Apple PodcastsSpotifyGoogle Podcasts

నేను, నా ఉషాయణం!

ఈ మధ్య ఒక కథ చదివా, అది అచ్చు నా కథే, నా కథే కాదు మీ అందరి కథే. ఆ కథ ప్రేరణతోనే ఈ కథ చెబుతున్నా. నేను మరియు ఉషా, ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకూ క్లాస్ మేట్స్. బాగా తెల్లగా, చలాగ్గా అచ్చు మన హీరోయిన్ జయప్రదకు నకలుగా ఉంటుంది ఉష. స్కూల్ మరియు ట్యూషన్ లో పక్క పక్కనే కూర్చోవాల్సిందే. హోమ్ వర్క్ సబ్మిట్ చేసినా ఆ పిల్ల పలక మీద మన పలక లేక ఆ పిల్ల నోట్స్ మీద మన నోట్స్ ఉండాల్సిందే, పక్క వాళ్ళవి తోసేసి అయినా. స్కూల్ నుండి రావటం, స్నానం చేయటం, తెల్లగా పౌడర్ కొట్టడం, మా అక్కని మా అమ్మని ఒకటే ఊదరకొట్టటం నేను ఉష అంత తెల్లగా ఉన్నానా అని. మా అన్నలకి అక్కలకి ఒకటే నవ్వు నా ఉష పిచ్చికి. వచ్చిన బంధువులకి కూడా చెప్తారు, మా వాడికి ఒక ఫ్రెండ్ ఉంది, ఆ పిల్ల పేరు ఉష, ఆ పిల్ల కోసమే ఇప్పుడు వీడు టిన్నుల టిన్నులూ పౌడర్ ఖాళీ చేస్తాడు, అది వీడికంటే సంవత్సరం పెద్దది అని. అలా సాగి పోయింది నా ఉషాయణం.

ఆ తర్వాత నేను తంతే నెల్లూరులో గుంటబడి ఆ పిల్లేమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ల ఊరిలో. ఆ తర్వాత ఉషాని చూడనే లేదు. కానీ ఆ రూపం అలాగే నిలిచి పోయింది నా మదిలో. ఆఖరుకు పెళ్ళయాక కూడా సుప్రియతో మా ఉష అలాగా మా ఉష ఇలాగ అని ఒకటే ఊదరకొట్టేవాడిని. మా ఆవిడక్కూడా కోరిక అమాంతంగా పెరిగి పోయింది, ఆ ఉషా ఎలా ఉంటుందో చూద్దామని. మా అక్కలు, సుప్రియ మాంచి దోస్తులు. ఆఖరికి వాళ్ళందరూ నా చిన్నప్పటి లవ్ స్టోరీ ని చెప్పుకోవటం పడి పడి నవ్వటం, వాడి మొహంలే అని. ఐదేళ్ల క్రితం అనుకుంటా అందరం మా ఊరోళ్ళ పెళ్ళికి వెళ్ళాము, నేను మా అన్నలు, అక్కలు, సుప్రియ అందరం కలిసి. కొంచెం సేపటికి మా అక్కలు ముగ్గురు కట్టకలిసి వచ్చారు. ఒరే మాతో రా మేము నీకు ఒక్కర్ని చూపాలి అని. నువ్వూరా, సుప్రియా అంటూ తననీ లాక్కొచ్చారు. వాళ్ళ మొహంలో ఎదో అల్లరి నవ్వు. కానీ అది ఏంటో నేను పసికట్టలా. అందరం వెళ్ళాము.

అక్కడ గుమ్మడికాయలా ఒక ఆవిడ, మా వాళ్ళు ఇదిగో వీడే మీ కిరణు (మా వూళ్ళో నా పేరు కిరణ్ లే ఐదో క్లాస్ దాకా). ఆవిడేమో కిరణు, కిరణు అంటూ మాట్లాడేస్తూ వుంది. అయోమయంగానే మా బేబీ అక్కనడిగా, ఎవరే ఆవిడా అని. ఆవిడా ఏంట్రా మన ఉషారా అని, సుప్రియా వైపు చూసిఒక్క కిసుక్కు మంటూ నవ్వు నవ్వింది మా అక్క. మా ఆవిడకి నా మొహం చూసి ఒకటే వేళాకోళం. అంతే ఒక్క దెబ్బకి అక్కడ నుండి పారిపోయి నా సీట్ లో పడ్డా. అస్సలకి ఆ రూపం ఎక్కడా, ఇప్పుడు ఎక్కడా. సన్నగా మంట మెదలయ్యింది గుండెల్లో. అస్సలు చూడకుండా వున్నా బాగుండు,  ఆ చిన్నప్పటి ఉష రూపమే మనస్సులో ఉండిపోయేది కదా అని. సో ఫ్రెండ్స్ ! ప్రతి వాళ్ళకి ఇష్టమైన స్టోరీస్ ఉంటాయి. అవి మనస్సులో వరకే ఉండాలి. అప్పటి వాళ్ళని కలుసు కొని, ఎలా వుంటారో చూద్దామనుకుంటే కొన్ని సార్లు నిరాశ తప్పదు. మార్పు తప్పదు, మనమూ మారలా?

Leave a Reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading