Apple PodcastsSpotifyGoogle Podcasts

నేనెక్కాల్సిన బస్సు!

“అమ్మా ! ఎందుకమ్మా! ఎన్ని సార్లు నాన్న చెయ్యెత్తినా ఏ బస్సూ ఆగట్లేదు” ?

మిట్ట మధ్యాహ్నం పన్నెడున్నర, ఎండాకాలం. హైవే పక్కనే నిల్చొని వున్నాం నేను అమ్మా నాన్న.

“ఇంక ఆగలేనమ్మా ఇంటికి పోదాం !, ఇంటికి పొయ్యి రాజయ్య తో ఆడుకుంటా!”

“లేదు చిన్నా! నీకు ఒంట్లో బాగ లేదు కదా, నెల్లూరు పొయ్యేసి డాక్టర్ దగ్గర మందు తెచ్చుకుందాం. నెల్లూళ్ళో బొమ్మల పుస్తకం కూడా కొనిస్తా ! బస్సొచ్చే లోపల, అక్కడ పొయ్యే గూడ్స్ రైలు కి ఎన్ని పెట్టెలో లెక్క పెట్టి చెప్పు, అమ్మకి”

అది ఇంటికెళ్లి పోదాం అనే నా గోల భరించలేక, మా అమ్మ మాయ చెయ్యడానికి, ఉపయోగించిన మంత్రం అని తెలియని నేను, నీరసం లో కూడా ఉత్సాహం తెచ్చుకొని, “ఒకటి, రెండు, మూడు …” అంటూ లెక్క పెట్టుకు పోతున్న.

కొంత సేపు అయ్యాక చెప్పా, “అమ్మ ఏభై ఆఱు!”

“కాదు నాన్నా! ఏభై ఎనిమిది! ముందు ఈ మంచినీళ్లు తాగు, పెదాలు ఎండి పోతున్నాయి నీకు”

మంచి నీళ్లు తాగి చెప్పా నేను, “ఓహ్! నేను ఇంజను, గార్డు పెట్టె కలపలేదమ్మా!”

ఎదురుంగా, దూరం నించి ఓ ఎర్ర బస్సు వస్తా వుంది.

“ఈ రెండు వేళ్ళల్లో ఒకటి పట్టుకో చిన్నా !” అనిందమ్మ.

నేను పట్టుకున్నా ఒక వేలు.

మళ్ళీ మా నాన్న చెయ్యి ఎత్తటం, ఆ బస్సు ఆగకుండానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవటం.

నా మొహం లో నిరాశ చూసి చెప్పింది అమ్మ, “ఈ సారి బస్సు ఆగుతుందనే వేలు పట్టుకో చిన్నా! ” అని.

మా అమ్మ భుజం మీద తల వాల్చా!

నన్ను అలా తలవాల్చనీయ కుండా వుంచాలని మా అమ్మ ప్రయత్నం.

” చిన్నా! దాహమైతా ఉందా, మళ్లీ నీళ్లు కాసిన్ని తాగతావా!”

“లేదమ్మా! అస్సలకి లేదు, గొంతంతా బాగా నొప్పి గూడ !”

ఓ అర నిముషం ఆగి చెప్పిందమ్మ!

“ఈసారి వేరే ఆట ఆడదాం చిన్నా ! కళ్ళు మూసుకొని, ఏ లారీ పొయ్యినా, ఏ కంపెనీ దో చెప్తావ్ కదా!”

అమ్మ ఆ మాట అనంగానే కళ్ళు మూసుకున్నా చప్పున!

“ఇప్పుడు పొయ్యే లారీ ప్రీమియర్, పేరు పలక లేక నాన్న దాన్ని రాకెట్ అంటాడుగా, దాని తర్వాత వస్తా ఉండేది లేలాండు బండి, ఆ తర్వాత టాటా వాళ్ళది…”, ఇట్టా చెబుతూ పోతూనే వున్నా, ఒక దాని తర్వాత ఒకటి ఆపకుండా.

ఇంకో పక్క, మా నాన్న అలసి పోకుండా పాపం, చెయ్యెత్తి దించీ కుస్తీలు పడతానే వున్నారు.

ఎందుకో గానీ ఏ బస్సు ఆగట్లా, మా కోసం. ఎండ మండిపోతావుంది.

“భలే రా చిన్నా! అన్నీ కరెక్ట్ గా చెప్పేస్తున్నావు అంది ” అమ్మ నా తల మీద చెయ్యేసి.

“అమ్మా! నీకు తెలుసా? నేను లారీలే గాదు. బైకుల పేర్లు గూడా చెప్తా కళ్ళు మూస్కోని, బులెట్, జావా, రాజదూత్ అన్నీ ‘“

అప్పటికి గంట అయ్యిందేమో నాన్న అమ్మలతో, నెల్లూరు వెళ్లే ఎర్ర బస్సు కోసం, మా వూరికి ఉత్తరాన కూసింత వేటు దూరం లో వుండే నేషనల్ హైవే మీదికొచ్చి.

నేనేసుకున్న రబ్బరు చెప్పులు గూడ కాల్తా వున్నాయి.

నాన్న పాపం రోడ్డు మీద నిలబడి చేతులెత్తుతూనే వున్నాడు.

చూసి చూసి, నన్ను తీస్కొని అమ్మ రోడ్డు పక్కనుండే, కర్ర తుమ్మ నీడ లో కూర్చోబెట్టింది. తాను గూడ రోడ్డు మీద కళ్లంతా బెట్టి, అప్పుడప్పుడూ నన్ను సముదాయిస్తూ నా పక్కనే అట్టానే నిల్చోని వుంది.

మా వూరినించి, నెల్లూరుకో లేక రాజు పాళేనికో వెళ్లాల్సొచ్చినప్పుడు. ఇట్టా ఆపకుండా వెళ్ళిపొయ్యే ఎర్ర బస్సులతో పడిగాపులు కొత్త కాదు, మాకు .

దూరాన్నించి ఎవరో ఒకాయన ఎర్ర బట్టలతో నడిచొస్తున్నాడు. దగ్గరకి రాంగానే నాన్న చూసి ఆగి పొయ్యాడు. మా ఊరి పూజారి ఆయన.

“సుందరయ్యా ! వేళ కానీ వేళలో పిల్లగాడి నేసుకొని ఎందాక ప్రయాణం”

“నెల్లూరి దాకా అయ్యోరా! పిల్లగాడికి నిన్నటి నుండి గొంతు లో చిన్న పుండు అయ్యున్నాది. వాళ్ళమ్మ నిన్నటి నుండి ఒకటే సతాయింపు, డాక్టర్ దగ్గరకి తీసు కెల్దామని. మాటలా? అప్పటికప్పుడు నెల్లూరు బోవాలంటే., ఎదో నాలుగు డబ్బులు సర్దుబాటు చేసుకొని బయలుదేరే సరికి ఈ వేళ అయ్యింది” అని మా నాన్న సాధక బాధలు చెప్పటం మొదలెట్టేసాడు.

నన్ను ఓసారి తేరిపార చూసాడు మా పూజారి గారు. మేము కూర్చోనున్న చెట్టుని గూడ ఒక పారి చూసి, ఆయన చేతి కుండే , బ్రిటిష్ కాలం వాచీ లో టైం చూస్కోని చెప్పాడు, గబ గబా.

“సుందరయ్య! ఇక్కడ యమ గండ ముందయ్యా! పిల్లోడు ని చూస్తే గుడ్లు తేలేస్తున్నాడు! ముందు ఇక్కడ నుండి వెళ్లిపోండి! కావాలంటే ఎగువు కి వెళ్లి ఆ నేరేడు చెట్ల దగ్గర కూర్చోండి. ఇక్కడ ఒక్క క్షణం గూడ ఉండొద్దు. అక్కడ నుండి అల్లూరు మీద వెళ్లే బస్సు పట్టుకొని, నెల్లూరి కి వెళ్ళండి” అని చెప్పాడు.

మా నాన్నా, అమ్మా, మొహ మొహాలు చూసుకున్నారు. మా అమ్మ ఆరోజుల్లోనే హేతువాది, ఓ పెద్ద కమ్యూనిస్టు గారి పుత్రిక. ఆమేమో కదలనంటోంది.

పూజారి గారి మీద విపరీతమైన గురుండే , మా నాన్నేమో కళ్ళతోనే బతిమాలాడ్తున్నాడు అమ్మని.

మా పూజారి గారు మేము కదిలే దాకా అక్కడ్నించి పొయ్యేటట్టు కనపళ్ళా .

ఇంకో పక్క ఒక అర కిలో మీటరు దూరంలో వుంది, పూజారి గారు చెప్పిన నేరేడు చెట్టు.

ఏమనుకుందో ఏమో అమ్మ, అక్కడ్నించి కదిలింది.

మేము అక్కడ నుంచి, ఒక ఫర్లాన్గ్ నడిచేదాకా, అక్కడే ఉండి చూసి, పూజారి గారు చక్కా ఊర్లోకి వెళ్లి పోయారు.

ఇంత ఎండలో, వొంట్లో బాలేని బిడ్డనేసుకొని, అటూ ఇటూ ఈ తిరుగుళ్ళు ఏందో అని సణుక్కుంటూ అమ్మ, నన్ను చంక నేసుకొని నాన్న వడి వడి గా నడుస్తున్నారు.

ఓ పది నిముషాల నడక తర్వాత చేరుకున్నాం మా అయ్యోరు చెప్పిన నేరేడు చెట్టు కిందకి.

ఇంకో అరగంట అయ్యాక ఆగింది, ఓ ఎర్ర బస్సు మా ముందర, మమ్మల్ని ఎక్కిచ్చుకోడానికి.

వెనకాల సీట్లు ఖాళీగున్నాయి.

బస్సు పైన కమ్మీ పట్టుకొని, నన్ను పట్టుకొని సీట్లో గూర్చోడానికి కెళ్తున్నారు, అమ్మ నాన్న.

సడన్ బ్రేక్ వేసాడు మా బస్సు డ్రైవర్.

బస్సు ఆపింది మేము ఇంతకుముందు నిలబడ్డ చోటు, కరెక్ట్ గా, అదే ప్లేసు.

మా అమ్మ, మా నాయన కేసి కోపం గా చూస్తా వుంది, చూసావా అనవసరం గా ఇంత దూరం ఆ పూజారి మాట విని, నడిపిచ్చు కొచ్చావు అన్నట్టు.

బస్సులోకి ఎవరూ ఎక్కలా .

కండక్టరు కిందికి దిగాడు. ఆయనతోబాటూ ఓ ఇద్దరు ముగ్గురు పాసెంజర్లు హడావుడిగా.

నాన్న కిటికీలోంచి ఒంగి , రోడ్డు మీదకి చూస్తే, క్రింద ఒక చిన్న గుంపు.

గుంపు మధ్యలో పడున్నాడు ఓ పాతికేళ్ల మనిషి, రక్తపు మడుగులో.

నాన్న కిందికి దిగబోతే, అమ్మ ఆపేసింది.

ఒక పదినిముషాల తర్వాత కండక్టరు బస్సుల్లోకెక్కుతూ చెప్పాడు, మేము కింద కూర్చున్న తుమ్మచెట్టు ని చూపిస్తూ, “ఓ పది నిముషాల క్రితం వచ్చి కూర్చున్నాడట పాపం నీడ ఉందని చెప్పి అతను, లారీ అదుపుతప్పి మీదికి ఎక్కేసింది. ప్రాణం అక్కడికక్కడే పొయ్యింది.” అని.

ఈ సంఘటన జరిగిన పదిహేనేళ్ళకి నాకు గుర్తు చేసింది అమ్మ ఆ రోజు జరిగిందంతా.

అడిగా నేను తమాషాగా, “ఇంత జరిగినా, ఇన్నేళ్ల తర్వాత గూడ, చెయ్యెత్తి, ఒక్క దణ్ణం గూడా పెట్టవు గదే అమ్మా” అని.

నా తల మీద మొట్టికాయేసి చెప్పింది.

“నేను నీ పక్కనుంటే నీకేం అవుతుంది రా. అయినా నీకు మంచి జరుగుద్ది అంటే దయ్యాలకైనా దండలేయడానికి రెడీ ” అని మా నాన్న కి వినపడకుండా.

“నేనెక్కాల్సిన బస్సు!” కి 12 స్పందనలు

 1. Interesting one. Beliefs, coincidenses commonly seen even now..

  1. It is a true story Rama. My mom being rational can not explain it.

 2. Chilukuri Venkata Subbarao Avatar
  Chilukuri Venkata Subbarao

  Konni enduku jarugutayo telisi but end result will be good like in this case

 3. The story of this incident is well written. Nenu vundaga naa koduku ki emi kaadu ane amma confident super

  1. Yes Prasanna. they will not let anything happen to their wards

 4. Nicely narrated story, such incidents do happen. It reminds me the saying ‘ sivagne lenidhe ceemaina kuttadu’.

 5. “Maatru devO bhava” entha hethuvaadi ayinaaaa aavide Devatha. Mimmalni kaapaaadukovaaalane sankalpaaaaniki Poojari, Erra Bus oka saadhanaaalu maatrame. Lorryla perlu cheppdam, Goods bhogi lu lekka pettadam, aaavida lorry perlu bagaa cheputunnaavu ante , nenu bikes perlu kuudaaa cheppagalanu ani antha neerasam lo kuudaaa Meeru cheppukovadam….. thalli pillaadi avyaajamaina premaanu ragaaalaki prateeka. Excellent narration took me back to 40+ years . 👌👌👍👍👏👏💕💕

  1. All are true incidents and true conversations..more over mom used to tell a story based on the context..say for example when I say I can recognise some thing based on sounds..she used to tell a story some thing like sabdabhedi..may be a story about Dasaratha and Sravana kumarudu..my mom is a true contextual master…

Leave a Reply