Apple PodcastsSpotifyGoogle Podcasts

మా స్నేహ రమణీయం!

మా ప్రభుత్వ ఉన్నత ఆదర్శ పాఠశాల యిచ్చిన సన్నిహిత మిత్రులలో మా రమణుడు ముందు వరుసలో ఉంటాడు. బిక్కు బిక్కు మంటూ ఎనిమిదవ తరగతి బి-సెక్షన్ లో చేరిన నన్ను వీడు వెంటనే ఆదరించాడు. ఆ రోజుల్లో మా స్నేహాలు మొదట మనిషి గుణ గణాలని బట్టి కాక వారికొచ్చిన మార్కులను బట్టి మొదలయ్యేవి, అటు పిమ్మట కొంత కాలానికి స్నేహాలు స్థిర మవ్వటమో లేక ఒడిదుడుకులకు లోనవ్వటమో జరిగేవి.

వీడు ఏడవ తరగతిలో ద్వితీయ స్థానంలో వచ్చినా, ప్రధమ స్థానములో వున్న మల్లిగాడికి వీడికి మార్కుల లో తేడా ఓ వంద మార్కులకు పైనే. అప్పటి వరకు మా మల్లిగాడు ఎదురులేని మనిషి అన్న మాట. ఆ మార్కుల తేడా వీడి మనస్సులో చాలా బలం గా నాటుకు పోయినది. నేను ఎనిమిదవ తరగతి లో చేరగానే మొదట నాకు వీడు చెప్పినది ఏమిటంటే వాడికి మూడేళ్ళ సమయం ఉందని, ఈ మూడేళ్ళలో కష్ట పడి చదివి పడవ తరగతిలో ప్రథముడిగా నిలుస్తానని. 

దానికి తగ్గట్టే ప్రణాళికలు వేసాడు వీడు, ఎనిమిదిలో నాతో చాలా పోరాడాడు, నన్ను తెలుగు బదులు సంస్కృతము తీసుకోమని, అలా తీసుకుంటే పదవ తరగతి లో మంచిగా మార్కులు సాధించ వచ్చు అని. కాలం జరిగే కొద్ది ఒక మనిషిలో వచ్చే అద్భుతమైన మార్పుని దగ్గర నుండి వీక్షించటం ఒక అదృష్టమైతే నేను అట్టి వాళ్లలో ఒకడిని, ఎందుకంటే వాడి మార్పుకి ప్రత్యక్ష సాక్షిని నేనే. పాఠ్య అంశాల మీద ఏమన్నా సందేహాలు ఉంటే వాటిని ఉపాధ్యాయుల వెంటపడి వెంటనే తీర్చుకోవటం, అంశాలమీద వేరు వేరు పుస్తకాలు చదవటం వీధిలో వికాసాన్ని బాగా పెంచాయి.

ఆ వికాసము  వలన వీడు మా లిటరసీ అసెంబ్లీకి సెక్రటరీ అయ్యాడు మరియు అద్భుతమైన వక్తగా మారాడు. అందులోను వీడు కథలు చెప్పటంలో నా కన్నా దిట్ట. మీకేమో సురేష్ కృష్ణ రాసిన బాషా స్క్రిప్ట్ (బైబిల్ అఫ్ అల్ మోడరన్ స్క్రిప్ట్స్ అట) యీ మధ్య తెలుసు. కానీ నాకు మన రమణుడు ఎప్పుడో పరిచయం చేసేసాడు నారపనేని వీరాస్వామి అండ్ సన్స్ ని. నారపనేని వీరాస్వామి గారు వీళ్ళ తాత గారు. ఆయనది నెల్లూరులో కెల్లా పేరుగాంచిన పండ్ల వ్యాపారము.   

నేను నోరు విప్పార్చుకుని వినే వాడిని మా రమణుడు చెప్పే సంగతులు,  ఎలా వాళ్ళ నాన్నగారు లక్షలాది ఆస్తులు వదిలేసుకొని, కుటుంబం నుండి బయటకు వచ్చేసి సింపుల్ గా బతికేస్తున్నారో అని. నెల్లూరిలో  పెద్ద బజార్ నుండి కామాటి వీధికెళ్లే మొదల్లో వాళ్ళకొక పండ్ల కొట్టు ఉండేది, అది నడుపుతూ వాళ్ళ నాన్న గారు వీళ్ళ ముగ్గురు అన్న తమ్ములను చదివించుకునే వారు.

