Apple PodcastsSpotifyGoogle Podcasts

నెల్లూరు ట్రంక్ రోడ్డు నందలి నా ‘జాతక’ కథ!

ఆ రోజు, ఒంగోల్లో ఏదో పెళ్లి ఉందని, వారం రోజులు కని, మా ఆవిడ బయలు దేరుతూంటే, ఆవిణ్ణి, రైలు ఎక్కించి, ట్రంకు రోడ్డుకొచ్చాను.

మా రోజు వారీ సమావేశానికి నేను ఓ అరగంట లేటు.

అప్పటికే, మా వాళ్ళు, విశ్వనాధం, సుబ్బారాయుడు, వెంకటరామన్ సర్, ట్రంకు రోడ్డు, సదాశివ మెడికల్ హాల్ మెట్ల మీద, చేరి పోయి వున్నారు.

మా విశ్వనాధం ఎదో విషయం సీరియస్ గా చెపుతూంటే, వెంకట రామన్ గారు, సుబ్బారాయుడు ఆసక్తిగా వింటున్నారు.

నేను రావడం చూసి మా విశ్వనాథం సడన్ గా మాట్లాడ్డం ఆపేసాడు.

“ఏవయ్యింది” అడిగాన్నేను విశ్వనాధాన్ని.

సమాధానం లేదు మనిషి దగ్గర్నుంచి.

సుబ్బారాయుడి, వైపు చూసాడు విశ్వనాధం .

సుబ్బారాయుడు అన్నాడు, ” ఏం లేదు గురూ, ఇప్పుడు విశ్వనాథం, జాతకాలు చూడ్డం నేర్చుకున్నాట్ట. దాని మీద ఒక చిన్న ఇంటరెస్టింగ్ డిస్కషన్.”

“జాతకాలు నమ్మొచ్చేమో అన్న అనుమానం వుంది గానీ, జాతకం చెప్పే వాళ్ళను చూస్తే, అంత తొందరగా నమ్మాలనిపించదు నాకు, అన్నాను నేను, విశ్వనాధాన్ని చూస్తూ.

ఇంతలో వెంకటరామన్ గారు అందుకొని అన్నారు, “సుందరబాబు రాంగానే, చెప్పాలని, తహతహ లాడిపొయ్యావు గదా. చెప్పెయ్యరాదా !” అని విశ్వనాథం తో.

ఇంక లాభం లేదనుకున్నట్టున్నాడు, విశ్వనాధం చెప్పడం మొదలు పెట్టాడు.

” మొన్న మీ జాతకం వేసి స్టడీ చేసా సార్. దాని ప్రకారం, కొద్ది రోజుల్లో, ఎదో గొడవలో, మీరు కొంత సమయం జైలు లో ఉండాల్సి వస్తుందని, అనిపిస్తోంది. కాబట్టి, మీరు కొంచెం జాగర్తగా ఉంటే మంచిది .”

ఎటూ మీరు తేలిగ్గా తీసేస్తారు అని తెలుసు గాబట్టి, చెప్పినా ప్రయోజనం లేదని నేను, ఇలాంటి విషయాలు, అనిపిస్తే , చెప్పకుండా ఉండగూడదని, సుబ్బారాయుడు, తర్జన భర్జనలు పడుతున్నాం అరగంట నించి “

విశ్వనాథం చెప్పిందంతా విని, అడిగాన్నేను, “నువ్వు, ఇట్లా జాతకాలు చూడ్డం అని మొదలు పెట్టి ఎన్ని రోజులయ్యింది ?”

“నేర్చుకోడం ఓ సంవత్సరం నించి, ప్రెడిక్షన్స్ మొదలు పెట్టి, ఓ నెల రోజులయింది, మా మేన మావ ఒకాయన బాగా చెప్తాడు. ఆయన దగ్గర నేర్చుకుంటున్నా ” అన్నాడు విశ్వనాథం.

