Apple PodcastsSpotifyGoogle Podcasts

ఈ కథకి టైటిల్ పెట్టటం నా వల్ల కాదు!

నా అమెరికా ప్రయాణం మరియు డెన్వర్ కి చేరటంలో పడ్డ అష్టకష్టాలు నేను ఇదివరకే మీకు నా అమెరికా యాత్రలో వివరించాను. నా డెన్వర్ కష్టాలు అంతటితో ఆగలేదు. నేను మరియు మన నాయుడుపేట వాసి అయిన బుడ్డ రాజేషు ఒక సంక్లిష్టమైన ప్రాజెక్ట్ ని చేపట్టాము. అదేమియనగా మా ఖాతాదారుని యొక్క ఖాతాదారుల వివరాలను ఒక పాత డేటాబేస్ నుండి కొత్త డేటా బేస్ కి వలస యొనర్చటం. ఈ క్రమంలో మేమిద్దరం కలిసి ఒక ఇరవై లక్షల ఖాతాదారుల వివరాలలో దాదాపు ఒక లక్ష (అక్కడ లక్ష అనకూడదు, ఓ వంద వేలు అనాలి) ఖాతాదారుల వివరాలని కృష్ణార్పణం చేసేసాము. ఒక లక్షే కదా అని ఊరుకోవొచ్చుగా మా ఖాతాదారుడు, ఊరుకోకుండా మా చేత ఆ తప్పిపోయిన వివరాలను వెతికించి, వలస చేయించి మాకు ఉద్వాసన పలికాడు. ఈ ఉద్వాసన పర్వం గురించి రాస్తే ఓ భారతమంత అవుతుంది ఈ కథ. ఆ విధంగ నా డెన్వర్ కొలువు మూన్నాళ్ళ ముచ్చట అయ్యింది.


మా రెసిడెంట్ మేనేజర్ పెద్దాయన మంచివాడు కాబట్టి, నన్ను డెన్వర్ కి ఓ ముప్పై మైళ్ళ దూరం లో వున్నబౌల్డర్ అనే వూరిలో వున్న జి.ఈ కంపెనీలో పడేసాడు. అందరూ చల్ల కదలకుండా డెన్వర్లో కొలువు చేసుకుంటూ వుంటుంటే నేను మాత్రం, ఓ సంవత్సరం పాటు డెన్వర్ కి బౌల్డర్ కి మధ్య బంతిలాగ దొర్లా. అట్టి ఆ జి.ఈ లో మా మేనేజర్ ఉమేష్ నారాయణస్వామి. చాలా సదాచార సంపన్నుడు మరియు కొంచెం చాదస్తుడు. ఏడు గంటలకల్లా ఆఫీసులో ఉండేవాడు, కొంపలేదో మునిగేటట్టు. నేను పడుతూ లేస్తూ డెన్వర్ నుండి ఎప్పుడన్నా, ఎనిమిది కన్నా ఓ పదినిమిషాలు మాత్రమే, ఆలస్యంగా వెళితే నా కుర్చీ వరకు వచ్చి శుభమధ్యాహ్నం అని చెప్పి వెళ్లేవాడా దుర్మార్గుడు. ఏమాటకామాట చెప్పుకోవాలి పనిమాత్రం బాగా నేర్పాడు నాకు దగ్గరుండి మరి. మా పనిలో ఎమన్నా పొరపాటు వుంటే ఉగ్రనరసింహావతారమెత్తే వాడు.


ఆయన పోరగా పోరగా సంవత్సరం తర్వాత నేను డెన్వర్ కి మరియు బౌల్డర్ కి మధ్యనున్న లూయిస్విల్ కి మకాం మార్చేసాను. అక్కడ మన భారతీయ సమూహం అస్సలుండే వారు కాదు. మేమైతే అక్కడ నివసించటమొక శిక్షగా భావించే వారము. ఎప్పుడెప్పుడు తిరిగి డెన్వర్ లో పడుదామా అని ఎదురుచూసే వారము. మా ఉమేష్ ఆ సంవత్సరము తనకు తానుగా కల్పించుకొని అందరు ప్రోడక్ట్ వెండార్స్ తో బేరాలు ఆడి ఒక మిలియన్ డాలర్స్ మిగిల్చాడు, జి.ఈ కి, లైసెన్సుల ఖరీదు మీద. అవన్నీ పూర్తి అయ్యాక వచ్చి చెప్పాడు, “హర్ష తట్ట బుట్ట సర్దుకో నువ్వు కూడా, నేను కూడా సర్దుకుంటున్నా”, అని. అదేమిటి ఉమేష్, నువ్వు జి.ఈ కి ఒక మిలియన్ మిగిల్చావు నిన్నెందుకు సాగనంపుతారు అంటే, “లేదు హర్ష ! నీకు తెలియదు ఈ జి.ఈ నాయకత్వపు జనాల ఆలోచన, నేను ! ఈ సంవత్సరానికి ఒక మిలియన్, మిగల్చటంతో ఇక ఈ సంవత్సరమంతా నా దగ్గర నుండి ఇక కొత్త ఉత్పాదకత ఏమి ఉండదు, నేను కూడా ఈ ఘనకార్యాన్ని గురుంచే డప్పుకొట్టుకుంటానని వాళ్లకు తెలుసు”, అని చెప్పాడు. నిజమే, ఆయన అన్నట్టే ఆయన్ని మేనేజర్ పదవి నుండి జి.ఈ తొలిగించింది. నాకొక ఆర్నెల్ల పొడిగింపు వచ్చింది. కానీ నాకు మా ఉమేష్ లేని అక్కడ పని చేయాలని అనిపించలేదు. అదియును కాక, ఎప్పుడెప్పుడు డెన్వర్ లో పడదామా అన్న కోరిక మాకు.


సరే ఆ ప్రయత్నాలు మొదలు పెట్టాము. ముందు మా పెద్దదానికి డెన్వర్ లో ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం కింద నాలుగు ఏళ్ళు నిండితే సీట్ ఇచ్చే స్కూల్ లో ప్రవేశం కోసం ప్రయత్నిద్దామని అనుకున్నాము. అందుకని ఓ రోజు మంచి ముహూర్తాన డెన్వర్ కి మా ఇంజనీరింగ్లో సీనియర్ అయినా శివకోటన్నఇంటికి వచ్చాము. పిల్లలు కాస్త తేరుకున్నాక, స్కూల్ కి పోదామని కార్ దగ్గరకొచ్చాము. పిల్లలిద్దర్నీ వెనక కార్ సీట్స్ లో కూర్చోపెట్టే క్రమంలో నేను తెచ్చిన ఫైల్ ని కార్ మీద పెట్టి, వాళ్ళని కుర్చోపెట్టాక, ఆ ఫైల్ తీసుకొని లోపలపెట్టుకోవటం మరచి అలాగే బర్రుమని స్కూల్ కి వెళ్లిపోయాం. అక్కడికెళ్లి చూసుకుంటే ఫైల్ కనపడలేదు. మా సర్వ సమస్తం ఆ ఫైల్ లోనే, మా పాస్పోర్ట్స్, నా సర్టిఫికెట్స్, పిల్లల బర్త్ మరియు వాక్సినేషన్ రికార్డ్స్, ఒకటేమిటి సమస్తం అందులోనే. మా గుండెలు జారిపోయాయి, వెంటనే పరుగు పరుగున శివకోటన్న అపార్ట్మెంట్ కి వచ్చాము. అక్కడ మాకు మా ఫైల్ కనపడలేదు, ఒక్క సారి కుప్పకూలిపోయాము. దేశంగాని దేశంలో సంబంధిత కాగితాలన్నీ పోగొట్టుకొని, ఏమిరా ఈ శిక్ష అనుకుంటూ. సరే ధైర్యం తెచ్చుకొని శివకోటన్న వాళ్ళ అపార్ట్మెంట్ లోని అన్నీ కామన్ పరిసరాల్లో ఒక నోటీసు పెట్టాము, ఎవరికన్నా మెరూన్ కలర్ ఫైల్ దొరికితే మాకు ఫోన్ చేయండి అని. ఎవరూ చేయలా, ఆ రోజు సాయంత్రం దాకా ఎదురు చూసి, మా వూరెళ్ళిపోయాము.

శివకోటన్న మరునాడు ఫోన్ చేసి, ఫైల్ తెచ్చి ఇచ్చినవాళ్లకు 50 డాలర్స్ బహుమతి అని పెడదామని చెప్పి అలాగే నోటీసు పెట్టివచ్చాడు. అయినా మాకేమీ ఆచూకీ రాలేదు. అలా మేము ప్రతీ కొన్ని రోజులకి ఒక ఏభై డాలర్లు పెంచుకుంటూ పోయాము. రెండు వారాల తర్వాత, ఆ బహుమతి రెండువందల డాలర్లకి పెంచాక ఫోన్ వచ్చింది, ఆ ఫైల్ మా దగ్గర వుంది అని. మాకు గొప్ప ఊరట మరియు ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది. సరే, డెన్వర్ లో, శివకోటన్న వాళ్ళు వుండే కాంప్లెక్స్ దగ్గరలో, ఒక బర్గర్ కింగ్ లో కలవాలని నిశ్చయించాము. నేను, శివకోటన్న, సుప్రియా అందరమూ అక్కడకు వెళ్ళాము. అక్కడ మా ఫైల్ పట్టుకొని ఒక నల్లనయ్య నిలబడి వున్నాడు. రెండువందల డాలర్స్ తీసుకొని మా ఫైల్ మాకు ఇచ్చాడు. ఇస్తూ చెప్పాడు, నాకు జాబ్ పోయి కష్టాల్లో వున్నాను అందుకే మీరు బహుమతి పెంచేదాకా ఎదురు చూసాను అని. నేను కూడా నవ్వుతూ చెప్పా! నా ఫైల్ నాకిచ్చి నా నెత్తిన నువ్వూ పాలుపోసావు అని అచ్చు తెలుగులో. ఆ పోసిన పాలు కాస్త ఎండినాక మొదలయ్యింది నాకు రెండువందల పోయిన బాధ.

Leave a Reply