మా గిరిజక్క పిచ్చి చిట్టాలు!

“మా నాయన పేరు మీ పేరు ఒకటే,  సుందర రామయ్య, అందుకే నిన్ను ఇక నుండి నాయనా అనే పిలుస్తాను” అంది మా పక్కింటి  గిరిజక్క, మా నాన్నతో. 

“సరేనమ్మా  నువ్వు ఆర్డర్ వేసింతర్వాత, కాదనే ధైర్యం ఎవరికీ ఉందమ్మా” అన్నారు నాన్న. 

మా నాన్న, కాట్రాక్టింగ్ పార్టనర్ అయిన గోవింద రెడ్డి అంకుల్  భార్య  గిరిజక్క.  ‘చండశాసన గండర గండి’ మాటల్లో మటుకు. 

“ఏమే! మాధవీ, వాసవీ,  ఇకనుంచీ, మా నాయిన్ని  మీరు తాత అనే పిలవాలి, అర్థ మయ్యిందా” అంది తన కూతుళ్ళ వైపు.  

వాళ్లిద్దరూ అయోమయంగా మొహం పెట్టారు, ఈయన్ని తాతా అని పిలవడం ఏంది?  అనిచెప్పి. 

ఈ సంభాషణంతా  మేము నెల్లూరు సంత పేటలో వాళ్ళ ఇంటి పక్కన చేరిన కొత్తల్లో. 

మాధవక్క, వాసవక్క  మా గిరిజక్క సంతానం.  ముగ్గుర్నీ అక్కా!  అనే పిలిచే వాణ్ని.

నేను ఎనిమిదో క్లాసు లో ఉంటే,  వాసవక్క బీ.ఎస్.సి ఫస్ట్ ఇయర్, మాధవక్క బీ.జెడ్.సి  ఫైనల్ ఇయర్ లో వుండే వారు. 

మా గిరిజక్క వాళ్ళ నాన్న గారు డీ.ఎస్.పీ గా పనిచేశారు. 

పైకి డీస్పీ గారి వారసత్వ  వేషం గంభీరం గా వేసినా , లోపలంతా పసిపిల్ల మనస్తత్వం మా గిరిజక్కది. 

గోవిందరెడ్డి అంకుల్ వుద్యోగం విజయవాడ, రెండు వారాలకోసారి ఆయన దర్శనం. ఇంట్లో వున్నా ఆయన వాయిస్,  పెద్ద బయటికి   వినిపించేది కాదు. 

ఒక వేళ వినిపించినా ఎదో ఆయన ముచ్చటపడి తీసుకెళ్లిన “36 ఛాంబర్ అఫ్ షావోలిన్” లాటి ఇంగ్లీష్ సినిమాలు,  మాకు తెలుగులో తర్జుమా చేసి చెప్పినప్పుడే. 

మా గిరిజక్క కి  సినిమాలు అంటే చాలా పిచ్చి. 

కొత్త సినిమా వచ్చిందంటే, మా గిరిజక్క    తన అనుంగు స్నేహితురాలు మాయాదేవి తో  కలిసి,  పట్టు చీరలు కట్టి  మరీ నేల లేక బెంచీ టిక్కెట్టులో  తేలేవారు. 

తనకున్న ఏకైక స్నేహితురాలు మాయాదేవి. 

మీరు ‘కుర్చీ’ టిక్కెట్టు కొనుక్కుని అక్కడ కూర్చోవచ్చుగా  అని  గిరిజక్కని అడిగితే,  ,

 “మాయ,  అంత డబ్బులు దగ్గర పెట్టుకొని రాలేదురా ” అనేది మా గిరిజక్క. 

ఆ మాయా దేవి ఎక్కడ్నుంచి సృష్టించేదో  గానీ,  పెద్ద పెద్ద రోల్స్ లో పాలిథీన్ షీట్స్ పట్టుకొచ్చేది. 

