Apple PodcastsSpotifyGoogle Podcasts

“గోమెజ్ ఎప్పుడొస్తాడో”! – శ్రీ వేలూరి వేంకటేశ్వర రావు

‘గోమెజ్ ఎప్పుడొస్తాడో’ అనే ఈ కథకు రచయిత శ్రీ. వేలూరి వేంకటేశ్వరరావు గారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి లో జన్మించిన శ్రీ వేంకటేశ్వరరావు , తన విద్యాభ్యాసం అనంతరం, అమెరికా వెళ్లి సైంటిస్ట్ గా పనిచేసి , ప్రస్తుతం అట్లాంటా లో నివాసం వుంటున్నారు. వీరు ఇప్పటిదాకా రెండు కథ సంపుటాలను వెలువరించారు. 1980 దశకంలో ‘తెలుగు వెలుగు’ పత్రికను అమెరికా నించి నిర్వహించారు. కొంతకాలం ‘ఈమాట’ అంతర్జాల పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. ఈ కథ వేంకటేశ్వరరావు గారి “ఆ నెల ఆ నీరు ఆ గాలి’ అనే కథాసంకలనం నించి సేకరించబడింది. పుస్తకం కొనేటందుకు మరిన్ని వివరాలు ‘వెబ్ పేజీ ‘ చివరలో ఇవ్వడం జరిగింది. ఈ కథలో ఆయన అమెరికాకు వచ్చే మెక్సికన్ ఇమిగ్రెంట్ లేబర్ అవస్థల గురించి చాల హృద్యంగా చిత్రీకరించారు. తానా వారు 2013 వ సంవత్సరం లో ముద్రించిన ‘ కథ – నేపధ్యం’ అనే అనే ప్రత్యేక సంకలనం లో ఈ కథ ఎంపిక కాబడింది. కథను హర్షణీయం ద్వారా మీ కందించడానికి అనుమతినిచ్చిన శ్రీ వేంకటేశ్వరరావు గారికి మా కృతజ్ఞతలు.

గోమెజ్ ఇవాళా రాలేదు. పోయిన శనివారమే రావా ల్సినవాడు. పదు హేను రోజులకోసారి, శనివారం పొద్దున్నే వచ్చి లాస్ చెయ్యమని ఎన్నిసార్లు చెప్పినా వాడికి అర్థం కాదు. ప్రతీసారీ ‘యస్ యస్, సీ సీ,’ అంటూ నవ్వుతూ తలకాయ ఊపుతాడు. అంతే. వాడికి తీరికైనప్పుడే వస్తాడు. వచ్చినప్పుడు ప్రతిసారీ శ్రద్ధగా గడ్డికోసి, ఇంటి ముందు, వెనకా పెరిగిన పొదలన్నింటినీ అందంగా కత్తిరిస్తాడు. అదేం ఖర్మమో మరి! ఎప్పుడూ మధ్యాన్నం ఒంటిగంటకి వస్తాడు. కనీసం రెండు గంటలు మండు టెండలో పనిచేస్తాడు. రోడ్డు మీద ఎవరిని చూసినా చెయ్యి ఊపుతూ నవ్వుతూనే ఉంటాడు. అందుకనే కాబోలు, వాడు రావలసిన రోజున టైముకి రాలేదని సుజాత ఎంత చిరాకుపడినా గోమెజ్ చేతే లాన్ పను లన్నీ దగ్గిర ఉండి చేయిస్తుంది. తను మంచినీళ్లు తాగుతూ వాడికి కోక్ బాటిల్ ఇస్తుంది.

గోమెజ్ కి ఇంగ్లీషు రాదు, యస్ యస్, అనడంతప్ప! ఇంగ్లీషు నేర్చు కుందామన్న కుతూహలం కూడా ఉన్నట్టు కనిపించదు. సుజాతకి స్పానిష్ రాదు. నేర్చుకుందామని అనుకోవడమే కాని, పనికట్టుకొని ఈ వయస్సులో కొత్త భాష నేర్చు కోవడానికి కావలసిన ఓపికా లేదు. అయితేనేం, వాళ్ళిద్దరూ చేతులతో సైగలు చేస్తూ సంభాషణ చెయ్యడం మూకీ సినిమాలని మరిపిస్తుంది. నిజం చెప్పొద్దూ! వీళ్ళ ముందు మార్సెల్ మార్సో ఎందుకూ పనికి రాడనిపిస్తుంది. గుబురుగా పెరిగిన పొదలు ఎంత ఎత్తు ఉంచాలో, ఎంత కిందకి కత్తిరించాలో, ఏ పూలమొక్కలు ఎప్పుడు ఎక్కడ తిరిగి పాతాలో, ఈ వివరాలన్నీ సుజాత చేతులు తిప్పుకుంటూ సైగలు చేస్తూ చెప్పడం, వాడు యస్ యస్! అని తలకాయ ఊపడం చూడముచ్చటగా ఉంటుంది. ఈ రెండేళ్ళన్నరలో వాడు సుజాతతో మాట్లాడుతూ నేర్చుకున్న తెలుగు మాటలు ముత్యంగా మూడు- ఆగు, ఇలారా, కాదు. సుజాత నానాయాతనా పడి వాడితో మాట్లాడుతూ నేర్చుకున్న స్పానిష్ మాటలు- అమీగో, సబాదో, దొమింగో.

రెండున్నర సంవత్సరాల పైనే అయ్యింది సుజాత, మోహన్లు ఆ వీధిలో ఒక పెద్ద పాత ఇల్లు కొనుక్కొని. ఇంటి ముందు, వెనక ఖాళీస్థలం అర ఎకరం పైనే ఉంటుంది. ముందు పెద్ద లాను, రకరకాల పూల పొదలు. వెనక అటూ ఇటూ రెండు వీపింగ్ విల్లో చెట్లు ఉన్నాయి. వెనకాల సరిహద్దులో పెద్ద బర్మ్.దాని కింద ఆరడుగు లెత్తున హెడ్డింగ్ పొదలూ ఉన్నాయి. వాళ్ళు కొత్త ఇంట్లోకి చేరిన రోజునే ఎదురింట్లోకి కేథరీన్, ఫ్రాంక్ కూడా వచ్చారు. ఇద్దరికీ సంసార బాధ్యతలు, ఇతర బాదరబందీలు ఏవీలేవు. దానికి తోడు ఒకే వయసు వాళ్ళవడంతో సుజాతకి, కేథరీన్ కీ ఇట్టే స్నేహం కుదిరింది. రోజూ పొద్దున్నే లేచి సబ్ డివిజన్ లో వీధులన్నీ కొలుచు కుంటూ మెల్లిగా నడవడం, అమ్మకానికున్న ప్రతి ఇంటి మీదా కామెంట్లు చెయ్యడం, సాయంత్రం పూట ఎవరి డ్రైవ్ వేలో వాళ్ళు నిలబడి గంటల తరబడి పిచ్చాపాటీ చెయ్యడం అలవాటయ్యింది. సుజాత అమెరికా వచ్చి ము ప్ఫై ఏళ్ళయ్యింది. ఇన్ని ఏళ్ళున్నా ఫలానా తెల్లవాళ్ళు స్నేహితులు అని చెప్పుకోవటానికి ఎవరూ ఉన్నట్టులేదు. అలాగని నల్లవాళ్ళూ కూడా లేరు. ఇంతకుముందు వాళ్ళున్న ఇంటి సంగతి సరేసరి! తను పెరట్లోకి వెళ్ళితే చాలు, తను చెయ్యి ఊపుతూ పలకరిద్దామనుకున్నా ఆవెనకింటి ఆవిడ హాయ్ అని కూడా అనేది కాదు! ఈ సబ్ డివిజన్ లోకి రావడం, వచ్చిన రోజే కేథరీతో స్నేహం కుదరడం కలిసివచ్చింది.

ఒక శనివారం సాయంత్రం సుజాత, కేథరీన్ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ట్రక్ నిండా పైన్ స్ట్రా బేళ్ళు పెట్టుకొని ఒక పాతికేళ్ళ కుర్రాడు వచ్చాడు. ఒక కట్ట పైన్ స్ట్రా చేత్తో పట్టుకొని, ఇంటిముందు చెట్లకుదుళ్ళకి స్ట్రా వేస్తానని సైగ చేస్తూస్పానిష్ లో వటవట వాగడం మొదలెట్టాడు. కాథెరీన్ మాట్లాడద్దని తర్జని తన పెదాల పై పెట్టుకొని సైగ చేస్తూ, ‘హౌ మచ్?’ అని అడిగింది. వాడు మూడు వేళ్ళు చూపించాడు. అంతే! కేథరీన్ ఇంటి ముందు, సుజాత ఇంటి ముందూ చెట్లకి, పొదలకీ ఓపిగ్గా కుదుళ్ళు చేసి పై’ వేశాడు. బహుశా ఒక్కొక్క ఇంటికి పాతికబేళ్ళు పట్టి ఉంటాయి. అంటే డెబ్బై ఐదు డాలర్లు! ఏ హోమ్ డిపోలోనో పైన్ స్ట్రా కొంటే నూటపాతిక పైనే అవుతుంది. దానికి తోడు, అది తెచ్చి వేసినందుకు కూలి కనీసం మరో పాతిక డాలర్లు. చులాగ్గా ఒక్కొక్కళ్ళకీ నూట యాభై డాలర్లు ఖర్చు. సుజాత, కేథరీన్ లిద్దరికీ కలిపి నూటయభై డాలర్లతో ఇంటి ముందు అన్ని చెట్లకీ, పొదలకీ పైన్ స్ట్రా చవగ్గా దొరికింది.

సుజాత, కేథరీన్ ఇద్దరూ ఒకేసారి వాడిని, ‘గడ్డి కూడా కోస్తావా?’ అని సైగ చేశారు, లాన్ చూపిస్తూ! వాడు యస్, యస్ అన్నాడు. కేథరీన్ కి సుజాతకన్నా ఓ నాలుగు స్పానిష్ మాటలు ఎక్కువ వచ్చు. ఇంగ్లీషు, స్పానిష్ కలిపి మాట్లాడేస్తుంది. వాడిని, ‘లాన్ మోవర్ ఉన్నదా?’ అని అడిగింది, వచ్చీరాని స్పాంగ్లిషే! వాడు, ‘సీ, సీ’ అన్నాడు చిరునవ్వు నవ్వుతూ! లాన్ చెయ్యడానికి ఎంత కావాలి, అని కూడా అడగలేదు. అడగడం ఎల్లాగో తెలిస్తేగా! ఆ రోజునుంచీ సుజాతకీ, కేథరీన్కీ గోమెజ్ తోటమాలి. ఇద్దరూ కూడబలుక్కొని చెరో ము ప్ఫై డాలర్లు ఇద్దామనుకున్నారు, అంతే.

ఆ నెల వర్షాలు బాగా పడ్డాయో ఏమో, రెండు వారాలు తిరక్కుండా ఇంటి ముందు గడ్డి కనీసం అరడుగు పైగా పెరిగింది. వెనక బల్మ్ మీద డాన్ డెల్యన్ కలుపు మొక్కలు పెరుగుతున్నాయి. గడ్డి కొసన సన్నగా మట్టిరంగు పూలు కూడా పూస్తున్నాయి. వారం నుంచీ సుజాత గోమెజ్ కి ప్రతిరోజూ టెలిఫోన్ చేస్తూనే ఉన్నది.

గోమెజ్ దగ్గిర నుంచి సమాధానం లేదు.

అప్పటికి రెండు నెలల కిందట వీధి చివర కార్నర్ లో ఉన్న పెద్ద ఇంట్లోకి కొత్తగా గుజరాతీ వాళ్ళు దిగారు, రెండు హోండాలు, ముగ్గురు పిల్లలతో సహా! ఈ ఇల్లు ఏడాది నుంచీ అమ్మకానికుంది. కార్నర్ లో ఉన్న ఇళ్ళు తొందరగా అమ్ముడు పోవు కాబోలు! కారణం, మిగితా ఇళ్ళకన్నా ఖాళీస్థలం భారీగా ఉంటుంది అందు లోనూ, ఈ ఇల్లు కొండ మీద ఉన్నట్టే ఉంటుంది. మూడు పక్కలా స్థలం కూడా సుజాత ఇంటికన్నా బాగా పెద్దది. రెండు లాట్లు కలిపి కట్టిన ఇల్లు. ఇల్లు ఫోర్ క్లోజర్ లోకి పోయింది కాబట్టి బాగా చవగ్గానే దొరికి ఉండాలి గుజరాతీ ఫేమిలీకి. వాళ్ళు ఇంట్లోకి దిగిన రెండో రోజున సుజాత, కేథరీన్, ఇద్దరూ ఒక క్రోటన్ మొక్క తీసుకొని ‘వెల్కమ్ టు నైబర్ ‌హుడ్’ అని చెప్పటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆవిడ ఇచ్చిన టీ తాగుతూ వచ్చీరాని హిందీలో వాళ్ళ భోగట్టా కనుక్కుంది సుజాత. ఆవిడ పేరు మాలిని; ఆయన పేరు జాయ్. అతనికి ఏదో ట్రక్కింగు కంపెనీ ఉందిట. ఆవిడ పిల్లలని బళ్ళో దింపిన తరువాత స్వామినారాయణ్ గుడిలో వాలంటీర్ పనికి పోతుం దిట. వాళ్ళ గురించి ఇంత సొద ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, సుజాత రికమం డేషన్‌, గోమెజ్ వాళ్ళకి ఒకే ఒక్కసారి లాన్ కూడా చేశాడు, అందుకని!

సుజాత గోమెజ్ జాడ గురించి కేథరీనిని అడిగింది. ఆ సాయంత్రం మాలిని ఇంటి ముందు ఆగి ఆవిడని కూడా అడిగింది. ఆవిడ ఏదో గుజరాతీలోనో, హిందీ లోనో గొణిగింది. సుజాతకి ఒక్క మాట కూడా అర్థం కాలేదు. కేథరీన్ కూడా రోజూ టెలిఫోన్ చేస్తూనే ఉన్నది. కాని, ఫలితం శూన్యం.

గోమెజ్ శనివారం, ఆదివారం మాత్రమే లాన్ పని చేస్తాడు. మిగిలిన ఐదు రోజులూ వందమైళ్ళ దూరంగా ఏదో పూల మొక్కల కంపెనీలో పని చేస్తాడు. వీడితో పాటు నలుగురు అమీగోలు రోజూ పొద్దున్నే ఆ కం పెనీకి వెళ్ళి రాత్రి పదిగంటలదాకా తిరిగి రారని కేథరీన్ భోగట్టా. అందుకనే కాబోలు, ఎవరు ఎన్నిసార్లు ఫోను చేసినా సమాధానం ఇవ్వడు.

‘కాస్త నమ్మకంగా, ఖచ్చితంగా రెండువారాల కొకసారి వచ్చి లాస్ చేసేవాడిని, మరొకణ్ణి చూసుకోవాలి,” అని ఇద్దరూ అనుకుంటారు, గోమెజ్ రానప్పుడల్లా!గోమెజ్ రాగానే ఇద్దరూ ఆ విషయం మరిచిపోతారు! కారణం, వచ్చినప్పుడు లాన్ పని బాగా చేస్తాడు. పై పై పనులెన్ని చెయ్యమని చెప్పినా విసుక్కోడు; అందుకుగాను పైకం అడగడు; టిప్ ఎంత ఇస్తే అంతే తీసుకుంటాడు. నవ్వుతూ యస్ యస్ అంటాడు. అంతే!

గోమెజ్ వస్తాడని చూసిచూసి చివరకి విసుగెత్తి, సోమవారంనాడు పొద్దున్నే యెల్లో పేజీల్లో చూసి ఏదో సర్వీసు కంపెనీని పిలిచింది, కేథరీన్. ఆ విషయం సుజాతకి చెప్పింది. ఆ కంపెనీ వాళ్ళు యూనిఫారాలు వేసుకొని, పెద్ద ట్రక్ లో వచ్చారు, మధ్యాన్నానికల్లా! మొత్తం ముగ్గురొచ్చారు. రెండు ఇళ్ళ ముందూ వెనకా లానులు పరీక్షగా చూశారు. ఒకడు టేపుతో కొలతలు కూడా తీసుకున్నాడు. మొట్టమొదటిసారి గడ్డి కోసి బుషులన్నీ కత్తిరించి పూలమొక్కలన్నింటికీ కుదుళ్ళు తవ్వి శుభ్రం చెయ్యడానికి ఒక్కొక్కళ్ళకీ నూటైయభై డాలర్లు అవుతుందని అంచనా ఇచ్చారు. వారానికొకసారి లాను పని చేయించుకుంటామని కాంట్రాక్ట్ రాస్తే, ప్రతివారం అరవై ఐదు డాలర్లకి లాన్ చేస్తామని, పూల పొదలు బుషులు కత్తిరించడానికి వేరే నెలకి నలభై డాలర్లు అని చెప్పి రిబేట్ కాయితాలు, కాంట్రాక్ట్ కాయితాలూ అన్నీ కేథరీన్ కి, సుజాతకీ ఇచ్చి రెండు రోజుల్లో పిలిచి ఏ విషయం చెప్పండని వెళ్ళిపోయారు.

వీళ్ళిద్దరికీ గుండె ఆగినంత పని అయ్యింది. ‘ఇది నిలువు దోపిడీ,’ అని సుజాత, ‘హైవే రాబరీ,’ అని కేథరీన్ ఒకేసారి అనేశారు. వస్తానని చెప్పి, మాట నిలబెట్టుకోకండా

మోసం చేసి ఎగగొట్టినందుకు, గోమెజ్ ని నానా తిట్లు తిట్టుకున్నారు: సుజాత తెలుగులోను, కేథరీన్ ఇంగ్లీష్ లోనూ!

అయినా తప్పదు కదా!

ఈ దేశంలో, ఎవడి ఇల్లు వాడు లోపల ఎంత చెత్తగా పెట్టుకున్నా పరవాలేదు. శానిటరీ డం’ వున్నా నష్టం లేదు. ‘నా ఇల్లు. నా సొంతం’ అని దబాయించవచ్చు. ఇండివిడ్యువల్ ఫ్రీడం! కానీ, ఏ ఇంటి ముందు, వెనకా ఖాళీస్థలంలో గడ్డి ముత్యంగా మూడంగుళాలకన్నా ఎత్తుగా పెంచకూడదు. ఏ ఇంటి ముందన్నా కాస్త గడ్డి గాదర దుబ్బుగా పెరిగితే, ఇంటి ధరలు అమాంతం పడిపోతాయని బెంబేలు పడిపోతారు, ఇక్కడి జనం! ఇరుగుపొరుగు వాళ్ళు టౌన్‌హాలుకి పిలిచి రిపోర్ట్ చేస్తారు కూడాను! టౌన్‌హాల్ వాళ్ళే గనక మీ ఇంటి ముందు గడ్డి కోయిస్తే తడిసి మో పెడవుతుంది. అంతేకాదు; అది అప్రతిష్ట కూడాను! పెద్ద న్యూసెన్స్! అందుకైనా గడ్డి కోయించి తీరాలి.

ఆ రోజు బుధవారం.

పొద్దున్నే సబ్ డివిజన్లో నడుస్తూ, కేథరీనూ, సుజాతా ఇవాళ సర్వీసు కంపెనీని పిలుద్దామని ఒప్పందం చేసుకున్నారు. మిట్టమధ్యాన్నం. జులై ఎండ మాడ్చే స్తూన్నది. కాసేపు కునుకు తీద్దామని సోఫాలో వాలింది, సుజాత.అరగంట కూడా పట్టలేదు ఉలిక్కిపడి లేచింది, బయట లాన్ మోవర్ చప్పుడుకి! తలుపు తీసి చూసింది. అదేమీ మామూలు లాస్ మోవర్ కాదు. చక్కగా సీటు మీద కూర్చొని గడ్డి చేసుకునే మోవర్. కావి రంగు హోండా రైడింగ్ మోవర్. వెనక పెద్ద గోనె సంచి; పక్కన మరో మనిషి నిలబడటానికి చిన్న ఇనప మెట్టు కూడా ఉన్నట్టున్నది. గోమెజ్ బండి నడుపుతున్నాడు; పక్కనే మరో అమీగో హుషారుగా చేతులూపుతున్నాడు. సుజాతని చూడగానే గోమెజ్ ఎడమచెయ్యి ఊపుతూ హాయ్ అని సైగ చేసి మోవర్ ఆపాడు. వాడి స్నేహితుడిని గుమ్మం దగ్గిరకి తీసుకొని వచ్చాడు. సుజాత సైగ చెయ్యకముందే, వాడికేసి చూపుడు వేలు చూపిస్తూ ‘మార్సెలీనో’ అని చెప్పాడు. చూస్తే వీడికి పదిహేను పదహారు ఏళ్ళకన్నా ఎక్కువ వయస్సుండదు. మార్సెలీనోని ‘ఇంగ్లీషు అర్థం అవుతుందా?’ అని అడిగింది, సుజాత. వాడు వెంటనే ‘లిటిల్….. లిటిల్…’ అని సమాధానం చెప్పాడు. వీడే నయం. ఆ గుజరాతీ ఆవిడయితే ‘థోడా థోడా’ అనేది. ఇంతలో ఎదురింటి కేథరీన్ కూడా బయటికొచ్చింది. చెప్పద్దూ! కేథరీన్ కీ, సుజాతకీ మొహాలు విప్పారిపోయాయి.

గోమెజ్ మోవర్ ఎక్కి గడ్డి చెయ్యడం మొదలు పెట్టాడు; కేథరీను మార్సెలీనోతో మాట్లాడటం మొదలెట్టింది. రకరకాల ఆరాలు తీసింది. రైడింగ్ మోవర్, వాళ్ళు పని చేసే పూలకం పెనీ ఓనర్ ది. రోజుకి ముప్పై డాలర్లకి అద్దెకి తీసుకున్నారట! ఒక్క రోజులో అధమ పక్షం అరడజను లానులు చెయ్యచ్చు. ఒక్క గంటలో రెండు లాన్లూ కత్తిరించేశారు. పాత తోపుడు బండి మోవర్ అయితే కనీసం రెండు గంటలు పట్టేది. మార్సెలీనో గడ్డి ప్లాస్టిక్ బస్తాల్లోకి పట్టి ట్రక్ వెనకాల పడేశాడు. డబ్బులిస్తూ కేథరీన్ “ఇప్పుడు కచ్చితంగా రెండు వారాలకొకసారి రావాలి,’ అని మార్సెలీనోతో చెప్పింది. వాడు, సీ సీ కి బదులు ‘షూర్… షూర్…’ అన్నాడు. సుజాత చెరొకడికీ లీటర్ కోకు సీసాలిచ్చింది. మంచి ఎండగా ఉన్నదేమో, మార్సిలీనో సీసా మొత్తం ఒక్క గుక్కలో ఖాళీ చేశాడు.

ఇప్పుడు గోమెజ్ ఠంచనుగానే వస్తున్నాడు. అనుకున్నట్టుగానే రెండు వారాల కొకసారి శనివారమో, వీలు కుదరకపోతే అదివారమో గోమెజ్, మార్సిలీనో, ఇద్దరూ కొత్త మోవర్ని టొయోటా ట్రక్కులో కెత్తుకొని వచ్చేవాళ్ళు. ఒక గంటలో రెండు ఇళ్ళ ముందూ వెనకా గడ్డి కత్తిరించేసి పోయేవాళ్ళు. ఆరోజు ఇంట్లో ఎవరూ లేకపోతే, డబ్బులకోసం మార్సిలీనో సోమవారమో, మంగళవారమో సాయంత్రం బాగా చీకటి పడింతర్వాత వచ్చేవాడు.

ఆరోజు శనివారం.

సెప్టెంబర్ నెలాఖరయ్యింది. ఎండలు బాగా తగ్గాయి. బయట కాస్త చల్లబడు తూన్నది. తొందరగా చీకటి పడుతూన్నది కూడాను. సాయంత్రం గోమెజ్, మార్సిలీనో గుజరాతీ వాళ్ళ ఇంటి ముందు గడ్డి చేస్తున్నారు. మార్సిలీనో మోవర్ తోలుతున్నాడు, గోమెజ్ మోవర్ కి ఎడమ పక్కన మోవర్ని తప్పుకుంటున్నట్టుగా నటిస్తూ చకచక మోవర్ పక్కనే నడుస్తున్నాడు. మార్సిలీనో మోవర్ని ఎడమ పక్కకి, కుడి పక్కకీ వెంటవెంటనే అదొక ఆటలా తిప్పటం మొదలెట్టాడు.

గోమెజ్ మోవర్ని తప్పించుకోవటం; మార్సిలీనో గోమెజ్ ని మోవర్ లో తరమటం మొదలెట్టాడు. కుర్రతనం చేష్టలు.

అప్పుడే సుజాత కారు ఎడమపక్కకి తిప్పుతూ కుడిచేతి వైపున ఉన్న మాలిని ఇంటికేసి చూసింది.

గోమెజ్ ని, మార్సిలీనోని చూసింది. ఒక్కక్షణం, అంతే! మోవర్ ఎత్తు నుంచి పల్లంలోకి వస్తోందో ఏమో, మార్సిలోనోకి బేలెన్స్ దొరకలేదు. మోవర్ ఎడమపక్కకి పల్టీ కొట్టింది. పక్కనే ఉన్న గోమెజ్ కుడికాలి మీద పడింది.గోమెజ్ కిందపడ్డాడు. మోవర్ స్టీరింగ్ వాడి తలకి కొట్టుకుంది. మార్సిలీనో కుడిపక్కకి దూకా డేమో, వాడు నిలబడే ఉన్నాడు. ఇదంతా ఒక్కక్షణంలో జరిగింది.గోమెజ్ మార్సిలీనోని ఏదో తిడుతూ ఏడుస్తున్నాడు. మార్సిలీనో అతికష్టం మీద మోవర్ని లేపి నిలబెట్టాడు. అదృష్టం బాగుండి, ఇంజన్ ఆగిపోయింది. .

సుజాత కారు ఆపి గోమెజ్ దగ్గిరకి పరిగెత్తుకొని వచ్చింది. వాడు కుడికాలు మణిమ పట్టుకొని ఏడుస్తున్నాడు. మార్సిలీనో కళ్ళనిండా నీళ్ళు నిండాయి.గోమెజ్ తలకి దెబ్బ తగిలింది. నుదురు నుంచి రక్తం కూడా వస్తోంది. రక్తాన్ని ఎడం చేత్తో తుడుస్తూంటే సుజాత వాడిని వారించి, తన కారులోంచి టిష్యూ పేపర్ తెచ్చి తుడిచింది. రక్తం ఎక్కువగా లేదు కాని, నుదురు మీద పెద్ద బొప్పి బాగా కనిపిస్తోంది. కుడికాలు నేల మీద అదిమిపట్టి ఎడమచెయ్యి ఒత్తు పెట్టుకొని లేవడానికి ప్రయత్ని స్తున్నాడు. విపరీతమైన నెప్పి కాబోలు; లేవటం కష్టం అయ్యింది. మార్సిలీనో చెయ్యి ఊతగా పట్టుకొని అతికష్టం మీద లేచి నిలబడ్డాడు. సుజాత వాడిని తన కారులో కెక్కించింది, మార్సిలీనో సాయంతో. మార్సిలీనోని వెనక ట్రక్ లో రమ్మంది. యస్ యస్ అన్నాడు మార్సిలీనో.

“హాస్పటల్ ఎమర్జెన్సీకి తీసికెళ్ళాలి,” అంది. “హాస్పటల్? నో! నో హాస్పటల్ మామ్! నో! నో!” అంటున్నాడు గోమెజ్.

సుజాత వాడి మాట ఖాతరు చెయ్యలేదు. మెడికల్ సెంటర్ ఎమర్జెన్సీకి తీసికెళ్ళింది. అరడజను కాగితాలిచ్చింది అక్కడి రిసెప్షనిస్ట్. వివరాలన్నీ పూర్తిచేసిన తరువాత డాక్టర్ చూస్తాడని చెప్పింది. మార్సిలీనో రావడంతో కాస్త ఇబ్బంది తప్పింది. పూర్తి పేరు, అడ్రెస్, వయస్సు, వగైరా వగైరా వాడే పూర్తిచేశాడు. ఈ తతంగం అవు తున్నంత సేపూ,

గోమెజ్ నో నో హాస్పటల్ అని అరుస్తూనే ఉన్నాడు. ఆ కాగితాలు రిసెప్షనిస్ట్ తీసుకుంటూ ఇన్స్యూరెన్స్ భోగట్టా అడిగింది.

గోమెజ్ కి ఇన్స్యూరెన్స్ లేదు. ఈలోగా మార్సిలీనో మాయమయ్యాడు. హాస్పటల్ కి ఎవరో ఒకరు హామీ ఇవ్వాలని రిసెప్షనిస్ట్ చెప్పింది, ఆ కాగితాలని సుజాత ముందుకి నెడుతూ. సుజాత హామీ పత్రం మీద సంతకం పెట్టింది, మోహన్ తో చివాట్లు తినాలని అనుకుంటూ!

గోమెజ్ ని డాక్టర్ ఒక ఐదు నిమిషాలు పరీక్ష చేసాడు. తలమీద బొప్పి చూసాడు. కాలు చివర పట్టుకొని గట్టిగా లాగాడు.

గోమెజ్ బాధగా ఉన్నా అరవలేక పోయాడు. కాలికి ఎక్స్-రే తీయాలని చెప్పాడు. తలమీద దెబ్బ తగిలింది కాబట్టి గోమెజ్ సోమవారం వరకూ హాస్పటల్లో ఉండవలసి వస్తుందని చెప్పి ఏవో కాగితాలుపూర్తి చేసి, నెప్పికి మందు రాసి వెళ్ళిపోయాడు. నర్స్ గోమెజ్ ని కుర్చీలో కూర్చోబెట్టి వాలోకి తీసుకెళ్ళింది. నర్స్ తో పాటు సుజాత కూడా గోమెజ్ బెడ్ దాకా వెళ్ళింది. ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో మార్సిలీనో తన వెనకాలే వచ్చాడు.

మార్సిలీనోతో సుజాత చెప్పింది, “రేపు వచ్చి చూస్తానని గోమెజ్ కి చెప్పు.రాత్రికి మందు వేసుకొని పడుకోమను. సరేనా?” మార్సిలీనో యస్ యస్ అని తలకాయ ఊపాడు. ఈలోగా సుజాత కేథరీన్ నిపిలిచింది. అన్ని విషయాలూ పూసగుచ్చినట్టు చెప్పింది.

గోమెజ్ విపరీతమైన నొప్పితో బాధపడుతూ కూడా, “మి పే, మి పే, మామ్… మి పే, యస్ యస్, మి పే,” అని కలవరిస్తున్నట్టు చెపుతున్నాడు. వాడు ఏమంటు న్నదీ సుజాతకి బోధ పడలేదు. ఏమిటీ? అన్నట్టు మార్సిలీనో కేసి చూసింది. మార్సిలీనో చెప్పాడు హాస్పటల్ ఖర్చు తను ఇస్తానని అంటున్నాడు, అని.ఆదివారం మూడు గంటలకి సుజాత, కేథరీన్ హాస్పటల్ కి వచ్చారు. తిన్నగా గోమెజ్ గదికి వెళ్ళారు. గోమెజ్ గదిలో లేడు. అక్కడ ఉన్న నర్స్ స్టేషన్ కెళ్ళి గోమెజ్ గురించి అడిగింది. వాళ్ళు తమకేమీ తెలియదని చెప్పారు. ముందు ఆఫీస్ లో అడగమని సలహా ఇచ్చారు. పొద్దున్నే గోమెజ్ గదిలో నుంచి వెళ్ళిపోయాడని చెప్పాడు, పక్కనున్న పేషేంట్. ముందు ఆఫీస్ కెళ్ళి అడిగింది కేథరీన్.

గోమెజ్ రిలీజ్ చెయ్యక ముందే ఎవరికీ చెప్పాచెయ్యకండా పారిపోయాడని చెప్పింది. పోలీస్ రిపోర్ట్ ఇచ్చామని చెప్పింది కూడాను. కేథరీన్ కి బోధపడింది; గోమెజ్ భయపడి పారిపోయాడని! ‘పోలీస్ రిపోర్ట్ చెప్పకుండా హాస్పటల్ నుంచి పారిపోయినందుకు చేశారా? మరెందుకైనా రిపోర్ట్ చేశారా?’ అని అడుగుదామనుకున్నది కానీ, ఏ కళలో ఉన్నదో ఆ ప్రశ్నలు మాత్రం అడగలేదు, కేథరీన్. తిరిగి వస్తూ సుజాత గోమెజ్ కి ఫోన్ చేసింది. సమధానం లేదు.గోమెజ్ పోలీసు లకి భయపడి పారిపోయాడేమో అన్న అనుమానం ఇద్దరికీ వచ్చింది. అయినా ఇంటి కొచ్చే వరకూ ఇద్దరూ ఆ విషయం ఎత్తలేదు. మర్నాడు సాయంత్రం,గోమెజ్ ఇచ్చిన ఎడ్రస్ పట్టుకొని ఇద్దరూ ఆ ఇంటికెళ్ళారు. తలుపు కొట్టారు. ఇద్దరు లాటినో కుర్రాళ్లు తలుపు తీసారు. ఇద్దరూ టీనేజర్స్!

గోమెజ్ గురించి, మార్సిలీనో గురించి అడిగింది, కేథరీన్. వాళ్ళు స్కూల్ కెళ్ళే పిల్లలు కాబోలు; ఇంగ్లీషులో అడిగితే, ఇంగ్లీషు లోనే సమాధానం చెప్పారు; గోమెజ్, మార్సిలీనో ఇక్కడ లేరు, అని.

“గోమెజ్ ఎవరో మాకు తెలియదు,” అన్నాడు ఒకడు. “ప్లీజ్! గో,” అని తలుపు మూశాడు రెండోవాడు.

గోమెజ్, మార్సిలీనో ఇద్దరూ ఇల్లీగల్స్ అయి ఉండాలి, అని నచ్చచెప్పుకున్నారు, సుజాత, కేథరీన్. వచ్చే మే నెలదాకా గడ్డి చెయ్యవలసిన అవసరం అంతగా ఉండ దుగా! అప్పుడెవరినో చూసుకోవచ్చులే అన్నది, కేథరీన్ .

గోమెజ్ తిరిగి వస్తాడని గట్టి నమ్మకం ఉన్నది, సుజాతకి. అలాగని కేథరీన్ తో అనలేదు, నవ్వుతుందేమోనని!

ఆ రోజు సోమవారం.

డిసెంబర్ లో హాస్పటల్ నుంచి వెయ్యి అరవై డాలర్లకి బిల్లు వచ్చింది. సుజాత గుండె గుభేలుమన్నది. కేథరీన్ తో చెప్పింది.

“గోమెజ్ కి జరిగిన యాక్సిడెంట్ ఆ కార్నర్ ఇంటిముందే కదా?” అన్నది కేథరీన్.

“యస్.” “ఆ ఇంటి ఆవరణలోనే యాక్సిడెంట్ అయ్యిందా?”

“యస్,” చెప్పింది సుజాత. “నేను గోమెజ్ ని వాళ్ళ లా లో నుంచే లేవదీసి నా కారులో హాస్పటల్ కి తీసికెళ్ళాను.”

““మరయితే, ఈ మెడికల్ బిల్ వాళ్ళ బాధ్యత కాదూ?” “యస్.” “అయితే, వెళ్ళి ఆవిడతో మాట్లాడు.” “నువ్వు కూడా వస్తావా?” అని అడిగింది, సుజాత.

“వత్తాసు కోసం వస్తాను, కానీ నేను యాక్సిడెంట్ చూడలేదుగా? అందుకని ఆవిడని నిలదీసి అడగలేను,” అన్నది, కేథరీన్. నయమే! కనీసం వస్తానన్నది, రాను పో అనలేదు, అని సంతృప్తి పడింది సుజాత.

మర్నాడు సాయంత్రం ఇద్దరూ మాలిని ఇంటికెళ్ళారు. మాలిని గుడి నించి తెచ్చిన ప్రసాదం పెట్టింది. మసాలా టీ ఇచ్చింది. సుజాత జరిగిన విషయం పూస గుచ్చినట్టు చెప్పింది.

“యాక్సిడెంట్ అయిన రోజునే నీకు చెప్పి ఉండాల్సింది. కానీ,” వాక్యం పూర్తి కాకముందే మాలిని గబగబ హిందీ, ఇంగ్లీషు కలిపి మొదలెట్టింది.“నేను గడ్డి చెయ్యమని అడగలేదే? అసలు ఆరోజు ఎందుకొచ్చాడు? అడగకండా పెట్టకండా మా లాన్ ఎందుకు చేశాడు? నేను వాడితో కచ్చితంగా చెప్పాను. నేను పిలిచినప్పుడే వచ్చి మా లాన్ చెయ్యాలి అని!”ఈవిడగారు తప్పుకొని పోతున్నదని తెలిసిపోయింది. కేథరీన్, సుజాత తిరుగు ముఖం పట్టారు మళ్ళీ మాట్లాడకండా! ఇచ్చిన టీ అక్కడే వదిలి పెట్టి. బయటికి వస్తూ, “గోమెజ్ ని పిలిచి మాలిని ఏ భాషలో చెప్పిందో?” అని నవ్వింది, సుజాత. కేథరీన్ వంతపాడింది.

ఒక వారంరోజులు పోయిన తరువాత, హాస్పటల్ కి వెళ్ళారు, కేథరీన్, సుజాతానూ! ఒక వంద డాలర్లు ఇచ్చి సరిపెట్టుకుందామని. హాస్పటల్ ఎడ్మిని స్టేటర్ తో అరగంట బేరం ఆడారు. మొత్తానికి బేరమాడి, మూడువందల అరవైకి ఒప్పించారు. “మీరు మంచి పనిచేసి ఆపదలో ఉన్న వాడికి సాయం చేశారు కాబట్టి.

“ఐ థింక్… వుయ్ ఓ మోర్ టు గోమెజ్ ఫర్ హిజ్ సర్వీసెస్…” అని సరిపెట్టుకుంది సుజాత.

ఇవాళ శనివారం.

ఏప్రిల్లో కూడా ఇంకా చలి చలిగానే ఉన్నది. సుజాత, మోహన్లు రెండు వారాల పాటు ఫ్లారిడాలో మకాం చేసి తిరిగొచ్చారు, నెలాఖరుకి.

సుజాత రెండు వారాల మెయిల్ చూస్తున్నది. చాలా భాగం జంక్ మెయిల్. తట్టెడు బిల్లులు. రాఫెల్లో ఐదు మిలియన్లు నెగ్గటానికి చదవాల్సిన ఉత్తరాలు ఐదు;

మోహన్ పేరున మూడు, తన పేరున రెండు! అంతా కలిపి ఓ రెండు పౌండ్ల బరువుం టాయి. అన్నీ పక్కకు బొత్తిగా పెడుతుంటే కనిపించింది ఒకే ఒక్క మాసిపోయిన కవరు. ఈ ఉత్తరం చాంద్రాయణం చేసి వచ్చినట్టుంది. ఉత్తరం చింపి చూసింది. తెల్లకాయితం మడతలో నలిగిపోయిన ఐదు డాలర్ల బిల్లులు మూడో నాలుగో. పైనున్న బిల్లు వాటర్ మార్క్ మీద పొడి పొడి ఇంగ్లీషు అక్షరాలు. –

“థాంక్స్ మామ్.” ఎడ్రస్ లేదు; ఎల్ పాసో పోస్టు ముద్ర తప్ప.

‘మి పే! మి పే!’ అని హాస్పటల్ లో కలవరిస్తున్న గోమెజ్ గుర్తుకొచ్చాడు. సుజాత కళ్ళనిండా నీళ్ళు తిరిగాయి. ఒక్క చుక్క కూడా ఐదు డాలర్ల బిల్లు మీద పడలేదు.

********

పుస్తక లభ్యత:

ఈ పుస్తకం , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.

*Intro- outro BGM credits: Edhedho Ennam Valarthen | Durai Srinivasan | Soul Strings (https://www.youtube.com/watch?v=LWpJxRYZb2w)

““గోమెజ్ ఎప్పుడొస్తాడో”! – శ్రీ వేలూరి వేంకటేశ్వర రావు” కి 2 స్పందనలు

  1. వెంకటేశ్వర రావు గారు gomez కథ తో అమెరికా లో జీవనం గురించి చక్కగా వివరించారు. ముఖ్యంగా ముగింపు, క్లైమాక్స్ చాలా బాగుంది. ఇటువంటి మంచి కథ అందించిన వెంకటేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

  2. Thank you so much for reminding those golden days. Awesome 👍

Leave a Reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading