Apple PodcastsSpotifyGoogle Podcasts

అర్థాంతర ప్రయాణాలు!

అమ్మ పొట్టలోనే ఇంకొన్ని రోజులు హాయిగా వుందామనుకున్న నన్ను, అలా ఉండటం కుదరదు అంటూ ఫోర్సెప్స్ లాటి పరికరాలు వాడి మరీ ఈ లోకం లోకి తీసుకొచ్చారు అమ్మ తో పని చేసే సహ డాక్టర్లు.

కళ్ళముందు, హాస్పిటల్ లో వాడే టూల్స్ కనిపించీ కనిపించక, శబ్దాలు వినిపించీ వినిపించక నా అయోమయంలో నేను ఉంటే, ఏవో మాటలు కూడా, “వీడు తెల్లగా బొద్దుగా భలేగున్నాడు అంటూ”.

అలా ఓ నాలుగు చేతులు మారాక, “ఇంకా ఎన్ని చేతులు మారాలి రా నాయనా అనుకుంటూ, ఉన్న పళాన నాలుగు ఆవులింతలు అరువు తెచ్చేసుకొని మెల్లగా నిద్రలోకి జారుకున్నా”.

ముప్పావు వంతు నిద్ర, పావు వంతు మెలుకువ, మెలకువలో అమ్మ స్పర్శ, అమ్మ గొంతు కోసం వెతుక్కునే నన్ను, పెద్దైయ్యాక ఏమైతాడో వీడు అని అమ్మా నాన్నతో పాటు అందరూ అనుకుని అన్నప్రాసన మొదలెట్టేసి, ఏవో బుక్కు, పెన్ను, బంగారు గొలుసు లాంటివి ముందర పెట్టారు ఆ రోజున,

కానీ చూసేవాళ్ళని సంభ్రమాశ్చర్యాలలో ముంచుతూ, వాటిలోంచి ఓ చిన్ని కత్తిని పట్టుకుని అప్పటికప్పుడే వీరులమైపోయాం. కానీ బహుశా అక్కడే నా ఫ్యూచర్ కు నాంది పడిందేమో, పనిముట్ల తో ముడిపడి వుండే వృత్తి తో! రాజ్యాలు, వాటినేలే రాజులు అప్పటికే అంతరించి పోవటం తో.

అందుకు తగ్గట్టే, చిన్నప్పుటి నుండి ఇంట్లో ఉండే స్పాన్సర్, హ్యామర్, టెస్టర్ లాంటివి నన్ను తెగ ఆకర్షించి వాటితో ఆడుకోవాలనిపించేది. అవన్నీ మా నాన్న చిన్న చిన్న పనులకోసం వాడేవారు. అవి ఎలా వాడాలి అని మా నాన్నను విసిగిస్తూ గమనిస్తూ, ఛాన్స్ దొరికితే అవి ఎలా వాడాలో కాస్త తెలుసుకున్నా.

ఇక ఆ విజ్ఞాన రస గుళిక, మన బుర్రలో పనిచేయడం మొదలెట్టి, మా నాన్న ప్రేమతో కొనిచ్చిన సైకిల్ మొత్తం విప్పేసి, తిరిగి ఎన్ని సార్లు బిగించినా బోల్డెన్ని నట్లు, బోల్టులు మిగిలిపోతూ ఉండటంతో, మెకానిక్ వచ్చి బిగించేవాడు. ఒక విషయం తెలుసుకోడానికి, అది నాన్న నాకు ఫ్రీడంతో ఇచ్చిన అవకాశం అనుకుంటా!! అదే ఇంకాస్త ముందుకెళ్ళి మెకానికల్ ఇంజనీరింగ్ చేసే అవకాశం కూడా కలిగించిందేమో!

అమ్మ డాక్టరుగా, నాన్న ఇంజినీరుగా పని చేస్తూ, నేను, చెల్లెలుస్కూలుకు వెళ్ళొస్తూ మా ఇల్లంతా తెగ హడావిడిగా ఉండేది. ఇంత జరుగుతున్నా మద్యలో మధ్యలో మన ప్రయోగాలు మనవే కదా!!

ఓసారి అమ్మ అడిగింది, “పెద్దయ్యాక ఏమౌతావురా” అని.

ఠక్కున మన సమాధానం, “డ్రైవర్ అవుతా”!!

కాసేపు ఓ భయంకరమైన నిశబ్దం. అమ్మకు మన రుచులు, అభిరుచుల సంగతి తెలియదు కదా పాపం. నన్నదోలా చూస్తూ ఏదో అనుకుంటూ వెళ్ళిపోయింది.

నాకు అత్యంత ఇష్టమైన బస్సు ప్రయాణంలో ఎప్పుడూ ఓ స్పెషల్ సీటు రెడీ. అదే డ్రైవర్ పక్కనే ఉన్న ఇంజిన్ బానెట్. అది ఎలా ఉన్నా సరే, డ్రైవింగ్ గమనిస్తూ కాస్త ఆయన బుర్ర తింటూ మనక్కావలసిన విషయాలు రాబడుతూంటే కొన్న టిక్కెట్టుకు పూర్తి న్యాయం చేసినట్లే. అలా బోనెట్ మీద కూర్చొని అద్దం లోంచి సుదూరాన తారు రోడ్ మీద ఏర్పడే ఎండమావులను చూడటం గొప్ప అనుభూతి.

