Apple PodcastsSpotifyGoogle Podcasts

మనసున్న మారాజు!

నాకు మా నెల్లూరులోని ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి లోనే దొరికిన మరో స్నేహ సుమనుడు లక్ష్మిపతి రాజు. సూటిగా సుత్తిలేకుండా మాటలాడటం వీడి నైజం. అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలని ఆశించి భంగపడతాడు. అలా భంగపడినప్పుడు ఒక అపరిచితుడిలా వీడికి తెలియకుండానే గోదావరి జిల్లా వెటకారపు రాజు బయటకొచ్చేస్తాడు వీడి నుండి. అందుకే వీడు మా బడి యొక్క యాంగ్రీ బాయ్.

మా బడికి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో వుండే  నవాబ్ పేట నుండి సైకిల్ తొక్కు కుంటూ వచ్చే అలసట వలన కలిగే చిరాకుతో కోపమే లక్షణంగా వుండే వాడు. కానీ వాడి మనసు వెన్న. మల్లిగాడు, రమణగాడుల రాజకీయ చదరంగంలో దొర్లుడు పుచ్చకాయనయ్యే నాకు పతీ స్నేహం ఒక ఒయాసిస్సు మరియు రక్షణ. వీడు అంత దూరంలో వుండే బడిలోనే చేరటం ఎందుకు అనేగా మీ ప్రశ్న, దానికి ఒకటో కారణం వాళ్ళ నాన్నగారు మా బడికి పక్కనే వున్న పాత పెద్ద ఆసుపత్రిలో సంచాలకుడి గా పని చేసేవారు, రెండో కారణం మా బడి యొక్క ప్రాశస్త్యం. వీడు మా లంచ్ బ్రేక్ లో వాళ్ళ నాన్న గారి దగ్గరకు వెళ్లే వాడు భోజనానికి.

నోట్స్ మర్చిపోయాయనురా పతీ! సైకిల్ ఇవ్వు అంటే పంక్చర్ చేయను అనే కండిషన్ మీద సైకిల్ నాకు మాత్రమే ఇచ్చేవాడు, ఇంకెవ్వరు అరిచి గగ్గోలు పెట్టిన మన వాడి సమాధానం నో వే అనే.  ఇక మా రమణ ఎల్.ఏ పీరియడ్ లో అసాధారణ దంచుడుకి నేను పతి వెనక  వరసలో కూర్చొని తెగ ఎంజాయ్ చేసే వాళ్ళము. మన ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ గారున్నారు చూడండి అని రమణ మా కళ్ళముందర ఆవిడని ఆవిష్కరించడానికి ప్రయత్నము చేయగానే,  పెద్ద ఈడు వెళ్లి చూసొచ్చాడురా అని పతీ గాడి కామెంట్స్ కి నాకు నవ్వు ఆగేది కాదు. ఏ మాటకామాట ఉపన్యాసాలు మా రమణుడు దంచేసే వాడు

మా టీచర్ బొద్దింకల్లో శ్వాసకోశాలు వుండవు, వాటికి బదులు మాల్ఫీజియన్ నాళాలు వుండును అని చెబుతుంటే, పక్క పక్కన  నేల  మీద కూర్చున్న నేను మా పతీ, బొద్దింకల్లో మాల్ఫీజియన్ మా సైన్స్ టీచర్ మెజీషియన్ లాటి మీమ్స్ వేసుకొని మా ఇద్దరికే సాధ్యమైన వెధవ నవ్వులు నవ్వుకొని వాళ్ళం. నిజంగానే మా సైన్స్ టీచర్ మమ్మల్ని తన బోధనాపటిమతో మంత్ర ముగ్ధులను కావించెడిది.

ఒక రోజు బాడుగ సైకిల్ తీసుకొని మా సంతపేట నుండి నవాబ్ పేటలో వాళ్ళింటికి  వెళ్ళిపోయా. వాడికో ప్రొజెక్టర్ ఉండేది. నాకు ఆ ప్రొజెక్టర్ తో వాడి దగ్గర వుండే రీల్ ప్లే చేసి చూడాలని కోరిక. వాడికి ఆ రీల్స్ సార్ట్ చేయాటానికి ఓపిక లేదు. అయినా బతిమలాడి ఒక రీల్ ని ఓపిగ్గా చుట్టి ప్లే చేసాము. అలా స్క్రీన్ మీద మేము ప్రాజెక్ట్ చేసిన బొమ్మలు లైవ్ లాగ కదులుతుంటే ఆ ఆనందమే వేరు. వాడికి వాళ్ళ ఇంట్లో చాలా మంచి గ్రంధాలయం ఉండటం నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. చదవటం అంటే తరగతి పుస్తకాలని కాదు, వాటికి ఆవల మంచి పుస్తకాలను చదివే అభిరుచి మరియు వాళ్ళకోసం ఒక లైబరీ ని ఏర్పాటుచేసిన తలితండ్రులను కలిగిన పతి ధన్యుడు. మార్కులను చూసి స్నేహం చేసే మాలాటి వారికి వాడో కనువిప్పు.

తర్వాత వాళ్ళ అమ్మగారు ప్రేమతో పెట్టిన భోజనం నేను మరవలేనిది. అసలు గోదావరి వాళ్ళ ఆతిథ్యమే వేరబ్బా. మాగాయ గురించి పుస్తకాలలో చదవటమే కానీ రుచి చూసింది ప్రధమంగా అక్కడే.  అటుపిమ్మట ఆ భుక్తాయాసాన్ని తీర్చుకోవడానికి అర్జెంటు గా సైకిల్ తొక్కేయాలిని అని నిర్ణయించుకొని, వాళ్ళ నాన్న గారి సలహాతో, మా  లీలమహల్ లో బడ్ స్పెన్సర్ మరియు ఇంకో బక్కాయన నటించిన,  “హూ ఫైన్డ్స్ ఏ ఫ్రెండ్ ఫైన్డ్స్ ఏ ట్రెషర్” అనే సినిమాకి వెళ్ళాము.

నేను చూసిన మొదటి ఆంగ్ల సినిమా. మా పతీగాడు ఆరోజు ఆ సినిమాలో నాకు అనువాదకుడిగా మారిపోయాడు. చాలా నచ్చింది నాకు ఆ  సినిమా. వాడిని ఆ రోజు చాలా దగ్గరగా చూసాక పతి దొరికాడు నాకు ఇక నిధి దొరికింది అనే భావన మరియు నిశ్చింత కలిగింది.

అప్పటి వరకు ఎంతో అద్భుతముగా జరిగిన నాకు, ఇంటికెళ్ళాక బడిత పూజ జరిగింది, చెప్పకుండా రోజంతా మాయమైనందుకు, మరియు మా నాన్న ఖాతాలో రాసుకో అని బాడుగ సైకిల్ పట్టుకెళ్ళినందుకు. కానీ నాకు ఆ రోజు జ్ఞానోదయం అయినదేమిటంటే బుద్ధిమంతుడు పేరుతో నిస్సారంగా బతికెడు దానికంటే అప్పుడప్పుడు యిలా సాహసోపేతమైన కార్యక్రమాలు చేయటం చాలా తృప్తికరము అని. అల్ దోస్ బీటింగ్స్ వర్ వర్త్.

ఈ కథ చదివే మనకి ఇంకో విషయం తట్టాలి, కేవలం చదువే లోకంగా పిల్లల్ని చూసే  తలితండ్రులకు, చదువేలోకం కాదు, పుస్తకాలు, మంచి సినిమాలు, ఆటలు, పాటలు లేక ఒక మంచి అభిరుచిని ఏర్పరుచుకోమని ప్రోత్సహించే తలితండ్రులకు మధ్య కల బేధం. అటువంటి తలి తండ్రులున్న పిల్లలు ధన్యులు.

అలాగే నాకు వాడి ఇష్టాలు వాడి చిరాకులు కూడా తెలుసు నాకు. వాడి చేతి రాత వాడికే చిరాకు. తెలుగు అయ్యవారు మా రమణుడి చేత గైడ్ డిక్టేట్ చేయించి మమ్మల్ని రాసుకోమనటం వాడికి పరమ చిరాకు, ఆయన చెయ్యమనటం, వీడు చెయ్యటం, మనమాపాటి గైడ్ కొనుక్కోలేమా అని. మా క్రాఫ్ట్ సార్ లైన్ లో మమ్మల్ని నిలబెట్టి బి.ఈ.డి కాలేజీ కి తీసుకెళ్లటం ఇంకో చిరాకు. మా పి.ఈ.టీ సార్ చేయించే డ్రిల్ల్ ఇంకా చిరాకు.

ఆ చిరాకులతో వాడు యాంగ్రీ మాన్ అఫ్ గుంత బడి అయ్యాడు. వాడు కూడా వలస పక్షిలా అన్నీ ఊర్లు తిరిగి ఇప్పుడు మా భాగ్యనగరం లోనే స్థిరపడ్డాడు. తరచుగా కలుస్తుంటాము మరియు చరవాణులలో పలకరించు కుంటాము. మొన్ననే నలభై తొమ్మిది నిండి యాభై లో పడ్డాడు. కానీ వాడికి నంబర్స్ మేటర్ కాదు, స్టిల్  యంగ్ ఎట్ హార్ట్ విత్ గుడ్ లుక్స్.

“మనసున్న మారాజు!” కి 6 స్పందనలు

  1. హర్షా, మన పతి గురించి చాలా తక్కువ గా రాసావు అని నా అభిప్రాయం. చక్కటి నవ్వు, ఆప్యాయత తొ కూడిన పలకరింపు వాడి సొంతం. మన గ్రూపు లో వాడికి వున్న మరొక ప్రత్యేకత , వాడీ కోపం కూడ. ఐతే కారణం లేకుండా రాదు.
    మంచి అందగాడు కూడా వీడు.
    ఎవరితో ఐనా బాగా కలిసిపొయేవాడు .
    మన అందరికి మంచి మిత్రుడు , మన రాజు.

    1. థాంక్స్ రమణా. చాలా రాయొచ్చు..

  2. ee kadhani ‘mitrulu’ section lo kadaa, vunchaalsindi? itharamuu section lo elaa?

  3. Mee Telugu ayya vaaaru “Ramanaaa guide ethaaali raaa” ane varaaa?? 🤣😀😀

    1. Ramana guide etthithe maa netthi meeda tannula load padinatte…Ramana load etthaali kaadu..load veyyaliraa anaalemo…maako siksha adi..

Leave a Reply