 వాటిల్ని కవర్లు గా మారిస్తే, షాపులకిస్తే, వంద బాగుల కు ఒక  రూపాయ  ఇచ్చేవాళ్ళు.  

వాళ్ళ స్నేహితురాలికి సహాయంగా ఉంటుంది అని చెప్పి,  ఆ షీట్లు కవర్లుగా మార్చే హోమ్ వర్క్,  మా పిల్లలందరికీ ఇచ్చేది గిరిజక్క. 

ఆ యాతన తప్పిచ్చుకోడానికి, నానా కష్టాలు పడే వాళ్ళం మేమంతా. 

ఇప్పుడు అసలు విషయం లోకి వద్దాం !

మా గిరిజక్కకి ,  రోజువారీ పనులు  ఏ క్రమం లో జరగాలో,  తన చేత్తో , లిస్ట్ రాయనిదే నిద్ర పట్టేది కాదు. 

ఆ పనులు అదే క్రమంలో జరగాలి. 

ఎవ్వరూ నోరెత్తకూడదు ఈ విషయంలో. 

వాళ్ళ పనాయనకి, నీళ్లు చల్లి ఇస్త్రీ చేయాలి అనే బదులు, ఇస్త్రీ చేసి నీళ్లు చల్లాలి అని రాసిందంటే, అది అట్టా జరగాల్సిందే.  

మా గిరిజక్క చేతిరాత డీకోడ్ చెయ్యగలిగింది,  వాళ్ళ పని వాళ్ళు తప్పితే,  ఈ  భూ ప్రపంచం లో ఇంకెవ్వరూ  ఉండరని నా నమ్మకం. 

నేను డీకోడ్ చేయబోయి చాలా సార్లు ఫెయిల్ అయ్యా. 

గిరిజక్క చిన్న కూతురు,  వాసవక్క  మా  గ్యాంగ్ లీడర్.

 ఆమె చదువులో  బ్రిలియంట్. లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ లలో ఆవిడ దిట్ట. 

ఏ డౌట్లు  వచ్చినా వాసవక్కే  దిక్కు  మా  పిల్లలందరికీ. 

మమ్మల్ని వెంటేసుకొని , సినిమాలకీ షికార్లకీ ఒక పిల్లల కోడి లా బయలుదేరేది వాసవక్క. అసలు రేపు పరీక్ష అనగా ఈ రోజు ఫస్ట్ షో చూడటం కూడా ఆమె అలవాటు చేసిందే. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఆమెను చూసి మేము అనుకరించి బొక్క బోర్లా పడ్డ సందర్భాలు ఎన్నో. 

మా గిరిజక్క నిరంకుశత్వాన్ని  ఎదిరించి ఎదిరించీ,  మా వాసవక్క ఒక రెబెల్ స్టార్ అయిపోయిందని నా నమ్మకం. 

అలాంటి వాసవక్క గూడ,  వాళ్ళమ్మ  దగ్గరుండే ఒక చిట్టాకి మటుకు భయపడేది. 

ఆరు నెలలకి ఒక సారి గిరిజక్కా వాళ్ళ   ఇంట్లో,  వెండి బంగారు వస్తువుల  ఆడిట్ జరిగేది. 

ఈ వస్తువుల చెకింగుకి ఒక పెద్ద లిస్ట్ ఉండేది గిరిజక్క దగ్గర. 

ఆ ఆడిట్ కి మా వాసవక్క ఒక నెల రోజుల ముందే ప్రిపేర్ అయ్యేది, తను గానీ, మాధవక్కగానీ ఏవన్నా వస్తువులు పోంగొట్టుంటే.

మిస్ అయిన ఐటెం, నెల్లూళ్లో  వున్న అన్ని  బంగారు వెండి  అంగళ్ళకు తిరిగి తిరిగీ, అక్కడ తెచ్చి పెట్టేసేది వాసవక్క. 

మా మాధవక్క మెడిసిను చదివే, రోజుల్లో ఒక డైమండ్ రింగు పోంగొట్టింది. ఇక చూడాల మావాసవక్క తిప్పలు. ఎదో చిన్న రింగో , గింగో  అయితే మేనేజ్ చెయ్యొచ్చు. పొయ్యింది డైమండు రింగు. 

ఎట్టాగైతేనేమి, అలాగేవుండే అమెరికన్ డైమండ్రింగు ఒకటి  పట్టుకొని వచ్చింది వాసవక్క.

ఆడిట్ రోజు రానే వచ్చింది. మా గిరిజక్క పక్కనే  ఆమె  చెల్లెలు గారు  గూడ ఆడిట్లో.

అన్నీఅయింతర్వాత , ఇంట్లో వుండే ఉంగరాల లెక్క మొదలయ్యింది. చిట్టా ప్రకారం మొత్తం పన్నెండు ఉండాలి.

ఒకటి , రెండు…. చిన్నగా పన్నెండు , అమెరికన్ డైమండ్ ఉంగరం పన్నెండోది అనిచెప్పి లెక్క పెట్టేసింది వాసవక్క. 

పక్కనుండే , గిరిజక్క చెల్లెలు ఏమో , “ అది డైమండు రింగు లాగ లేదే గిరిజా” అంటుంది. 

నీ మొహం మా ఇంట్లో వస్తువులు ఎట్టా మారి పోతాయ్ . సరిగ్గా చూడవే అంటుంది గిరిజక్క. 

ఆ విధంగా ఆ నెల ఆడిట్ సుఖాంతం అవడంతో ఊపిరి పీల్చుకుంది వాసవక్క. 

అలాగే మా గిరిజక్క   దగ్గర రోజువారీ ఉపవాసాలగ్గూడా ,  ఒక లిస్ట్ ఉండేది. 

సోమవారం శివుడు, మంగళ వారం ఆంజనేయుడు, గురువారం సాయిబాబా, శుక్ర వారం లక్ష్మి దేవి, శని వారం వెంకన్న. ఒక్క ఆదివారం అనుకుంటా పోనీలే దేవుళ్ళకు ఆ రోజు సెలవిద్దాం అనుకునేది.

 ఉపవాసం అంటే గిరిజక్క  ఏం  తినకుండా ఉంటుంది,  అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. 

హాయిగా, దర్జాగా మా వాసవక్క, దోసెలో, వడలో, వాటిల్లోకి రక రకాల చట్నీలు, పొళ్లు  చేసిస్తే దర్జాగా ఉపవాసం ముగించేది మా గిరిజక్క. 

ఈ మధ్య , నేను హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాక,  గిరిజక్క  మా ఇంటికొచ్చి, అప్పుడప్పుడూ,  ఓ రెండు మూడు రోజులు గడిపి  వెళ్ళేది. 

ఆ రెండు మూడు రోజులు దర్జాగా ఉండేది,  మా అమ్మ దగ్గర,  సుప్రియా దగ్గర.  

వున్నప్పుడంతా,  “చక్కటి పిల్లమ్మా!”   అంటూ సుప్రియాకి ఎన్నో కితాబులు. 

తాను వెళ్లి పోయాక , మంచం దిండు కింద చూస్తే మటుకు,  ఒక లిస్టు  ఉండేది, తనకి ఆ రెండు రోజులు ఏమీ బాగా జరగ లేదో అనిచెప్పి,  కంటిన్యూయస్ ఇంఫ్రూమెంట్ ఫిలాసఫీ లాగా. 

చెప్పడం మర్చిపోయా, ఈ అన్ని లిస్టులల్లో స్పెషల్, మా గిరిజక్క  ‘ తండ’ లిస్టు.

తండల వ్యాపారం చేసేది గిరిజక్క.

చుట్టూ పక్కల చిరు వ్యాపారులకు , డైలీ బేసిస్ మీద వడ్డీకి ఇవ్వటమే తండల వ్యాపారం. 

వీళ్ళతో పాటూ,  చుట్టుపక్కల డబ్బులకి ఎవరికి ఏమి ఇబ్బందున్నా, గిరిజక్క దగ్గరికే వచ్చేవాళ్ళు. 

“గిరిజమ్మా !  ఈ సారి ఇంకో , వెయ్యి ఇయ్యమ్మా!  ఈ దెబ్బతో నీ ముందు బాకీ,  దాని మీద వడ్డీ కట్టేస్తాం” అని ప్రతీ సారీ,  ఓ వెయ్యి, రెండు వేలు పట్టకెళ్ళేవాళ్ళు. 

మా గిరిజక్క,  ఈ లెక్కలన్నీ చిత్ర గుప్తుడి చిట్టా లాగ రాసి పెట్టుకొని మరీ ఇచ్చేది. 

నేనైతే ఎప్పుడూ  చూళ్ళా ! ఒక్క రూపాయైనా ఆమెకి తిరిగి రావటం, “ ఈసారికిస్తే ముందువి గూడా  వడ్డీ తో కలిపి కట్టేస్తాం”  అనే వాళ్ళ మాటలు తప్ప. 

ఈ విషయంలో మటుకు, మా గిరిజక్క,  రాసిన చీటీ,  మళ్ళీ బయటకి తీసి చూస్కోడం, లెక్కలేసుకోడం ,  మేమెవ్వరం చూళ్ళా. 

ఈ లిస్టులో వేసుకునే అంకెలు, ఆమె పెద్ద మనసుకి కనపడనంత చిన్నవేమో !, అర్థం అయ్యేది కాదు. 

ఇవన్నీ, ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాయంటే, ఈ రోజు  మా గిరిజక్క, పెద్ద కర్మ దినం. 

కరోనా రెస్ట్రిక్షన్సు  వలన,  వెళ్ళ కూడదు అనుకుంటూనే వెళ్ళకుండా ఉండలేక పోయా.

వొచ్చేసేటప్పుడు కల్సింది వాసవక్క. 

“మనం ఈ  లిస్టుల గురించి తెగ ఆలోచించేసి,   చాలా కష్టాలు పడ్డాం కిరణూ! మా ఆయన మాకు పెళ్లి అయిన కొత్తల్లో తెగ మురిసిపోయాడు,  అమ్మ రాసే లిస్టులు చూసి, ఏమి రాస్తిరి , ఏమి రాస్తిరి “ అనుకుంటూ. కానీ ఆ లిస్టులో రాసిన పనులు జరక్క పొయ్యినప్పుడు అమ్మ తీరుచూసింతర్వాత, అవి రాయంగానే,  కనపడకుండా దాచేసేవాడు”   అంది పెదవి మీద చిరునవ్వుతో, కళ్ళల్లో నీళ్లతో, మా వాసవక్క.

 • Bavundi kadha, kaani ilaanti girijakkalu rare ga vuntaaru . Kadha chaduvutunte interesting ga vundi. Kaani chivara thanu ledu ippudu ani badha ga anipinchindi.

 • Chala hrudyam gaa undi sanghatanala samaahaaram. Kadha anukovaaali anipinchaledu. Chalaaa kutumbaallo unna Girija akkalu gurthuku vastaaranadam athishayokthi kaaadu 👏👏👌👌👍

 • Abbay kiranu nuv Ela chala years taruvata kuda Ela ne life lo jarigina incidents inka manushulani gurtucheskovadam chala muchataga vundi nijamga memories chala important kada chala baga anipinchindi Mamaya

 • చిన్న కధ అయినా, ఎంతో ఉత్సుకత తో చదివించింది. కథలోని పాత్రలన్నీ రోజూ మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు గుర్తు చేస్తూ, సహజంగా చిత్రీకరించబడ్డాయి. ముగింపు భారంగా అనిపించింది. రచయిత కు అభినందనలు.

 • అతిధి దర్శనాలు

  అధ్యాయాలు

  హర్షణీయం సభ్యత్వం కొరకు మీ ఈమెయిల్.

  ధన్యవాదములు

  >