని వదిలేసా నా అధ్యయనాన్ని. అలా వదిలేసిన అధ్యయనం ఇప్పటికీ మొదలెట్టలా ఎందుకంటే అమ్మమ్మ కథలలో తప్పొప్పులు ఎంచడానికి అమ్మమ్మ అధ్యయనం కాదు ఓ జ్ఞాపకం.
అలా ఆవిడ చెప్పే కథల్లో నాకు నచ్చిన ఇంకో కథ, నేను పదే పదే చెప్పమని అడిగే కథ, ఒక తోడేలు ఒక గొర్రె పిల్లని తినెయ్యాలని అనుకొని, తాను వాగుకి పైన నీళ్లు తాగుతూ కూడా దిగువున తాగే గొర్రె పిల్లతో వాదానికి దిగుతుంది, నువ్వు నా నీళ్లు ఎంగిలి చేస్తున్నావని.
తినెయ్యాలనుకుంటే తినెయ్యొచ్చుగా గుట్టు చప్పుడు కాకుండా మరలా దానికి యీ ఎదవ ఆరోపణలు ఎందుకట. చేసేది ఎదవ పని అయినప్పుడు సమర్ధించుకోవడానికి ఆ పైన మనగలగడానికి ఇటువంటి డొల్ల వాదనలు మనుషులకి చాలా అవసరం అనే సూత్రం అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు చాల బాగా అర్థమవ్వటం ఆచరణలో పెట్టటం కూడా జరిగి పోయాయి.
కథలు పక్కన పెట్టి తన నిజ కథకి వస్తే, అమ్మమ్మకి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు వివాహితుడై, ఇద్దరు బిడ్డల తండ్రి అయ్యాక తాగుడు అనే వ్యసనం బారి పడి, చనిపోయాడు. చిన్న కొడుకు చదువుకొని మంచి ఉద్యోగస్థుడై, ప్రేమ వివాహం చేసుకొని, ఆ చేసుకున్న ఆవిడకి పల్లెవాసులంటే పడక పోవటం తో దూరమయ్యాడు. ఇద్దరు కొడుకులు దూరమయ్యారు అనే దిగులుతోనే ఆవిడకి చాలా ఇష్టమైన తాత కూడా పోయారు.
చిన్న కొడుకు ఆరునెల్లకో, సంవత్సరానికో వచ్చి మా అమ్మమ్మ చేతిలో ఓ వందో లేక రెండు వందలో పెట్టి వెళ్లే వాడు. ఆ రావటం కూడా మొదట తన దగ్గరకే వచ్చేవాడు కాదు, మా ఊరిలో ఆసాములైన వరసకి ఆయనకి పిన్నమ్మ అయిన వాళ్ళ ఇంటికి వెళ్లి సేద తీరి మరీ.
అప్పట్లో దుమ్ము రేపుకుంటూ ఆయన ఓ స్కూటర్లో వస్తుంటే ఆయనెనకాల మా పిల్ల గుంపు వెళ్ళటం నాకు గుర్తు. అలా స్కూటర్ మీద వచ్చే మేన మామ వున్నాడని నేను పెద్ద పోస్ కొట్టేవాడిని. ఆయన స్కూటర్ మా పిల్ల దోస్తులు తాకాలన్న, స్టాండ్ వేసిన దాన్నెక్కి డుర్ర్ డుర్ర్ మని తోలినట్టు అనుభూతి చెందాలన్న నా అనుమతి కావాల్సిందే.
అలా వచ్చిన ఆయన ఒక సారి మా అమ్మమ్మకి తాను ఇల్లు కట్టుకున్నానని చెప్పటం, ఆవిడ సంబరపడి ఒక్క సారి నన్ను తీసుపోరా నీ దగ్గరకి అని అడగటం, ఆయన సమాధానం దాట వెయ్యటం నాకు బాగా తెలుసు. కానీ ఆవిడకు కొడుకు అంటే వల్ల మాలిన అభిమానం.
మేము ఏవన్నా ఆయన్ని అంటే ఆవిడ చాలా వెనక వేసుకొచ్చేది. నన్ను వాడు అసలుకే వదిలెయ్యలేదురా, బతికున్నానో లేదో వచ్చి చూసుకుంటున్నాడు, నా మందులకు లేక పళ్లకో పదో పరకో ఇచ్చి వెళ్తున్నాడురా పిచ్చి సన్నాసి అంటూ సంబర పడి పోయేది.