కంటిన్యూ చేస్తూ చెప్పాడు,

“మొన్న మా పక్కింటాయన, ఎప్పుడో చిన్నప్పుడు, జరిగినవన్నీ కూడా, చాల కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేసాను” అని

“జరిగినవి, చెప్తే, ప్రెడిక్షన్, అనగూడదేమో, ప్రిపరేషన్ అనాలేమో ” అన్నా , నేను అతని మొహంలోకి ఓరగా చూస్తూ.

సుబ్బారాయుడు గూడ ఒక కొంటె నవ్వుతో, విశ్వనాధం ఏవంటాడా అని, అతని వైపు చూసాడు.

మా వెంకట రామన్ గారు, ఇవన్నీ పట్టించుకోకుండా, మా సాయి కేఫ్, ప్రసాద్ పంపించే టీ కోసం రోడ్డు అవతలి వైపు చూస్తున్నారు.

విశ్వనాధం మొహం ఎర్రబడింది, “ఏమోనండి, నాకూ ఆయనకీ పరిచయం అయ్యి వారం రోజులు కూడా కాలేదు. ఆయన చిన్నతనం లో జరిగిన సంఘటనలు నాకు తెలిసే అవకాశం లేదు” అన్నాడతను

పక్క రోజు మధ్యాహ్నం, దర్గామిట్ట లో ఎదో పని చూసుకొని, ఇంటి కొచ్చా. ఇంటి తాళం తీసి లోపలికెళ్తుంటే, మా ఎదురింటాయన ఆదుర్దాగా వచ్చి, “సుందరబాబు గారూ, ఓ గంట క్రితం మీ గురించి ఒక పోలీసు వచ్చాడండి, కలుద్దామని” , అన్నాడు.

“దేని గురించిట ?’ అడిగాన్నేను.

“విషయం అడిగినా , ఏం చెప్పలేదండి, మీ ఫోన్ నెంబర్ తీస్కొని వెళ్ళాడు. పేరు విష్ణు అని చెప్పి వెళ్ళాడు. వన్ టౌన్ స్టేషన్ నించి వచ్చాడట .” అన్నాడాయన .

“వెళ్లి కలుస్తాలెండి. సాయంకాలం ” అన్నాను నేను .

“విషయం ఏదైనా, కొంచెం జాగర్త సార్, డాక్టర్లు, పోలీసులు వీళ్ళ చేతుల్లో, పడ్డం కంటే నరకం లేదు ” అంటూ బోధించి, ఇంటికి పొయ్యాడు, మా ఎదురింటి ఆయన.

ఇంట్లో కి వచ్చి, ఓ గ్లాసుడు మంచి నీళ్లు ఆలోచించడం,మొదలు పెట్టాను.

నా జీవితం లో రెండే సార్లు పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టడం జరిగింది.

మొదటి సారి, తన పర్సు, టౌన్ బస్సు లో ఎవరో కొట్టేసినప్పుడు, మా టీచరు ఒకాయన, “తోడు రండి సార్, రిపోర్ట్ ఇద్దాం” అన్నప్పుడు.

రెండో సారి, ఓ ఆర్నెల్ల క్రితం మా ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు.

అప్పుడు పోయిన నాల్గు తులాల బంగారం గురించి,, ఒకటో రెండో మార్లు స్టేషన్ చుట్టూ తిరిగాను కానీ, పెద్ద ఫలితం, లేకపోవడంతో అట్లానే వదిలేసాను ఆ విషయాన్ని .

అలా ఆలోచిస్తూ ఉంటే, మా ఇంట్లో ఫోన్ మోగడం మొదలు పెట్టింది. ఈ లోకంలోకి వచ్చాను.

ఫోన్ తీస్తే, అవతల ఇందాక ఇంటికొచ్చిన, పోలీస్ కానిస్టేబుల్, పేరు విష్ణు అట, స్టేషన్ కి వచ్చి, సి.ఐ గారిని కలవాలని చెప్పాడు.

సీ.ఐ నన్ను స్టేషన్ కి పిలిచి, మాట్లాడాలనుకుంటే, ఎదో తల నొప్పి విషయమే అయ్యుంటుంది అని, అనుకున్నా.

ఒక గంట తర్వాత మిట్ట మధ్యాహ్నపు ఎండలో బయలు దేరి, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నా.

విష్ణు ని కలిసాను. ఓ ముప్ఫయి ఏళ్ళు వుంటాయేమో అతనికి.

“కొంచెం సేపు వెయిట్ చెయ్యండి సార్. సీ ఐ గారు, వేరే పనిలో వున్నారు. ” అని చెప్పి ఒక కుర్చీలో కూర్చోపెట్టాడు.

స్టేషన్ లో అంతా గందరగోళం గా వుంది.

ఒక మూల చిన్న రూమ్, కట కటాల తలుపు తో, దాంట్లో ఒక పది మంది ని కుక్కేసినట్టు కూర్చోబెట్టారు.

వాళ్లలో ఒకడు, బయటుండే పోలీసుల్ని ఎదో బతిమాలాడుతున్నాడు.

ఇంకో మూల రూమ్ లోంచి, ఎవరివో పెద్ద పెద్ద గా అరుపులు.

ఇది గాక ఒక ఆడమనిషి ఎవరో, రిపోర్ట్ చెయ్యడానికి వచ్చినట్టుంది, ఏడుపులు పెడబొబ్బలూ.

నా లాంటి వాణ్ని, ఇక్కడకి, తీసుకొచ్చి, రోజూ గంట సేపు, వూరికే కూర్చో బెడితే సరి పోతుంది.

వేరే శిక్ష ఆవసరం లేదు.

మనది హెడ్ మాస్టర్ ఉద్యోగం అయ్యేటప్పటికి, సైలెంట్ గా లేని ప్రదేశాలంటే నాకు సహజ సిద్ధంగా చిరాకు. దానికి ఒకటే ఎక్సెప్షన్ మా నెల్లూరు ట్రంక్ రోడ్డు.

కొంత సేపటికి విష్ణు వచ్చి , నన్ను, సిఐ , రూమ్ లోపలికి తీసుకెళ్లాడు.

వెళ్ళగానే నన్ను కూర్చో పెట్టి అన్నాడు , సి.ఐ. ” చిన్న చిన్న వాటికి మా పెద్ద వాళ్ళ దాకా విషయాన్ని తీసుకెళ్లి, విసిగిచ్చ మాకండి సర్. మా ఏడుపులు మాకుంటాయి.” అని విసుగ్గా.

“విషయం ఏందీ ? ” అడిగాన్నేను.

‘ఇది అమాయకత్వమా ఒళ్ళు పొగరా” అన్న పద్ధతి లో చూసాడు సి ఐ నన్ను.

ఇంతలో విష్ణు కలగ చేస్కోని, నా చెవి దగ్గర కొచ్చి చిన్నగా, చెప్పాడు.

“మీ ఇంట్లో ఎప్పుడో జరిగిన చిన్న దొంగతనం గురించి , మీరు మా చుట్టూ నెలలు, నెలలు తిరిగినా, మేము పట్టించుకోలేదని, మీరు డీ ఎస్ పీ గారికి కంప్లైంటు చేశారట గద సర్. నిన్న డీ ఎస్ పీ గారు, మా సార్ కి ఫోన్ చేసి, అరగంట అచ్చ తెలుగు లో మాట్లాడారు.” అని.

“ఆ దొంగతనం జరగడం, రెండు మూడు సార్లు మీ స్టేషన్ చుట్టూ తిరగడం నిజమే గానీ, నేనేమీ ఎవరికీ వెళ్లి కంప్లైంట్ చెయ్యడం జరగలేదు” అన్నాను.

సీఐ మొహం లో చిరాకు , కోపం ఇంకా ఎక్కువయ్యాయి. చెప్పాడు నాకు. ” మీరు మా విష్ణు తో టచ్ లో వుండండి. ఒక వారం రోజుల్లో మీ కేసు, ఎదో ఒక రకం గా సాల్వ్ చేస్తాము . మాకేదన్నా అవసరం ఉంటే మీరు స్టేషన్ కి రావాల్సి ఉంటుంది ” అని.

రూంలోంచి బయటకొచ్చి నిలబడ్డాను.

నిజానికి ఆ దొంగతనం గురించి పూర్తి గా మర్చిపోయాను, నేను ఈ రోజు పోలీసు ఇంటికొచ్చే దాకా.

” ఇన్ని నెలల తర్వాత, ఈ విషయం డీస్పీ దాకా వెళ్లడం ఏంటి ? ఆయన ఈ సిఐ ని పట్టుకొని ఉతకడం ఏంటి? ఇంకా, ఈ సి.ఐ వాలకం చూస్తే, చివరికి నేనే దొంగని అని ప్రూవ్ చేసినా, చేసేటట్టున్నాడు” అనుకున్నా, మనసులో.

ఈ లోపల విష్ణు బయటికి వచ్చి చెప్పాడు.

” రేపు మళ్ళీ మీరు ఒకసారి స్టేషన్ కి రావాల్సి ఉంటుంది. మీ ఏరియా లో మామూలుగా ఇలాంటి టైపు దొంగతనాలు చేసేవాళ్ళు మా లిస్టు లో వుంటారు. వాళ్ళల్లో ఎవడో మీరు గుర్తు పట్టాలి” అని.

నాకున్న చిరాకును అణుచుకొని, చెప్పాను.

“ఆ రోజు రాత్రి, మేము ఎండాకాలం గదా అని, మిద్దె మీద నిద్ర పోతుంటే, మా ఆవిడ మెడలోంచి గొలుసు లాగి పరిగెత్తాడు వాడెవరో. మా ఆవిడ అరిస్తే , నాకు మెలకువ వచ్చింది. మొహం, ఆకారం ఎదో కనపడింది గానీ. ఇన్ని రోజుల తర్వాత గుర్తు పట్టడం కష్టం” అని.

తాపీగా చెప్పాడు విష్ణు , “మీరు చెప్పిందంతా, మా రికార్డుల్లో ఉంటుంది సార్, కానీ కేసు సాల్వ్ చెయ్యాలంటే, మా పద్ధతులు మాకుంటాయి. రేపు వచ్చెయ్యండి.మీ గొలుసు మీ చేతిలో పెట్టే , బాధ్యత నాకిచ్చారు, మా సి ఐ గారు”

స్టేషన్ బయటకొచ్చేసాను.

కానీ, విష్ణు చెప్పినట్టు, ఆ మరుసటి రోజుతో, కథ ముగియలేదు.

అతను నాకు చూపించిన వాళ్ళల్లో నేను ఎవర్నీ గుర్తు పట్టలేక పొయ్యాను.

మళ్ళీ , ఇంకో గంట ఆ నరకం లో , సి ఐ గురించి వెయిటింగ్, ఆయన చాలా బిజీ గా ఉండడంతో. చివరిగా ఆ చిరాకు – సి ఐ తో ఒక కష్టా – గోష్టి. అలా వారం రోజులు , మూడు సార్లు ప్రదక్షిణ చెయ్యాల్సి వచ్చింది స్టేషన్ చుట్టూ , నా పనులన్నీ మానుకొని.

మా ఎదురింటాయన చెప్పినట్టు, వీళ్ళ చేతిలో పడితే బతుకు దుర్భరమే.

ఇది గాక రోజూ రాత్రి, ట్రంక్ రోడ్డులో , మా వాళ్ళ పరామర్శ వీటన్నిటికంటే, ఇబ్బందిగా ఉంది.

ఇంక ఒక రోజు తట్టు కోలేక, విష్ణుని పక్కకి పిల్చి చెప్పాను .

“ఇంక ఈ తిరుగుళ్ళు తిరగలేను. మోక్షం కల్పించమని”.

అతను నన్ను జాలిగా చూసి చెప్పాడు. ” ఎందుకో , మిమ్మల్ని చూస్తూంటే, మా చిన్నప్పటి, టీచరు, ఒకాయన గుర్తొస్తున్నాడు సార్. మిమ్మల్ని ఇట్టా తిప్పాలంటే నాకూ ఇబ్బందిగా వుంది. కానీ ఆర్డర్ పైనుంచి వచ్చింది కాబట్టి కొంత హంగామా అవసరం.”

నేనేం మాట్లాడలేదు.

ఒక రెండు నిమిషాలు ఆలోచించి చెప్పాడతను . “దీనికి ఒక మార్గం వుంది సర్. నేను చెప్పినట్టు చెయ్యండి. ” అని.

అతను చెప్పినదానికి ఒప్పుకొని, పక్క రోజు డైరెక్టుగా కోర్టు కు వెళ్తే, విష్ణు నన్ను లోపలి తీసుకెళ్లాడు.

అక్కడ నా ముందరకొన్ని ఎవరివో నగలు పెట్టి, గుర్తు పెట్టామన్నారు. విష్ణు చెప్పినట్టే, ఎదో ఒక గొలుసుని “నాదే “, అని చెప్పాను .

కాయితాల్లో వాళ్ళు కెలుక్కోవాల్సింది ఎదో కెలుక్కుని. ఆ గొలుసు నా చేతిలో పెట్టారు.

విష్ణు కి, థాంక్స్ చెప్పి అక్కడ్నుంచి బయట పడ్డాను.

అప్పటికి సాయంత్రం ఆరున్నర అయ్యింది. బండి వేసుకొని, నేరుగా ట్రంకు రోడ్డు కి వెళ్ళాను.

మా వాళ్ళు రావడానికి ఇంకా దాదాపుగా గంట టైం ఉండడంతో, వెళ్లి, సాయి కేఫ్ లో ప్రసాద్ దగ్గరకెళ్ళి కూర్చున్నా !

” ఏమిటి సార్ విషయం. ఈ రోజు ఇంత తొందరగా బయట పడ్డారు” అన్నాడు అతను.

నిజం గానే బయటపడ్డానంటూ, నా గోలంతా వివరించాను. చివరిగా అన్నాను. ” నాకు తెలియకుండా డీస్పీ కి ఎవరు కంప్లైంట్ ఇచ్చివుండొచ్చు ? ” అని.

ఎక్కడో ఆలోచిస్తూ, “ఆంజనేయులు అయ్యుంటాడు సర్’” అన్నాడు ప్రసాద్.

“ఎవరు సుబ్బారాయుడు గారి , బావ మరిదా ?” అడిగాన్నేను.

“కాదండి, మా పక్క వీధిలో ఉండేవాడు. డిగ్రీ అయ్యి, ఉద్యోగం కోసం తెగ కష్ట పడుతూంటే, మీ ఫ్రెండ్ హోటల్ లో ఉద్యోగం ఇప్పించారు మీరు” అన్నాడు అతను.

“ఆ గుర్తుకొచ్చింది, ఆ తర్వాత ఈనాడు లో , జర్నలిస్ట్ గా కూడా జాయిన్ అయ్యాడు అతనేనా? ” అన్నాను.

ప్రసాద్ చెప్పాడు, “అవును సర్, ఒక నెల రోజులక్రితం , ఎదో అర్జెంటు పని మీద నెల్లూరు వచ్చాడు . ఇప్పుడు ఒంగోలు లో వుంటున్నాట్ట. మీ గురించి అడిగితే, మాటల విషయం లో , మీ ఇంట్లో జరిగిన దొంగతనం గురించి చెప్పాను. తనకి తెల్సిన డీస్పీ ఒకాయన ఒంగోలు నించి నెల్లూరు కి , ట్రాన్స్ఫర్ అయ్యి వస్తున్నాడు అని, ఆయన కి విషయం చెప్పి, మీ సొమ్ములు మీకు వచ్చే ప్రయత్నం చేస్తాను” , అన్నాడు.

నాకు ఒక్క క్షణం. ఆంజనేయులుకి థాంక్స్ చెప్పాలో, ఇలా పోలీసుల చుట్టూ తిప్పించినందుకు,తిట్టుకోవాలో అర్థం కాలేదు.

ఏడున్నరకి , మా విశ్వనాధం వాళ్ళు, మా సభా మందిరానికి , వచ్చి రాంగానే, గొలుసు చేతికొచ్చిన సంగతీ. ఆంజనేయుల సిఫారసు గురించీ చెప్పాను .

అంతా విన్న విశ్వనాధం , ” ఇంక నేను ఈ జాతకాలు వొదిలేయ్యాలి సర్, స్టేషన్ దాకా వెళ్లారు కానీ, జైల్లో కూర్చోలేదు మీరు “. అన్నాడు నవ్వుతూ.

అప్పటి దాకా ఇదంతా వింటున్న మా వెంకటరామన్ గారు, తన కప్పులో టీ ఆస్వాదిస్తూ, సెలవిచ్చారు. “సుందరబాబు , జైల్లో కూర్చోలేదు కానీ, జైలు వచ్చి సుందరబాబు లో కూర్చుంది ఆ మూడు రోజులూ” అని.

“నెల్లూరు ట్రంక్ రోడ్డు నందలి నా ‘జాతక’ కథ!” కి 4 స్పందనలు

  1. షడ్రుచులను ఆస్వాదించే ఉగాది పచ్చడి లాంటి కధ.

    ముందుగా కథకుడికి నా అభినందనలు. చాలా రోజుల తర్వాత ఇలాంటి కధ చదువుతూ వింటుంటే పాఠకుడిగా చాలా సంతృప్తినిచ్చింది.
    ఈ కధలో పాత్రల ద్వారా అద్భుతంగా నవరసాలను పండించారు. ఎక్కడా అనవసరమైన పాత్రలు ఇరికించక, విషయాన్ని అటూ ఇటూ తిప్పక కథనాన్ని ఫ్రేమ్ టు ఫ్రేమ్ ముందుకు తీసుకెళ్ళారు. కధ ఎటు వెళుతుందో అన్న ఆసక్తి చాలా బాగుంది.
    అక్కడక్కడా నిజ జీవితంలో జరిగే అనుభవాలతో ఒక ఆలోచన రేకెత్తించారు.. అందులోని ఒక మాట “పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టడం”..
    మనలో చాలామందికి ఈ ఆలోచన ఎప్పుడూ పంటి కింద రాయి లాగా ఇబ్బంది పెడుతూంటుంది. అది ఎక్కువగా తమ పని కన్నా ఇతరుల ముందు తమ పరువు గురించే శ్రద్ధ ఉంటుంది . ఇప్పుడు ఆ విషయాన్ని తవ్వితే పెద్ద డిబేట్ అవుతుంది లేండి..
    ఈ కధను తిరిగి చదివినపుడు నాకర్ధమైంది ఏంటంటే, చాలా మేరకు హెడ్ మాస్టర్ గారి ఆలోచనలనే ఈ కధ నడిపించింది అని..
    “పోలీస్ స్టేషన్ వర్ణన, తర్జన భర్జనలు, కష్టా గోష్టి, జైలొచ్చి కూర్చోవడం కథలో మాంచి చెణుకులు”
    జాతకాల ప్రభావాలు మన జీవితాలపై ఉంటాయో లేవో కానీ మన జీవితం మాత్రం మన ఆలోచన విధానాలపై, చుట్టూ ఉన్న పరిస్థితులపై, నడిచే దారులపై ఆధారపడి ఉంటాయేమో!!. 🙏👍

    1. హర్షణీయం Avatar
      హర్షణీయం

      ధన్యవాదాలు రవికాంత్.

    1. హర్షణీయం Avatar
      హర్షణీయం

      ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారు.

Leave a Reply