Apple PodcastsSpotifyGoogle Podcasts

మా బడిలో వుండే వాడు ఓ మల్లిగాడు!

నేను ఏడవ తరగతి ఉత్తీర్ణుడను అయ్యాక, మా కుటుంబము ఉప్పలపాటి నుండి నెల్లూరికి వలస వచ్చేసింది. నెల్లూరిలో మా మకాం సంతపేటలో అని ముందే నిశ్చయించబడింది మా నాన్నగారి వ్యాపార భాగస్వాములు అప్పటికే అక్కడ నివసించే వారు అవటంతో.

సంతపేట లోని ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల అప్పుడు బాగా పేరుగాంచినది కావటంతో నన్ను అక్కడ మరియు మా అక్కను అమ్మగార్ల బడి అనబడే సెయింట్ జోసెఫ్ బడిలో వేయాలని మా వాళ్ళు నిర్ణయం చేసేసారు. మా అక్కకి ప్రవేశం సులువుగానే దొరికింది, అమ్మగార్ల బడి కేవలం అమ్మాయిల బడి కావటంతో.

నా ప్రవేశం అంత సులువుగా జరగలా. శ్రీ సుబ్బారావు గారు ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు. నా ఏడవ తరగతి మార్కులు ఆ బడిలో చదివి ప్రధమ స్థానం సంపాదించిన మల్లికార్జున వర ప్రసాద్ కంటే మూడు మార్కులు ఎక్కువ అవటం ఆయనకీ నచ్చలా. అందులోను నేను వచ్చినది మారు మూల పల్లెలో వున్నజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అవటంతో ఆయనకు గట్టినమ్మకం అక్కడ మాస్ కాపీయింగ్ జరిగి ఉంటుంది అందుకే నాకు అన్ని మార్కులు వచ్చి ఉంటాయి అని.

ఆయన నాకు ప్రవేశం ఇవ్వడానికి సుముఖంగా లేరు. నాకు ఆయన నన్ను తిప్పించుకోవటం చాలా ఉక్రోషంగా వున్నది. ఆయనేమో చాలా చిన్న వయస్సులోనే గెజెటెడ్ ర్యాంకు కల ప్రధానోపాధ్యాయ పదవిని అధిరోహించిన సింహ స్వరూపుడు. అయినా ధైర్యం చేసి చెప్పేశా మీరు ఏ పరీక్ష పెట్టుకోవాలంటే ఆ పరీక్ష పెట్టుకోండి, నేను మాత్రం ఈ బడిలోనే చదువుతాను అని.

బహుశా ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కోసం మరల పరీక్ష రాసిన కొద్ది మంది లో నేను ఒకడినేమో, అలా పరీక్ష పెట్టిన మహా చాదస్తపు ప్రధానోపాధ్యాయుల వారు ఆయనేమో. ఆయన ఏర్పరిచిన ఉపాధ్యాయులు పెట్టిన ప్రవేశ పరీక్షను విజయవంతముగా గట్టెక్కిన నన్ను ఆయన లెక్కలు బోధించే బి-సెక్షన్ లోనే వేయించుకున్నారు పట్టుబట్టి మరీ నీ సత్తా మేమిటో చూస్తా సంవత్సరమంతా అని.

అలా బి-సెక్షన్ లో ప్రవేశించిన నన్ను ఏడవ తరగతిలో ఆ బడికి ప్రధమ, ద్వితీయ స్థానాలలో నిలిచిన మల్లిగాడు మరియు రమణుడు త్వరగానే నన్ను వారి వారి మిత్ర బృందాల్లో కలిపేసుకున్నారు. వారి వారి బృందాలు అని ఎందుకు అన్నాను అంటే మా మల్లిగాడు మరియు రమణుడు అచ్చు టామ్  మరియు జెర్రీ లాటి వారు.

