Apple PodcastsSpotifyGoogle Podcasts

నా మొదటి ప్రవాస జీవనానుభవం!

నా మొదటి ప్రవాస జీవితం దక్షిణాఫ్రికా లోని జోహనెస్బర్గ్ లో మొదలయ్యింది. ఆనాడు దక్షిణాఫ్రికా లో రెండు ప్రధాన బ్యాంకు సమూహాలుండెడివి, ఒకటి ఏ.బి.ఎస్.ఏ మరియు రెండవది నెడ్కోర్. నేను ఏ.బి.ఎస్.ఏ బ్యాంకు వాళ్ళ అసెట్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ లో పని చేసే వాడిని. మా బస మరియు రవాణా అంత మా కంపెనీ నే ఏర్పాటు చేసింది. జోహనెస్బర్గ్  కంతటికీ అందమైన సాండ్ టన్ అనే ప్రదేశంలో సాన్మారియో అనే గృహ సముదాయం లో. చాలా అందమైన దేశం దక్షిణాఫ్రికా, విశాలమైన రహదారులు, రహదారుల మీద ఖరీదైన బి.ఎం.డబ్ల్యూ లు బెంజులూ, ఫోల్క్స్ వాగెన్ లు, ఎక్కడ బట్టినా సహజ సిద్దమైన అడవులు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఆహా ఏమి అభివృద్ధి అనేలా. ఆఫీస్ లో సహోద్యోగులంతా డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఇంగ్లీష్ మరియు మిగతా యూరోప్ దేశస్థులే. మా ఆఫీస్ మాత్రమే ఏమిటి అన్నీ తెల్లకాలర్ పనుల్లో అంతా తెల్లవారే. ఆహా ఏమి ఈ దేశం ఏమి ఈ ప్రగతి ఇలాటి దేశానికి వచ్చిన నా భాగ్యమే భాగ్యమంటూ మురిసాను.

కానీ ఆ కమ్మిన పొరలు కరగడానికి అట్టే సమయం పట్టలేదు. పెట్రోల్ పంప్స్, బిల్డింగ్ మైంటెనెన్సు, రోడ్స్ క్లీనింగ్, డొమెస్టిక్ మెయిడ్స్ లాటి పనుల్లో అంతా అక్కడి నల్లవారే వారే. చిన్న చితకా పనులు, కష్టమెక్కువ డబ్బులు తక్కువ పనులన్నీ వారివే. వాళ్ళ నివాసాలన్నీ ఊర్లకు దూరంగా వుండే మురికి వాడల్లో. టిన్ షీట్స్ తో వేసిన తాత్కాలిక నివాసాలు, కచ్చా రోడ్స్, అక్కడికి వెళ్లాలంటే అందరు భయపడేలా కథనాలు. వాళ్ళు అక్కడనుండి సిటీ లోకి రావాలంటే మనకిక్కడి రన్నింగ్ ఆటోల్లాగా రన్నింగ్ వ్యాన్లు  వాటిల్ని కాంబిలు అనే వారు. వాళ్ళు అంటే చెప్పలేని సృష్టించిన భయాలు. ఆరుగంటలు దాటితే అన్నీ రహదారులు నిర్మానుష్యం అయిపోతాయి. కాలి నడక అయితే అస్సలకే బంద్. అన్నీ నివాస సముదాయాలు విద్యుత్ కంచెలతోనే దర్శనమిస్తాయి.

మాకు మా కంపెనీ మెయిడ్ ని కూడా ఏర్పాటు చేసింది. వారానికి రెండు రోజులు వచ్చి ఇల్లు మొత్తం అద్దంలా తుడిచి, బట్టలన్నీ కామన్ వాష్ మెషీన్ లలో ఉతికి, ఇస్త్రీ చేసి వెళ్లేవారు. మా మెయిడ్ పేరు సిల్వియా. ఎంత భీకరాకారో అంతే భీకరమైన గొంతుతో వుండే  ఈమె అంటే మా వాళ్లందరికీ టెర్రర్. ఎక్కువ బట్టలున్నా వాషింగ్ కి, ఇల్లు ఎక్కువ గందర గోళంగా వున్నా క్లీనింగ్కి, రుస రుస లాడి పోయేది. అలాటి గడ గడ లాడించే సిల్వియా సుప్రియా దగ్గర కొచ్చేసరికి ఒక స్నేహితురాలైపోయేది. సుప్రియ తను ఆకలి మీద వస్తుందని ఎమన్నా తినడానికి పెట్టేది, తనకి మన బిర్యాని ని బాగా అలవాటు చేసేసింది. తాను కూడా బాగా కబుర్లు చెబుతూ పని చేసేది. అంత రుస రుస లాడే సిల్వియా ఇక్కడ మాత్రం, ఈ హర్షా! విప్పినన్ని గుడ్డలు ఈ వోల్ సాన్ మారినోలో వుండే మగాళ్లు కలిపి విప్పరు అని నవ్వేసేది.

అలాటి సిల్వియా ఒక రోజు మా ఇంట్లోనే కుప్పకూలి పోయింది. బోరు బోరు మంటూ ఒకటే ఏడుపుతో. తనతో సహజీవనం చేసే వాడు పారిపోయాడు తాను ప్రెగ్నెంట్ అని తెలిసాక. వాడుత్త తాగుబోతని, వాడిని ఆమె పోషించేది అని, ఆఖరుకు వాడి తాగుడుకి కూడా ఆమె ఇచ్చేది. వాడి పని తాగటం, వచ్చి కొట్టటం. ఇది విన్నాక ఏ దేశ మేగినా , ఎందు కాలిడినా, కథలన్నీ ఒకటే, మనుషుల వ్యధలన్నీ ఒక్కటే అని. ఇది తెలిసాక సుప్రియా సిల్వియా కి ఒక మదర్ అయిపోయింది. తాను ఏదైతే తినేదో అదే సిల్వియా కి  పెట్టేది. కొన్నాళ్ళకు మేము కూడా,  మా చిన్నది సుప్రియా కడుపులో పడటంతో మా  ఊరికొచ్చేసాం. ఇప్పటికీ మా చిన్నది ఎప్పుడన్నా పెద్ద పెద్ద గొంతుతో అరిచినప్పుడల్లా,  నేను కానీ సుప్రియా కానీ ఏమ్మా! నీకు సిల్వియా పూనిందా అంటూ ఉంటాము. ఆలా సిల్వియా మా జ్ఞాపకాలలో సజీవంగానే వుంది . నా సౌతాఫ్రికా అనుభవాలతో ఎవరన్నా బ్రిటిషర్లు మనదేశాన్ని ఏకీకృతం చేశారు , రోడ్లు వేశారు , పొగ బండ్లు ఏర్పాటు చేశారు , చాలా అభివృద్ధి చేశారు అంటే అసలే నల్లగా వుండే నా మొహం ఇంకా వివర్ణమవుతుంది.

“నా మొదటి ప్రవాస జీవనానుభవం!” కి 2 స్పందనలు

  1. వర్ణ వివక్ష ప్రపంచానికి పట్టిన ఓక దురదృష్టకరమైన జాడ్యం. ఎన్ని పోరాటాలు జరిగినా ఎంత మంది యోధులు నెలకొరిగినా ఆ సామాజిక, భౌతిక భేదం ఓక విష సంస్కృతిలా, ఓక వాక్సీన్ లేని వైరస్ లా ఈనాటికీ ప్రజల మద్య దూరం పెంచుతోంది.
    నల్లజాతి సూర్యుడు నెల్సన్ మండేలా అన్నట్టు ” ప్రతి కష్టం వెనుక ఓక అవకాశం ఉంటుంది. అది చదువు అన్న ఆయుధం ద్వారా సాధించవచ్చు” అని. సాధనలో అది ఎంతమేరకు దేశాలను మారుస్తోందో తెలియదు.
    ఈ జాతి మత కుల వర్గ వర్ణ ప్రాంత భేదాలు లేని ప్రపంచాన్ని మన తరువాతి తరాలైనా చూస్తారో లేదో!! ఆశ పడడంలో తప్పు లేదుగా.. 👍

  2. వాల్లు లాభం చూసుకున్నారో లేదో తెలియదుగానీ.. అంబేత్కర్ మహాశయుడికి తమ దేశంలో విధ్య అభ్యసించే అవకాశం కల్పించడంద్వారా మన దేశంలో ఉన్న వివక్షని రూపుమాపడంలో ఓ చెయ్యి చేశారు.. కావాలంటే అంభేత్కర్ లేని ఈ దేశాన్ని ఊహించండి?

Leave a Reply