కానీ ఆవిడ మా ముందర అలా సంబర పడిపోయినా, భౌతికం గా పెద్ద కొడుకు, మానసికంగా రెండవ కొడుకు దూరమయ్యినందుకు ఆవిడ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపి వుంటారో. ఆ నిద్ర పట్టని రాత్రుల్లో ఆవిడకి బాధాపీ జీర్ణం, బాధాపీ జీర్ణం, బాధాపీ జీర్ణం అని మనసు మీద చేయి వేసి ఎవరి చెప్పారో నాకు తెలియదు. బహుశా ఆవిడ నమ్ముకున్న భగవంతుడేమో.
ఇద్దరు కొడుకులు గాక ముగ్గురు కూతుర్లు ఆవిడకి. పెద్ద కూతుర్ని పక్కనున్న గ్రామంలోనే ఇచ్చారు. మిగిలిన ఇద్దరు కూతుర్లు చాల సంవత్సారాలు గ్రామంలోనే ఉండిపోయారు, వారి పొలాలు గ్రామంలోనే ఉండటం తో మరియు పిల్లల చదువులకోసం.
ఆ ఇద్దరు కూతుర్లు ఆవిడని ఉన్నంత లో బాగానే చూసుకున్నారు. రెండవ కూతురు తన పిల్లల చదువుల కోసం నెల్లూరు వెళ్ళినప్పుడు, మూడవ కూతురు చూసుకున్నారు. అలాగే మూడవ కూతురు తన పిల్లల చదువుల కోసం నెల్లూరు వెళ్ళినప్పుడు, రెండవ కూతురు గ్రామానికి వచ్చేసారు, అమ్మమ్మని చూసుకోవడానికి.
ఉన్నది గ్రామం, చుట్టూ పక్కలంతా బంధువులుండటం తో, ఏదన్నా పనుల మీద, లేక కొంచెం దూరా బారాలలో వున్న వారి వారి పిల్లలను చూసుకొని రావడానికి అప్పట్లో ఇళ్లల్లో వున్న పెద్ద వారి కోసం అన్నీ ఏర్పాట్లు చేసి, ఇరుగు పొరుగు వాళ్ళని పెద్దవాళ్ళను కొంచెం గమనించుకోండి అని చెప్పి వెళ్ళటం జరిగేది.
అలా రెండవ ఆవిడ తన కూతురు వద్దకు వెళ్లిన మరునాడే, మా అమ్మమ్మ తన తల తిరుగుతుంది అని పక్కింటావిడని పిలిచి, ఆవిడ వచ్చే లోపులే ప్రాణాలు విడిచేసింది. మా అందరికీ ఇప్పటికీ ఇది చాలా గ్రుచ్చుకొనే విషయం, అలా మేమెవ్వరూ లేని సమయంలో ఆలా ఒంటరిగా వెళ్లిపోయిందనేది. ఉన్నంతలో బాగానే చూసుకున్నాము కానీ ఇంకా ఇంకా బాగా చూసుకోలేక పోయామని.
అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, తలి తండ్రుల ప్రేమ అనే వాగు పిల్లల వైపే ప్రవహిస్తూ వుంటుందట, ఆ పిల్లల ప్రేమ వారి పిల్లల వైపు, నీరు పల్లం వైపు ప్రవహించినట్టు. అవి ఎన్నటికీ తమ వ్యతిరేక దిశలో ప్రవహించవు.
వాగు లేక ప్రవాహం, ముసలి తలి తండ్రులు, వారి పిల్లలు అంటే మా అమ్మమ్మ చెప్పిన రెండో కథ గుర్తుకు వస్తుంది, కాకపోతే స్వభావ రీత్యా పాత్రలు స్థానాలు మారాయి అన్పిస్తుంది నాకు. అనగా ఎగువన ఎప్పుడు ప్రేమను పంచే తలిదండ్రులు, దిగువన వారి వారసులము. వారి ప్రేమ అనే ఎంగిలి తాగి కూడా తాగలేదనే వాదనలు చేస్తూ, వారి ఆస్తులకు మాత్రమే వారసులమని భావిస్తూ.
మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ప్రస్తుతం దిగువున వున్నా, మనం వయస్సయ్యాక చాల సహజంగా, మన మన వారసుల చే ఎగువకు తోయ బడతాము. ఈ పరిణామ క్రమం నిరంతరం గా ఒక ప్రవాహం లా సాగిపోతూనే వుంది.
Leave a Reply