కలడు కలం డనెడు వాడు?

తారీఖు నవంబర్ 7 , సంవత్సరం 1990 .

నెల్లూళ్ళో మా టౌన్ హాల్ అంతా నిండిపోయింది . రెండువేల కి మించి ప్రజానీకం.

వాళ్లలో ఎక్కువమంది నెల్లూరు జిల్లా లో పని చేసిన , చేస్తున్న ఉపాధ్యాయులు.

హాల్లో అంతా పండగ వాతావరణం.

ఇంతమంది ఉపాధ్యాయులు ఒక ప్రజా నాయకుడి సన్మానానికి రావడం బహుశా జిల్లా చరిత్ర లోనే మొదటి సారి అయివుండవచ్చు.

ఆ రోజు, మేమంతా ‘మా రెడ్డి గారు’ అని, ప్రేమగా పిల్చుకునే భక్త వత్సల రెడ్డి గారి షష్టి పూర్తి మహోత్సవం.

ఇంకా సమావేశం ప్రారంభం కావడానికి ఇరవై నిముషాలుంది. నేను స్టేజి కిందనే నిల్చుని వున్నాను.

ఈ లోపల మా రాజయ్య హడావుడి గా పరిగెత్తుకుంటూ నా దగ్గరికి, సారూ! , సారూ! అంటూ వచ్చాడు.

రాజయ్య వెనక ఒక ముప్ఫయి ఏళ్ల వ్యక్తి నిలబడి వున్నాడు. ఎక్కడో చూసిన మొహమే, కానీ ఎవరో జ్ఞాపకం రాలేదు .

ఈయనా, అన్నాను ప్రశ్నార్థకంగా!

మా రాజయ్య అందుకోని, గుర్తుకు రాలేదా మీకింకా ! ఈ అబ్బాయి మన రాతల అయ్యోరి కొడుకు.
నిన్న మా వాళ్ళ పెళ్ళిలో కనపడి, మీరెక్కడున్నారని అడుగుతుంటే చెప్పాను, ఇక్కడొచ్చి కలవొచ్చని అని.

అతన్ని కొంచెం పరిశీలనగా చూస్తే , అనిపించింది నిజమే ఇరవై ఏళ్ల క్రితం చివరి సారి చూసాను అతన్ని.

చాలా మారిపోయావు. అమ్మ ఎలావుందీ ! అడిగాన్నేను.

నాకు చేతులు జోడించి చెప్పాడతను, హైదరాబాద్ – DRDO లో పని చేస్తున్నానండి.

ఇన్ని రోజులూ మిమ్మల్ని కలవడం కుదర్లేదు. రాజయ్య సారు చెప్తే, ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని కలిసి పోదామని.అమ్మ కూడా అక్కడే, నా దగ్గర వుంది.

కంటిన్యూ చేస్తూ చెప్పాడు, మీరు అప్పట్లో మమ్మల్ని ఆదుకున్నది, నేను జీవితంలో మర్చిపోలేను అని.

ముందు వరసలో కూర్చుని వున్న మా రెడ్డి గారి వైపు చూస్తూ అనుకున్నా, గుర్తు పెట్టుకోవలసింది నన్ను కాదు అని.

దాదాపు ఇరవై ఏళ్ల క్రితం విషయం, నేను చింతారెడ్డి పాలెం స్కూల్ హెడ్ మాస్టర్ గా చేరి అప్పటికి ఓ రెండేళ్లు అయ్యుంటుందేమో.

ఒక రోజు, మా జీతాల చెక్ తీసుకుందామని, మా పంచాయతీ సమితి ఆఫీస్ కి వెళ్ళాను. అక్కడ పెద్ద గుమస్తా వచ్చి చెప్పాడు ప్రెసిడెంటు గారు మిమ్మల్ని కలవాలంటున్నారని చెప్పి.

ప్రెసిడెంటు గారు అంటే మా భక్తవత్సల రెడ్డి గారు. ఇందుకూరి పేట పంచాయతి సమితి ప్రెసిడెంటు. మా స్కూల్ , ఆ పంచాయతీ సమితి కింద వచ్చే ముప్ఫయి స్కూళ్లలో ఒకటి.

మేము ఏదన్నా పనులు ఉంటే ఆయన్ని కలవడమే కానీ. మమ్మల్ని ఆయన రూమ్ లోకి రమ్మని పిలిపించడం చాలా అరుదు.

ఎవయ్యుంటుందా అని ఆలోచిస్తూనే లోపలి వెళ్ళాను.

ఏం అయ్యోరా ! ఎట్టుంది మన స్కూలు ? అడిగారాయన.

అంతా బానే వుంది, సార్ చెప్పాన్నేను.

నువ్వు వున్నావ్ గా ఆడ! అంతా బానే ఉంటది లే, అడగబల్లే అన్నారాయన.

విషయానికి వస్తూ, చెప్పారు.

రేపు మన బడికి ఓ కొత్త అయ్యోరు వస్తాడు . నువ్వు జాగర్త గా చూస్కోవాలి. నేనే ఆలోచించి నీ దగ్గర అయితే బావుంటాడని ఆర్డర్ ఇప్పిచ్చా మా అయ్యోరికి, అన్నారాయన.

ఆయన రూమ్ లోకి తనే పిలవడం ఓ వింత అయితే , ఇట్టా టీచర్ల గురించి జాగర్తలు చెప్పడం ఇంకో వింత.

టీచర్లు ట్రాన్స్ఫర్ అయ్యిపొయ్యి కొత్త టీచర్లు జాయిన్ కావడమనేది చాలా సాధారణ విషయం.

నేను హెడ్ మాస్టర్ గా వచ్చిన ఆ రెండేళ్లలో, మా స్టాఫ్ గురించి ఆయన కలగజేసుకోడం ఇదే మొదటి సారి.

ఆ ఆశ్చర్యాన్ని పైకి ప్రకటించకుండా తలూపాను, అట్టానే సార్ అంటూ.

చెప్పారు మా రెడ్డి గారు ,

ఏదన్నా ఆయన గురించి ఇబ్బంది వొస్తే నాతో చెప్పు.

పరిషత్తు ఆఫీస్ లో మీటింగ్ కి పోవాలా అంటూ కుర్చీ లోంచి లేస్తూ.

పక్కరోజు పొద్దున్న ఆఫీస్ రూంలో కూర్చుని కిటికీ లోంచి బయటకి చూస్తుంటే,ఓ పన్నెండు పదమూడేళ్ళు వుంటాయేమో. ఒక పిల్లవాడు, ఓ యాభై ఏళ్ల మనిషిని, సైకిల్ వెనకాల కూర్చో పెట్టుకుని తోసుకుంటూ , మా స్కూల్ ఆవరణ లోకి ప్రవేశించాడు.

నేను రూమ్ నించి బయటకొచ్చాను. ఆ పెద్దాయన చిన్నగా సైకిల్ దిగి , ఆ పిల్లవాడి దగ్గరున్న చేతి కర్ర, తన చేతిలోకి తీస్కొని, నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాడు.

నా దగ్గరకొచ్చి ఆయన ఏదో చెప్పాలని ప్రయత్నించాడు కానీ, మాట స్పష్టం గా రావట్లేదు.

ఆయన నోరు ఒక పక్కకి తిరిగి పొయ్యి వుంది. ఎడమ చెయ్యి, ఎడం కాలు కూడా, పూర్తిగా స్వాధీనం లో ఉన్నట్టు లేదు.

ఈ లోపల ఆ అబ్బాయి అందుకొని అడిగాడు . హెడ్ మాస్టర్ గార్ని కలవాలి సార్ . రూమ్ ఎక్కడ అని.

వాళ్ళని నా రూమ్ లోకి తీస్కొని వెళ్లి, ఓ పది నిముషాలు మాట్లాడిన తర్వాత, మా లెక్కల టీచర్ రాజయ్య గార్ని లోపలికి పిలిపించి, ఆయన్ని పరిచయం చేస్తూ చెప్పాను.