ఆయన్ని చూడాలనే కోరిక వెంటనే కలిగేది కూడా నాకు. ఆయన నన్ను చాల ప్రేమగా పలకరించే వారు. మా స్నేహితుల్లో చాల మందికి తెలుసు నేను ఆయన్ని నాయనా అనే పిలుస్తానని. ఇప్పటికీ నెల్లూరు వెళ్తే నేను కలిసే వ్యక్తుల్లో ఆయన ఒకరు.

ఇక పువ్వు పుట్టగానే పరిమళించినట్టు వీడు పుట్టుకతోనే పెదరాయుడు, ఇంటికి పెద్ద కొడుకు మరియు వాళ్ళ అమ్మగారికి కుమారి అయ్యాడు ఆడపిల్లలు లేక. వీళ్ళ అమ్మ గారు మహా స్ట్రిక్టు . నేను అంత దూరం నుండి వచ్చి వీడి చదువు కాజేస్తున్నానని ఆవిడ నమ్మకం. అది నిజం కూడా. వాళ్ళ ఇంటి కెళ్లిన నాకు వాళ్ళ కాంపౌండ్ వాల్ గేట్ దగ్గరే వాళ్ళ అమ్మగారు, కుమార్ ఇంట్లో లేడురా అని చెప్పేవారు,  ఈలోపలే మావాడు బాల్కనీ లో నుండి చేయి ఊపేవాడు.

నేను కూడా సిగ్గులేకుండా మీరు చూడలేదేమో అమ్మా వాడు ఇంట్లోనే వున్నాడు అని చెప్పి దూరిపోయేవాడిని చాలా సమయాల్లో. అప్పుడప్పుడు ఆవిడ అలా చెప్పటంతో కొంచెం అంతర్మధనం చెంది యింటికెళ్లి కాసేపు మాత్రం పుస్తకం పట్టేవాడిని, కానీ మన బుద్ధి షరా మామూలే. మా అమ్మ ఎప్పుడు చెప్పినట్టు దాలిగుంటలో వెచ్చగా ఉన్నంత సేపే నంట కుక్కపిల్ల రేపటి నుండి ఎవరి ఇళ్లలోనూ కుండలు ముట్టకూడదు అని అనుకొనేది బయటకు రాగానే దాని బుద్ధి షరా మామూలేనట.

ఎనిమిదవ తరగతిలో సైన్స్ ఫెయిర్ కి మల్లి, ప్రతాప్ వెళ్లారు స్కూల్ తరపున కావలికి. మేము ఇద్దరం టికెట్ పెట్టుకొని వెళ్లి చూసొచ్చాము. చూస్తూ ఉండరా నెక్స్ట్ ఇయర్ నేను ఖచ్చితంగా స్కూల్ తరపున వెళ్తాన్రా అన్నాడు,  అన్నమాట ప్రకారం  తదుపరి సంవత్సరం  గూడూరు లో జరిగిన సైన్స్ ఫెయిర్ కి  వెళ్ళాడు. కల కనటం సాధించుకోవటం వాడికి అలవాటే హార్డ్ వర్క్ ద్వారా.  అలాగే 480 మార్కులతో పదవ తరగతిలో మా బడికి ప్రథముడిగా నిలబడ్డాడు . ఎప్పుడన్నా మా ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలకు వెళ్తే అక్కడ వాల్ అఫ్ ఫేమ్ పలక మీద వీడి పేరు 1985 సంవత్సరానికి ఎదురుగా చూడటం ఓ గొప్ప అనుభూతి.

నేను ఇప్పటికే రిగ్రెట్ అయ్యే అంశమేదన్న వుంటే వాడి మాట పెడచెవిన పెట్టటమే. వాడు చెప్పిన విధముగా సంస్కృతములో చేరక పోవటం వలన రమారమి నేను ఓ ఇరవై అయిదు మార్కులు పోగొట్టుకున్న పదవ తరగతిలో. కేవలం అరవై మూడు మార్కులు వచ్చాయి నాకు తెలుగులో, సంస్కృతం తీసుకున్న మా మల్లీకి, రమణుడుకి ఎనభై ఐదుకి తగ్గలా మార్కులు.

వాడు పాలిటెక్నిక్, నేను ఇంటర్ కు వెళ్ళటంతో ఆ స్నేహానికి గ్యాప్ వచ్చేసింది. ఎప్పుడన్నా కలిసినప్పుడువాడు మాటి మాటికీ నన్ను సతీష సతీష అనేవాడు, ఆ సతీష అనే అతను మా వాడికి పాలిటెక్నిక్ లో కొత్త ఫ్రెండ్ అని అర్థమయ్యింది. దానితో పాటు ప్రయారిటీలు మారాయని, లైఫ్ హాస్ టు కంటిన్యూ విత్ న్యూ ఎంటిటీస్ అని కూడా. పాలిటెక్నిక్ అయినా పిమ్మట వాడు జె.ఎన్.టి.యూ అనంతపూర్ కళాశాల లో ఇంజనీరింగ్ చేశాడు. ఎక్కడికెళ్లినా విజయకేతనమే వాడిది. రమణ తో నాకు చాలా వున్నాయి జ్ఞాపకాలు. చెప్పాలంటే రోజులు చాలవు. అవన్నీ చాల ఇష్టం కొంచెం కష్టంతో కూడుకున్నవి.

అప్పుడప్పుడు మల్లిగాడు మరియు రమణుడుల మధ్యలో నలిగి, మా ఆన్సర్, లక్ష్మిపతిలతో కలిసి తృతీయ ఫ్రంట్ ఏర్పరచినా, తూచ్ అంటూ ఆ తృతీయ ఫ్రంట్ ని రద్దు చేసి వీడి వైపే దూకేసేవాడిని అలా ఉండేది వీడి మాటల చమత్కారం మరియు మా తృతీయ ఫ్రంట్ యొక్క దొర్లుడు  పుచ్చకాయ వ్యవహారం. నేను అందరితో ఎక్కువగా తిరిగినా, స్నేహంలో ఎక్కువగా వీడి వైపే మొగ్గాను. మా అమ్మ చేసే చేపల కూర, నేను కొసరి వడ్డిస్తుండగా తినటం వీడికి చాలా ఇష్టం. అసలు చేపలు కూర మీద పేటెంట్ మా అమ్మకే ఇవ్వాలంటాడు వీడు.

మా  రమణ లో ఒక స్టోరీ టెల్లర్ దాగున్నాడు. మా  పదవ తరగతి లో అనుకుంటా  చందమామ సంచికలో బొమ్మ ఇచ్చి ఆ బొమ్మకు తగ్గ కథ రాయమన్నారు. ఒక సింహం, ఒక పిల్లి రాజ మందిరంలో వున్న బొమ్మ ఇచ్చి కథ రాయమన్నారు. అడవిలో క్రూరమైన సింహాన్ని అడ్డు తొలగించు కోవడానికి ఒక తెలివైన పిల్లి సింహంతో నేను రాజ మందిరానికి ధైర్యంగా వెళ్ళగలను నువ్వు వెళ్ళగలవా అని పందెం వేసి రాజమందిరానికి రప్పిస్తుంది. అక్కడ రక్షక భటులు ఆ సింహాన్ని చంపేస్తారు. ఇది వాడు రాసిన స్టోరీ. ఈ స్టోరీ ఎన్నిక అయ్యి ప్రచురింప బడింది. ఈ మధ్యనే అనుకుంటా ఆ సంచిక వెతికి వాడికి ఆ లింక్ కూడా పంపాను.

అందరం కలిసి ఫోటో తీయుంచు కుందాము అనేది వాడి ఐడియా పదవ తరగతిలో. అలా ఫోటో తీయించుకొని నెల్లూరి కే తలమానికమయిన జై హింద్ మిఠాయి అంగడి లో గులాబ్ జామూన్ తినాలని ప్లాన్ వేసాము. మేము వెళ్లిన రోజున ఫోటో స్టూడియో తెరవలేదు. కానీ గులాబ్ జామూన్ మాత్రం తిన్నాము. తర్వాత ఫోటోకి నేను ఎందుకో వెళ్లలేక పోయా. ఆన్సర్, రఘు, చందు, పతి వెళ్లారు అనుకుంటా. ఆ ఫొటోస్ చూసినప్పుడల్లా నేను వెళ్లి ఉండాల్సింది అనే దిగులు కలుగుతుంది.

అప్పటిలో వీడు వీడి పి.డి.ఎస్.యూ భావజాలం నా మీద రుద్దే వాడు. నో దేవుడు, నో గుడి, సమ సమాజం అంటూ. ఒకసారి మేము కావలిక్కూడా బయలుదేరాము వాళ్ళ సమావేశాలు చూడడానికి. వీడి నో గుడి గోల నేను భరించలేక పోవటం, అన్నిటికీ వీడు రుజువు చూపించరా అని దబాయించటం మరియు వీడి వాదనా పటిమ ముందు నేను పదే పదే ఓడిపోవటం చూసిన మా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు నాకొక సలహా ఇచ్చారు. వీడిని మా బడిలోనే ఒక ప్లగ్ పాయింట్ కి తీసుకెళ్లి వాడిని వేలు పెట్టమని అడగరా హర్ష అని, వాడు పెట్టకపోతే అప్పుడు చెప్పరా! కరెంటు కి కూడా రూపం లేదు, కంటికి కూడా కనిపించదు, కానీ ఎనలేని శక్తి వుంది అని. ఆ రోజుకి వీడి బారి నుండి నన్ను గట్టెక్కించిన ఆ మహానుభావుడికి ధన్యవాదాలు చెప్పా.

కానీ ఇప్పుడు కెంటకీ లోని లూయివిల్లీ లో ఉదయం భగవత్ గీత లేక వెంకటేశ్వర సుప్రభాతంతో తన రోజుని మొదలు పెడుతాడు. పెళ్లయ్యాక భార్యలు మార్చేస్తారు ఏమో మనిషినే సమూలంగా. లేక పోతే అప్పుడు ఏదైనా నా చేతిలోనే వుంది అనే నమ్మకం పెళ్లయ్యాక నా  చేతిలో ఏమీ లేదు అనే పరివర్తన గా మారినదేమో.

“మా స్నేహ రమణీయం!” కి 9 స్పందనలు

  1. Thank you so much, Harsha! నీవంటి మిత్రుడు నాకు దొరకడం , 🙏🏼

  2. నీ వంటి మిత్రుడు మాకు High School లొ వుండడం .. మాకు వరం 🙏🏼

  3. మీ రమణుడు, ఇప్పుడు లూయీవిల్ మాకు చాలా కథలు చెపుతూ మాఅందరికీ మంచి ఆత్మీయుడు అయ్యారు. మీరు మీ హర్షణీయం ద్వారా ఆయన చెప్పిన కథలు కొంత వరకూ నిజమే అని తెలియచేసినందుకు కృతజ్ఞతలు… మీరు వ్రాసే పద్దతి, చదివే పద్దతి కూడా చాలా బావుంది. భగవంతుని ఆశీస్సులతో మీ హర్షణీయం బాగా ఆదరణ పొందాలని కోరుకుంటూ… సెలవు…

  4. మీ బ్లాగ్‌లో ఆడియో ఎంబెడ్ చేయడం బావుంది. ఎలా చేశారో చెప్పగలరా, ప్లీజ్!

    1. లలిత గారు, ముందుగా ఆడియో ని ఎంపీ౩ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకున్నాను అండి. వర్డ్ ప్రెస్ లో ఆడ్ బ్లాక్ ఆప్షన్ చేసుకోగానే, అక్కడ వివిధ రకాల ఆప్షన్స్ వస్తాయి, ఉదాహరణకి, పేరాగ్రాఫ్ లేక ఆడియో మొదలగునవి. ఆడియో ఆప్షన్ ఎంచుకొని, ఆడియో ఫైల్ ని అప్లోడ్ చేయటమేనండి.

  5. మామ నీ మెమరీ కి ధన్యవాదాలు మామ.వాయిస్ మెసేజ్ మరియు టైపింగ్ వల్ల అందరికీ ఉపయోగంగా ఉంటుంది చదివేవారు చదువుతారు వినే వారు వింటారు. నువ్వు కేక మామ.

Leave a Reply to Bala ChittemCancel reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading