Apple PodcastsSpotifyGoogle Podcasts

సన్నిధానం!

ఇన్ని రకాల జనాలు, వీళ్ళందరూ ఎందుకొచ్చారో అనుకున్నా చుట్టూ చూస్తూ.

లాల్చీ పైజామాలు, పంచెలు, చీరలు, పంజాబీ డ్రెస్సులలో రక రకాల వయస్సుల వాళ్ళు.

ముందు వరుసలో అప్పుడే పెళ్లి అయిన ఓ జంట పసుపు బట్టలలో కూర్చోనున్నారు.

క్యూ కాంప్లెక్స్ నుండి మసక మసకగా కనపడుతుంది బంగారు గోపురం.

వేకువ ఝాము ఐదున్నర అవుతుంది. డిసెంబర్ నెల, మంచు కురుస్తుంది బయట.

అప్పుడు నేను బెంగుళూరు లో ఉండేవాడిని. ముందురోజు తిరుపతొచ్చి ఫ్రెండ్ ని కల్సి దర్శనం చేసుకుందామని కొండకి వచ్చాను.

ఆ ముందు వారం రాసిన సెమిస్టరు ఎండ్ ఎగ్జామ్స్ లో ఓ పేపర్ అంత గొప్పగా రాయలేదు .

ఆ పేపర్ లో గ్రేడ్ బెటర్ గా రావాలని కోరుకోడం నా యాత్ర ఉద్దేశ్యం.

“బాగా చలిగా వుంది కదా” అన్నాడతను.

పక్క కుర్చీలో కూర్చోనున్నాడు, ఓ నలభై ఏళ్ళు ఉండవచ్చు.

“జనవరిలో ఇంకా ఎక్కువవుతుంది” అని షేక్ హ్యాండ్ ఇస్తూ చెప్పాను నేను, “నా పేరు వెంకట రమణ. బెంగుళూరు నుంచి వచ్చాను అని.

మాది రామనాధ పురం, తమిళనాడులో, ఎల్&టి ప్రాజెక్ట్స్ లో పని చేస్తూ వుంటాను. “నాలుగేళ్ల నుండి రాజమండ్రి దగ్గర ఓ డైరీ ప్రాసెసింగ్ యూనిట్ కమిషనింగ్ చేస్తున్నాను” అన్నాడు అతను.

నేనేమీ అడక్కుండానే అతనే వివరాలు చెప్పడం మొదలు పెట్టాడు.

ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ గుల్బర్గా దగ్గర, “చాలా మారుమూల ప్రాంతాలలో పనిచేయాల్సి ఉంటుంది ప్రాజెక్ట్స్ లో పనిచేయటం అంటే. అట్లాంటి చోట్లకి ఫ్యామిలీ ని తీసుకెళ్ళలేము.

అందుకే వాళ్లను చెన్నై లో వుంచి నేను తిరుగుతూ వుంటాను.

ఒంటరిగా వుండటం వలన అన్ని రకాల అలవాటులతో చెలరేగి పోతూ వుంటాము. డబ్బులు బాగానే వస్తాయి. జీతం కాకుండా రోజుకి అవుట్ స్టేషన్ అలవెన్సు అని ఓ అయిదు వేలు ఇస్తారు కూడా. రోజు మందు ముక్క లేనిదే బండి నడవదు” అని.

ఇలాటి సకల గుణ సంపన్నుడికి ఇక్కడ ఏమి పనబ్బా అని మనసులో అనుకున్నా.

కొనసాగిస్తూ చెప్పాడతను, “రాజమండ్రి వెళ్లిన రెండు నెలలలోనే చంద్రకళతో పరిచయం అయ్యింది. వారానికి మూడు రోజులు భోజనం తన యింటిలోనే.

నేను పరిచయం అయ్యాక వేరే వాళ్ళని దగ్గరకు రానిచ్చేది కాదు.

తనలాటి వాళ్ళతో పరిచయాలు నాకు కొత్తేమి కాదు. కానీ తను ప్రత్యేకం.

ఒకపక్క యీ పనులు చేస్తూనే రెండవ పక్క పూజలు పునస్కారాలు గుళ్ళు గోపురాలు.

ఉన్నఒక్కగానొక్క కూతురుని వైజాగ్లో ఉంచి చదివిస్తూ, తనే అప్పుడప్పడూ వెళ్లి చూసి వస్తుండేది.

ఎప్పుడైనా తన పూజల గురించి నేను ఎగతాళిగా మాట్లాడితే, తను నవ్వుతూ చెప్పేది, మీరు ఉద్యోగం చేస్తూ సమయం దొరికితే ఇటువంటి పనులు చేస్తున్నారు, మరి నేను నా ఉద్యోగం చేస్తూ, సమయం దొరికితే పూజలు చేసుకుంటున్నాను అని.”

మరిప్పుడు మీకు బదిలీ అయ్యింది కదా, ఆవిడ సంగతి ఏమిటి అని అడిగా.

“నా పాటికి నేను, ఆవిడ పాటికి ఆవిడ”. అన్నాడతను ఆర్థోక్తి గా.

నేను బదిలీఈ అయి వస్తుంటే చంద్రకళ చెప్పింది, “నేను కూడా యీపని మానేస్తున్నాను. పిల్లకి చదువు అయ్యిపోయింది. నేను దాని తల్లిననే విషయం అమ్మాయి కి తెలీదు.

తనో అనాధను అని అనుకుంటుంది. మీరే ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే తన జీవితం సెటిల్ అయిపోతుంది.

నేను కోయంబత్తూరు లోని మా గురువు గారి ఆశ్రమం లో చేరి నా మిగిలిన జీవితాన్ని గడిపేస్తాను” అని.

మరి మీరేమి చెప్పారు అని అడిగా ఆసక్తిగా.

“మన ముందు వరుసలో పెళ్లి బట్టల్లో ఉన్న అమ్మాయే చంద్రకళ కూతురు.

విజయవాడ లో ఓ స్కూల్ టీచర్ గా పని చేసే అబ్బాయిని చూసి, కొండ మీద నిన్ననే పెళ్లి జరిపించాను, వాళ్ళ వివాహ జీవితం బాగుండాలని కోరుకుందామని దర్శనానికి తీసుకొచ్చాను” అన్నాడతను.

మీరేమనుకోకుంటే నాదో ప్రశ్న అన్నాను నేను సందేహం గా.

అడగండి అన్నాడతను తాపీగా వెనక్కి వాలుతూ.

మీ వ్యక్తి గత విషయాలు నాకెందుకు చెబుతున్నారు మీరు.

“మీకు చెప్పాలని చెప్పలేదు. ఆ స్వామి ఎదురుగ నిలబడి ఇవన్నీ చెప్పుకోవాలంటే అంత టైం ఇవ్వరుకదా, అందుకే ఇక్కడ చెప్పుకున్నాను” అన్నాడాయన కళ్ళు మూసుకుంటూ.

మా ఎదురుగా బంగారు గోపురం తెరలు తొలిగిపోయి దేదీప్యమానంగా కనపడుతూ వుంది.

నాకు మరొక్క ప్రశ్న మిగిలిపోయి వుందండి, మీరేమి అనుకోక పోతే అన్నాను నేను సందేహంగా.

పర్లేదు అడగండి అన్నాడాయన.

మీలాటి వాళ్ళ కోర్కెలు కూడా తీరుస్తాడా ఆ దేవుడు అన్నా నేను.

“qualification మనకుండక్కర్లేదు, మన కోరికకు ఉంటే చాలు” అన్నాడాయన.

Leave a Reply