నాన్నలో కాస్త నిశబ్దత, గంభీరత ఎక్కువ. అది పని ఒత్తిడి వల్ల అని తాతయ్య చెప్పేవాడు. నాన్నకు మంచి మూడ్ ఉంది అనే గుడ్డి గుర్తు , ఇంట్లో ఘంటసాల గారి పాట వినిపిస్తే , నాన్న చక్కటి గొంతుతో పాడుతుంటే, ఆ టైమ్ లో ఎవరూ ఆయన్ని డిస్ట్రబ్ చేసే వాళ్ళం కాదు. అది అమ్మ పెట్టిన రూల్.

స్కూల్లో నా చదువులు టాప్ క్లాస్ కాక పోయినా, ఇంట్లో ఏ రోజూ ఇబ్బంది రాలేదు. స్కూల్లో మేం ఓ ముగ్గురం బాగా ఫ్రెండ్స్. మమ్మల్ని అమర్ అక్బర్ ఆంటోని అనేవారు తక్కిన వాళ్ళు. పేర్లకు తగ్గట్టుగా మాది ఓ సర్వమతసమ్మేళణం. ఒకరి లంచ్ బాక్స్ ఇంకోడిది. మాలోని ఆంటోని గాడు ఇప్పుడెక్కడికెళ్ళిపొయ్యాడో!!

చిన్నప్పుడు నన్ను బాగా వేధించిన విషయం అంటే మా ఫ్యామిలీ అంతా కలిసి ఒకే ఇంట్లో లేకపోవడం. గవర్నమెంట్ ఉద్యోగులుగా అమ్మా నాన్న చాలా ఊళ్ళు తిరుగుతూ మా ఇద్దర్ని, చెరీ ఒకరు పంచుకుని చదివించేవారు.

తాతయ్యను అడిగితే నిజాయితీకి శిక్ష అనే వాడు. అర్థం అయ్యేది కాదు. నా ప్రయాణ పదనిసలు ఇంకొంచెం ముదిరి, హాస్టల్ లో ఉండాల్సొచ్చో , లేక టౌన్ పక్క పల్లెలో బంధువులతో ఉంటూ, రోజూ బస్సులో వచ్చి , స్కూల్ బస్సు పట్టుకుని తిరిగి, మళ్ళీ పల్లె బస్సులో ఇల్లు చేరాల్సొచ్చేది.

కానీ ఆ తిరిగే శిక్ష , మెల్లగా నన్ను బస్సు మీద ప్రేమకు దూరం చేయడం మొదలెట్టింది.

నేను పదో తరగతిలో ఉన్నప్పుడు తాతయ్య అన్న మాటలు అర్ధమైన రోజు రానే వచ్చింది. నాన్న పనిచేసే కరెంటు సబ్ స్టేషన్, క్వార్టర్స్ అన్నీ కలిపి కాలనీలోనే ఉండేవి. ఆఫీసు ఇల్లు పక్కపక్కనే ఉండేవి. పనుల కోసం చాలా మంది రాకపోకలు సాగేవి. అలా రాజకీయ నాయకులు కూడా వచ్చి కాస్త కఠినంగా మాట్లాడితే నాన్న వాళ్ళను గెటౌట్ అనడం, తోటి ఆఫీసర్లు నాన్నకు సపోర్టు చేయడం, జీపు డ్రైవర్ వాళ్ళకి సర్దిచెప్పడం ఇలా రభస అయ్యింది.

రికమెండేషన్ పద్దతిలో వాళ్ళ పని కావాలనడం, నాన్న రూల్స్ మాట్లాడటంతో గొడవ. ఇక మళ్ళీ ట్రాన్స్ఫర్ మామూలే. ఇవే విషయాల మీద అమ్మ కూడా నాన్నకు వత్తాసు పలకడం జరిగేది. నాన్న ఎందుకు గంభీరంగా నిశ్శబ్దంగా ఉండేవాడో అర్థమైంది. తన నిజాయితీ తన మనస్సు విరిచేసిందేమో అనేంత.

అమ్మకు మా ఇద్దరిలో ఎవరినైనా డాక్టరుగా చూడాలన్న కోరిక బలంగా ఉండేది. చాలాసార్లు ఈ మాట బయటపెట్టింది కానీ మన లోకం వేరాయె. నాన్న చదివిన కాలేజీలోనే తాను కాలుపెట్టాలన్న చెల్లెలి కోరిక, అమ్మను తన ఇష్టాన్ని వదులుకునేలా చేసింది.

నేననుకున్న మెకానికల్ బ్రాంచ్ చేరాక అత్యంత బోరు కొట్టిన సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ . ఇదే విషయంపై ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన నాన్నతో మంచి డిబేట్ కూడా నడిచేది. నా లాజిక్ ఒకటే! కనపడని దాని గురించి ఊహించి ఎలా చదవడం అని!! “ప్లగ్ లో వేలెట్టి చూడు, అండ పిండ బ్రహ్మాండాలు కనిపిస్తాయి” అని నాన్న అనడం ఇంకా గుర్తు. మా చర్చ చాలా ఆసక్తికరంగా ఉంటూ నాన్న దగ్గర విలువైన విషయాలు నేర్చుకునే అవకాశం కలిగించింది.

నా చిన్నప్పటి నాన్నకు, ఇప్పటి నాన్నకు మధ్య ఈ చర్చల ద్వారా వచ్చిన కొత్త మార్పు నేనూ అమ్మ గమనించాం, చాలా ఆనందపడ్డాం. అలా సాగుతున్న నా కాలేజీ లైఫ్ లో ఒక పెద్ద షాక్ మా నాన్న చనిపోవడం. సడన్ గా గుండెపోటు. డాక్టర్ గా పక్కనే ఉండి అమ్మ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ బాధలోంచి అమ్మ ఒక బదిలీ రూపంలో తేరుకుంది.

ఎందుకో అమ్మ ఆ తర్వాత తీరిక లేనంతగా బిజీ బిజీగా జీవితాన్ని గడుపుతూ ఉద్యోగంతో పాటు అనేక రకాల వ్యాపకాలతో రోజు మొత్తం గడిపేది. రిటైర్ అయ్యాక మాతో కూడా ఎక్కువ రోజులు గడిపేది కాదు.

అమెరికా బోరుకొట్టి చెల్లెలి దగ్గర నుండి రెండు నెల్లకే తిరిగొచ్చి నాకు ఇవన్నీ జైలు జీవితాల్లా ఉన్నాయ్, నాకంటూ గుర్తింపు ఉన్న నా చిన్న ఊరే నా ప్రపంచం అది నాకు చాలు అనేది.

ఒకరోజు అర్ధరాత్రి కిందింటి వారిని నిద్రలేపి హాస్పిటల్ కు తొందరగా తీసుకెళ్ళమని అడగడం, మెల్లగా వాలిపోపడం జరిగాయి. అప్పటికే తనకు గుండెపోటు రావడం. తాను రిటైరైన హాస్పిటల్ లోనే తుది శ్వాస వదలడం జరిగిపోయాయి.

ఇద్దరికీ వెళ్ళిపోడాానికి ఎందుకంత అర్జంటట!!

బహుశా, ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేసి ఊళ్ళో, మిత్రులు, బంధువుల దగ్గర మంచి పేరు సంపాదించి చివరకు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టలేదేమో!!

“అర్థాంతర ప్రయాణాలు!” కి 13 స్పందనలు

 1. You have narrated your past so well. I really felt happy and sorrow for the moments you brought in. I am one of the witness for the last statement… remembering peddamma on 25 th July2009 the day before I left NZ.
  You just nailed it. Simply super. I don’t know what else to say… 👌

 2. కథ చాలా బావుంది. చిన్నతనంలో నాన్న అంటే గౌరవం వున్నా ఒక బెరుకు ఉంటుంది. మనం పెద్ద అయ్యే కొద్దీ అది స్నేహంగా మారుతుంది. అదొక అద్భుతమైన అనుభూతి. ఆ పాయింట్ చాలా బాగా టచ్ చేశారు కథలో.

  1. True Bala. Ravikanth put it very nice. It reflects his pain too. Why did they leave so early. Only answer I could think, GOD need such good people there to keep it heavenly.

  2. ధన్యవాదాలు బాలా గారు.. ప్రతి ఒక్కరికీ నాన్న ఓ హీరో.. అంతే 👍

 3. “ ఇద్దరికీ వెళ్ళిపోడాానికి ఎందుకంత అర్జంటట” …. even i am also in need of answer to this question… good one!

   1. agree with you..

  1. ఇది చాలా జటిలమైన ప్రశ్నించి.. అది తెలిస్తే మానవుడు మహనీయుడౌతాడు 🙏

 4. Katha lighter vein lo modal petti, paatakunni lopalaki teeskellina paddhati baagundi

  1. thankyou RamK garu.. mee analysis bagundi 👍🙏

 5. thankyou prasad. u posted some very touching comments which brought back memories. 🙏

 6. ప్రయాణం స్వగతం అయినప్పుడు… జ్ఞాపకాల దొంతర పరచుకుంటుంది. అలసిన మనసుకు సొలసిన కనులే సాంత్వన…. నీది నాదీ ఒకటే కథ కాకపోవచ్చు కానీ… భావోద్వేగానికి కావల్సినంత చోటుంది. అమ్మానాన్నలను కథా వస్తువు గా తీసుకుంటే ఇక కథనం పరుగులు పెట్టాల్సిందే….

  1. నీ వ్యాఖ్యల్లో తీయని తెలుగుదనం నిండిపోయింది. కృతజ్ఞతలు భూపతీ.. 🙏

Leave a Reply