Apple PodcastsSpotifyGoogle Podcasts

మా ఐ.టి వాళ్ళు కొండను తవ్వారు, ఎలుకను పట్టారు!

“ఎవరక్కడా!” అని కోపంగా అరిచాడు మహారాజు

“తమరి ఆజ్ఞ మహారాజా” అంటూ గజ గజలాడుతూ వచ్చాడు, అంతరంగ రక్షకుడు అయిన భద్రుడు.

“నా రాజ్యం లో, నా రాకుమారుడి కి భోజనం లో ఎండు చేప అందలేదు. మేము దీన్ని ఎంత మాత్రమూ సహింప జాలము. నా దృష్టిలో ఇది ఒక అత్యయిక ఘటన. వెంటనే మన సర్వ సైన్యాధ్యక్షుల వారైన రామానుజాన్నీ మూలకారణాన్ని శోధించి, నివారణోపాయాన్ని పంపమనండి”

“చిత్తం మహారాజా” అంటూ అక్కడనుండి నిష్క్రమించి, సర్వ సైన్యాధ్యక్షుల వారి భవనానికి వచ్చి రామానుజాన్ని నిద్ర లేపాడు భద్రుడు.

“ఏమయ్యింది రా! భద్రా” అన్నాడు రామానుజం కళ్ళు నలుపుకుంటూ, ఆవులిస్తూ.

“మన రాజ్యం లో ఓ అత్యయిక ఘటన జరిగింది, అందుకే సర్వసైన్యాధ్యక్షునిగా మిమ్మల్ని బాధ్యత వహించి, మూలకారణాన్ని శోధించి, నివారణోపాయాన్ని పంపమన్నారు, మహారాజులం గారు” అన్నాడు భద్రుడు.

“రాజు గారి ఒక్క కొడుక్కి దొరకలేదా ఎండు చేప లేక ఆయన గారికి మరియు తక్కిన ఆరుగురు కొడుకులక్కూడానా ” అడిగాడు రామానుజం.

“లేదండి, ఒక్కరికే అందలేదు అని అన్నారండి రాజు గారు”

“నిన్న అందిన ఎండు చేప, మొన్న అందిన ఎండు చేప ఈ రోజు ఎందుకు అందలేదబ్బా” ఆశ్చర్యపోయారు రామానుజం.

“అయినా ఏడుగురిలో ఒకరికి అందక పోతే అది మన సేవా ధర్మ ప్రకరణ ప్రకారం ఒకటో అంకె లోపం కాకూడదదే” అనుకుంటూ, భద్రా! వెంటనే మన దండనాయకుల వారిని ప్రవేశ పెట్టుము అని ఆజ్ఞ జారీ చేసాడు.

ఐదు నిముషాల్లో, దండనాయకులయిన సీతారాం వేం చేసేసారు, “అలా ఒకటో అంకె సేవా లోపం అని మహారాజా వారు ఎలా నిర్ణయిస్తారు? ఇలా అయితే రేపు బంగాళా దుంపల వేపుడు అందలేదనో, మధువు దొరకలేదనో, ధూమపాన గొట్టం బాగా లేదనో, పాదరక్షలు ఇంపుగా లేవనో, వంటికి రాసుకునే అత్తరు బాగాలేదనో ప్రతీ దానికీ ఒకటో అంకె సేవా లోపం అంటారు భవిష్యత్తులో. ప్రాణాలకు ప్రమాదం సంభవిచినప్పుడు తొమ్మిది ఒకటీ ఒకటీ సేవల్లో లోపం వస్తే గోల చేయాలి గానీ ఇలా ప్రతీ అడ్డమైన దానికీ ఒకటో అంకె సేవా లోపం అంటే ఎలా” అని రుస రుస లాడిపోయాడు.

“ముందు ఒకటో అంకె లోపం గా తీర్మానం చేయి సీతారాం, తర్వాత రెండో లేక మూడో అంకె లోపం గా చేద్దాము” అన్నాడు విసుగ్గా రామానుజం.

ఇద్దరు కలిసి ఒకటో అంకె సేవా లోప పరిస్థిని తెలియజెప్పే గంట మోగించారు. వెంటనే దళ నాయకులూ రంగం లోకి దిగారు. లెక్క ప్రకారం ప్రభావితం అయ్యింది ఏకాకి, అయినా రాజు యొక్క కుటుంబ సభ్యుడు కాబట్టి ఇది ఒకటో అంకె లోపం అని నిర్ధారించుకున్నారు.

ముందు ఆ రాజుగారి కొడుక్కి రామానుజం గారి కుక్క పిల్ల కోసం నిల్వ చేయబడ్డ ఎండు చేప ముక్కని పంపారు వండుకు తినమని, ఆ తర్వాత మూలకారణాన్ని శోధన మొదలెట్టారు

అసలేమీ జరిగింది:

రాజు గారికి ఏడుగురు కుమారులు. ఆ కుమారులు ఒక రోజు వేటకి వెళ్లి ఏడూ చేపలు తెచ్చారు. వాటిల్ని ఎండ బెట్టారు. అన్నీ చేపలు ఎండాయి కానీ ఒక చేప ఎండలేదు.

సమస్యేమిటి:

ఆరు చేపలు ఎండాయి. ఒక చేప మాత్రం ఎండ లేదు.

ఒకటవ ఎందుకు: చేప ఎందుకు ఎండ లేదు?

సమాధానం: గడ్డి మోపు అడ్డం వచ్చింది.

రెండవ ఎందుకు: గడ్డి మోపు ఎందుకు అడ్డం వచ్చింది?

సమాధానం: ఆవు గడ్డి మోపును మేయలేదు.

మూడవ ఎందుకు: ఆవు గడ్డి మోపును ఎందుకు మేయలేదు?

సమాధానం: అవ్వ ఆవును మేతకు విడవలేదు.

నాలుగవ ఎందుకు: అవ్వ ఆవును ఎందుకు మేతకు విడవలేదు?

సమాధానం: పిల్లవాడు ఉదయం నుండి ఒకటే ఏడుస్తున్నాడు కాబట్టి.

ఐదవ ఎందుకు: పిల్లవాడు ఉదయం నుండి ఎందుకు ఏడుస్తున్నాడు?

సమాధానం: పిల్లవాడిని ఉదయం చీమ కుట్టింది.

ఈ సమాధానం తో అందరూ ఆహా తెలిసెన్ జుమీ అని అరిచేసేసారు. అందరూ కూడబలుక్కుని మహారాజు కి ఈ క్రిందని సమాచారం పంపించేశారు.

“దైవ సమానులైన మహారాజ శ్రీవారి పాద పద్మములకు నమస్కరించి, మీ దళ, దండ, సర్వ సైన్యాధ్యక్షులు నమస్కరించి విన్నవించుకొను విన్నపము. తమరి ఆఖరి సుపుత్రుల భోజనంలో ఎండు చేప కరవైనదని విని మిక్కిలి దుఃఖపడినాము. ఇది చాల విచారింప దగ్గ విషయము. ఇది దురదృష్టవశాత్తు జరిగిన మానవ తప్పిదనమే కానీ మా సేవ భావం లో లోపము గా మీరు భావించరాదు. మేము ఈ విషయాన్ని కూలంకషం గా శోధించి, ఇక మన రాజ్యం లో చీమలని సమూలంగా గా నిర్మూలించాలని నిర్ణయించాము. కావున తమరు దయయుంచి తమ ఖజానా నుండి మాకు ఓ పదివేల బంగారు మోహరులను కేటాయించ వలసినిది”

Leave a Reply