‘పీవీ తో నేను’ – శ్రీరమణ గారి రచన ‘వెంకట సత్య స్టాలిన్’ నించి.

రచయిత పరిచయం:

తెలుగు వారు గర్వపడే కథలు రచించిన రచయితల మొదటి వరుసలో శ్రీ శ్రీరమణ గారు వుంటారు. ఇది గాక వారు తెలుగు ప్రసార మాధ్యమాలన్నిటిలోనూ గత యాభై ఏళ్లపైబడి విమర్శ, సమీక్ష, సంపాదకీయం లాంటి అనేక రంగాల్లో పని చేస్తూ ఎంతోమందికి మార్గదర్శకత్వం చేస్తున్నారు.

అతి సున్నితమైన హాస్యం తో రచనలు చేయడంలో ఆయన సిద్ధహస్తులు. తెలుగులో పేరడీ ప్రక్రియకు , ఒక గౌరవ ప్రదమైన సాహితీ స్థాయి కల్పించిన రచయిత గా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

ఆయన కథా రచన ‘మిధునం’ మలయాళం లో వాసుదేవన్ నాయర్ గారి దర్శకత్వంలో, తెలుగు లో భరణి గారి దర్శకత్వంలో సినిమా గా తీయడం జరిగింది.

హర్షణీయంలో ఈ విజయదశమి రోజున ఆయనతో ఇంటర్వ్యూ ప్రసారం అవుతుంది.

ఇంటర్వ్యూ కు , వారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ రమణ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.

ఇప్పుడు మీరు వినబోతున్న ఆడియో శ్రీ రమణ గారి సరికొత్త హాస్య రచనా సంకలనం ‘వెంకట సత్య స్టాలిన్’ లోని ఒక భాగం.

ఈ పుస్తకం మీరు డిజిటల్ ఎడిషన్ లేదా ప్రింటెడ్ ఎడిషన్ కొనడానికి, ఇదే వెబ్ పేజీ లో వివరాలు ఇవ్వబడ్డాయి.

ముందుగా వెంకట్ సత్య స్టాలిన్ గురించి, శ్రీరమణ గారి మాటల్లోనే ఓ రెండు ముక్కలు –

” ఇంతవరకు తెలుగు లిటరేచర్‌లో వచ్చిన అత్యుత్తమ హాస్యపాత్ర వెంకట సత్యస్టాలిన్! ఈ ముక్క ఎవరన్నారు?
– అప్పుడప్పుడు నాకే అనిపిస్తూ వుంటుంది.
ఇంత గొప్ప క్యారెక్టర్‌ని సినిమాలో పెట్టి తీరాల్సిందే!
– నిబిడాశ్చర్యంతో కొందరూ,
– ఆఁ, పెట్టి తీసిందేనని చప్పరిస్తూ యింకొందరూ,
అడయార్ మర్రిచెట్టుకి నాలుగంటే నాలుగే ఆకులు ఉండటం స్టాలిన్‌బాబుకి తెలుసు. కొంచెం ముదురు.
– ఇలా రకరకాలుగా చెప్పుకుంటారు. మీరు తప్పక ఓ కాపీ కొని చదవండి. ఈ బ్రహ్మపదార్థాన్ని మీకు తోచిన విధంగా అంచనా వేసుకోండి. అర్థం చేసుకోండి. అర్థంకాపోతే వెనకనించి ముందుకు చదవండి. తప్పక అవుతాడు. కాపోతే మళ్లీ మొదట్నించి…”

ఇలాంటి వెంకట సత్య స్టాలిన్ గారు మన పూర్వ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు గారి జీవితంలో , ఎలాంటి ముఖ్య పాత్ర వహించారు అనేది, ఆయన స్వగతం లోనే విందాం. స్టాలిన్ గారు తన పేరులోనే సత్యాన్ని ఇముడ్చుకోవడం ద్వారా , తన మాటల్లోనిజం ఎంత ఉందొ మనకు అన్యాపదేశంగా చెబుతున్నారని శ్రోతలందరూ గ్రహించ ప్రార్థన.

కథ :

అసలు అతని పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. మిత్రులంతా పీవీ అని పిలిచేవారు. నిజానికి అతనికి అలా పిలవడమే యిష్టం. 1971లో కాబోలు, అప్పుడతను రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోలు. ఇప్పటికంటే దాదాపు ముప్పె, ముప్పైనాలుగేళ్లు చిన్నవాడు. వయసుకి తగని ఉత్సాహంతో వుండేవాడు. కాని అప్పుడింత సెక్యూరిటీ గొడవా వుండేది కాదు. ఎక్కడికైనా వెళ్లాలంటే వెళ్లిపోవడమే. 


నేను హిమాయత్ నగర్ లో ఒక కారు షెడ్డులో వుండేవాణ్ణి. అన్నాడతను చాలాసార్లు, “మిత్రమా! నువ్వు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కి మకాం మార్చెయ్యి, నేను చెబుతా కదా” అని.- “నేనెందుకు ప్రభుత్వ క్వార్టర్స్ లో వుండాలి? అందుకు నాకున్న అర్హతేమిటి?” అని ప్రశ్నించుకునేవాణ్ణి. పీవీ మహామేధావి. “సత్యం! నాకు తెలుసు. నీ మనసులో ఏమాలోచిస్తున్నావో. నువ్వు యీ రాష్ట్రానికి చేస్తున్న సేవ. పైగా ఏ పదవీ ఆశించకుండా…” తర్వాత క్రమేపీ స్వరం గద్గదమై, సాంతం ఆగిపోయి పెదాలు మాత్రమే కదులుతున్నాయి. తెలియకుండానే నా కళ్లు చెమర్చాయి. అతను ఎదుటివారిలో వున్న ప్రతి చిన్న మంచిలక్షణాన్ని గమనించి గుర్తు పెట్టుకునేవాడు.

“రాసిపెట్టి వుండి నేను సిఎమ్ అయా, నువ్వు కాలేదు అంతే తేడా” అన్నాడు ఉర్దూలో మీర్జాగాలిబ్ మాటల్ని కోట్ చేస్తూ. అతనికి అదొక అలవాటు. 1954లో కాబోలు నేనతనికి గాలిబ్ గజల్స్ ని, కొన్ని కవితల్ని వినిపించాను. “సత్యం! నాకు ఆ కవి రచనలన్నీ కావాలి. రేపటికే” అన్నాడు. ఏం చెయ్యాలి? అప్పటికి కాపీలు తీసే యంత్రాలు లేవు. అప్పుడేముంది, అణా యిస్తే రెండు దస్తాల తావులు, సిరాబుడ్డి,పుల్లకలం- తీసుకుని కూచున్నాను.

‘చాయ్’ అని వినిపించింది. తలెత్తి చూద్దును కదా ఎదురుగుండా పీవీ. చేతిలో ప్లాస్కు! ఎప్పుడు తెల్లవారిందో తెలియదు. బొత్తి పెట్టి అయనకు యిచ్చాను. అతనిదొక విచిత్రమైన తత్వం. ఉన్నట్టుండి ఏదో సందేహం వచ్చేది. సత్యాన్వేషణ మొదలయ్యేది. ఒకసారి అలంకారశాస్త్రంలో ఒక సున్నితమైన అంశం పైన సందేహం వచ్చింది. అలాంటి సందర్భం వస్తే అతనికి వేళాపాళా లేదు, బిళ్లకండువా వేసుకుని బయలుదేరడమే.

విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలు మొదటిసారి యిద్దరం కలిసే చదివాం. తను పెద్దగా వుద్వేగపడినట్లు కనిపించలేదు. బాపిరాజు నారాయణరావు కూడా చదివాం. అందులో నారాయణరావు పాత్ర బాపిరాజే. వేయిపడగలలో ధర్మారావుపాత్ర విశ్వనాథ. పీవీ కొంచెం నిదానస్థుడు. ఒక వారం తర్వాత “వేయిపడగలు బావుంది, మళ్లీ చదివా” అన్నాడు. ఆరునెలలు గడిచిపోయాక “హిందీలోకి తర్జుమా చేస్తున్నా, సహస్రఫణ్” అన్నాడు. అప్పుడే ప్రారంభదశలో వుంది. ఏవో కొన్ని సంగతులు చర్చించాం. అవన్నీ ఇప్పుడుచెప్పడం స్వోత్కర్షగా వుంటుంది. మొత్తం మీద సహస్రఫణ్ అనువాదానికి చాలా కాలం పట్టింది. ఒక రోజు వచ్చి “దాని మీద మనిద్దరి పేర్లు వుంటాయి” అన్నాడు కొంచెం దౌర్జన్యంగా. నేను వెంటనే వాల్మీకి శ్లోకం కోట్ చేసి “యిది చాలా దారుణం” అన్నాను. గంభీరంగా వెళ్లిపోయాడు. రాతప్రతి మాత్రం నా గదిలో పెట్టి వెళ్లాడు. అతనంతే! చదివి అభిప్రాయం చెప్పాలి కాని అది పైకి అనడు. స్వాతంత్ర్యం వచ్చేనాటికే కాకతీయపత్రిక పెట్టాలనే ఆలోచన అతని మనసులో వుంది. నాతో చెబితే నేను ఏమంటానోనని సంకోచం. అది బయట పెట్టడానికి చాలా వ్యవధి పట్టింది. కాకతీయలో సంపాదకీయాలు నేను రాస్తున్నానని చాలామంది అనుకునేవారు. ఏదో చిన్నచిన్న దిద్దుబాట్లు తప్ప పూర్తిగా నేను రాసింది ఎన్నడూ లేదు. గురజాడ వారన్నట్టు కీర్తులూ అపకీర్తులు ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే వచ్చి పడుతుంటాయి.

“సత్యం! చాలు. రాజకీయాలు, రాజభోగాలు చాలు. నేనిక సాహిత్యం వైపు దృష్టి సారించాలి. నువ్వు యింకో వ్యాపకం పెట్టుకోవద్దు” అన్నారు ఒకరోజు ఫోను చేసి. జాతకాన్ని ఎవడు తప్పించగలడు! రాజీవ్ గాంధి అకాల మరణం అనుకోని దుర్ఘటన. ప్రధానిగా పీవీ పేరు ప్రతిపాదనకి వచ్చినపుడు

మౌనంగా వుండిపోయారు. క్రితంరోజు ఉదయం ఫ్లయిట్ లో నేను ఢిల్లీ వెళ్లాను. కారణం చెప్పలేదు. ఒక అధికారి ద్వారా రప్పించి నన్నక్కడ ఆంధ్రాభవన్లో దింపారు. “ఇదీ పరిస్థితి, ఏమిటి?” అని నా అభిప్రాయం కోసం చూశారు. ఏమంటాను, నేనేం మాట్లాడలేదు. ఎవరెవరో వచ్చి వెళ్తున్నారు. హిందీలో, ఇంగ్లీషులో ముక్తసరిగా మాట్లాడి పంపేస్తున్నారు. అంతకు ముందు రాంటెక్ ఎలక్షన్ సందర్భంలో, ఢిల్లీలో పీవీతో నన్ను చూసినవాళ్లు చాలామంది వున్నారు. వాళ్లలో కొందరు “మీరు చెప్పండి” అన్నట్లు సైగ చేశారు. ఇది చూస్తే పెద్ద విషయంగా వుంది. మనమెందుకు తలదూర్చడం అని వూరుకున్నాను. కిటికీ లోంచి బయటకు చూస్తూ “దేశభవిష్యత్తు నీ మాట మీద ఆధారపడి వుంది. ఒక మిత్రుడు నీ ఆదేశం కోసం నిరీక్షిస్తున్నాడు” అన్నాడు పీవి. నా గుండె గుభేలుమంది. “కానివ్వండి. అవకాశం వచ్చింది. నిజానికి మీకు కాదు,

పీవీ ప్రధానిగా ఎన్నికైనట్లు టీవిలో వార్త!

పద్మ అవార్డులప్పుడు నా జీవితసంగ్రహం కావాలని అడిగాడు. ఏముంది జీవితం, ఏమీ లేదన్నాను. “సరే, కాళోజీని ఒప్పించే పూచీ నీది. లేదంటే నువ్వు…” సాంతం మాట పూర్తికాకుండానే నేను లిటరల్ గా పారిపోయాను. పీవి ఒకందాన అంతుపట్టడు. అతను ప్రధాని పగ్గాలు పట్టాక మామధ్య జరిగిన అనేకానేక సంఘటనలు వివరిస్తే పెద్ద గ్రంథమే అవుతుంది. పైగా అవన్నీ పూసగుచ్చినట్టు చెప్పాలనే ఆసక్తి నాకు లేదు.

ఇన్ సైడర్ రాసేటప్పుడు వారం రోజులు కలిసే వున్నాం. అంటే దాని స్వరూపస్వభావాలు నిర్ణయించి, ఒక కొలిక్కి వచ్చేదాక. అందులో రెండు

మూడు ముఖ్యపాత్రలను నేను అందించే అవకాశం రావడం నా అదృష్టమే గాని పీవీ మరుపు ఎంత మాత్రం కాదు.

“ఏమయ్యా సత్యం! నువ్వెప్పుడూ నా అవసరాలకి నాకు అడ్డం పడతావుగాని, నీ అవసరాలకి నేను అడ్డంపడే ఛాన్స్ యివ్వవా” అనేవాడు. అందులో నిష్ఠూరం వుండేది. ఇంతకీ తను భౌతికంగా లేకపోబట్టి యివైనా బయటపడి రాశాగాని. నిజానికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏదో స్నేహధర్మం…దట్సాల్.

(పీవీ పోయాక తమ పరిచయాలపై పుంఖానుపుంఖాలుగా వస్తున్న అనేకానేకుల అనుభవాలు, జ్ఞాపకాలు అందించిన స్ఫూర్తితో…)

(19-1-2005)

పుస్తక ప్రచురణ వివరాలు:

ఈ సంకలనం అనల్ప పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది. వారి ప్రచురణల గురించి అప్ డేట్స్ కి క్రింది లింక్ ని క్లిక్ చెయ్యండి.

ఈ పుస్తకం digital edition ని , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.

లేదా ‘నవోదయ’ సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.

నవోదయ బుక్ హౌస్

3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్

ఫోన్ నెంబర్: 090004 13413

https://goo.gl/maps/nC4BSr2bBvfZgwsm7

*Intro- outro BGM credits: Edhedho Ennam Valarthen | Durai Srinivasan | Soul Strings (https://www.youtube.com/watch?v=LWpJxRYZb2w)

Leave a Reply