ఒక కొత్త టీచర్ జాయిన్ అవుతారని చెప్పా కదా నిన్న సమితి ఆఫీస్ నించి వచ్చి, ఈయనే ! స్టాఫ్ రూమ్ లోకి తీసుకెళ్లి మిగతా వాళ్లకి పరిచయం చేయండి అని.

ఆ పిల్లవాడి వైపు తిరిగి చెప్పాను. అబ్బయ్య ! నాయనా సంగతి నేను చూస్కుంటాను అని చెప్పి.

రోజూ నేను ఉదయం దిగబెట్టి సాయంత్రం తీసుకెళ్తా సార్ నాయన్ని అంటూ వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి.

ఆ సాయంత్రం లోపల, నాకు అర్థమైంది ఏందంటే -మా రెడ్డి గారు పంపించిన, టీచర్ కి అసలు మాట స్పష్టత లేదని, ఏది చెప్పాలన్నా , రాత సహాయం ఆయనకి అవసరమని.

చేతి రాత మాత్రం అద్భుతం గా వుంది.

క్లాసులో పిలకాయలకి పాఠాలు చెప్పే పరిస్థితి మటుకు లేదు.

వేరే పనులకి వాడుకోవాల్సిందే.

పక్కరోజు నించి మా మిగతా టీచర్ల సణుగుళ్లు మొదలైనాయి ఆయన్ని చేర్చుకోడం గురించి..

నేను ఆయన విషయంలో గట్టి గా ఉండడం తో నా వెనక తప్ప , ముందుకొచ్చి ఆయన గురించి ఎవరు మాట్టాడే వాళ్ళు కాదు.

నేను గూడ ఆయనకి, అన్నీ రాత పన్లే, అప్పజెప్పేవాణ్ణి.

చాలా శ్రద్ధగా చేసేవాడు.

రెండునెల్లల్లోనే , అందరి టీచర్ల కి కావాల్సినవాడైపోయాడు, టీచర్లందరికీ అన్ని రాత పనులు చేసి పెట్టడంతో.

అదీగాక, ఆ టైం లో , మా స్కూల్లో ఆఫీస్ అసిస్టెంట్ లేక పోడంతో , అన్ని రిజిస్టర్లు చక్కగా మైంటైన్ చేసేవాడు.

ఇదేగాక , ఏ కారణం చేత అయినా , ఒక క్లాసులో టీచర్ లేకపోతే, తనెళ్ళి , పిల్లలికి సైన్స్ బొమ్మలు వెయ్యడం నేర్పించేవాడు.

వినోదమూ విజ్ఞానమూ రెండూ పిల్లలకు.

మా స్టాఫ్ అంతా ఆయన్ని, ‘రాత అయ్యోరని’ పిల్చుకునేవాళ్ళు.

రోజూ నెల్లూరు భక్తవత్సల నగర్ నించి, స్కూల్ కి వచ్చే వాడని తెల్సింది.

ఇలా ఓ రెండేళ్లు జరిగింతర్వాత, దసరా సెలవల ముందు అనుకుంటా, ఒక నాలుగు రోజులు, రాత అయ్యోరు స్కూల్ కి రాలేదు.

నేను ఒక రోజు ఉదయాన్నే, మా రాజయ్య గార్ని పిల్చి చెప్పాను , వాళ్ళ ఇంటికెళ్లి విషయం కన్నుక్కు రమ్మని.

సాయంత్రం కనుక్కుంటానన్నాడాయన.

అదే రోజు మధ్యాహ్నం నాకు ఎవరో వచ్చి చెప్పారు , ఆ ముందు రోజు రాత్రి, రాతఅయ్యోరు హటాత్తు గా గుండె పోటుతో పొయ్యారని.

మా వాళ్ళని పిల్చి చెప్పాను, సమితి ఆఫీస్ కి వెళ్తున్నా! అర్జెంటు గా అని.

సమితి ఆఫీస్ కి వెళ్తే , ఎదో పెద్ద ఆఫీసర్ విసిట్ కి వచ్చినట్టుంది . ఆఫీస్ లో జనాలందరూ అటూ ఇటూ పరిగెడుతున్నారు.

ఎట్టోఒగట్ట రెడ్డి గారి P.A ని పట్టుకొని ఓ చీటీ లో విషయం రాసి ఆయనకి పంపించాను అర్జెంటు గా మిమ్మల్ని కలవాలని.

ఓ ఐదు నిమిషాల్లో మా రెడ్డి గారు హడావుడి గా హాల్లో కొచ్చారు, రెడ్డి గారి మొహమంతా వివర్ణమై పొయ్యుంది.

విషయం చెప్పాను.

వెంటనే పెద్ద గుమాస్తా ని పిల్చి విషయం చెప్పి, నన్ను చూపించి,

ఆ చనిపొయ్యిన ఆయన కి , ఈ సందర్భంగా మన ఆఫీస్ నించి రావాల్సిన అన్ని డబ్బులు, ఇప్పుడు తీసుకొచ్చి ఈయనకి ఇవ్వు , తర్వాత రసీదు తెచ్చిస్తాడీయన అని ఆర్డర్ జారీ చేశారు.

అంతటి తో ఆగకుండా, అక్కడే పక్కన నిలబడున్న డ్రైవర్ ని పిల్చి చెప్పారు.

ఈ రోజంతా ఈయన తోనే వుండు అని.

ఓ పదిహేను నిమిషాల తర్వాత కాష్ తీస్కొని , కారులో భక్తవత్సల నగర్ బయలు దేరాను.

ఏ టీచర్ కయినా సహాయం కావాలంటే మా రెడ్డి గారు ముందుంటారు గానీ, ఇంత ఆందోళన పడ్డం నేను చూడలేదు ఇంతకు ముందెప్పుడూ.

రెడ్డి గారి డ్రైవర్ మస్తానయ్య నాకు బాగా పరిచయమే.

ఏమైంది సార్ అడిగాడు కారులో నేను స్థిమిత పడ్డాక. విషయం చెప్పాను, అట్లానే , రెడ్డి గారు అంతగా బాధ పడ్డం గురించి గూడ.

భక్త వత్సల నగర్లో వాళ్ళ ఇల్లు వెతకడం మాకు అంత కష్టం కాలేదు.

ఇంటి ముందర కొంతమంది జనాలు గుమి కూడి వున్నారు.

కింద చాప మీద ఆయన్ను పడుకోబెట్టున్నారు.

తల దగ్గర ఆయనది, ఒక చిన్న ఫోటో.

ఆయన భార్య అనుకుంటా! ఆమె, ఆయన కొడుకు, ఆయన పక్కనే వున్నారు.

ఆ పిల్లవాడితో నాలుగు మాటలు మాట్టాడి , ఆఫీస్ నించి తీసుకొచ్చిన కాష్ చేతిలో పెట్టి చెప్పాను. ఏదన్న అవసరం వస్తే తెలియపర్చమని.

ఓ గంట తర్వాత, కారులో కూర్చొని ఇంటికి వెళ్ళేటప్పుడు, అన్నాను మస్తానయ్య తో.

చాల కష్టపడి పనిచేసేవాడు .రెండేళ్లలో అందరికీ బాగా దగ్గరయ్యాడు. ఇబ్బంది వున్నాగూడ , ఇలా అర్ధంతరం గా పోతాడనుకోలేదు అని.

ఇన్ని రోజులు లాగగలడనుకోలేదు సార్ ఈయన అన్నాడు మస్తానయ్య, క్లుప్తం గా.

ఈయన నీకు తెల్సా అడిగాన్నేను.

ఏం మాట్టాడలేదతను కొంచెం సేపు.

నేను మళ్ళీ రెట్టిస్తే చెప్పాడు మస్తానయ్య.

ఈయనది ఇందుకూరు పేట దగ్గర భీమన్న పాలెం. ఆ పక్కూర్లోనే టీచర్ గా చేసే వాడు.

ఈ కొడుకు గాకుండా ఓ పదహారేళ్ళ కూతురుండేది . అమ్మాయి చాల చక్కటిది.

నెల్లూరు మూలప్పేట స్కూల్లో పదో క్లాస్ చదివేది. ఓ రోజు స్కూల్కి వెళ్లిన పిల్ల తిరిగి రాలేదు.

అందరూ వెతికితే , వాళ్ళ ఊరి చివర వుండే తోటలో శవమై కన్పించింది.

ఆ తర్వాత తేలిందేమిటంటే ఆ అమ్మాయి బస్సు దిగి వస్తుంటే , కొంత మంది బలవంతం గా తీసుకెళ్లి , తెల్లవారు ఝామున మళ్ళీ తీసుకొచ్చి , ఆమె శవాన్ని బావిలో వేశారని.

అది తట్టుకోలేక ఈయనకి వెంటనే పక్షవాతం వొచ్చి, శరీరం స్వాధీనం తప్పితే దాదాపు నెల్లాళ్ళు హాస్పిటల్ లో ఉండి కొంత కోలుకున్నాడు.

నిట్టూర్చి చెప్పాను, అతనికి ఏదో ఆరోగ్యం సరిగా లేదనుకున్నా గానీ, ఇంత వివరం గా విషయం నాకూ తెలీదు . ఆయన అవస్థ చూసి , నేను గూడా ఎప్పుడు వివరాల్లోకి వెళ్ళలేదు అని.

అయినా ఇదంతా నీకెట్టా తెల్సు అడిగానతన్ని.

మస్తానయ్య చెప్పాడు –

ఆ అమ్మాయి పొయ్యిన విషయం వాళ్ళ ఊరి అయ్యోర్ల ద్వారా రెడ్డి గారి కి తెల్సింది. అప్పుడు నేనక్కడే వున్నా.

అప్పుడు గూడ తన పేరు బయటకు రాకుండా, రెడ్డి గారు చాల సహాయం చేసారు, డబ్బు సహాయం తో బాటు ఆయన్ని ఇక్కడికి బదిలీ చేయించి, అని.

నేనున్నాను వెంటనే –

రెడ్డి గారే వాళ్ళ కుటుంబానికి సహాయం చేసారని ఆ కుటుంబానికి తెలియాలి.
నేను మళ్ళీ ఇంకో సారొచ్చి ఆయన కొడుక్కి చెప్తాను విషయం చెప్తాను అని.

ఆ పని మటుకు చెయ్యబాకండి. పనులు చెయ్యడం తప్ప, చెప్పించుకోడం ఇష్టం ఉండదు సారుకి అన్నాడు మస్తానయ్య.

ఓ పది నిముషాల తర్వాత , కారు వెంకటేశ్వర స్వామి గుడి ముందర నించి పోతుంటే అన్నాడు మస్తానయ్య.

అన్నీ కష్టాలు కొంతమందికే వస్తాయి . ఈ పెద్దాయన అసలు వున్నట్టా లేనట్టా అని గుడి వైపు చూస్తూ.

చప్పట్ల శబ్దం వినిపించి ఈ లోకానికి తిరిగి వచ్చాను.

రెడ్డి గారు స్టేజి ఎక్కుతున్నారు. రాతల అయ్యోరి కొడుకు గూడ అందరితోపాటు చప్పట్లు కొడుతున్నాడు.

ఇరవై ఏళ్ళక్రితం మస్తానయ్య అన్న మాటలు గుర్తుకొచ్చాయి. వున్నట్టా లేనట్టా అన్న,

రెడ్డి గారి వైపు చూస్తూ అనుకున్నాను.

“కలడా లేడా” అని “సందేహం వలదు”. కొంతమంది మనుషుల చేతల్లో కనపడతాడు అని.

ఆ ఆలోచనతో పాటే, అప్రయత్నం గా, దూరం గా వున్న రెడ్డి గారిని చూస్తూ నేను చప్పట్లు కొట్టడం మొదలు పెట్టాను .

— మీ సుందరబాబు

“కలడు కలం డనెడు వాడు?” కి 11 స్పందనలు

  1. బాగుందండీ.
    మీ టపా శీర్షికలో పొరపాట్లున్నాయండి. కొంచెం‌ మార్చగలరా వీలైతే?
    “కలడు కలండెను వాడు?” అని కాక “కలడు కలం డనెడు వాడు?” అని ఉండాలండి సరిగా ఉండాలంటే.

    1. మంచి observation సర్.
      పొరబాటే.
      సరిదిద్దుతాము . మీకు కృతఙ్ఞతలు .

  2. మీ టపాలు అన్నీ చదివాను, చాలా బాగుంటున్నాయి. ఇది ఎందుకో నా మనసుకు బాగా హత్తుకుంది, బహూశా అలాంటి ఉపాధ్యాయులని చూసినందువల్లేమో. నాకు తెలుసున్న వాళ్ళకి షేర్ చేసాను, తప్పక చదవండి అంటూ.ఇలాగే రాస్తూ ఉండండి.

    1. థాంక్స్ అండి వాత్సల్య గారు. నా కథలు చదివినందులకు మరియు బాగున్నాయని చెప్పినందులకు. మీరు చెప్పిన “కలడు కలండనెడు వాడు” కథ మాఘ గురుతుల్యులైన శ్రీ సుందర బాబు గారు వ్రాసినారు. ఆయన వద్దనుండి మరి కొన్ని కథలు వినాలని, నేను ఆయన కోసం “సుందరకాలం” అనే ఒక పుటను కేటాయించాను. ఆయన నుండి మరికొన్ని మంచి కథలను ఆశిద్దామండి.

  3. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు 🙏

    ఒకరికి సవాలును ఇచ్చాడు, ఇంకొకరిచే నిర్వహింపజేశాడు, ముఖ్యుడిచే ముగింపచేశాడు..

    ఒక చేతికి తెలియకుండా ఇంకొక చేత్తో సాయం చేసే రెడ్డిగారు గొప్పా లేక ఇచ్చిన అవకాశాన్ని అందరికీ సంతృప్తినిస్తూ ముగించిన రాతలయ్యోరు గొప్పా లేక తన కర్తవ్యాన్ని ఎవరినీ నొప్పించక చేసుకెళ్ళిన కధకుడు గొప్పా!!
    మానవత్వం కాస్త మిగులుందంటే ఇదేనేమో!!
    కొన్ని కధలు చదివితే మనకు తెలియని చిన్ని చెమ్మ కళ్ళను తాకుతుంది. రాతలయ్యోరి జ్ఞాపకాలతో నాకు అదే జరిగింది🙏

    1. ఒక్కోసారి కొన్ని ముందుమాటలు , విమర్శలు , రచయిత వ్యక్తపరిచిన దానికన్నా గొప్పగా భావ వ్యక్తీకరణ చేసి , ఆ రచనని వేరే స్థాయిలో నిలబెడతాయి. ఈ విమర్శ ఆ కోవకి చెందింది. superbly expressed Ravi.

    2. అద్భుతమైన వ్యాఖ్య. మీరు చెప్పిన ఆ మువ్వురితో పాటు, మానవత్వం ఎపుడూ పరిమళిస్తూనే వుంటుందని చెమ్మగిల్లిన కళ్ళ సాక్ష్యం గా నమ్మే మీలాటి పాఠకులు కూడా గొప్పవారు, రవికాంత్ గారు.

  4. Anam Venkata Ramesh Reddy Avatar
    Anam Venkata Ramesh Reddy

    గొప్పవాళ్ళ పనులు మాటలవరకె ఉంటాయి.
    గొప్ప మనసు ఉన్న వాళ్ళ పనులు చేతల్లో ఉంటాయి.
    అందుకు నిదర్శనం ఈ కలడు కలం డనెడు వాడు?

    ఆనం రమేష్ రెడ్డి
    MCA, MA,MLISc,BL.,

Leave a Reply