Apple PodcastsSpotifyGoogle Podcasts

దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కథ ‘దొంగ’

తెలుగువచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా నిండకుండా అయన మరణించడం తెలుగు వారి దురదృష్టం.

తిలక్ గారి మరణానంతరం 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ‘ అమృతం కురిసిన రాత్రి ‘ ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.

ఇదిగాక ఆయన కొన్ని అద్భుతమైన కథలను రచించారు.

ఇప్పుడు వినబోయే కథ ‘దొంగ’ – ‘తిలక్ కథలు’ అనే సంకలనం నుంచి. ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.

తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.

ఈ పుస్తకం మీరు డిజిటల్ ఎడిషన్ లేదా ప్రింటెడ్ ఎడిషన్ కొనడానికి, ఇదే వెబ్ పేజీ లో వివరాలు ఇవ్వబడ్డాయి.

కథ – ‘దొంగ’ :

మసక మసకగా వుంది వెన్నెల. చెట్లకిందవున్న చీకటిలోంచి నడుస్తున్నాడు గోపాలం. మోకాళ్ళపైకి ఎగకట్టిన పంచెకట్టూ, ఛాతీకి బిగుతుగా అంటుకొనిపోయిన బనీనూ, మొలలో చిన్న కత్తి – ఆత్మ విశ్వాసంతో, ధైర్యంతో ఉన్నాడు గోపాలం…

మధ్య మధ్య త్రేన్పులు వస్తున్నాయి పుల్లపుల్లగా – ఒకే ఒక గ్లాసుడు నాటుసారా పుచ్చుకున్నాడు బలానికీ, హుషారుకీ. చదువురానివాడైనా, ప్రతీదీ ఒక ప్లానుప్రకారం నడవాలి గోపాలానికి. ఏ పని చేసినా ముందూ వెనకా చూసి ఆలోచించి బేరీజువేసే అలవాటు వుంది అతనికి. ఒక స్వాభావికమైన వివేకం వుంది. అందుకే రత్తయ్యా, సోములూ ఎంతో నమ్మకంవుంచి అతనిమీద యీ బాధ్యత వేశారు. వాళ్ళిద్దరూ లేకుండా వుంటే, పనులు సవ్యంగా జరుగుతాయి. వాళ్ళిద్దరికీ నిదానం లేదు. ఉత్త కంగారు. ఉత్తి ఆశ తప్ప.

రాత్రి ఒంటిగంట దాటితేకాని ఆవిడ మొగుడింటికి రాడు, రెండు వారాలు పరిశీలనగా చూసి యీ విషయం గ్రహించాడు. ఆ క్లబ్ లో కూర్చుని ఖరీదైన మందు తాగుతూ పేకాడుతూ డబ్బయిపోయేవరకూ అక్కడే వుంటాడు. ఈలోగా అతని భార్యవొంటరిగా యింట్లో వంటగదికి పక్కగా వున్న గదిలో పడుకుని నిద్రపోతుంది. వంటగదికి దొడ్లో నుంచి వెళ్ళాలి. దొడ్డి చాలా పెద్దది. ఎన్నో మొక్కలూ చెట్లూ వున్నాయి. వాటి నీడలో తాను కనుపించడు. మరీ మంచిది. వంటగది కిటికీ వానకి తడిసి ఎండకి ఎండి కమ్ములు పట్టుతప్పివున్నాయి. బలంగా తెలివిగా పనిచేస్తే మూడు నాలుగు ఊచల్ని తీసెయ్యవచ్చును. ఇంక ఒకసారి వంటగదిలో ప్రవేశించాక పనిచాలా సులభం. తాను అవతల గదితలుపు కొడతాడు మెల్లగా, ఆవిడ ఏ ఎలకో. పిల్లో అనుకుని తలుపు తీస్తుంది. అంతే, తాను కత్తి చూపించి భయపెడతాడు. మెళ్ళో వున్న నాలుగు పేటలగొలుసు ఒడుపుగా తాపీగా తీసుకుంటాడు. ఆమె తెప్పరిల్లే లోపల. కేకవేసేలోపల తోటలోకి చీకట్లోకి అదృశ్యుడైపోతాడు.

గోపాలం యిలాగ తన ప్లానంతా ఆలోచించుకుంటూ నిబ్బరంగా నడుస్తున్నాడు. రోడ్లు నిర్మానుష్యంగా వున్నాయి – అక్కడక్కడ ఒకరిద్దరు రాత్రించరుల్ని తప్పించి, ఊరికి దూరంగా ఉన్న కొత్తపేట యిది. ఊళ్ళోవున్న జనసంచారమూ, అలజడి ఇక్కడ ఉండవు

మొదట ఆట అయిపోగానే మొగలోవున్న కిళ్ళీకొట్లూ, చిన్న కాఫీ హోటలూ మూసేస్తారు. చాలా ఇళ్ళు నిద్రలో మునిగిపోయాయి. కొన్ని ఇళ్ళలోంచి మాత్రం విద్యుద్దీప కాంతి కిటికీలోంచి వస్తోంది. మొత్తమ్మీద వీధులూ, ఇళ్ళూ ఆ మసక వెన్నెలలో ఒంటరిగా గోపాలంకోసం యెదురు చూస్తోన్నట్లు వున్నాయి.

గోపాలానికి తనుచేసే పనిమీద నైతిక సందేహాలు ఏమీలేవు. దొంగతనం తప్పనీ, పాపమనీ అతను అనుకోలేదు. ఎందరో తమ తమ అవసరాలకి ఎన్నో వృత్తులూ , ఉద్యోగాలు చేసినట్టుగా అతనూ యిది చేస్తున్నాడే తప్ప మంచి చెడ్డల సూక్ష్మ విచారణచేసే పిరికితనం కాని, అసలటువంటి ఆలోచనకి అవసరంకాని అతనికి కనిపించలేదు. అందువలన అతనికి అంతరాత్మని నొక్కివేయడమూ ఒప్పించడమూ లాంటి బాధలు కలుగలేదు. తనపనిలో దొరికిపోతే జైలుకి వెళ్ళాలన్న భయమూ జ్ఞానమూ వున్నాయి అతనికి. అందుకే జాగ్రత్తగా ప్లానువేసుకుంటాడు. ఎంతో అవసరమైతేకాని రత్తయ్యనీ, సోముల్నీ వెంటతీసుకుని వెళ్ళడు. వాళ్ళిప్పుడు తనకోసం ఆశగా ఎదురు చూస్తూంటారన్న ఆలోచన అతనికి మరింత ఉత్సాహం ఇచ్చింది.

ఆ యిల్లు మసక వెన్నెల్లో ముడుచుకున్న తాబేలులా వుంది. ప్లాను ప్రకారం ఇంటివెనక్కి వెళ్ళి దొడ్లోకి ప్రవేశించాడు. అరటిచెట్లూ, కొబ్బరిచెట్లూ ఏవేవో మొక్కలూ , తుప్పలూ, అంతా గలీజుగా చీకటిగా ఉంది.

నెమ్మదిగా నడిచి వంటగది దగ్గరకు వచ్చాడు గోపాలం. కిటికీ వూచల్ని ఒకసారి లాగిచూశాడు. ఇంతలో అతనికి లోపల్నుంచి మాటలు వినిపించాయి. అతనికి ఆశ్చర్యం కలిగింది. అతని పథకం అప్పుడే దెబ్బతిన్నట్టనిపించింది. ఈసారి మాటలు కొంచెం గట్టిగా కోపంగా వినవచ్చాయి. గోపాలానికి కుతూహలం కలిగింది.బహుశా ఆ వచ్చిన వాళ్ళెవరైనా మళ్ళీ వెళ్ళిపోవచ్చును. తన మార్గం నిరాటంక మనవవచ్చును అనికూడా అనిపించింది. ఒకవేళ ఎవరైనా ప్రియుడేమో- మొగుడు లేకుండా చూసి ప్రేమకలాపం జరుపుతోందేమో అని ఊహ తట్టింది. మాటలు తొందరగా గట్టిగా వినబడుతున్నాయి. ఆవిడ గొంతు ఏదో భయం. బాధావున్నాయి. అతని కుతూహలం హెచ్చింది. బలంగా వూచల్ని లాగి కదిపి ఊడదీశాడు. నేర్పుగా ఏర్పడిన జాగాలోనుంచి వంటింట్లోకి ప్రవేశించాడు. పక్క గదిలోనుంచి మాటలు వినబడుతున్నాయి.

” వద్దండీ నామాట వినండి ” ఆవిడ గొంతు.

” ఇస్తావా – తగలనియ్యనా” మగ గొంతు.

“ఎందుకు జూదమాడి తగలేస్తారు చెప్పండి. కాపరానికొచ్చిన నాటినుండి సరదాలేదు. సుఖంలేదు. ఉన్న ఆస్తంతా తగలేశారు చాలదా? “

“వెధవ లెక్చరివ్వక మర్యాదగా తీసి ఇలా ఇయ్యి. లేకపోతే…”

“ఈ ఉన్న ఒక్క గొలుసూ ఇస్తే నా గతేంకాను. బాబు గతి ఏంకాను! చూడండి వాణ్ని-కన్న కొడుకుని. మీకు దయలేదా? జాలిలేదా! ఏమండీ- ఈ వాళికి ఊరుకోండి. పన్నెండు గంటలవుతోంది. ఒక్కరినీ బిక్కుబిక్కుమంటూ ఇంట్లో – రండి. పడుకోండి.”

కర్కశంగా వినబడింది. యీసారి మగ గొంతు – “ఇస్తావా – పీక పిసికి చంపెయ్యమన్నావా, వెధవ పీడ వదుల్తుంది.”

” ఇవ్వను.”

” ఇవ్వనా?”

ఇవ్వనుగాక ఇవ్వను. ఇది మా పుట్టింటివారు పెట్టింది. ఇది నా ఆస్తి.”

వింటూన్న గోపాలానికి ఆవిడ మాటలలో ఏదో న్యాయం గోచరించింది. ఆవిడ గొంతు తియ్యగా సన్నగా జాలిగా వుంది. గోపాలానికి ఆవిడ మొగుడి మీద కోపం వచ్చింది.

“నీ ఆస్తా-? ఏవిటీ పేలావు, ఇన్నాళ్ళూ తిన్నది నా డబ్బు కాదూ! తే- ఆ గొలుసు తే.”

“ఏవండీ. ఇలా అన్యాయంగా మాట్లాడతారేమండి… నేను మాత్రం మీకోసం, మీ బాగుకోసం కాదూ చెబుతున్నది. ఈ గొలుసొక్కటే యింక మనకి ఆధారం. నాకు పసుపు కుంకుమకింద మా వాళ్ళు రాసిచ్చిన ఎకరమూ మీరు అమ్మేస్తే యేమైనా అన్నానా?

మీరు తాగుతారు, జూదమాడతారు. మీకు మంచి, చెడ్డా: భార్యా కొడుకూ అన్న విచక్షణ పోయింది. ఈ నరకంలో మగ్గిపోతూ ఉండాల్సిందేనా, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా మాట వినండి”

ఛెళ్ళుమని చప్పుడు వినిపించింది గోపాలానికి, ఆవిడని మొగుడు కొడుతున్నాడు. గోపాలానికి జాలీ ఉద్రేకమూ కలిగాయి. దీనంగా మధురంగా గద్గదికంగా ఉన్న ఆమె గొంతు అతన్ని ఆకట్టింది.

” కొట్టండి, చంపండి. నా గొలుసుమాత్రం యివ్వను”

” ఇవ్వవూ, ఇవ్వవుటే .” మళ్ళీ గుద్దినట్టు చప్పుడు. ఆమె ఏడుస్తోంది. నిస్సహాయంగా, దీనంగా. బాధగా, ఆమె ఆక్రోశించింది. ఇద్దరూ పెనుగులాడుతూన్న ధ్వని వినపడింది గోపాలానికి.

“వొదలండి. నన్నొదలండి. అమ్మో.”

గోపాలం పిడికిళ్ళు బిగించాడు.అతని కళ్ళలో ఎర్రజీర కదలింది ;

“పీక పిసికి తీసుకెళతాను. గొలుసు ఇలా పడెయ్యి”

ఎందుకివ్వాలి మీకు, జూదంలో తగలెయ్యడానికా?” ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూనే మాట్లాడుతోంది. “పిల్ల వాడికి దగ్గుమందైనా తీసుకురాలేదు. ఒక్క మంచిచీర లేదు. కట్టుకున్న పెళ్ళాం చచ్చిందో బతికిందో చూడరు. ఇంక వీధులమ్మట ముప్టెత్తుకుని బతకాలి నేను.”

“ఈ వేలెడు వెధవ కోసం నా కివ్వవన్న మాట. ఆగువీడిని చంపేస్తాను. వీడి పీక నులిమేస్తాను.”

“అయ్యో అయ్యో వాణ్ణి ఏం చెయ్యకండి. అయ్యో అయ్యో” ఆవిడ పెద్ద పెట్టున కేకలు.

పిల్లవాడు కెవ్వుమని ఏడుపు.

గోపాలం ఇంక ఆగలేకపోయాడు. కుర్రవాణ్ణి పీక నులిమి చంపి వేస్తున్న దృశ్యం అతని కళ్ళముందు కదలింది. బలమంతా ఉపయోగించి తలుపు తన్నాడు.

రాలేదు. తిరిగి దడదడా తన్నాడు; తలుపులు విచ్చుకున్నాయి. ఆమె కుర్రవాణ్ణి ఎత్తుకొని గోడమూలగా నక్కి వుంది. వణకి పోతూ వుంది.

“బాబు నేమీ చెయ్యకండి. వొదలండి. ఇదిగో గొలుసు” అంటూ మీదకి రాక్షసుడిలా వొంగిన అతనికి గొలుసు ఇస్తోంది. మొగుడు తీసుకుని వెనక్కి తిరిగాడు.

ఎదురుగా గోపాలం.

“ఎవడవురా నువ్వు? ” అన్నాడు మొగుడు.

గోపాలం బలంగా అతని దవడమీద ఒకటి వేశాడు. మొగుడు తూలిపడబోయాడు. గోపాలం యీసారి మీదకురికి అతని తలవంచి బలంగా గుద్దాడు. అతను కిందపడ్డాడు.

“ఆడకూతుర్ని కొడతావా? ఆ గొలుసు కాజెయ్యాలని చూస్తావా? దొంగ యెదవా. సిగ్గులేదురా నీకు. బుద్ది లేదురా. ఏది ఆ గొలుసు ఇలా యియ్యి. లేవకు, లేచావంటే సంపేత్తాను.”

గోపాలం అతని చేతిలోంచి గొలుసు లాక్కున్నాడు. అతను కింద పడి వగరుస్తున్నాడు. రొప్పుతున్నాడు. ఆమె యీ హఠాత్పరిణామం అర్ధంకాక నిశ్చేష్టురాలై గోడకి బల్లిలా అంటుకుని కళ్ళప్పగించి చూస్తోంది.

“తాగుడూ జూదమూసట్రా నీకు. సదువుకున్నోడివి. ఉద్యోగం చేసి పెళ్ళాం పిల్లల్ని పోషించాల్సింది. పైగా పెళ్ళాం నగలే ఎత్తుకు పోతావట్రా దొంగనాయాల……”

నేలను కరుచుకున్నా మొగుడు అస్పష్టంగా బూతులు తిడుతున్నాడు.

గోపాలం డొక్కలో ఒకటి తన్ని “నోర్ముయ్యి”అన్నాడు.

ఆమె ” వద్దు వద్దు కొట్టకు ” అని అరిచింది.

గోపాలం చేతిలో గొలుసుతో గోడవారనున్న ఆమెను సమీపించాడు. ఆమె సన్నగా ఎర్రగా నాజుకుగా వుంది. జుట్టంతా రేగిపోయి వుంది. చెక్కిళ్ళు కన్నీళ్ళతో తడిసిపోయి వున్నాయి. పాతికేళ్ళయినా వుండవు. ఆమె కళ్ళలో భయాశ్చర్యాలు పెనవేసుకున్నాయి. చంకలో పిల్లవాడు ఏడుస్తున్నాడు.

“ఇదిగోనమ్మా గొలుసు” అంటూ ఆమె చేతికి గొలుసు ఇచ్చాడు. కింద దొర్లుతూన్న మొగుడు లేవబోయాడు. గోపాలం మొలనుండి కత్తితీశాడు.

” ఇదేవిటో చూశావా! లేవడానికి ప్రయత్నించావా పొడిచేస్తాను కబడ్డార్. దెబ్బకి యెగిరిపోతావు”

మొగుడు దండం పెట్టాడు.

” నువ్వు మళ్ళీ ఎప్పుడైనా గొలుసు తీసుకున్నట్టు కాని ఆవిడవంటి మీద దెబ్బపడినట్లుగాని తెలిసిందా నీ ప్రాణం తీసేస్తాను” గోపాలం కత్తిని అతని ముఖానికి దగ్గరగా పెట్టి ఝళించాడు.

మొగుడు తలవూపాడు ఇంకెప్పుడూ చెయ్యనన్నట్టుగా. గోపాలం ఆమె వైపు తిరిగాడు. “ఏం భయంలేదు. ధైర్యంగా వుండమ్మా” అన్నాడు. ఆమె భయంతో కృతజ్ఞతలతో తల వూపింది.

గోపాలం కత్తి మొలలో పెట్టుకుని వెళ్ళిపోబోయాడు, ఆమె హీనస్వరంతో అడిగింది “ఎవ్వరు బాబూ నువ్వు…”

“నేనా… నేనా” తెల్లబోయాడు గోపాలం. “నన్ను గోపాలం అంటారు లెండి. అంతే” అంటూ గోపాలం తలెత్తకుండా వడివడిగా పెరట్లోకి చీకట్లోకి వెళ్ళిపోయాడు.

(జ్యోతి, మార్చి 1964- ఉగాది సంచిక)

పుస్తక ప్రచురణ వివరాలు:

ఈ పుస్తకం, నవచేతన పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది.

ఈ పుస్తకం , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.

*Intro- outro BGM credits: Edhedho Ennam Valarthen | Durai Srinivasan | Soul Strings (https://www.youtube.com/watch?v=LWpJxRYZb2w)

“దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కథ ‘దొంగ’” కి 6 స్పందనలు

  1. Very nice story. Thanks for sharing and request you to continue this great effort.

    1. తిలక్ గారు రాసిన ఇంకో గొప్ప కథ – ‘నల్లజర్ల రోడ్డు’వచ్చే వారం హర్షణీయంలో వస్తుంది సర్. కథపై మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు.

  2. Good moral story,but one doubt to convincemidnight husband asking gold chain..to play gambling..

  3. తిలక్ గారి కధ ‘దొంగ’ ప్రచురించినందుకు ధన్యవాదాలు. మనిషి ఎంత చెడ్డవాడైన, ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత నైతికత ఉంటుందనే విషయాన్ని చక్కగా వివరించారు రచయిత. ఇటువంటి పాత కథలు ఇంకా పరిచయం చెయ్యండి.

    1. తప్పనిసరిగా . ఇదే శీర్షికలో గొప్ప రచయితల కథలని పరిచయం చేయాలనేదే ‘హర్షణీయం’ ప్రయత్నం. ప్రచురణకి అనుమతులు తీసుకోవడానికి,కొంత సమయం పడుతోంది. శ్రీయుతులు కె ఎన్ వై పతంజలి గారు, త్రిపురనేని గోపీచంద్ గారు, పతంజలి శాస్త్రి గారు, వేలూరి వెంకటేశ్వర రావు గారు , రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు, చాగంటి సోమయాజులు గార్ల కథలు, ముందు ముందు హర్షణీయంలో రాబోతాయి.

      1. Thank you very much.

Leave a Reply