Apple PodcastsSpotifyGoogle Podcasts

మా విజయ్ – “అన్న”

చేతి లో ఒక చిన్న బాగు తో, నా రూం బయట, కుర్చీలో కూర్చుని వెయిట్ చేస్తున్నాడాయన.

అరవై ఐదు ఏళ్ళు ఉంటాయి.

ఆయన్ని చివరి సారి నేను చూసింది నేను 10th క్లాస్ లో వున్నప్పుడు, ఇదే వూర్లో .

నా ముందున్న ఫైల్ మీద రాసుంది ఆయన పేరు, సంజీవరావు అని.

కావాలని ఒక రెండు గంటలనించి ఆయనని, నా గురించి వెయిట్ చేయిస్తున్నా.

నవంబర్ నెల కావడంతో, పెన్షన్ తీసుకొనే సీనియర్ సిటిజన్స్, “లైఫ్ సర్టిఫికెట్’ కోసం మా ఆఫీస్ కి వస్తారు, ఫిసికల్ వెరిఫికేషన్ గురించి.

వాళ్ళ ఐడెంటిటీ వెరిఫై చేసి మేం సర్టిఫై చేస్తేనే, పెన్షన్ కంటిన్యూ అవుతుంది.

నేను కూడా, అంతకు ముందు నెలలోనే, ట్రాన్స్ఫర్ అయ్యి వరంగల్ ఆఫీస్ లో జాయిన్ అయ్యాను. మా ఫాదర్ కూడా ఇదే వూర్లో నా స్కూల్ డేస్ లో ఓ ఐదేళ్లు పని చేయడంతో, నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి ఈ వూర్లో.

ఇంతలో, మా ఫ్రంట్ ఆఫీస్ క్లర్కు, గఫార్ లోపలికొచ్చాడు ,

“సార్ చాలా సేపటినించి వెయిట్ చేస్తున్నాడు సార్, ఆ పెద్దాయన మీకోసం, లోపలికి పిలవమంటారా ?” అన్నాడు, కొంచెం ఆదుర్దాగా.

“సరే రమ్మను,” అన్నాన్నేను.

ఓ రెండు నిమిషాల తర్వాత, సంజీవరావు వచ్చి, నా ఎదురుగా వున్న, కుర్చీలో కూర్చున్నాడు.

ఓ ఐదు నిమిషాలు ఆయన ఫైలు అటూ ఇటూ తిప్పి, అక్కడే నిలబడి వున్న మా గఫార్ మొహం లోకి చూస్తూ చెప్పాను.

“మా రికార్డ్స్ లో వుండే మీ పేరు, మీ అప్లికేషన్ లో మీరు రాసిన మీ పేరు, స్పెల్లింగ్ మ్యాచ్ కావట్లేదు.”

సంజీవరావు ఆందోళనగా అన్నాడు, “అదే విషయం నాకూ అర్థం కావట్లేదండి, పదేళ్లనించి ప్రతీ సంవత్సరం ఇదే ఆఫీస్ లో సర్టిఫై చేయిచుకుంటున్నాను. ఇప్పుడు మీరే ఎదో ఒక పద్ధతి ఆలోచించండి, ఇప్పుడు పెన్షన్ ఆగిపోతే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. వేరే ఆధారం ఏం లేదు .”

“ఆలోచిస్తాను, కానీ, రెండు వారాలు పడ్తుంది. వర్క్ చాలా హెవీ గా వుంది ” అన్నాన్నేను, ఫర్మ్ గా.

“మీరు అలా అంటే నేనేమీ చెప్పలేనండి. కానీ, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు, నా ప్రాబ్లెమ్ సాల్వ్ కాకపోతే, మీ ఆఫీస్ నించి కదిలి వెళ్లే పరిస్థితి మటుకు ఉండదు నాకు” అంటూ కుర్చీ లోంచి లేచి డోర్ వైపు అడుగులేసాడు సంజీవ రావు .

డోర్ దాకా వెళ్లి, ఒక్క క్షణం ఆగి, వెనక్కి తిరిగి అన్నాడు సంజీవ రావు నన్ను పరిశీలనగా చూస్తూ, ” మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది” అని.

“ఆ అవకాశం లేదు. నాకు ఇక్కడి ట్రాన్స్ఫర్ అయ్యి నెల మాత్రమే అయ్యింది” అన్నాను నేను పొడి పొడి గా.

తన బెల్టు సరి చేసుకుంటూ, రూమ్ బయటకి వెళ్ళిపోయాడు సంజీవ రావు.

గఫార్ కూడా, నా మొహంలోకి అదోలా చూసి, రూమ్ నించి బయటకు వెళ్ళిపోయాడు, తన సీటు దగ్గరికి.

సంజీవరావు ఫైల్ వైపే చూస్తూ ఓ ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను.

సంజీవరావు, మా పక్కింట్లోనే ఉండేవాడు, మా ఫామిలీ ఇరవై ఏళ్ళక్రితం ఇదే వరంగల్ లో ఉండేటప్పుడు. ఆజన్మ బ్రహ్మచారి. మా కాలనీ లో ఆయనికి ఓ పెద్ద చాదస్తుడు అనే పేరు ఉండేది. ఆయన తమ్ముడే విజయ్.

మా స్నేహితులందరం ప్రేమగా పిల్చుకునే విజ్జన్న, సంజీవ రావు కంటే విజ్జన్న ఓ పదిహేనేళ్లు చిన్న.

హైదరాబాద్ లో నిజాం కాలేజీ లో చదివే వాడు విజ్జన్న. సెలవలకి విజ్జన్న వరంగల్ వొస్తే, మా పిల్లలందరికి పండగే పండగ. మా పిల్లలందరికీ విజ్జన్న అంటే ఒక పెద్ద హీరో. ఇది గాక, మా విజ్జన్న కి ఎందుకో నేనంటే విపరీతమైన ఇష్టం. నన్నూ, నా ఫ్రెండ్స్ నీ, తెగ సినిమాలకి, షికార్లకి తిప్పేవాడు వూర్లో వున్నన్ని రోజులూ.

కానీ ఇంత సరదాగా వుండే మా విజ్జన్నకీ, సంజీవరావు కీ ఎప్పుడు పడేది కాదు. ఆ రోజు నాకు బాగా గుర్తు. మా నాన్న కి విజయవాడ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చిన రోజు.

మా విజ్జన్న, హైదరాబాద్ నించి పూలదండలతో సహా, ఒక అమ్మాయి తో సంజీవ రావు గారింట్లో దిగి పొయ్యేడు.

ఇంక రామ రావణ యుద్ధం, ఫైనల్ గా, పక్క రోజు పొద్దున్నే, విజ్జన్నను కొత్త పెళ్ళాం తో సహా, ఇంట్లో నించి బయటకి పంపించాడు వాళ్లన్న, సంజీవ రావు గారు, కాలనీ లో ఎవ్వరు చెప్పినా వినిపించుకోకుండా…

ఈ గొడవలు ఆస్తి పరంగా సంజీవరావు కి బాగానే కలిసొచ్చాయి అని మా కాలనీ వాళ్ళు అనుకునే వాళ్ళు, విజ్జన్న ను ఆయన వదిలించు కోవడంతో.

విజ్జన్నను, సంజీవరావు, ఆ రకంగా, ఇంట్లోనించి పంపించేసిన సంఘటన నన్ను చాల బాధ పెట్టింది. సంజీవరావు అంటే అసహ్యం పుట్టేలా చేసింది.

విజ్జన్న పెళ్లి తర్వాత, హైదరాబాద్ లోనే ఎక్కడో చిన్న ఇంట్లో భార్య తో ఉంటున్నాడని, వుద్యోగం కోసమని తెగ వెతుకుతున్నాడని, అప్పట్లో మా ఫ్రండ్స్ లో ఎవరో చెప్తే విన్నాను.

ఇది జరిగిన ఆర్నెల్లకో ఏమో, మా నాన్న, ఫామిలీని విజయవాడ షిఫ్ట్ చేయడంతో, విజ్జన్న గురించి అసలు సమాచారమే లేకుండా పొయ్యింది.

విజ్జన్న ను నేను మళ్ళీ చూసింది,చాలా ఏళ్ళ తర్వాత, డెక్కన్ క్రానికల్ లో ఫోటో రూపంలో, నేను చదువు పూర్తిచేసుకుని, ఉద్యోగంలో చేరి, ఎదో ట్రైనింగ్ కని చెప్పి హైదరాబాద్ వెళ్ళినప్పుడు.

ఫోటో క్రింద రాసుంది దశదిన కర్మలు అని ఒక డేట్ వేసి.

ఇట్టా నా ఆలోచనల్లో నేనుంటే, రూమ్ లోపలికొచ్చి, నా ఎదురుగ్గా కూర్చున్నాడు సుధాకర్, నాకు దూరం కజిన్. హైదరాబాద్ లో ఉంటాడు వాడు.

సుధాకర్ వాళ్ళ ఫాదర్ రామ్మోహన్ గారు గూడ, మా నాన్న డిపార్ట్మెంట్ లోనే హనుమ కొండ లో పనిచేసేవారు. కాకపోతే కొన్నేళ్లు పని చేసింతర్వాత, రెసిగ్నషన్ ఇచ్చేసి, ప్రైవేట్ కాంట్రాక్టు వర్క్ చెయ్యడం మొదలు పెట్టి, బాగా సంపాదించారు. ఇప్పుడు ట్విన్ సిటీస్ లో వుండే టాప్ బిల్డర్స్ లో సుధాకర్ వాళ్ళ ఫాదర్ రామ్మోహన్ గారొకరు.

నేను ఎదో అనే లోపలే చెప్పడం మొదలు పెట్టాడు వాడు నాన్ స్టాప్ గా. “శని వారం,మా రెండో చెల్లెలి పెళ్లి హైదరాబాద్ లో, పెళ్లి గోల్కొండ హోటల్లో. ముహూర్తం సాయంత్రం ఏడు గంటలకి. వెడ్డింగ్ కార్డు ఒకటే తీస్కోచ్చానురా. ఇప్పుడే మీ ఆఫీస్ దగ్గరే మా ఫాదర్ చిన్నప్పటి ఫ్రెండ్ ఒకాయన కనపడితే ఇచ్చేసాను, నీకివ్వక పోయిన పరవాలేదని ” అన్నాడు సుధాకర్.

“మా ఆఫీస్ లో ఎవరు. ” అడిగాన్నేను క్యూరియస్ గా.

“మీ ఆఫీస్ గాదు, సంజీవరావు అని, మీ ఆఫీస్ కి ఎదో పని మీద వచ్చాడట”, అన్నాడు సుధాకర్.

“ఆ మహాశయుడు నీకు గూడ తెల్సా” అడిగాన్నేను వ్యంగ్యంగా.

“అదేంది అలా అడిగావు, అంత గొప్ప పనులు ఏం చేసాడు ఆయన”, అన్నాడు సుధాకర్.

విషయం అంతా చెప్పి చెప్పాను. “బతికినన్నాళ్ళూ అసంతృప్తితోనే గడిపాడట విజ్జన్న. విజ్జన్న, చనిపోయిన ఓ రెండు నెలల తర్వాత నేను వాళ్ళ ఆవిడని కలవడం కుదిరింది. విజ్జన్న దహన సంస్కారాల తర్వాత, ఆ ఇంటి వైపు కన్నెత్తి గూడ చూడలేదట ఈ సంజీవరావు. ఇది గాక ఆస్తి లో చిల్లి గవ్వ గూడ ఇవ్వలేదట. నేను సపోర్ట్ ఆఫర్ చేస్తే, ఆవిడ తీసుకోడానికి ముందుకు రాలేదు. దాని తర్వాత నేను గూడ కాంటాక్ట్ లో లేను ” అని.

“ఇంత స్టోరీ ఉందని నాకు తెలీదు. మా నాన్న కేవన్నా తెలుసేమో” అన్నాడు సుధాకర్.

సుధారాకర్ బయటకు వెళ్లిన పది నిముషాలకి , మా ఇంటి కి ఫోన్ చేసి మా ఆవిణ్ణి అడిగాను., “మా విజ్జన్న గుర్తున్నాడా” ?

“అదే మీ చిన్నప్పటి ఫ్రెండ్.. హైదరాబాద్ లో మా సుమతి వాళ్ళ కాలనీ లో కాపురం ఉంటూ సడన్ గా హార్ట్ ఎటాక్ తో పోయాడు. ఆయనే గదా” అంది మా ఆవిడ.

“ఆయనే. మీ సుమతి ఫోన్ నెంబర్ ఎలాగో సంపాదించి, కొంచెం ఇప్పుడుమా విజ్జన్న వైఫ్ ఎలా వున్నారో కనుక్కుంటావా ” అడిగాన్నేను.

సాయంత్రం డైనింగ్ టేబుల్ దగ్గర మా ఆవిడ చెప్పింది. “ఇప్పుడు మీ విజ్జన్న వైఫ్, హైదరాబాద్ నించి నల్గొండ షిఫ్ట్ అయిపోయారట”, అని.

” ఎలా ఉందట ఆవిడ?” అడిగాన్నేను.

“కాలనీ వాళ్ళ తో టచ్ లోనే వుంటుందట ఆవిడ. బాగానే ఉన్నారట, నల్గొండ లో ఎదో స్కూల్ రన్ చేస్కుంటూ. విజయ్ గారు పని చేసిన కంపెనీ వాళ్ళు, ఆయన పోయిన తర్వాత, చాల డబ్బులు ఇచ్చారట, విజయ్ గారు కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేశారని చెప్పి. కంపెనీ పేరు గూడ ఎదో చెప్పిందండి సుమతి. చాల పెద్ద కంపెనీ అట. జననియో రమనీయో అని”

“మంచి న్యూస్ చెప్పావు” అన్నాను నేను మా ఆవిడతో, కంచం ముందు నుంచి లేస్తూ.

ఆ శని వారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నాను, సుధాకర్ సిస్టర్ మ్యారేజ్ కని చెప్పి. సెకండరాబాద్ స్టేషన్ నుండి, టాక్సీ తీసుకుంటే, గంట పెట్టాల్సిన జర్నీ , రెండు గంటల పట్టింది. ముహూర్తానికి గంట లేటు గా వెన్యూ కి చేరుకున్నా.

గోల్కొండ హోటల్ లో ఎంటర్ అయితే , పెళ్లి గ్రౌండ్ ఫ్లోర్ లో వుండే ఫంక్షన్ హాల్ లో అని తెల్సింది.

నేను కిందికి వెళ్ళేటప్పడికి, సిటీ పెళ్లి గదా, హాల్ అంతా ఖాళీ , అందరు జనాలూ, భోజనాలకని డైనింగ్ హాలు మీద పడ్డట్టున్నారు.

సుధాకర్ వాళ్ళ నాన్న గారు రామ్మోహన్ గారు, ఓ మూల కూర్చోనున్నారు తీరిగ్గా.

సుధాకర్ అక్కడే స్టేజి మీద వున్న వాళ్ళ చెల్లెలి కి, బావకి నన్ను పరిచయం చేసాడు.

స్టేజి దిగిన తర్వాత, నన్ను గూడ డైనింగ్ హాల్ లోకి తోలేస్తూ చెప్పాడు. ” నువ్వు భోజనం చేసి రా. ఒక పది నిముషాలు మాట్లాడుకుందాం”, అని.

భోజనం చేసి హాల్ లోకి వచేటప్పడికి, సుధాకర్ వాళ్ళ ఫాదర్ తో కూర్చుని ఎదో మాట్లాడుతున్నాడు ఆనిమేటెడ్ గా. దూరం నుంచి వస్తున్న నన్ను చూసి పిల్చాడు.

దగ్గరికి వెళ్లి వాళ్ళ ఫాదర్ నమస్కారం చేసి కూర్చున్నాను.

ఆయన్ని నేను కల్సి, చాలా ఏళ్ళే అయ్యింది. నిజమైన రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ లాగానే వున్నారాయన. కుడి చేతికి మూడో నాలుగో ఉంగరాలతో. సిల్కు పంచె చొక్కాతో, మెరిసి పోతూ.

ఎలా వున్నావు , నాన్న ఆరోగ్యం ఎలా వుంది అడిగారు రామ్ మోహన్ గారు.

అంతా బావున్నాం సర్ . చెప్పాను నేను

ఆయనే మళ్ళీ అన్నారు, ” ఇప్పుడే సుధాకర్ , మా సంజీవమ్ గురించి చెప్పాడు. నువ్వు అనుకున్నంత దుర్మార్గుడు కాదు మా వాడు” అని.

ఆ పెద్దాయన డైరెక్ట్ ఎటాక్ కి ఒక క్షణం సర్దుకొని, “ఆలా అని మీరు ఎలా చెప్తున్నారు” అడిగాను నేను, చాలా మర్యాద గా.

“నాకు హైదరాబాద్ వచినప్పట్నుంచీ తెల్సు మీ విజయ్, అతని ఇబ్బందులకు, ఆరోగ్యం చెడిపోవడానికి కారణం మొదట్నుంచీ అతనికున్న అలవాట్లు”. అన్నారు రామ్మోహన్ గారు.

“అదొక్కటే కాదు సర్., విజ్జన్న చనిపొయ్యిన తర్వాత కూడా , అన్న ఫ్యామిలీ కి సంజీవమ్ గారు ఎందుకు సహాయం చెయ్యలేదు” అడిగాన్నేను అంతటితో వదిలిపెట్టకుండా.

ఆయన ఏదో చెప్పబొయ్యి ఆగిపోయి, “వాడు, సంజీవ రావు ఇక్కడే వున్నాడు, రూమ్ నెంబర్ 203 లో, వెళ్లి అడగొచ్చు నువ్వు ” అన్నాడు ఏమాత్రం తగ్గకుండా.

నేను ఒక క్షణం ఏం మాట్లాడలేదు, ఎదురుగా ఓ పెద్ద గిఫ్ట్ బాక్స్, పెళ్లి కనే, తెచ్చారేమో, ఫ్రొం ద ఎంప్లాయిస్ అఫ్ జనని కంస్ట్రక్షన్స్ అని రాసుంది. ఎక్కడో విన్నాను ఆ పేరు ఈ మధ్యనే, సడన్ గా గుర్తుకొచ్చింది.

మా ఆవిడ చెప్పింది. విజ్జన్న వైఫ్ కి విజ్జన్న పని చేసిన కంపెనీ షేర్స్ ద్వారా బాగా డబ్బులొచ్చాయని చెప్తున్నప్పుడు ఆ పేరు.

అక్కడే వున్న సుధాకర్ వైపు చూసి అడిగాను, ” మీ కంపెనీ పేరు జనని కంస్ట్రక్షన్సా ?” అని.

అవుననన్నట్టు తలూపాడు సుధాకర్.

సూటిగా రామ్ మోహన్ గారి కళ్ళలోకి చూస్తూ అడిగాను. ‘మా విజ్జన్న మీ కంపెనీ లోనే పని చేసేవాడా.”

ఆయన కాదనలేదు.

ఇబ్బందిగా కుర్చీలోంచి అటూ ఇటూ కదిలారు.

వెంటనే నేనే అడిగాను, ” విజ్జన్న కి మీరు సంజీవ రావు గారి ఫ్రెండ్ అని తెలుసా?”

తెలీదు అన్నారు రామ్మోహన్ గారు.

నాకు నెమ్మదిగా విషయం అంతా అర్థం అవ్వడం మొదలయ్యింది.

ఆయన్ని ప్రశ్నించాను . “ఈ ఉద్యోగమూ, ఈ షేర్ డబ్బులూ అవీ, మీ సహాయమా?, ఫ్రెండ్ తమ్ముడు అని?”

రామ్ మోహన్ గారు , కొంచెం బాధగా మొహం పెట్టి చెప్పాడు. ” మా నలభై ఏళ్ల పరిచయం లో, ఒక్కసారే, మా సంజీవమ్ నా సహాయం తీసుకున్నాడు. అది వాళ్ళ విజయ్ కి పెళ్లి అయ్యి, వుద్యోగం లేకుండా తిరుగుతున్నప్పుడు, అతని వుద్యోగం విషయం లో “

మరి షేర్ డబ్బులు విషయం అన్నాను నేను కొంచెం రెట్టిస్తూ.

“అది నా సహాయం కాదు, విజయ్ పొయ్యిన కొన్ని రోజులకే, సంజీవానికి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవో వస్తే దాంతో పాటూ వాళ్ళ వూళ్ళో వున్న ఒక ఎకరం అమ్మి, అంతా తీసుకొచ్చి నా చేతిలోపెట్టి విజయ్ భార్య కి అందచెయ్యమన్నాడు .” అని.

నాకు వొంట్లో ఎదో చిన్న కరెంటు పాస్ అయ్యినట్టు అనిపిచ్చింది ఆ వాక్యం వినగానే.

సంజీవ రావు గారి రూమ్ నెంబర్ ఎంత అన్నారు అడిగాను నేను వెంటనే.

203 చెప్పారు రామ్మోహన్ గారు.

సర్రున, వెనక్కి తిరిగి లిఫ్ట్ వైపు వెళ్తున్న నాతో అన్నారు రామ్ మోహన్ గారు.

“ఈ విషయాలన్నీ ఇప్పటి దాకా నాకు సంజీవానికి మధ్యలోనే వున్నాయి.. ఎవరికీ ఈ విషయాలు చెప్పొద్దని మాట తీసుకున్నాడు మా వాడు” అని.

ఆయన వైపు తిరిగి చూడకుండా, లిఫ్ట్ వైపు పెద్ద పెద్ద అంగలేస్కుంటూ వెళ్లి పొయ్యాను.

లిఫ్ట్ లోంచి రెండో ఫ్లోర్ లో దిగి, 203 నెంబర్ కోసం చూసుకుంటూ , ముందుకు వెళ్ళాను, రూమ్ తలుపులు తెరిచున్నాయి. ఓ చిన్న బాగ్ లో బట్టలు సర్దుకుంటున్నారు సంజీవ రావు గారు టేబుల్ దగ్గర నిలబడి.

డోర్ నాక్ చేసి అడిగాను, “లోపలి రావచ్చా సర్ అని”

ఆయన తలెత్తి నా వైపు ఒక క్షణం చూసి, వెంటనే గుర్తుపట్టి, కొంచెం ఆశ్చర్యం గా, లోపలి రండి, ఆ కుర్చీలో కూర్చోండి అన్నారు, సర్దడం ఆపకుండా. ఏదో తొందర్లో వున్నట్టున్నాడాయన.

నేను రూంలో కి వెళ్ళాను , కూర్చోలేదు, నిలబడే వున్నాను.

సంజీవరావు గారే నా వైపు తిరిగి అడిగారు. “మీరు ఏమిటి ఇక్కడ”

“మీ స్నేహితులు రామ్ మోహన్ గారు నాకు దూరపు బంధువు అవుతారండి. ఆయనతో మాట్లాడుతుంటే, మీరు కూడా పెళ్ళికొచ్చారని తెల్సింది. విజ్జన్న గురించి, రెండు నిమిషాలు మాట్లాడి పోదామని వచ్చాను” అన్నాను నేను.

ఆయన మొహం లో కొంత బాధ కనపడింది, విజ్జన్న పేరు వినం గానే, తమాయించుకొని అడిగారాయన.

“మీ నాన్న గారు సాంబశివరావు గారు ఎలా వున్నారు?”

“నన్ను మీరు గుర్తు పట్టారా?” అడిగాను నేను ఆశ్చర్యం గా.

“ఆరోజు మీ ఆఫీసులోంచి బయటకొస్తూంటే, గుర్తు కొచ్చింది, నన్ను ఆ రోజు మీరు గుర్తు పట్టినట్టు లేరు. చాల రోజులయ్యింది కదా, వెంటనే గుర్తు పట్టడం కష్టం గూడ” , అన్నారాయన.

ఎక్కడో గుచ్చినట్టు అయ్యింది. నేనేం సమాధానం ఇవ్వలేదు.

మళ్ళీ ఆయనే అన్నారు. “మీరేం అనుకోనంటే, మళ్ళీ వరంగల్ లో కలుద్దాం, మీ ఆఫీస్ కొచ్చినప్పుడు. ఇప్పుడు నా ట్రైన్ అందుకోవాలి, సికింద్రాబాద్ నించి ఇంకో గంట లో బయలు దేరుతుంది.”

ఆయన సర్దుతున్న బట్టలోంచి , ఒక పర్సు జారి పడింది. దాంట్లో “విజ్జన్న ఫోటో”

పర్సు కింది నించి తీసి ఆయన చేతికిస్తూ అన్నాను, చిన్నగా ” రామ్ మోహన్ గారు మీరు విజ్జన్న కోసం చేసిందంతా చెప్పారు. ” అని.

“అదంతా ఎవరికీ చెప్పొద్దన్నా గదా” అన్నాడాయన ఇబ్బందిగా.

ఉండబట్టలేక అన్నాను. విజ్జన్న అంటే ఇంత ఇష్టం వున్నా మీరు, అన్న వున్నన్ని రోజులు అంత దూరం ఎందుకు పెట్టారు అని.

“పెళ్లి అయింతర్వాత , నా నుంచి దూరం గా ఉంటే బాధ్యత తెలుస్తుంది అనుకున్నా! కానీ ఈలోపలే అంత అయ్యిపోయింది. వున్న కొన్ని రోజులు, వాడి భార్య గూడ వాడితో ఇబ్బందులు పడేదని విన్నాను. కనీసం చని పోయిన తర్వాత అయినా, ఆమె జ్ఞాపకాల్లో వాడు గొప్పగా మిగిలి పోవాలని, డబ్బులతో రామ్మోహన్ ని పంపించాను, విజయ్, సేవ్ చేసిన డబ్బులు అనిచెప్పి, యిచ్చిరమ్మని” అన్నాడాయన కళ్ళనిండా నీళ్లతో .

నాకు నోట్లోంచి మాటలు రాలేదు . ఓ రెండు క్షణాల తర్వాత తేరుకొని, అన్నాను.

“నా చిన్నతనం అంతా విజ్జన్న నిండిపోయి ఉన్నాడు సార్, కానీ నేను ఇంకో ఇరవై ఏళ్ళు ఎదిగితే గానీ పొరలు కమ్మిన నా కళ్ళకు మీరు కనపడలేదు” అని చేతులెత్తి నమస్కరిస్తూ.

“మా విజయ్ – “అన్న”” కి 11 స్పందనలు

  1. రమేష్ వేమారెడ్డి Avatar
    రమేష్ వేమారెడ్డి

    చాలా బాగుందండి. నాణేనికి బొమ్మా బొరసు ఉన్నేటే ప్రతీ సమస్యకు కనీసం రెండు ప్రాశ్యాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకొనే పెద్ద మనసు మనకుంటే, కొంతవరకు అపోహలు రావు.

  2. చాలా బాగుందండీ అనిల్‌గారు..
    మీ దృష్టికోణాన్నీ, సంజీవరావుగారి పార్శ్వాన్ని వర్ణించిన తీరు శ్లాఘనీయం.

    1. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు రవి గారు.

  3. కధ బాగుందండీ. నమ్మకాలు, ఇష్టాలు, అయిష్టాలు జీవితాన్ని నిర్దేశిస్తాయి చాలా మాట్లు. అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి కూడా. సమాజంలో విజ్జన్నలు కనిపిస్తూనే ఉంటారు కానీ సంజీవరావులు అరుదే.

    1. అలాంటి వారు చాలా అరుదే కానీ, ఒకరిద్దరు సంజీవ రావు పాత్ర ఛాయలు వున్న వారిని, నేను కలవడం జరిగింది సార్. అది గూడ నాస్నేహ బృందం లో.

      మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు .. మా హర్షణీయం లో మిగతా కథల్ని కూడా మీకు సమయం దొరికినప్పుడు, చదివి, మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వ ప్రార్థన.

  4. This is a lot like my fathers relation with his brother

    1. హర్షణీయం Avatar
      హర్షణీయం

      కృతజ్ఞతలు బాలా.

  5. ఎందుకో గాయకుడు రామకృష్ణ గారి ఓ పాటలో పల్లవి పలుకులు గుర్తొచ్చాయి.

    “మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు”

    దేవుడికి ఆ మనసు ఉందో లేదో తెలియదు కానీ మనుషులకు మాత్రం భిన్నమైన ఆలోచనలతో, విభిన్న దృక్పథాలతో కూడిన హృదయాలు ఇచ్చాడు.
    పౌరులను అనవసరంగా వేచి ఉంచే ప్రభుత్వ కార్యాలయాలు అందులోని ఉద్యోగుల మనస్తత్వం మేల్కోవాలి. ఇక తెలిసీ తెలియని బాల్యంలో ఏర్పడ్డ అభిప్రాయ నేపథ్య సంఘర్షణ 20 సంవత్సరాల తరువాత కూడా మోస్తూ సాధించింది ఎంత అన్నది ప్రశ్న!! ఎన్నో ఏళ్ళ బట్టి సాధారణంగా నడిచే విధానాన్ని ఇప్పుడు ఆపడానికి కారణం వ్యక్తిగతంగా ఏర్పడ్డ వివక్ష అని స్పష్టమౌతోంది.

    ఒకరి మీద ఇష్టం ఇంకొకరికి కష్టం అయ్యిందేమో!!

    ఇతరులు మనలాగే ఆలోచించాలని ఆశించడం మన మధ్య తర్కాలకు, భేదాలకు ప్రధాన కారకం. ప్రతి ఒక్కరికి వారి సొంత దృక్పథం ఉందని మనం ఎందుకు అర్థం చేసుకోలేము!!
    ఒక మనిషిపై తన అభిప్రాయం సరైన మార్గంలో లేదని ఆ వ్యక్తి తెలుసుకుని అర్థం చేసుకున్న తరువాత.. అదే మనిషి ఓ కడిగిన ముత్యంలా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటాడు. ఇది జ్ఞానోదయంతో కూడిన సత్యం.
    కధలో ఈ సోదరుడు తన బాధ్యతలను నెరవేర్చి ఒకరికి నమ్మకమైన జీవితాన్ని అందించి తన రుణం తీర్చుకున్నాడు.
    పాటలో అన్నట్లుగా దేవుడు ఒకరికి సోదరభావంతో కూడిన మనసిచ్చాడు, ఇంకొకరికి కనుల నీరు నింపి మారిన హృదయాన్ని బహుమతిగా ఇచ్చాడు 🙏

    1. హర్షణీయం Avatar
      హర్షణీయం

      చక్కటి విశ్లేషణ రవికాంత్.

Leave a Reply to BalaCancel reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading