

నాకు ఈ మధ్యన మా ఉప్పలపాడు చాలా గుర్తుకొస్తోంది.
నాకు దిగులేసినప్పుడల్లా అలా గుర్తుకొస్తోంది, ఎందుకో!
నేను చిన్న చిన్న కథలు రాయడం మొదలు పెట్టినప్పుడు నాకు తెలుసు నా ప్రెపంచం చాలా చిన్నదని.
నాకు తెల్సు, నేను, నా కుటుంబం, నా స్నేహితాలు లేక జీవితంలో నాతో పాటూ పరిగెట్టినోళ్లు, నన్నొదిలేసి ఎల్లిపొయ్యినోళ్లు, ఈళ్ల గురించే రాయగలనని.
అదేగాదు, నేను చూడలేని వాటి గురించి, చూడనోళ్ళ గురించి రాయలేనని.
అట్టా అనుకున్నప్పుడు, ఇవన్నీ గబా గబా రాసేస్తే, ఇంక రాయడానికి యింకేం మిగులుద్ది, అని అనిపిస్తే, ఆ దిగులింకా పెరిగిపోతావుంది.
ఆ దిగులుతోనే నేను ఇప్పుడు మిమ్మల్నీ, మా ఉప్పలపాడుకి తీసుకోబోతా!
అక్కడికెందుకురా ఇప్పుడు మనం, అంటే ఏమో!
మా అమ్మమ్మోళ్ల ఇల్లు మా రాములోరి దేవళం కి ఎడం పక్కన.
నా చిన్నప్పుడు ఆరుబయట ఓ నవారు మంచమో నులక మంచమో ఏస్కొని, వళ్లు మర్చిపొయ్యి, కలల్లోకి బొయ్యి, మళ్ళీ ఉదయాన్నే లేవంగానే, ఎదురుంగా, దేవళం మీద ఓ రెక్క విరిగిన గరుత్మంతుడు, అట్టా నిల్చోనుండేవాడు.
నాకెందుకో, రాములోరుతో, దేశాలన్నీ తిరిగే ఆయన కంటే, సీతమ్మోరిని, రావణాసురుడు పట్టకపొయ్యేటప్పుడు, అడ్డం పడి , రెక్కలు విరగొట్టుకున్న జటాయువు, అక్కడ కనపడే వాడు. ఎందుకంటారా ఏమో.
అలా ఉదయాన్నే సీతమ్మోరిని, రాముల వారిని తలచుకోవటం అదృష్టమేమో.
మా గుడికి ఓ మూగ పూజారి పక్కన ఊరినించొచ్చి, మా నడీది బాయి నుండి నీళ్లు తెచ్చి అభిషేకం చేసి అలంకరించి పొయ్యేవాడు. అగుపడని దేవుడికి, కనపడని మనసుతో, వినపడని పూజ చేసే ఆ పూజారిని మా ఊరిజనాలు గుళ్లోకెందుకు రానిచ్చారో. ఏమో!
అట్టానే ఆ నడీది బాయిని, ఎసుటి నీళ్ల బాయి అనే వాళ్ళం. ఆ నీళ్లు అన్నం వొండటానికి పనికొస్తాయే గానీ తాగడానిగ్గాదు. తాగడానికి మళ్ళీ, మాకు ఇంకో మంచెళ్ల బాయి ఉండేది.
పనికి రాని నీళ్లు ఎసుటి కెందుకు, అభిషేకానికెందుకు అని, అడగబాకండి . ఏమో!
సాయంత్రాల పూట మాత్రం మా మునవ్వో, లేక మా రామాంజవ్వో లేక ఎవరో ఒక ముసలవ్వలు, దీపాలు పెట్టేవోళ్ళు గుళ్లో. మా అమ్మమ్మ ఎప్పుడు ఈ దీపాలు పెట్టే అవ్వలతో గుళ్లో దీపాలు పెట్టేది కాదు. . నాకయితే మా అమ్మమ్మ కూడా ఆ అవ్వల మాదిరే దీపాలు పెడితే చూడాలనుండేది.
ఎందుకు పెట్టేది కాదో . తనతోనే ఎప్పుడూ వుండే రాముణ్ణీ, గుడి దాకా పొయ్యి చూసే పనేముందనేమో!
ఆ అవ్వలందరూ గుడిలో దీపం పెట్టి గుడి వరండాలో ఊసులాడుకోని , చివరగా అక్కడే ఆడుకుంటున్న మా పిలకాయల్ని పిల్చి, లెక్క ప్రకారం ఒక్కొక్కరికి, ఒక్కొక్క నలుసంత కలకండ ముక్క పెట్టేటోళ్లు.
మా స్నేహితులు అప్పుడప్పుడు, వాళ్ళు పెట్టే ఆ నలుసంత కలకండ కోసం, సిగ్గు లేకుండా ఆమైన మన ఆటలు గూడా మానేసి వెళ్లాలా అనే వాళ్ళు. నేను మాత్రం అలా సిగ్గు పడేటోణ్ణి గాదు.
పైపెచ్చు మా మురళి గాడు వొంతో లేక మా వంశీ గాడి వొంతో గూడా , అడిగి తెచ్చుకొనేటోణ్ణి . నేను ఎందుకంత ఆశ పడేటోణ్ణో నన్ను అడగబాకండి.
అట్టాగే , ప్రతీ శనివారం సాతంత్రం పూటా మా మునెవ్వ , రామాంజవ్వ ఇంకా చాలా అవ్వలు కలిసి,
హరే రామ హరే రామ!
రామ రామ హరే హరే!
హరే కృష్ణ హరే కృష్ణ!
కృష్ణ కృష్ణ హరే హరే! అని భజన చేసేటోళ్లు. ఆ భజనకు మా మునెవ్వ కొడుకయిన వెంకన్న డోలు వాయించే వాడు.
మా అమ్మమ్మ ఇంట్లో వుండే నాకు, ఈ భజన వింటూ వాళ్ళ మీద ఒక జాలి కలిగేది. వీళ్ళకి ఈ నాలుగు వాక్యాలకన్నా ఎక్కువవరావేమో అందుకనే అవే తిప్పి తిప్పి పాడుతున్నారు, ఎలా గైనా పెద్ద అయ్యిపోయి అర్జెంటు గా వాళ్లకి మిగిలిన భజన నేర్పిచ్చాలని.
ఇక్కడ డోలు వాయించే మా మునెవ్వ కొడుకు వెంకన్న గురించి కొంచెం చెప్పాల. ఇంటిపేరు చిత్తలూరు అయినా ఆయన్ని సిద్దమ్మ గారి వెంకయ్య అనే అనేటోళ్ళం. మనిషి మహా కష్ట జీవి. ఒక ఎకరమో లేక అర ఎకరం తోనో జీవితాన్ని మొదలుపెట్టాడు. ఆయన, ఆయన పెళ్ళాం కలిసే పొలం పనులన్నీ చేసుకునేటోళ్లు.
ఆయన తన పొలం పనులే కాక, వేరే వాళ్ళ పనులకు కూడా వచ్చేవాడు. ఇంట్లో చాలా పొదుపు.
అప్పట్లో పనులకు వచ్చే వాళ్ళకోసం , రైతులు మధ్యాహ్నం భోజనాలు పెట్టేవాళ్ళు. సాధారణం గా సొరకాయ బజ్జీ, వంకాయ బజ్జీ, మునక్కాయ పులుసో లేక చేమ గడ్డల పులుసో చేసే వారు. వాటిల్లోకి ఓ తాటాకు చేప ముక్క. ఆ కాంబినేషన్ ఇక ఎవర్ గ్రీనే.
ఈయన వడ్డించే వాళ్ళని ఓ అక్కా ! ముద్ద మిగిలింది కాస్త పులుసు పొయ్యక్కా అనేటోడు. వాళ్ళు పులుసు పోసాక అక్కా ! పులుసు ఎక్కువైనాది, కాస్త నాలుగు మెతుకులు విదిలించు అనేటోడు. దానిమైన, పులుసని ఆ తర్వాత మెతుకులని. అట్టా భోజనాలమీద, ఆయనుకున్న ప్రేమ కడుపారా చూపించుకునేటోడు.
వెంకయ్యా ! నీకు రూపాయి ఎక్కువిస్తాం, అన్నం మాత్రం ఎక్కువ అడగబాకయ్యా అని మా వూళ్ళో , ఏ రైతు అనలేదు. ఎందుకంటారా. ఏమో!
అలా మా ఎంకన్న అర ఎకరాని ఒకటి చేశాడు, ఆ తర్వాత ఒకటిన్నర, రెండు రెండున్నర అలా పదేళ్లలో పదెకరాల ఆసామి అయ్యాడు. మేము, మా పెద్దమ్మలు అమ్మిన పొలాలని ఆయనే కొన్నాడు. పొలాల కొనేటప్పుడు, మా వూరి నుంచీ బస్సులో వస్తూ, డబ్బులన్నీ గోతం సంచీ లో వేసుకొచ్చే వాడు పిచ్చోడిలా, ఈ పిచ్చోడి మూట లో ఏవుంటుందిలే అనీ అనుకునేటట్టుగా.
అంత కష్ట జీవికి తన ఎకరాలతో బాటు చక్కర జబ్బు గూడ బాగా పెరిగి పోయింది.
అన్నం అంటే విపరీతవైన ఇష్టం, కానీ ఏమీ తినలేడు.
ఒక్కగానొక్క కొడుకు ఆయనకు. వాడు ఆయనకు ఎదురుగా ఎమన్నా తిన్నా గూడ, భరించ లేని స్థితి, కొచ్చాడు. చక్కర జబ్బు , శరీరం తో బాటు బుద్ధి ని గూడా తినెయ్యడం మొదలు పెట్టిందేమో!
ఆయన భార్య కొడుక్కోసం రెండు వడలు చేసి, అయ్యి కొంగున కట్టుకొని వచ్చి మా ఇంట్లోనే వాడికి పెట్టుకునేది, వాళ్ళాయనకి కనబడకుండా.
జబ్బు ముదిరిపొయ్యి, ఆయన పొయ్యేటప్పటికీ, కొడుక్కి ఓ పన్నెండెకరాలు ఇచ్చిపోయాడు. ఊరి జనాలు ఇకనన్నా వీళ్ళ కుటుంబం సుఖపడుద్ది అనుకుంటే ఆ ఎంకట కిష్టుడు వాళ్ళ అబ్బ చెవిలో దూరిపోయాడు పిసినారి తనంలో, పన్నెండు ని ఇరవై ఐదు చేసి మరీ.
మా మునెవ్వ కొడుకు గురించి రాసి, మా రామంజవ్వ కొడుకు గురించి రాయక పొతే, ఆవిడ దగ్గర తిన్న కలకండ రుణం తీరదు. ఆవిడ చిన్న కొడుకు పేరు శ్రీహరి. నాకు వూహ తెలిసే సరికే సేద్యం చేసేవాడు.
మా వూరిలో రైతులు, శ్రీహరి దుక్కి దున్నాడా లేదా, , ఏ విత్తనాలు తెచ్చాడు, ఏ మందులు కొడుతున్నాడు, కలుపులెప్పుడు తీయిస్తున్నాడు అతని వెనకాలనే పొయ్యేటోళ్లు.
ఆఖరుకి శ్రీహరికే రెండు పుట్లకు మించలా, మనకి ఒక పుట్టి పండింది చాలు అని త్రుప్తి చెందే వారు.
నేను చిన్నప్పుడు కల కనే వాడిని, పెద్దయ్యాక నేను శ్రీహరి లాగ మంచి రైతునవ్వాలని.
మా అమ్మనడిగే వాడిని అవ్వగలనా అని. అమ్మ చెప్పేది కొన్ని లక్షణాలు పుట్టుక తోనే వస్తాయి రా అని.
శ్రీహరి ఐదారేళ్ళ అప్పటి నుంచే చాలా జాగ్రత పరుడు రా! “కోళ్ళు పెంచే వాడు, వాటి సమ్రక్షణ చూసుకొనే వాడు, గుడ్లని జాగ్రత్త పరచి మీ అమ్మమ్మకే అమ్మేవాడు, ఒక నక్షత్రకుని లా ఆమె వెనకాల పడి, డబ్బులు వసూలు చేసుకొనే వాడు అని. ఇవన్నీ వాళ్ళకి జరుగుబాటు కాక కాదు రా. సేద్యం మీద ఇష్టంతో” అని.
ఆలా ప్రతిదీ జాగ్రత్త చేసుకొనే శ్రీహరి ఇప్పుడు సేద్యం చేయటం లేదు, కాంట్రాక్టులు చేసుకుంటున్నాడు నెల్లూళ్ళో . ఎందుకంటారా ఏమో!
చివరాఖరిగా, ఈ కథ లో నువ్వేమి చెప్పాలని కుంటున్నావు రా అంటే ఏమో!
దిగులేస్తే నా బుర్ర ఉప్పలపాడు లోదిగిపోద్ది. అప్పుడు కనిపిచ్చినవీ, ఇనిపిచ్చినవీ ఇప్పుడు అనిపిచ్చేస్తాయి.
Leave a Reply