స్పర్ధయ వర్ధతే విద్య!

ఉప్పలపాటి ప్రాధమిక పాఠశాలలో మా అక్క సుమతి, రవణమ్మ, హైమావతి, దొరసాని మొదలగు వారు నాకు ఒకసంవత్సరం సీనియర్స్. నిజముగా నాకు గుర్తు లేదు సీనియర్స్ అయిన అబ్బాయిల పేర్లు. కావాలంటే నా క్లాస్ అమ్మాయిల మరియు అబ్బాయిల పేర్లు చెప్పగలను, కరుణాకర్, మురళి, ప్రభాకర్, ఉష, హిమ మరియు జయమ్మ వగైరా వగైరా అని.

మా సీనియర్ అయిన రవణమ్మకి చాల మంచి పేరు, చక్కని అమ్మాయి అని, బాగా చదువుకుంటుందనియు, మరియు ఆటల్లో కూడా చురుకుగా ఉంటుందని. తాను అవడానికి మా అక్క వాళ్ళ సహాధ్యాయిని అయినా వాళ్ళ తరగతి వాళ్ళకంటే వయస్సులో ఓ సంవత్సరమో లేక ఓ అరో పెద్దదవటం వలన మరియు తరగతిలో చదువుల్లో ప్రధమురాలైనందున సహజంగా తానే వాళ్ళ తరగతి లీడర్. మా అయ్యవారమ్మ ఎప్పుడన్నా మా పిల్ల పీచుల తరగతులకు లెక్కలు చెప్పమంటే ఆ బాధ్యతను నెత్తిన వేసుకొని సమర్థవంతముగా నిర్వర్తించెడిది.

మా అక్క తరగతి వారంతా బుద్ధిగా ఐదవ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులై, ఆరవ తరగతి మా ఊరికి రెండూర్ల  అవతల వున్న పెదపుత్తేడులోని ఉన్నత పాఠశాలలో చేరిపోయారు. వాళ్లకు జూనియర్స్ మయిన నేను, హిమ ఓ రోజు మనం నాలుగో తరగతిలోనే ప్రపంచాన్నంతా చదివేసాము అని నిశ్చయించుకుని, ఓ ప్రవేశ పరీక్ష రాసేసి, ఐదవ తరగతి ఎగ్గొట్టేసి ఆరవ తరగతిలో చేరిపోయాము.

అప్పటి వరకు నా చదువులకు పోటీ మా హిమే. కానీ ఇప్పుడు ఆరవ తరగతిలో చేరగానే ఇక నేను పోటీ పడాల్సింది చదువులో కాకలు తీరిపోయిన మా భీష్మి రవణమ్మ తోనే.

కానీ తాను మాత్రం మా తరగతి పరీక్షలు, యూనిట్ పరీక్షలు, త్రైమాసికాలు, అర్థ సంవత్సర పరీక్షలు మరియు సంవత్సరాంతపు పరీక్షలు అని వచ్చే లెక్కలేనన్ని పరీక్షల్లో తొణకకుండా బెణకకుండా ప్రధమురాలై నిలిచేది.

మేమందరము మాకు ఆంగ్లము మరియు లెక్కలు బోధించటంలో అపర ద్రోణాచార్యులైన సుబ్రహ్మణ్యం అయ్యవారి వద్ద రెండు పూటలా ట్యూషన్ కి కూడా వెళ్లే వారము. కానీ తాను మాత్రం ఇవేవీ అవసరం లేకుండానే అన్నీ సబ్జక్ట్స్ లో ప్రధమరాలుగానే నిలబడి వార్ ని ఎప్పుడు వన్ సైడ్ చేసి పారేసేది. 

నా ఏడవ తరగతిలో అనుకుంటా, “రవణమ్మ! నువ్వు రాత పుస్తకాలు ఇంకా కొనలేదు ఎందుకు” అని అడిగిన మా అయ్యోరి ప్రశ్నకు సమాధానంగా ఏమాత్రం భేషజాలకు పోకుండా, జంకు బొంకు లేకుండా, సూటిగా , “హర్ష! వాళ్ళ పొలానికి పనికి వెళ్లిన కూలి డబ్బులు యింకా రాలేదు సార్, అవి రాగానే కొనుక్కుంటాను” అని అని చెప్పింది రవణమ్మ,

తాను మాకు బడి లేని సమయాల్లో వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి మా వూరి పొలాల్లో కూలికి వెళ్ళేది అని తెలిసి కూడా నేను మా అయ్యోర్లు ఎప్పుడు చెప్పే, స్పర్దయా వర్ధతే విద్య అనే సూక్తిని వెంబడించి తనతో పోటీకి దిగేవాడను.

కానీ ఆ రోజు నాకు మా రవణమ్మలో ఒక నాయకురాలు కనిపించింది. కళ్ళనీళ్ళతో దగ్గరకు వెళ్లిన నాకు, నేను ఆంగ్ల భాష నీలాగా చదవాలనుకుంటాను అబ్బాయీ!, నాకు నేర్పవూ! అని చెప్పింది తాను. నేను నీతో పోటీ పడి చదువులో నీ దరిదాపుల్లో వుండగలనేమో కానీ రవణమ్మ, నేను ఎప్పటికీ నీవు కాలేను అని చెప్పాను సిగ్గుపడుతూ. ఇంత చెప్పాక మీకు చెప్పనక్కర్లేదు అనుకుంటా, ఆ సంవత్సరం జరిగిన పబ్లిక్ పరీక్షలలో మా బడికి ప్రధమ స్థానం లో నిలబడినది ఎవరో. 

నేను ఎనిమిదవ తరగతిలో నెల్లూరుకు వెళ్ళిపోయి అక్కడ మా గుంట బడిలో చేరినా, మనస్సులో నా పోటీ రవణమ్మతోనే, తనకెన్ని మార్కులు వచ్చాయి మరి నాకెన్ని వచ్చాయి అని.  అంటే గుంట బడిలో పోటీ దారులు లేరని కాదు, అక్కడ మహా మహులున్నారు.  ఉప్పలపాటికి వచ్చినప్పుడల్లా మా రవణమ్మని కలిసే వాడిని.

జీవితంలో ఎంతో ఉజ్జ్వల భవిష్యత్తు ఉండవలసిన మా రవణమ్మకి నేను తొమ్మిదో తరగతిలో ఉండగానే మద్రాసు సంబంధం వచ్చిందని పెళ్లి చేసి పంపించేశారు. నేను వాళ్ళ అమ్మతో తగువు పెట్టుకున్నా ఉక్రోషంతో కళ్ళ నీళ్లు తిరుగుతూ ఉండగా, అంత బాగా చదివే ఒక్కగానొక్క కూతురుని చదివించలేక పోయారా అని. దానికి ఆమె, మా ఇళ్లల్లో ఆడ పిల్లని ఒక అయ్య చేతిలో పెట్టాల్సిందే నాయనా అని నిట్టూర్చారు.

నా ఆ ఉక్రోషానికి కారణం కల్మషాలు లేని వయస్సు అని, ఆ వయస్సులో  మనం మన పోటీ దారులను మనకి తెలియకుండానే ఎంతో గౌరవిస్తామని.

“స్పర్ధయ వర్ధతే విద్య!” కి 5 స్పందనలు

  1. “భీష్మి” … నన్ను చాలా ఆకట్టుకుంది ఈ పదం..

    మా స్కూల్ బ్యాచ్ లో భీష్మి లాంటి ఓ అమ్మాయి ఉండేది. ఇంటి పేరు మాడభూషి.. పేరొద్దులేండి…
    ఈమె చాలా మితభాషి. టీచర్ల తరువాత టీచరంతటి విద్యార్థిని ..
    చెబితే సిగ్గుపోతుంది.. పరీక్షలు రాస్తుంటే మేము రాయడం కన్నా అమేమి రాస్తోందో అన్న కుతూహలమే ఎక్కువ. మొదటి క్లాసు టు పదో క్లాసు నరకూ ఆమెనే ఫస్టు 😃
    రాయలసీమలోనే ప్రఖ్యాతి చెందిన ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదివి ప్రస్తుతం సింగపూర్ లో ఉంది.
    ఇలాంటి వజ్రవైఢూర్యాలు, రత్నాలు, ఆణిముత్యాలు ప్రతీ ఊరిలో మన చుట్టుపక్కలనే ఉంటారు.. కాస్త వెతికితే దొరుకుతారు 🙏🙂

  2. మీ రవణమ్మ గురించి చదివాక నాకు మా బేబీ పిన్ని నేస్తం అయిన యతిరాజ్యం గుర్తుకు వచ్చింది. ఏమిటో అప్పట్లో ఆడపిల్లలకి నోరు విప్పేందుకు కొంచెం కూడా స్వాతంత్ర్యం ఉండేది కాదు.

    1. కానీ చదువుల్లో ఇప్పటికీ భీష్మి లే!! 😃🙏

  3. శ్రీనివాస సాయి Avatar
    శ్రీనివాస సాయి

    Great Dear. Now I respect you in the same manner.😊

    1. అప్పటి పోటీ తత్వం ఇప్పుడు లేదు అండి. ఇప్పుడంతా తెల్ల జెండాలు ఎగరెయ్యటమే పోటీ ప్రారంభానికి మునుపే.

Leave a Reply