ఈ ఇద్దరే కాకుండ మా తరగతిలో ఇంకో పాపులర్ ఫిగర్ సయ్యద్ ఆన్సర్ బాషా. అప్పటి దాకా వీళ్లిద్దరి రాజకీయాలకు బలి అయ్యి, ఒక్కోసారి మల్లిగాడి పార్టీ లో ఉండాలా లేక రమణుడి పార్టీ లో ఉండాలా అని సతతమయ్యే వీడికి నాది మరియు మా ఇంకో మిత్రుడు లక్ష్మిపతి రాక ఒక వసంతం. ఎందుకంటే మేము ముగ్గురం ఒక బలమైన తృతీయ ఫ్రంట్ ని స్థాపించాము అటు పిమ్మట కాబట్టి.

ప్రస్తుతానికి ఈ కథ  జెర్రీ లాటి వాడైన మా మాయదారి మల్లిగాడు గురించే. వీడు అసలు ఏమాత్రం ఆవేశ పడకుండా అవతల వాళ్ళని గిల్లేస్తాడు. అందులోను నన్ను, మా రమణుడిని గిల్లటమంటే వీడికి మహా సరదా. నేను ఎనిమిదవ తరగతిలో చేరే సరికి వీడు మహా పాపులర్ ఫెలో. ఏడవ తరగతిలో పాఠశాల కల్లా  ప్రథముడు కావటం, వాళ్ళ అమ్మ నాన్న గార్లు మా బడికి  అనుబంధమైన బి.ఎడ్ కాలేజీ లో లెక్చరర్స్ కావటంతో టీచర్స్ కి వీడంటే ఒకవిధమైన ప్రేమ. రాజు మరియు వరప్రసాద్ వీడి ముద్దు పేర్లు.

నేను చేరిన వెంటనే నన్ను వీడి బ్యాచ్ లో కలుపుకోవాలని ప్రయత్నాలు మొదలెట్టాడు. ఈ ప్రయత్నాలలో భాగంగానే నాకు ఒక్కో రహస్యాలు చెప్పేవాడు. అందులో భాగంగా మా ఆన్సర్ గాడి గురించి చెప్తూ, “ఆ ఆన్సర్ గాడితో ఎప్పుడైనా గొడవపడు, కానీ రంజాన్ మాసానికి కనీసం ఒక వారం ముందు అయినా వాడి దగ్గర తెల్ల జెండా ఎత్తెయ్యి, ఎందుకంటే వాడు రంజాన్ విందుకి వాడి స్నేహితులను అందరిని పిలుస్తాడు. ఆహా ఆ బిర్యాని, ఆ సేమియా పాయసం తినటానికి ఎన్ని జన్మలైనా ఎత్తొచ్చురా అని”. ఈ ప్రబోధాన్ని నేను ఇప్పటికీ ఫాలో అయిపోతుంటా.

మనకి లెక్కలంటే మహా భయం, అసలు అవి రావని గట్టి నమ్మకం. వీడు నాకు లెక్కలు చూపితే నేను వీడికి ఇంగ్లీష్ లో హెల్ప్ చేయాలనేది మా ఒప్పందం. ఇంగ్లీష్ లో హెల్ప్ చేయించుకొని లెక్కలకి నాకు హ్యాండ్ ఇచ్చేవాడు. అలా హ్యాండ్ ఇచ్చినప్పుడల్లా నేను వాడిని ఒక్క గిచ్చుడు  గిచ్చే వాడిని. బాగా పాలుకారేలా ముద్దు గా బొద్దు గా వుండే వాడు కాబట్టి నా గిచ్చుడు చాలా కొట్టొచ్చినట్టు కనపడేవి.

అప్పటిలో అన్నీ పాఠశాలకు మాదిరే మా పాఠశాలకు నేవీ బ్లూ నిక్కరు లేక పంట్లాము మరియు తెల్లని చొక్కా కల ఏకరూప దుస్తుల ఉండేవి. వీడు తన తెల్లని చొక్కా జోబీ మీద ఓ పావురాయి బొమ్మనో లేక గులాబీ బొమ్మనో లేక కుందేటి బొమ్మనో కంటికింపైన రంగులతో కుట్టించుకొని వచ్చే వాడు. వచ్చి చూడరా హర్షాగా నా చొక్కాయ ఎంత బాగుందో అని మాటి మాటికీ గిల్లేవాడు నన్ను.

వాళ్ళ అక్క మాకు ఒక సంవత్సరం సీనియర్ మాకు బడిలో, నేను నేరుగా వెళ్ళిపోయా అక్క దగ్గరకి, నాక్కూడా కుట్టి పెట్టాలి మీరు అని. ఒరే హర్ష! సాయంత్రం మా మాయదారోడితో రారా ఇంటికి అని చెప్పారు ఆవిడ. ఇంటికెళ్లిన నాకు అసలు రహస్యం చెప్పారు, వాడివన్నీ పాత చొక్కలురా, జేబు దగ్గర చిరిగి లేక వాడు బాల్ పాయింట్ ఇంకో పూసుకొని వస్తే వాటిల్నే వేసుకెళ్ళరా అంటే వాడు ఏడుస్తాడని నేనే కుట్టానురా వాడికి ఆ బొమ్మలు. నీకేమిరా ఈ సంవత్సరమే చేరావు, నీ చొక్కా ఫస్ట్ క్లాస్ గా వుంది. ఓ సంవత్సర మయ్యాక కావాలంటే కుట్టి పెడతానురా అని చెప్పారు. అప్పుడు నేను కిసుక్కుమని నా నవ్వుతో వాడిని గిల్లేశా.

అలాగే మా ఇంకో స్నేహితుడు రాంబాబు వాళ్ళ నాన్న గారికి మా నెల్లూరి జిల్లా లోనే ప్రసిద్ధి కెక్కిన కిళ్లీ సామానులు టోకున అమ్మే కొట్టు ఉండెడిది. కిళ్లీలలో వాడే కలకత్తా తమలపాకులు ఎవరైనా కొనాలంటే వాళ్ళ అంగడి లోనే దొరికేవి. వీడు ఎక్కడ పట్టాడో కానీ కొన్ని తమలపాకులు పట్టాడు. రెండు రోజులు నాకు ఆ ఆకులో కొంత గిల్లి పెట్టేవాడు, అవి బహు రుచి గా ఉండటంతో మేము ఇద్దరం బాగా ఆస్వాదించాము.

మూడవ రోజు వస్తూ వస్తూ వాళ్ళింటిలో వుండే ఓ పెద్ద క్రోటన్ ఆకుని పట్టకొచ్చి, ఒరే రోజు అంత చిన్ని ఆకునేమి తింటాము అని, ఈ రోజు ఇంత పెద్ద ఆకుని పట్టకొచ్చానురా నీకోసం ప్రేమగా అని నన్ను ఊరిచ్చాడు, నేను కూడా ఆత్రంగా వాడి చేతిలోది లాక్కొని పర పర నమిలేశా. నమిలాక తెలిసింది అసలు ఆకు అనేది అంత జిలగా కూడా ఉంటుందా అని.

నేను వీడితో చదువుతో పాటు, గాలిపట దారాలకు మాంజా రాయటం, సరోటాలు ఎగరేయటం, వీళ్ళ ఇంటిపక్కన వున్న ఎలిమెంటరీ స్కూల్ లో కల మామిడి చెట్టు కాయల్ని దోటికి సంచి కట్టి దొంగ చాటుగా కోయటం, పొద్దొస్తమానం  చుక్కలే వచ్చే వీళ్ళ బ్లాక్ అండ్ వైట్ క్రౌన్ టీవీ ఆంటెన్నా అడ్జస్ట్ చేయటం వీడి దగ్గరే ట్రైన్ అయ్యా. ఓరే నా వల్ల కాదురా ఈ టీ.వీ ని అడ్జస్ట్ చేయటం, పక్కనే వున్న పెన్నా నదిలో పారేద్దామురా అంటే, ఓరే హర్షగా అది నువ్వులేనప్పుడు అచ్చు తెర మీద వచ్చే సినిమా బొమ్మలా వస్తుందిరా, నువ్విలా అడుగు లోపలకి పెడుతావ్ అది సంకనాకిపోద్ది అని చెప్పే వాడు.

సండే అయితే నేను విజిట్ చేసేది నెల్లూరులోని ఒకప్పటి మున్సిపల్ ఆఫీస్ పక్కనే వుండే వీళ్ళ ఇల్లు. వెనకేమో పెన్నా నది. ఆ మున్సిపల్ ఆఫీస్ లో వున్న పెద్ద వాటర్ ట్యాంక్ ఎక్కి చుట్టు పక్కలంతా చూడాలనేది వీడి కోరిక. వీడేదన్న అనుకున్నదంటే అది సాధించుకోవడానికి చాలా ఓపికగా ప్రయత్నాలు మొదలెడతాడు. ఇక రోజూ మేమిద్దరం ఆ కాపలాదారుడిని బతిమాలే వాళ్ళము. అతను ససేమిరా అనే వాడు అలా ఎక్కడానికి అనుమతి లేదు అని. చివరకి నక్షత్రకుడి లాటి మా నస తట్టుకోలేక, తనే స్వయం గా దగ్గరుండి ఎక్కించాడు. ఆ రోజు మేము కొట్టిన కేరింతలు నాకు ఇప్పడిటికీ గుర్తే.  

అలాగే వీడి స్నేహం నాకు బి.ఎడ్ కళాశాలలో ఇష్టా రీతిన తిరిగే అవకాశాన్ని ఇచ్చింది. మేము తొమ్మిదవ తరగతిలో ఉండగా వీళ్ళ అమ్మగారి ఆధ్వర్యంలో జరిగిన నరాల రామ రెడ్డి గారి అష్టావధానం నాకు చాలా ఆశ్చర్యానుభూతిని మిగిల్చింది. ఈ అవధానం లో మాకు మరీ నచ్చిన అంశం అప్రస్తుత ప్రసంగం.

అధిక ప్రసంగులురా మీరు అని విసుక్కొనే వారంతా మేము రాసి పంపిన కొన్ని అప్రస్తుత ప్రశ్నలను పరిగణలోకి తీసుకోవటం మా లాటి కోతులకు కొబ్బరికాయ ఇచ్చినట్లు అయినది. దత్తపదిలో ఆయన ఇడ్లీ, దోశె, పూరీ, వడ, సాంబారు లను ఉపయోగించి చెప్పిన పార్వతీ పరిణయ ఘట్టం, నేను కూడా ఒక అవధాని అయిపోయి అలా అలవోకగా అవధానాలు చేసేసినట్టు కలలు కనేలా చేసేశాయి.

ఒకసారి చదవ కుండా గాలికి తిరుగుతున్నామని వాళ్ళ అమ్మగారు నాకు వార్నింగ్ ఇచ్చారు, ఇద్దరం కలిసి చెడిపోతున్నామని. ఆ మాటలకి కోపం వచ్చి నేను వీడితో మాటలాడటం బంద్ చేసాను. వీడితో  బాగా బతిమాలిచ్చుకొన్నాక గాని నా అలక తీరలేదు.

వీడికొక రాలీ సైకిల్ ఉండేది, అది స్కూల్ కి మాత్రం తెచ్చేవాడు కాదు అందరు అడుగుతారు అని. అప్పటిలో సైకిల్ ఉండటమే మహా గొప్ప. రాయటం కుడి చేత్తో అయినా పనులు మాత్రం పురచేయి. బాల్ బాడ్మింటన్ బాగా ఆడే వాళ్ళము, ఎడమ చేయి వాటము వీడికి బాగా కలిసొచ్చేది. అలాగే మా బాల్ బాడ్మింటన్ ఆటగాళ్లము రెండు బ్యాచ్ లుగా వుండే వాళ్లము, మా ఆట తీరుని బట్టి కాదు, నారాయణ బ్రాండ్ బాట్ వాడే వాళ్ళము రమణుడి  బ్యాచ్, హనుమాన్ బ్రాండ్ బాట్ వాళ్ళు మల్లిగాడి బ్యాచ్.

టెన్త్ లో వీడు స్కూల్ సెకండ్, మా రమణుడు ప్రధమ స్థానం కొట్టేశాడు, ప్రతాప్ గాడు మరియు నేను మూడు మరియు నాలుగు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నాకు ఆ రోజు బాగా గుర్తు సెకండ్ వచ్చిన వాళ్ళ పేరు కూడా బోర్డు లో రాయమని క్రాఫ్ట్ నాగరాజు సార్ ని బాగా విసిగించాడు వీడు.  ఆయనేమో ఒరే  రాజు ఆలా రాయకూడదు రా అని సర్దిచెబుతాడు. వీడు వినడు. పట్టు వదలని విక్రమార్కుడు వీడు. తెలివి కలవాడు , బాగా చదువుతాడు , అనుకున్నది సాధించుకుంటాడు. ఈ ఒక్క విషయం లో మాత్రం వీడి ఆటలు సాగలేదు.

ఇంటర్ కూడా కలిసి చదివాము. కానీ వీడి బ్యాచ్ వేరే. ఇంటర్లోనే వాళ్ళ నాన్న ఎజ్ది బైక్ వేసుకొని తిరిగే వాడు, నన్ను కూడా తిప్పేవాడు . వీడి పర్యవేక్షణ లోనే మా నెల్లూరులో  ఓ పెద్ద బంగ్లా కట్టేశారు వాళ్ళ నాన్న గారు. నేను వీడు చాలా సార్లు వెళ్లే వాళ్ళం ఆ ఇంటికి అది నిర్మాణంలో వున్నప్పుడు. ఇల్లు కట్టే టప్పుడు పని వాళ్ళతో నేర్పుగా వాడికి కావాల్సిన పని రాబట్టటం, ఇంటికి కావాల్సిన సామానులు కొనటం లో వీడు చూపే నెగోషియేషన్ స్కిల్స్ ఏవీ నాకు వంట బట్టలా.

ఇంటర్ అయ్యాక వీడు విజయవాడలోని  సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో చేరాడు. సెలవల్లో  బాగా కలిసే వాళ్ళం. అలా అలివి గాని ఎజ్ది బైక్ లో మా ఇంటికి వచ్చే మా మల్లి గాడిని చూసేసిన మా ఎదురింటి వాళ్ళు వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేసేసారు. ఒక విధంగా వాడి పెళ్ళికి పెద్దను నేనే. వాళ్ళ అమ్మ గారికి ఇప్పటికీ అనుమానమే వాడు మా ఇంటికి వస్తూ ఆ అమ్మాయి ప్రేమలో పడిపోయి పెళ్లి చేసేసుకున్నారని. ఆవిడ ఇప్పటికీ అంటారు నవ్వుతూ మనకి కట్నం నష్టం కదరా హర్షా అని. ఆ అమ్మాయే మీకు నిలువెత్తు బంగారం అని చెప్తా నేను కూడా.

తర్వాత వీడు అమెరికాకి పారిపోయి, అక్కడే సెటిల్ అయ్యి, వుద్యోగంతో పాటు ఒక SAP కన్సల్టెన్సీని స్థాపించి, యిక్కడ ఇబ్బడి ముబ్బడి గా ఆస్తులు కొనేశాడు. వీళ్ళ అక్క కూడా అమెరికాలోనే స్థిరపడి పోయారు. ఇద్దరి మధ్య సరదా అయినా పోటీ, ఆవిడ ఒక ఆస్తి కొంటె వీడు ఇంకోటి కొంటాడు. వీళ్లిద్దరి మధ్య పోటీ, ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందాన, మా మల్లి గాడి అత్తగారు మా వాళ్ళ చెవిలో వేయటం, మా వాళ్లేమో హూ! మా వాడు కొంటున్నాడు సంచీల కొద్దీ, కూరగాయల మార్కెట్టులో వాళ్ళావిడ వెంట వెళ్లి మరీ అని నిట్టూర్చటం. వద్దురా! నాయనా విజయవంతమయిన స్నేహితులున్న నా లాటి వాడి దుస్థితి పగవాడి కూడా.

వాడికి ఇప్పుడు ముగ్గురు మగ కుంకలు. యిక్కడ కూడా తన మన జనరేషన్ వాళ్ళలో తన ప్రత్యేకతని నిలబెట్టుకున్నాడు వీడు. ప్రస్తుతానికి వీడు  ఇండియాకి వచ్చేసి బెంగుళూరులో వ్యాపార అయస్కాంతం గా ఓ వెలుగు వెలిగేస్తున్నాడు.

Leave a Reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading