Apple PodcastsSpotifyGoogle Podcasts

చిన్నీ వాళ్ళ చంద్రత్త!

“చిన్నీ ! నీ పెళ్ళికి చంద్రత్త వాళ్ళు రావట్లేదు, ఇందాక నువ్వు షాపింగ్ కి వెళ్ళినప్పుడు, మావ ఫోన్ చేశారు, చంద్రత్త కి ఒంట్లో బాగాలేదు అనిచెప్పి” అన్నారు నాన్న.

“నా పెళ్ళికి చంద్రత్త లేకపోతే, ఎలా ! అయినా క్రితం వారమే కదా, మీరు ఢిల్లీ కి ఎదో పని మీద వెళ్లి , అత్తా వాళ్ళను చూసొచ్చింది. అప్పుడు బాగానే వుంది కదా అత్తకి ?” అడిగాను నేను నాన్నని.

నా ప్రశ్న కు ఏమీ సమాధానం చెప్పకుండా, నాన్న అమ్మ వైపు చూసారు.

అమ్మ చెప్పింది, “అత్తకి, నెక్ పెయిన్ వల్ల, బాగా ఇబ్బందిగా ఉంది, చిన్నీ! మాట్లాడితే ఇంకా ఎక్కువ అవుతుందని, రెండు మూడు వారాలు రెస్ట్ అవసరం అని అక్కడ వాళ్ళ డాక్టర్ చెప్తున్నారు. నీ పెళ్లి అయ్యిన, నెల లోపల అందరం కలిసి కొండకి వెళదామనుకున్నాం కదా! ఆ ట్రిప్ కి జాయిన్ అవుతాం! అని అత్త నీకు చెప్పమంది ” అని.

” అది వేరు, పెళ్లికి అత్త నా పక్కనే ఉండటం వేరు” అన్నాను నేను .

మా చంద్రత్త అంటే నాకు చాలా ఇష్టం.

మొన్న మొన్నటి దాకా, మా చంద్రత్త వాళ్ళు, మా ఇంటికి ఓ అరగంట దూరంలోనే, సీతమ్మధారలో వుండేవాళ్ళు. మావకి ప్రమోషన్ వచ్చి, ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఢిల్లీ షిఫ్ట్ అయిపోయారు, ఓ ఆర్నెల్ల క్రితం. విశాఖపట్నం లో వున్నా, భూప్రపంచంలో ఎక్కడున్నా సరే, రెండ్నెల్లకోసారి, తను, మా ఇంటికి రావాల్సిందే.

మావ సర్వీస్ ఎక్కువ శాతం విశాఖపట్టణం లోనే జరిగింది, కాబట్టి నేను మా అత్తను పెద్ద మిస్ అయ్యింది లేదు. వాళ్ళ ఇంటికెళ్తే, బాపు గారి సినిమా లో హీరోయిన్ ఇంటికెళ్ళిన ఫీలింగ్ వచ్చేది నాకు. అంత అద్భుతం గా ఉంటుంది తన ఇల్లంతా. ప్రతీ వస్తువూ, నాకు నచ్చిన పేస్టెల్ షేడ్స్ లో. ఇది గాక, మాట్లాడేటప్పుడు, మా అత్త, మంచి జోవియల్ గా ఉంటుంది, చుట్టూ వున్న వాళ్ళ మీద జోకులేసేస్తూ.

నాకు తెలుసు, చంద్రత్త పెళ్ళికి రాకపోవటం, మా అమ్మను గూడా ఎక్కువ బాధ పెడుతుంది. మా అమ్మా , చంద్రత్త గూడా చాలా మంచి ఫ్రెండ్సు. బయటికి షాపింగులు, గుళ్ళూ గట్రా అన్నీ ఇద్దరూ కలిసే చేసేవాళ్ళు. ఎక్కడున్నా ప్రతీ రోజూ టంచను గా ఫోన్ చేసి మరీ మాట్లాడుతుంది , మా అమ్మతో చంద్రత్త.

తమాషా ఏందంటే, అలాంటి చంద్రత్త, మా నాన్న ఒకరితో ఒకరు, ప్రశాంతంగా మాట్లాడుకోవడం, చాలా తక్కువ సార్లు చూసాన్నేను. ఆవిడ, నాన్న కంటే రెండేళ్లు చిన్నదయినా, తనకో పెద్దక్క ఫీలింగ్ ఉంటుందనుకుంటా.

మా ఇంటి కొచ్చినప్పుడల్లా, అన్నాచెల్లెళ్ళిద్దరూ, ఎదో ఒక విషయం మీద, నాలుగు విరుద్ధమైన అభిప్రాయాలతో వాదించుకుంటూ వుండే వాళ్ళు. మధ్యలో మా అమ్మ జోక్యం చేసుకునేది కాదు. నవ్వుతూ చూస్తూ వుండిపొయ్యేది.

ఇలా ఆలోచనల్లో ఉంటే, అమ్మ పిలవడంతో ఈ లోకంలోకొచ్చాను.

అమ్మ చెప్పింది ” రేపు సాయత్రం కల్లా అన్నీ సర్దేయ్యాలి. ఎల్లుండి పొద్దున్నే, కల్యాణ మంటపం కి బయలు దేరాలి . నిన్న కొన్న చీరలన్నీ, కవర్లలోంచి తీసిపెట్టు, సూట్ కేసు లో సర్దుతాను” అని.

ఆ తర్వాత మూడు రోజులకి నా పెళ్లి జరిగి పొయ్యింది. రెండు వారాల్లోనే, ఎంవీపీ కాలనీ లో మా అత్త గారింటికి, కాపురానికి వెళ్లి పొయ్యాను, మా ఆయన అమెరికా లో ఉద్యోగస్తుడవ్వడం తో, వీసాలు లాంటి గొడవలుండడం తో.

వెళ్లిన ఒక వారానికి, వాళ్ళ ఇండియన్ ఆఫీస్ లో ఎదో పని ఉందని, మా ఆయన మద్రాసు వెళ్లడంతో, నాన్న, మా అత్తగారింటి కొచ్చారు, నన్ను ఇంటికి ఓ మూడు రోజులు, తీసుకెళదామని.

అప్పుడు నాన్న మాటల్లో తెల్సింది అత్త ఢిల్లీ నించి ఆ ముందు రోజు సాయంత్రమే, మా ఇంట్లో దిగిందని.

అడిగాన్నేను, ” ఉంటుందా అత్త ఓ మూడు నాలుగు రోజులు? ” అని ఆత్రుత గా.

” ఉంటుందేమో, ఒక వారం పది రోజులు”, అన్నారాయన.

ఉత్సాహంగా ఇంటికెళ్ళాను, నాన్నతో బాటూ. ఇంటికెళ్తే, వరండాలో వాలు కుర్చీలో పడుకోనుంది అత్త, ఎదో పుస్తకం చదువుకుంటా. నన్ను చూడంగానే ఆమె కళ్ళలో ఓ చిన్న మెరుపు. మనిషి బాగా వీక్ గా కనపడుతోంది. నన్ను దగ్గరకి తీస్కొని చెప్పింది. “రావాలని చాలా ప్రయత్నించానే చిన్నీ, కనీసం పెళ్లి రోజుకైనా.” అంటూ, తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూంటే.

చెప్పాను నేను, ” మా ఆయన పని మీద మద్రాసు వెళ్ళారత్తా ! వీసా డాక్యుమెంట్లు అనిచెప్పి, సాయంత్రం ఎటూ ఫోన్ చేస్తారు నాకు . అప్పుడు చెప్పేస్తా, నువ్వున్న వారం రోజులు ఇక్కడే ఉండిపోతానని” అని.

నవ్వేసింది అత్త, “మీ మావ గూడ ఢిల్లీ వెళ్లి పొయ్యారు మళ్ళీ వస్తానని, అయినా రెండు వారాల్లో బాగానే ట్రైనింగ్ ఇచ్చావు మీ ఆయనకీ ” అంటూ

ఆ రోజు రాత్రి, భోజనాలయ్యిన తర్వాత, అమ్మతో అన్నాను, “అత్తతో పాటూ నేను పడుకుంటా” అని.

“నువ్వొద్దు లేవే” అంది అమ్మ.

“మరి నువ్వు పడుకుంటావా” అడిగాన్నేను. అమ్మేమీ సమాధానం చెప్పలేదు . ఎక్కడో ఆలోచిస్తోంది. ఒక రెండు క్షణాలాగి చెప్పింది.

“అత్త ఉన్నన్నాళ్ళు , మీ నాన్న తోడు పడుకుంటారట” అని.

“ఇద్దరూ రాత్రంతా పడుకోకుండా, వాదులాడుకుంటారేమో” అన్నాను , నేను నవ్వుతూ.

అమ్మేమీ ఆ విషయం గురించి మాట్లాడకుండా, ” చిన్నీ, అత్త వున్నన్ని రోజులు, షాపింగులు, గీపింగులు అని తిప్పొద్దు, తాను ఇక్కడ రెస్టు తీసుకుందామని వచ్చింది” అని.

” ఏమైంది అత్త కి ?, ఇంకా ఆ పెయిన్ తగ్గలేదా ” అడిగాన్నేను.

“లేదు ఇంకా ఎక్కువైందిట, బ్యాక్ బోన్ లో ఎదో ఇబ్బంది అంటున్నారు. ఢిల్లీ కంటే ఇక్కడ వాతావరణం బావుంటుందని మావ ఇక్కడ మన దగ్గర వదిలి వెళ్లారు” అని.

ఆ రోజు రాత్రంతా, మా నాన్న అత్తల మధ్య, నేనకున్న, వాగ్యుద్ధాలు ఏవీ జరగలేదు. ప్రశాంతంగానే వుండింది వాతావరణం. ఇదిగాక విచిత్రం ఏమిటీ అంటే, పక్క రోజు పొద్దున్న తెల్సిన విషయం, ఆ వారమంతా మా నాన్న ఆఫీస్ కి లీవ్ పెట్టేశారని. పుట్టి బుద్దెరిగి, ఆయన రెండు రోజులు గూడా, ఆఫీస్ కెళ్ళకుండా ఇంట్లో ఉండటం నేను చూడలేదు, ఈ మధ్య, నా పెళ్లప్పుడు తప్ప.

రోజంతా అందరికంటే అత్త దగ్గర, నాన్నే ఎక్కువ టైం స్పెండ్ చెయ్యడం మొదలు పెట్టారు. ఎప్పుడు చూసినా, ఇద్దరూ నవ్వుతూ, ఎదో జోకులేసుకుంటూ ఉండేవారు.

ఒక మూడు రోజులు ఇదంతా గమనించి అడిగాను నేను అమ్మని, ” ఏమవుతోంది అన్నా, చెల్లెల్లు ఇద్దరి మధ్య, ఇన్నాళ్లూ కొట్టుకున్నదానికి ఇప్పుడు కాంపెన్సేట్ చేసుకుంటున్నారా? అయినా నువ్వెందుకు అత్త తో ఎక్కువ టైం స్పెండ్ చెయ్యట్లేదు? “

చిన్న గా నవ్వి, అడిగింది అమ్మ, “మీ అత్త, మన ఇంటికొచ్చి నప్పుడు, ఎప్పుడైనా సరే, నాతో ఐదు నిమిషాలు కంటిన్యూయస్ గా మాట్లాడ్డం ఎప్పుడైనా చూసావా? “

“ఇప్పుడంటే ఢిల్లీ వెళ్ళిపోయింది, ఇక్కడున్నన్నాళ్లు ఎక్కడికి వెళ్లినా, నీతోనే గదా అన్నాను” నేను వదిలిపెట్టకుండా..

“బయట బజార్లు తిరగడం కాదు, మీ అత్త మన ఇంటికి ఎప్పుడైనా వచ్చినప్పుడు” అడిగింది అమ్మ.

ఓ నిముషం ఆలోచించాను. నిజమే, ఇంటి కెప్పుడు వచ్చినా, మా అత్త , నాన్న కి సెలవు వున్న రోజునే ఇంటికి వచ్చేది. ఇదిగాక ఎంత గట్టి , గట్టి గా అర్గ్యూ చేసుకున్నా.అరిచినా , వాళ్లిద్దరి, మధ్య లోనే అన్నీ.

“మరి ఫోన్లలో రోజూ మాట్లాడేది నీతోనే గదా? ” అన్నాను నేను.

“అందులో కూడా సగం టైం వాళ్ళ అన్నయ్య గురించే, మీ నాన్న ఏమి, తిన్నాడు, ఎలా తిన్నాడు, ఈ రోజు ఎలా వున్నాడు ” అని అంది అమ్మ

“మరి కొట్టుకోవడం కూడా, అన్న చెల్లెళ్ళ బంధం లో భాగం అంటావ్ “అని నవ్వుతూ అడిగాన్నేను.

“ఒక్కొక్కరిది ఒక్కో చట్టం, వీళ్లిద్దరికీ, ఎలా మాట్లాడుకున్నాం, ఏం మాట్లాడుకున్నాం అనే దాని కంటే, ఎంత సేపు కలిసున్నాం అనేది ముఖ్యమేమో ” ఆర్థోక్తిగా అంది అమ్మ.

అమ్మే మళ్ళీ అనింది, “చిన్నీ! ఇంతకు ముందు, కూడా ఒకసారి, మీ మావకు బెంగుళూరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తే, మీ అత్త కి ఇలానే, ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చినట్టు, అప్పుడు రోజూ తలనొప్పి వచ్చేది, చాలా మంది డాక్టర్ల చుట్టూ తిరిగి తిరిగి, తగ్గకపోతే, ఓ సైకియాట్రిస్ట్ చెప్పాడట మీ మావకి, “మీ ఆవిడ ఆమెకు దగ్గర అయిన వాళ్ళ కెవరికో, దూరమై బాగా ఇబ్బంది పడుతోంది” అని, ఆ డాక్టరు చెప్పినట్టే, మావ మళ్ళీ వైజాగ్ కి ఫామిలీ షిఫ్ట్ చెయ్యంగానే, మీ అత్త తలనొప్పి మాయమై పొయ్యింది” అని.

“అదంతా సరే, అన్నా చెల్లెళ్ళ మధ్య ఈ సడన్ సామరస్యానికి, కారణం ఏంటి ” అడిగాన్నేను.

“ఏమో వాళ్లనే అడుగు” అంది అమ్మ.

పక్క రోజు సాయంత్రం టీవీ దగ్గర, ఇద్దరమే, కూర్చోనున్నప్పుడు చెప్పింది, చంద్రత్త , “జాగర్తే చిన్నీ, అందరికీ దూరం గా అమెరికా కి వెళ్ళిపోతున్నావ్, వీలైనప్పుడల్లా అమ్మకీ నాన్న కీ ఫోన్ చేస్తూండు. అట్లాగే మీ అత్త గారు వాళ్లకి గూడా”

“వెళ్ళడానికి ఇంకా నెల దాకా టైం వుంది అత్తా., అప్పుడు చెపుదువు గాన్లే ఇవన్నీ” అన్నాను నేను,.

” చెప్పడానికి నేను ఇక్కడ ఉండాలి కదా ” అంది, అత్త.

” నువ్వు ఇక్కడ లేకపోతే, ఢిల్లీ కి ఫోన్ చేసి మాట్లాడతాలే, చెప్దువు గాని” అన్నాను నేను.

అత్త ఏం మాట్లాడలేదు.

నేనే అడిగాను “అయినా వచ్చినప్పటినుంచి చూస్తున్న అత్తా! నేనొక మనిషిని నీకోసం, వచ్చి ఇక్కడ కూర్చుంటే, నాతో మాట్లాడాలి కానీ, ఎంతసేపూ మీ అన్నగారు తప్ప ఇంకెవరం కనపడడం లేదా”?

చిన్న గా నవ్వుతూ అంది అత్త , ” నాకింకా ఎక్కువ రోజులు, టైం లేదే చిన్నీ అని”.

కంగారేసి కోపంతో అన్నా నేను, “అలాంటి మాటలు మాట్లాడొద్దు, అత్తా, నీ ఏజ్ లో బ్యాక్ పెయిన్ ఇష్యూ చాలామందికి ఉంటుంది ” అని,

అత్త చెప్పింది, “అదేనే! నెల నుంచి, మీ మావ, మీ నాన్న అదే విషయం, బయటికి చెప్తున్నారు. కానీ, నాకు తెలిసీ , ఈ లోపల ఉండేది, ఎదో, మామూలు నొప్పి కాదు ” అని.

” అంత కచ్చితం గా ఎలా చెప్తున్నావ్ అత్తా!” అడిగా నేను.

“నేను బతకడానికి ఏ మాత్రం అవకాశం వున్నా, నీ పెళ్లి వాయిదా వేసేవాడే మా అన్నయ్య. అయినా, నేను లేకుండా నీ పెళ్లి జరగడం ఏమిటే ” అంది అత్త.

ఒక్క క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, “అదేంటి అత్తా అంత మాట అనేసావ్ ? ” అన్నాను

“వాడికి నాకు మధ్య, మాటల గోల అవసరం లేదే, అవసరమైనవి చెప్పుకోడానికి, దానంతటకు అవే అర్థమైపోతాయి మా ఇద్దరికీ ” అంది అత్త కుర్చీలోంచి నెమ్మది గా లేస్తూ.

వారం రోజుల తర్వాత, రాత్రి పడుకున్న మా చంద్రత్త మళ్ళీ పొద్దున్న లేవలేదు. మేము రూమ్ లోకి వెళ్లి చూసేటప్పటికి, మా నాన్న మౌనం గా అత్త వైపే చూస్తూ కూర్చోనున్నారు.

ఇంకో రెండేళ్ల తర్వాత, మా నాన్న కూడా అదే పద్దతిలో, అదే గదిలో, వెళ్లిపోయారు.

మా నాన్న ను చూడగానే నాకు అంత బాధలో కూడా అనిపించింది, చంద్రత్త ను వదిలి మా నాన్న ఎక్కువ రోజులు ఉండలేక పొయ్యారు అనిచెప్పి.

“చిన్నీ వాళ్ళ చంద్రత్త!” కి 19 స్పందనలు

 1. Heart touching Real story..

  1. హర్షణీయం Avatar
   హర్షణీయం

   Thank you Madhusudan garu.

 2. ఇది కధ కాదు.. ఓ శ్రావ్య దృశ్య కావ్యం.🙏

  ముందు మొదట విన్నా తర్వాత మళ్ళీ మళ్ళీ చదివింపజేశారు. పాత్రలు జీవం పోసుకుని మనల్ని వాళ్ళలో కలిపేసుకుని కళ్ళ ముందే మాట్లాడుతున్నట్లుగా యావత్ కధంతా సాగింది. భావుకత నిండిన ఈ కధ ఎందుకో నాలో చాలా భావోద్వేగం నింపింది.
  అందరికీ అర్ధమైయ్యేలా సరళ భాషలో మంచి కధనంతో రచన చేసిన కధకుడికి అభివందనం.
  అన్నా చెల్లెలి బంధాన్ని చాలా సున్నితంగా తాకి వారి పరిధిని విశ్లేషించిన తీరు ఎవరినైనా కదిలిస్తుంది. ఇలాంటి బంధాలు, సన్నివేశాలు ప్రతీ ఇంట్లో ఏదో ఓ రూపంలో తారసపడతాయి. కధల రూపంలో మనల్ని అక్కున జేర్చుకుంటాయి.
  ప్రతీ ఒక్కరూ వెళిపోయే వారే!! కాకపోతే ఒకరు కాస్త ముందు ఇంకొకరు వారి వెనుక..

  హర్షణీయం కధలకు కృతజ్ఞతలు 🙏

  1. హర్షణీయం Avatar
   హర్షణీయం

   Succinct review of the story, Ravikanth. Thank you.

  1. హర్షణీయం Avatar
   హర్షణీయం

   Thank you Priya Garu.

 3. a moving end to a close to real life story.very well narrated !!

 4. Excellent sir, both story and voice over.👌🙏

  1. హర్షణీయం Avatar
   హర్షణీయం

   Thank you Satish Garu.

 5. అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని, ఆత్మీయతను చాలా గొప్పగా,హృద్యంగా ఆవిష్కరించావు అనిల్

  1. హర్షణీయం Avatar
   హర్షణీయం

   థాంక్ యు.

  1. It’s really superb 👌👌

   1. హర్షణీయం Avatar
    హర్షణీయం

    మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు వినాయకరావు గారు.

 6. చాలా హృద్యంగా ఉంది. కధ, కథనం చాలా చక్కగా ఉంది. కధ చదువుతున్నంత సేపూ కొద్దిగా ఉత్కంఠ కు లోనైనా, మధ్యలోనే క్లయిమాక్స్ కొద్దిగా అర్ధమవుతు వచ్చింది. రాబోయే ప్రయత్నాల్లో ఈ విషయం లో కొంత ఆలోచన చెయ్యగలవు.ముఖ్యంగా కధ చెప్పే విధానం నాకు బాగా నచ్చింది.

  ఇంకోక్క సలహా. తెలుగులో చిన్న పిల్లల కధలు, సొంతవి గానీ, సేకరించి గానీ, చందమామకథలు, పంచతంత్రం లాంటివి, పోస్ట్ చేస్తే, బాగుంటుంది.

  మీ అందరికి, నీకు, హర్ష గారికి, సుందర బాబు గారికి అభినందలు, ధన్యవాదాలు.

  1. హర్షణీయం Avatar
   హర్షణీయం

   కథ మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా వుంది సుధ అన్నయ్యా! క్లైమాక్స్ గురించి మీరు ఇచ్చిన సలహా చక్కగా వుంది. హర్షణీయం లో మిగతా కథలను కూడా చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Leave a Reply